మెయిన్ ఫీచర్

ఈ కష్టాలు తీరేదెన్నడో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశంలో సగం..
సహనానికి మరో రూపు..
సమానత్వ హోదా..
వినటానికి ఎంత బాగున్నాయి కదూ.. కానీ ఆచరణ శూన్యం. అభివృద్ధి కొత్తపుంతలు తొక్కుతున్న నేటి సమాజంలోనూ చీకటిమాటున జీవితాలను నెట్టుకొస్తున్న ప్రాణాలెన్నో.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పదినిముషాలకో అమ్మాయి లైంగిక వేధింపులకు గురవుతోంది. అనునిత్యం లింగవివక్షను ఎదుర్కొంటోంది. శారీరక, మానసిక దాడులకు బలవుతూనే ఉంది. ఇంకా ఇంకా కుంగిపోతూనే ఉంది నేటి మహిళ. ఐక్యరాజ్యసమితి ఏటా మహిళలపై జరిగిన హింస తాలూకు లెక్కలు వినిపిస్తున్నా.. అవన్నీ వట్టి మాటలేనండీ.. అంటూ కొట్టిపారేసే ఘనాపాఠీలు మన మధ్యలోనే కాలర్లు ఎగరేసుకుంటూ తిరిగేస్తున్నారు. పదకొండేళ్లు కూడా నిండని పసిమొగ్గలు సెక్స్‌వర్కర్లుగా మారడం నేటి ఆధునిక సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం.
కంప్యూటర్ యుగంలోకి అడుగిడినా మనదేశంలో ఇంకా భ్రూణహత్యలు, బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి. అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా ఇప్పటికీ స్పష్టంగానే కనిపిస్తూ ఉంది. మనదేశంలో మగవారితో పోలిస్తే ఆడపిల్లలు పుట్టిన మూడు నెలల్లోపే తల్లిపాలకు ఎందుకు దూరమవుతున్నారు? ఫలితంగా పోషకాహార లోపం, శారీరక ఎదుగుదల లోపం.. ఇలా ఆడపిల్లకు ఎన్నో సమస్యలు. దీనికి తోడు రజస్వల కాగానే పెళ్లి చేసేయాలని చూసే కుటుంబాలే ఎక్కువ. కారణం ఆడపిల్లను పరువు ప్రతిష్ఠలకు సంబంధించిన అంశంగా చూడటమే..! ఇక అమ్మాయి చదువుకు వచ్చేటప్పటికి ‘ఇంకో ఇంటికి వెళ్ళే ఆడపిల్లపై వృథాగా పెట్టుబడి పెట్టడమేంటి?’ అనేవారు ఎంతోమంది.. పుట్టిన పిల్లలను సమానంగా చూడాల్సిన తండ్రులే.. ఇలాంటి పరిస్థితులను కల్పించినప్పుడు ప్రభుత్వం ‘బేటీ బచావో.. బేటీ పఢావో..’ అనక ఏం చేస్తుంది?
ప్రపంచవ్యాప్తంగా మహిళల, బాలికల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూస్తే.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 700 మిలియన్లమంది
మహిళలు చిన్నవయస్సులోనే పెళ్లిపీటలెక్కారు. ముఖ్యంగా దక్షిణాసియాలోనే బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏటా దాదాపు 1.3 మిలియన్ల బాలికలు వివిధ రూపాల్లో జరుగుతున్న హింసకు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈజిప్టులో అయితే ఏకంగా డెబ్భై శాతం మంది మహిళలు లైంగిక హింసకు గురవుతున్నారు. ఇలాంటివి ఎన్నో.. దేశవ్యాప్తంగా మహిళలు, పురుషుల స్థితిగతులపై కేంద్రప్రభుత్వం వివిధ సంస్థలు, మార్గాల్లో జరిపిన అధ్యయనాలను క్రోడీకరించి 2016కు సంబంధించి కేంద్ర గణాంకాల మంత్రిత్వ తాజా నివేదిక 2017ను విడుదల చేసింది. ఏటా ఆదాయ, వృద్ధి రేటు పెరుగుతుందో లేదో తెలియదు కానీ అత్యాచారాల శాతం మాత్రం పనె్నండుకు పెరిగింది. భార్యపై భర్త దాడిచేసినట్లు నమోదైన నేరాల్లో తెలంగాణ ఐదో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో ఉంది. ఈ తరహా నేరాలు అత్యధికంగా అసోంలో 58.7, పశ్చిమ బెంగాల్‌లో 42.3, తెలంగాణ లో 39.2, ఆంధ్రప్రదేశ్‌లో 25.1 శాతంగా ఉన్నాయి. మొత్తంమీద 3.38 లక్షల నేరాలు నమోదవగా మూడు శాతం వరకట్న నిరోధక చట్టం కింద ఉన్నాయి.
ఈ కేసుల్లో 67 శాతం కేసులను మాత్రమే విచారించి పరిష్కరించారు. కోర్టులో విచారణ ప్రారంభమైనవి 2.60 లక్షలుంటే వీటిలో కేవలం 1.7 శాతానికి మాత్రమే శిక్షలు పడ్డాయి. అత్యాచారం కేసుల్లో 3.1 శాతం నిందితులకు శిక్షలు పడ్డాయి. వరకట్న హత్యకేసుల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. 2016లో దేశవ్యాప్తంగా జరిగిన అత్యాచార ఘటనల్లో 42 శాతం బాధితుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వయస్సు వారిపైనే అధికంగా లైంగిక దాడులు జరిగాయి. తెలంగాణ లో ఈ వయస్సు తరువాత 12 నుంచి 16 వయస్సు బాలికలపై కూడా ఎక్కువ అత్యాచారాలు జరిగాయి.
ఇవి బయటకు తెలిసిన లెక్కలు. బయటకు చెప్పుకోలేక చీకట్లోనే జీవితాన్ని అంతం చేసుకునే ప్రాణాలు ఎన్నో.. ఈ లెక్కలకు కారణమేంటి? అని అవలోకిస్తే.. తరతరాలుగా మనదేశంలో పేరుకుపోయిన సమస్యలే కారణం. వాటిని ఇప్పటి తరం మహిళలు కూడా ఎదుర్కొంటున్నారు. చుట్టూ సమాజంలో ఎన్ని మార్పులు వచ్చినా ఆడపిల్లలు ఎదుర్కొనే సమస్యల్లో చెప్పుకోదగిన మార్పులేవీ కనిపించడం లేదనే విషయాన్ని కేంద్రం రూపొందించిన నివేదిక స్పష్టం చేస్తోంది. ఆధునిక సమాజం, కంప్యూటర్ యుగమని అందరూ చెప్పుకుంటున్నా వివక్ష మాత్రం అలాగే ఉంది. అదే మహిళల అభివృద్ధికి ఆటంకంగా మారుతోంది. ఒకపక్క చదువుకునే వారి సంఖ్య పెరుగుతున్నా బాల్యవివాహాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. చాలామంది దృష్టిలో అమ్మాయంటే ఓ వస్తువు. అందుకే వారిపై మానసిక, శారీరక దాడులు ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పటికీ చాలామంది తల్లిదండ్రులకు ఆడపిల్లలు భారంగానే కనిపిస్తున్నారు. మనదేశంలో మాధ్యమిక విద్యవరకు మాత్రమే ఉచిత విద్య అందుబాటులో ఉంది. దాంతో చాలామంది పేద విద్యార్థినులు పదోతరగతితోనే చదువుని ఆపేస్తున్నారు. ప్రతి వందమందిలో కేవలం ఐదు మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నత విద్యను అభ్యసించగలుగుతున్నారంటేనే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఆడపిల్లలు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే వారు కూడా పురుషులతో సమానమేనన్న భావన పెరగాలి. ఆడపిల్లలను రక్షించుకోవడం ప్రతి ఒక్కరూ నైతిక బాధ్యతగా భావించినప్పుడే అది సాధ్యమవుతుంది. పురుషుల్లో, సమాజంలో మార్పు వస్తేనే ప్రభుత్వాలు ఎన్ని పథకాలు అమలుచేసినా ప్రయోజనం కలిగేది.

- సన్నిధి