మెయన్ ఫీచర్

కేంద్రంపై పోరులో స్పష్టత లేని ‘చంద్రులు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, ఎన్టీ రా మారావు, పి.వి.నరసింహారావు వంటి తెలుగువారు జాతీయ రాజకీయాల్లో నిర్ణయాత్మక పాత్ర వహించారు. తెలుగువారి ఉనికిని జాతీయ స్థాయిలో చాటారు. ఆ తర్వాతి కాలంలో ఢిల్లీలోని పెద్దల చుట్టూ తిరుగుతూ, వారిని ప్రసన్నం చేసుకొంటూ జాతీయస్థాయిలో తమ ఉనికిని కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నవారే గాని, బలమైన నాయకత్వాన్ని ప్రదర్శించిన తెలుగు నేతలు లేరని చెప్పవచ్చు. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా ఇద్దరు ప్రధానుల ఎంపికలో కీలక పాత్ర వహించానని, ప్రధాని పదవిని తనకు ఇవ్వజూపితే తిరస్కరించి రాష్ట్రానికే పరిమితమయ్యానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చెప్పుకొంటున్నా, దేశంలోనే తనంతటి సీనియర్ నేత లేరని ప్రచారం చేసుకొంటున్నా- మిగిలిన నాయకులెవ్వరూ అందుకు మద్దతుగా మాట్లాడటం లేదు. వాస్తవానికి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి పదవి చేపట్టి, రాజకీయాల్లో అపర చాణిక్యుడిలా వ్యవహరిస్తున్న శరద్ పవార్, అర్ధ శతాబ్దానికి పైగా తమిళ రాజకీయాల్లో కీలక నేతగా జాతీయ రాజకీయాలపైనా ప్రభావం చూపుతున్న డీఎంకే అధినేత కరుణానిధి, భాజపాలో రాజకీయ కురువృద్ధుడు ఎల్.కె.అద్వానీ వంటి మరెందరో నేతలు జాతీయ రాజకీయాలను సుదీర్ఘకాలం పాటు ప్రభావితం చేశారు. వారంతా చంద్రబాబు కన్నా అన్ని విధాలుగా సీనియర్లు, రాజకీయంగా బలవంతులుగానే మనగలగడం గమనార్హం.
రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు ఉన్న ఎంపీల సంఖ్య పరిమితం కావడంతో, ఈ రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ రాజకీయ పార్టీలు జాతీయ స్థాయిలో సమీప భవిష్యత్‌లో నిర్ణయాత్మక పాత్ర వహించే అవకాశం లేదు. అయితే, ఎందుకనో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌లు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే ప్రయత్నం ఒకేసారి ప్రారంభించారు. బిజేపీయేతర, కాంగ్రెసేతర రాజకీయ పక్షాలను సమీకరించి ఒక విధంగా తమ బలప్రదర్శనకు పూనుకున్నారు. ఈ ఇద్దరి దృష్టి తమ రాష్ట్రాల ప్రయోజనాల కన్నా, 2019 ఎన్నికలపైనే అనడంలో మరో అభిప్రాయం ఉండనవసరం లేదు. ఏపీకి ప్రత్యేక హోదా ‘సంజీవిని’ కాదని, అది ముగిసిన అధ్యాయం అని ప్రచారం చేయడమే కాదు, ‘హోదా’ కోరిన వారిపై నిప్పులు చెరిగిన చంద్రబాబు- ఇదే అంశంపై ఇప్పుడు మోదీ సర్కారుపై ఘర్షణకు తలపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి తమ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులతో రాజీనామా చేయించడమే కాకుండా, ఎన్డీయే నుండి కూడా వైదొలిగారు. మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటూ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగకుండా అడ్డుతగులుతున్నారు.
మరోవంక కాంగ్రెస్, బిజెపిలు ఏడు దశాబ్దాలుగా ప్రజల ఆశలను వమ్ముచేశాయని, ఈ పార్టీలతో సంబంధం లేకుండా ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటు చేస్తానంటూ కేసీఆర్ బయలుదేరారు. 2019 ఎన్నికల తరువాత జాతీయ రాజకీయాలపై దృష్టిసారిస్తానని ఆయన ప్రకటించారు. తద్వారా 2019 ఎన్నికలలో తెరాస గెలిస్తే సీఎం పదవిని తన కుమారుడు కేటీఆర్‌కు అప్పచెప్పనున్నట్లు కేసీఆర్ సంకేతం ఇచ్చారు. తృతీయ కూటమి ఏర్పాటుకు మొదటి అడుగుగా కోల్‌కత వెళ్లి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని కలసి వచ్చారు.
ఇక, ప్రధాని మోదీ ఎన్నికల అవసరాల కోసం పలు రాష్ట్రాలకు భారీ ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించడమే గాని వాటి అమలుకు శ్రద్ధచూపడం లేదు. త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో భారీ పథకాలను ప్రకటిస్తున్నారు. ఒక్క గుజరాత్‌కు, కొద్దోగొప్పో మహారాష్టక్రు తప్పిస్తే ఆయన మరే రాష్ట్రానికి భారీ ఎత్తున నిధులను, పథకాలను ప్రకటించిన సందర్భాలు లేవు. అందుకనే విభజన హామీల అమలులో కేవలం ఏపీకి ఏదో అన్యాయం చేశారని విమర్శలు చేయడంలో అర్థం ఉండదు.
ఇన్నాళ్లూ వౌనంగా ఉండి, మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్న సమయంలో ఏపీలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ తన ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని ప్రకటించాక- చంద్రబాబు కేంద్రంపై వత్తిడి తెచ్చే ప్రయత్నం చేయడం చూస్తుంటే ఆయన రాజకీయ అవసరాల మేరకు వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నది. భాగస్వామ్య పక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే ఎన్నో అవకాశాలు ఉండగా- అవిశ్వాస తీర్మానం తీసుకురావడం గమనిస్తే తన ప్రభుత్వం పట్ల ప్రజలలో ఏర్పడిన వ్యితిరేకతను మార్చుకొనే ప్రయత్నం చేస్తున్నట్లే భావించవలసి వస్తుంది. నిన్నటివరకు ప్రజలకు ఎన్నో హామీలు గుప్పించి, చంద్రబాబుతో జత కట్టి అధికారం పంచుకున్న ఏపీ బిజెపి నేతలు- ఎన్డీఏ నుండి వైదొలగగానే చంద్రబాబును, ఆయన పాలనను అవినీతి మయం అంటూ ఆరోపణలు చేయడం సహితం వెగటు కలిగిస్తుంది. ‘మమ్ములను వ్యతిరేకించే వారంతా అవినీతిపరులే, దేశద్రోహులే’అన్నట్లుగా వారు వ్యవహరిస్తున్నారు. తమ ప్రభుత్వాలపై, నేతలపై వస్తున్న అవినీతి ఆరోపణలపై ఎక్కడా స్పందించకుండా, తమను వ్యతిరేకించే వారిని మాత్రం అవినీతిపరులుగా చిత్రీకరించడం పచ్చి అవకాశవాదమే. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్లీనరీలో మోదీ ప్రభుత్వం అవినీతిపరులను కాపాడుతోందంటూ ఆరోపణలు చేయగానే, యుపీఏ హయాంలో రూ.18 లక్షల కోట్ల మేరకు కుంభకోణాలు జరిగాయని కొందరు బిజెపి నేతలు గొంతెత్తి అరిచారు. అదే నిజమయితే గత నాలుగేళ్ళలో ఎందుకని తగు విచారణలు జరిపి, నిందితులను జైళ్లకు పంపే ప్రయత్నం చేయలేదే? యుపీఏ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన పలువురు పారిశ్రామికవేత్తలు, ‘ఆర్థిక నేరస్థులు’ ఇప్పుడు కూడా యథేచ్ఛగా తమ ప్రయోజనాలను కాపాడుకోవడం లేదా?
చంద్రబాబు ఎన్డీయే కూటమి నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించగానే తృతీయ కూటమి ఏర్పాటు చేయమని పలువురు ప్రాంతీయ పార్టీల నాయకులు కోరుతున్నట్లు మీడియాలో కథనాలు వ్యాప్తిచేసారు. వాస్తవానికి ఒక్కరు కూడా పైకి ఆ విధంగా చెప్పకపోవడం గమనార్హం. నేడు ఎంపీల సంఖ్య దృష్ట్యా మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేష్‌యాదవ్, స్టాలిన్ వంటివారు అటువంటి కూటమికి బలమైన కేంద్ర బిందువులు కాగలరు. తెలుగు రాష్ట్రాల నేతలు తమ రాష్ట్రాలలో తమ వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు తృతీయ కూటమి ఏర్పాటు చేస్తామని కథనాలు వ్యాప్తిచేసినా ప్రస్తుత పరిస్థితులలో అందుకు తగిన అవకాశాలు లేవని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ తిరిగి కొంతమేరకైనా పుంజుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోదీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ చూపుతున్న పట్టుదలను మిగిలిన ప్రాంతీయ పార్టీల నేతలు ఎవ్వరూ చూపడం లేదు. కొంతవరకు మమతాబెనర్జీ మాత్రమే చూపుతున్నారు. చంద్రబాబు,కేసీఆర్ వంటివారు పలు కీలక సమయాల్లో మోదీ నిర్ణయాలకు సమర్ధకులుగా ఉన్నవారే. ఇప్పటికి కూడా జాతీయ స్థాయిలో ప్రజలను కదిలించే విధంగా మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టలేకపోతున్నారు. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా బిజెపి అడ్డుకొనడాన్ని- ‘మోదీ ప్రభుత్వం పడిపోతున్నదని భయపడడం’గా తెదేపా నాయకులు అభివర్ణించి ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి ప్రచారం సొంత రాష్ట్రంలో ప్రజల సానుభూతి పొందేందుకు ఉపయోగపడినా, భాజపాకు అటువంటి భయం లేదని అందరికీ తెలుసు. పైగా ఏపీ విభజన హామీల అంశంపై భాజపా తన వైపునుండి కొన్ని పదునైన వాదనలను సిద్ధం చేసింది. అవిశ్వాస తీర్మానం చర్చకువస్తే తమ ప్రభుత్వ వైఫల్యాలు, తమపై వచ్చిన కుంభకోణాలకు సంబంధించిన ఆరోపణలు చర్చకు వస్తాయని మాత్రమే భాజపా నేతలు మొదటి నుండి బడ్జెట్ సమావేశాలలో అర్థవంతమైన చర్చలకు అవకాశం లేకుండా తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానానికి అవకాశం ఇస్తే త్వరలో జరిగే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉండవచ్చని జంకుతున్నారు.
ఇక, కెసీఆర్ తలపెట్టిన ‘ప్రజల కూటమి’ ఏర్పాటులోనూ ఆయనకు స్పష్టమైన అవగహన లేదని కొద్దిసేపు జరిగిన సమాలోచనలోనే మమతాబెనర్జీ గ్రహించినట్లు కథనాలు వచ్చాయి. ఒక వంక భాజపాకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేస్తానంటూ మరోవంక ఆ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా తెరాస ఎంపీలు ఉపయోగపడటం ఏమిటని మమత నిర్మొహమాటంగా ప్రశ్నించినట్లు తెలుస్తున్నది.
రాహుల్ పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందుతున్నా, ఆయన నాయకత్వంలో పనిచేయడానికి శరద్ పవార్, మమతాబెనర్జీ వంటి నేతలు ఇష్టపడే సూచనలు కనిపించడం లేదు. అందుకనే ప్రతిపక్షాలను దగ్గరకు చేర్చడంపై సోనియా గాంధీ దృష్టిసారిస్తున్నారు. వాస్తవ పరిస్థితులను గ్రహించిన రాహుల్ స్వయంగా పవార్‌ను కలిసి, ఇతర ప్రతిపక్షాలను సమీకరించడంలో సహకరించమని కోరారు. ఇటువంటి రాజకీయ వ్యూహం గాని, కార్యాచరణ ప్రణాళికగాని జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపేందుకు ఇద్దరు ‘చంద్రులు’ ఏర్పర్చుకున్నట్లు లేదు. విభజన హామీలపై ఒకరు, రిజర్వేషన్ల అంశంపై మరొకరు మోదీ ప్రభుత్వంపై ఇప్పుడు కత్తిగట్టారు. ఈ విషయంలో జాతీయ స్థాయిలో ఇతర పక్షాల నుండి మద్దతు సమీకరించుకొనే ప్రయత్నం ఏమోగానీ, కనీసం సొంత రాష్ట్రాలలో అన్ని పక్షాల మద్దతు పొందే ప్రయత్నం చేయడం లేదు. అందుకనే వారిద్దరూ సమస్యల పరిష్కారం పైనకన్నా రాజకీయ ప్రయోజనాల పట్ల ఎక్కువ దృష్టిసారిస్తున్నట్లు భావించవలసి వస్తున్నది.
శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో అఖలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించినా, అలాంటి ప్రయత్నాలు కనిపించడం లేదు. కేంద్రంలో మంత్రి పదవులకు రాజీనామా చేయడం, ఎన్డీఏ నుండి వైదొలగడం, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం వంటి కీలక నిర్ణయాలు తీసుకొనే ముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉంటే సమష్టిగా కేంద్రంపై వత్తిడి తెచ్చే అవకాశం ఉండేది. ఇటువంటి విషయాలలో పొరుగు ఉన్న రాష్ట్రాల నుండి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. కర్నాటకలో అధికార, ప్రతిపక్షాల మధ్య నిత్యం మాటల యుద్ధం జరుగుతున్నది. అయినా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గత మూడేళ్ళలో పలు పర్యాయాలు అఖిలపక్ష ప్రతినిధి వర్గాలను వివిధ సమస్యలపై ఢిల్లీకి తీసుకువెళ్లారు. కానీ చంద్రబాబు, కేసీఆర్‌లు ఢిల్లీకి ప్రతినిధి వర్గాలను తీసుకువెళ్లడం దేవుడెరుగు, కనీసం రాష్ట్ర స్థాయిలోనైనా ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరపడం లేదు. ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం ద్వారా తమకు రాజకీయాలు మినహా ప్రజాప్రయోజనాలు పట్టవని ఏపీలో వైకాపా స్పష్టం చేస్తున్నది. తమిళనాడులో ప్రతిపక్ష నేత స్టాలిన్ స్వయంగా ముఖ్యమంత్రి పళనిసామిని కలసి కీలక అంశాలపై చర్చిస్తున్న సందర్భాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మర్యాద పూర్వకంగానైనా ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు పలుకరించుకొనే అలవాట్లకు స్వస్తిచెప్పారు. అందుకనే ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు మోదీ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నా విపక్షాలు తీవ్రంగా పరిగణించడం లేదు. రాజకీయ సాంప్రదాయాలను పాటించకుండా ఇద్దరు చంద్రులు రాజకీయ అవసరాల కోసం తలపెట్టిన పోరాటాలను కేంద్రం కూడా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కనిపించడం లేదు.
అవిశ్వాస తీర్మానం ద్వారా రాజకీయ పోరాటానికి కాలుదువ్వుతున్నట్లు చంద్రబాబు సంకేతం ఇవ్వడంతో బిజెపి ప్రతికూలంగా స్పందించడం ప్రారంభించింది. తీవ్ర నిర్ణయం తీసుకునే ముందు చంద్రబాబు అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లడమో, ఇతర పార్టీల నేతలను కలసి వారి ద్వారా వత్తిడితెచ్చే ప్రయత్నాలు చేసి ఉంటే మోదీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడి ఉండేది. తెలుగు రాష్ట్రాలలో తాము ఇప్పట్లో అధికారంలోకి రాగలమని బిజెపి నాయకత్వం భావించడం లేదు. ఏ పార్టీ గెలిచినా ఎన్నికల అనంతరం తమకు మద్దతు ఇవ్వక ఎక్కడకు పోతారులే అనే ధీమా వారిలో కనిపిస్తున్నది. అందుకనే చంద్రుల రాజకీయ జిమ్మిక్కులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపించడం లేదు.

-చలసాని నరేంద్ర సెల్ : 98495 69050