మెయన్ ఫీచర్

నేరచరితుల వెన్నులో ‘ఫాస్ట్‌ట్రాక్’ వణుకు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదైనా కేసు ఉంటే చాలు- పెద్ద చదువులు చదివిన వారికైనా ఉద్యోగం ఇవ్వరు.. అయితే, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారు, జైలుశిక్షలు పడినా బెయిల్‌పై ఉన్నవారు చట్టాలను రూపొందించే ప్రజాప్రతినిధులుగా ఎలా కొనసాగుతున్నారు? ఇలాంటి నేతలను పదవులకు అనర్హులుగా చేయాల్సిన బాధ్యత ఎవరిది? అనే ప్రశ్న ఇపుడు అనేక మలుపులు తిరిగి పెను సంచలనానికి దారితీసింది. తీవ్రమైన కేసులను ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులపై చర్యల సంగతిని ప్రశ్నించిన అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ పిటిషన్ దేశవ్యాప్తంగా ఎంపిలు, ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు రేపుతోంది. అశ్విన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ (నెంబర్ 699/2016)పై సుప్రీం కోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో నేతల్లో వణుకు మొదలైంది. ఈ అంశంపై అశ్విన్ కుమార్ 2011 నుండి పోరాడుతున్నారు. 2011లో రిట్ పిటిషన్ (సివిల్ 536) దాఖలైంది. తర్వాత డబ్ల్యూపీ (సివిల్) 1581, 1571 దాఖలయ్యాయి.
ప్రజాప్రతినిధులపై కేసుల వివరాలు సమర్పించాలని 2014 మార్చి 10న సుప్రీం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీనిపై అప్పటి న్యాయశాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ రీటా వశిష్ట ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. ఆ అఫిడవిట్ ప్రకారం కొంతమంది ప్రజాప్రతినిధులు హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, హింస, వేధింపులు, ఫోర్జరీ, కిడ్నాప్‌లు, ఆర్థిక నేరాలు, ఆయుధాలతో గాయపర్చడం, అక్రమ నిర్బంధం, బలవంతపు వసూళ్లు వంటి నేర విచారణను ఎదుర్కొంటున్నారని తేలింది. తాజా లెక్కల ప్రకారం 2014 వరకూ అధికారంలో ఉన్న, ప్రస్తుతం కొనసాగుతున్న ఎంపీలు, ఎంఎల్‌సిలు,ఎంఎల్‌ఎలపై 13,500 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. నేరచరిత్ర ఉన్నప్పటికీ మళ్లీ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, వీరి సంఖ్య ఏటా పెరుగుతోందే తప్ప తగ్గడం లేదని సుప్రీం వ్యాఖ్యానించింది. 1765 మందిపై 3816 కేసులున్నాయి. అందులో 125 కేసుల విచారణ పూర్తయింది. మరో 646 కేసుల్లో విచారణలు వివిధ దశల్లో ఉన్నాయి. 3045 కేసుల్లో విచారణ మొదలు కావల్సి ఉంది. ఈ కేసుల్లో తీవ్ర నేరాలు ఎదుర్కొంటున్న 1591 (అందులో 10 కేసుల్లో ప్రజా ప్రతినిధులు మరణించారు) కేసులకు సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని సుప్రీం ఆదేశించింది.
నేతలపై కేసుల విచారణలో తీవ్ర జాప్యాన్ని అశ్విన్ కుమార్ ఎండగట్టడంతో ఇక ఎలాంటి తాత్సారం లేకుండా వాటిని పరిష్కరించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశిస్తూ, ప్రతి రోజు విచారణ నిర్వహించైనా 2019 మార్చి నాటికి వాటిని ముగించాలని ఆదేశించింది. వివిధ హైకోర్టుల్లో తక్షణమే ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని, జిల్లా కోర్టుల్లో ప్రత్యేక సెల్స్ ఏర్పాటు చేసి- నేతలపై నమోదైన కేసులను ఎప్పటికపుడు సమీక్షిస్తూ త్రైమాసిక నివేదికలు సంబంధిత హైకోర్టులకు, తమకు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంలో ఇంత వరకూ ఏం చేశారో, ఏం చేయబోతున్నారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ఎంపిలు, ఎంఎల్‌ఎలపై ఫిర్యాదులు పెరుగుతుండటం, అవి ఎటూ తేలకపోవడంతో వారంతా హాయిగా పదవులు అనుభవిస్తుండటాన్ని సుప్రీం తప్పుపట్టింది. ప్రత్యేక కోర్టులు ఉంటే తప్ప ఈ కేసులను ఏడాదిలోగా తేల్చలేమని సుప్రీం అభిప్రాయపడింది.
తొలిదశలో కనీసం 12 ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు రూ. 7.80 కోట్లు విడుదల చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఏయే హైకోర్టుల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయో గణాంకాల సేకరణ ప్రారంభమైంది. అన్ని శాసనసభల కార్యదర్శులకు, పార్లమెంటు ఉన్నతాధిరులకు లేఖలు రాసి, ఎమ్మెల్యేలపైన, ఎంపీపిలపైన ఉన్న కేసుల వివరాలను ఇప్పటికే కేంద్రం సేకరించింది. దీనిపై 23 హైకోర్టులు స్పందించాయి. ఏడు శాసనసభల నుండి సమాచారం లభించింది. 11 రాష్ట్రాలు తమ వద్ద ఉన్న వివరాలను పంపించాయి. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులకు సంబంధించి విచారణకు తెలంగాణ, ఏపీల్లో ప్రత్యేక న్యాయస్థానాలు సిద్ధమయ్యాయి. దేశవ్యాప్తంగా 12 ప్రత్యేక న్యాయస్థానాలు కేసులు ఎదుర్కొంటున్న ఎంపిలు, ఎమ్మెల్యేలపై విచారణకు సిద్ధమవుతున్నాయి. ఇది తొలి దశ మాత్రమే. దీని తర్వాత ఇతర కేసులను ఎదుర్కొంటున్న నేతలపై విచారణ సత్వరమే పూర్తి కావడం ఖాయం. దీంతో దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధుల్లో గుబులు మొదలైంది. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న నేతల జాబితా ఒకటైతే, ఎన్నికల కేసులను ఎదుర్కొంటున్న నాయకుల జాబితా రెండోది ఉంది. మరో జాబితాలో అక్రమ సంపాదన కేసులు ఎదుర్కొంటున్న వారు ఉన్నారు. మొదటి జాబితాలో హత్యలు, దోపిడీలు, అత్యాచారాల కేసులు ఎదుర్కొంటున్న వారున్నారు. సుప్రీం కోర్టు తొలి ప్రాధాన్యత ఈ జాబితాకు ఇచ్చింది. దేశవ్యాప్తంగా మొత్తం 1765 మంది చట్టసభల సభ్యులకు సంబంధించి 3045 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ జాబితాలో 248 మంది ఎంపిలు, ఎమ్మెల్యేలతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు (178), బీహార్ (144), పశ్చిమ బంగ (139) రాష్ట్రాలున్నాయి. తెలంగాణలో ఎంపిలు, ఎమ్మెల్యేలు కలిపి 108 మందిపై 153 కేసులు ఉండగా అందులో 50 కేసుల్లో ఇప్పటికే విచారణ జరిగింది. మరో 103 కేసులు విచారించాల్సి ఉంది. ఏపీలో ఎంపిలు, ఎమ్మెల్యేలు కలిపి 132 మందిపై కేసులున్నాయి. వారిపై మొత్తం 249 కేసులు నమోదయ్యాయి. ఇందులో 12 కేసుల్లో ఇప్పటికే కోర్టులు తీర్పులు ఇచ్చాయి. మరో 97 కేసులు ఇటీవలే పరిష్కారం అయ్యాయి. 140 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో 9మందిపై 11 కేసులు నమోదు కాగా, ఆరు కేసులు విచారణ జరగాల్సి ఉంది. అస్సాంలో 37 మందిపై 47 కేసులు ఉండగా, వాటిలో 32 కేసులు పరిష్కారం కావాలి. బీహార్‌లో 144 మంది ఎంపిలు, ఎమ్మెల్యేలపై 373 కేసులు ఉండగా అందులో 306 కేసుల్లో విచారణ జరగాల్సి ఉంది. గుజరాత్‌లో 76 మందిపై 82 కేసులు నమోదుకాగా వాటిలో 45 కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో 39 కేసులు, జమ్మూ కాశ్మీర్‌లో 10, ఝార్ఖండ్‌లో 129, కర్నాటకలో 137, కేరళలో 373, మధ్యప్రదేశ్‌లో 94, మేఘాలయలో ఆరు, నాగాలాండ్‌లో ఒకటి, ఒడిస్సాలో 210, పంజాబ్‌లో 27, రాజస్థాన్‌లో 44, తమిళనాడులో 324 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం 1765 మందిపై 3816 కేసులు నమోదుకాగా, వాటిలో ఇంత వరకూ 671 కేసుల్లో విచారణ ప్రారంభమైంది. 125 కేసుల్లో తుది విచారణ పూర్తయింది. 3045 కేసుల్లో విచారణ ప్రారంభం కావల్సి ఉంది.
ఈ కేసుల విచారణకు సుప్రీం ఆదేశాల మేరకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు ఢిల్లీ ప్రభుత్వం 1.30 కోట్లు, ఏపీ, బిహార్, కేరళ, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, యుపమి, పశ్చిమబంగ రాష్ట్రాలు 65 లక్షలు చొప్పున కేటాయించాయి. ఏపీ,తెలంగాణల్లో ప్రత్యేక కోర్టుల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. అవసరమైన సిబ్బందిని కూడా కేటాయించారు. మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ, కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కూడా నోటిఫికేషన్లు ఇచ్చాయి. యుపి, బిహార్, తమిళనాడు, పశ్చిమబంగ నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరాఖండ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఝార్ఖండ్, మేఘాలయ, త్రిపుర, సిక్కిం, ఒడిసా, పుదుచ్చేరి, గుజరాత్ సరైన మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంది. సంబంధిత హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు ఆదేశాలు ఇచ్చినా, కొన్ని ప్రభుత్వాలు మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నాయి. క్రిమినల్ కేసులు రుజవైన పక్షంలో దోషులైన నేతలపై గరిష్టంగా ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడుతుంది.
అవసరమైతే కొంతమందిని జీవితకాలం నిషేధం విధించే అవకాశం తమకు కల్పించాలని ఎన్నికల సంఘం సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరుతోంది. ఈ ప్రతిపాదనపై సానుకూలత వ్యక్తం చేయడానికి కేంద్రం ఊగిసలాడుతోంది.
అసోసియేషన్ ఆఫ్ డెముక్రటిక్ రిఫార్మ్సు సంస్థ, లిల్లీ థామస్, లోక్‌ప్రహారి వెర్సస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు, ఎన్నికల అక్రమాలపై సుప్రీం దృష్టి సారించింది. ఇక ఎంత మాత్రం చట్టం చట్రం నుండి తప్పించుకునే అవకాశం నేరచరితులైన శాసనకర్తలకు ఇవ్వరాదని భావించిన సుప్రీం కోర్టు ప్రత్యేక కోర్టుల అస్త్రాన్ని ప్రయోగించింది.
తెలుగు రాష్ట్రాల్లో మాజీ కేంద్ర మంత్రులు సహా అనేక మంది ప్రముఖులపై ఈ కేసులుండటంతో రానున్న కొద్దిరోజుల్లో రాజకీయ ప్రకంపనలు అనివార్యంగా కనిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో 240 మంది ప్రజాప్రతినిధుల పునాదులు కదలనున్నాయి. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడానికి ముందు డిఎస్పీ స్థాయి అధికారితో ముందస్తు పరిశీలన నివేదిక తెప్పించుకున్న తర్వాతనే తదుపరి చర్యలు చేపట్టాలని మార్చి 20న సుప్రీం ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలో ముందస్తు బెయిల్ ఇవ్వకుండా అడ్డుకునే నిబంధనలు ఏవీ లేవని, వారికి ముందస్తు బెయిల్ ఇవ్వవచ్చని కూడా కోర్టు పేర్కొంది. సంబంధిత ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగులను వెంటనే అరెస్టు చేయవద్దని ఆదేశించింది. జస్టిస్ ఆదర్శ్ గోయల్, జస్టిస్ లలిత్‌లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పు కొంత ఉపశమనం కలిగించినా, మిగిలిన కేసుల్లో మినహాయింపు లభించే అవకాశం లేదు. మొత్తం మీద అధికార మదంతో దూసుకుపోయే నేతలకు ఇదో పెద్ద అడ్డుకట్టగా భావించవచ్చు. చట్టాన్ని భేఖాతరు చేసిన, చేస్తున్న నేతలకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులతో ఇక ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోని పరిస్థితి తప్పదేమో!

- బీవీ ప్రసాద్ 98499 98090