మెయిన్ ఫీచర్

వెండితెర శ్రీరామచంద్రులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహు మరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి.’’
-ఈ శ్లోకం, త్రేతాయుగ కథా నాయకుడు, అవతార పురుషుడు అయిన శ్రీరామచంద్రమూర్తి బాహ్య సౌందర్యాన్ని, అత్యంత శక్తివంతమైన, అంతర్గత లక్షణాలను వివరిస్తుంది. తెలుగు సినీ చరిత్రలో, ఆ శ్రీరామచంద్రుని పాత్రకు తమ అభినయం ద్వారా ప్రాణప్రతిష్ఠచేసిన మహానటుల అభినయాన్ని రేఖామాత్రంగా అవలోకిద్దాం..
ఆంధ్ర దేశంలో తొలి సినిమా ప్రదర్శనశాల విజయవాడలోని మారుతి టాకీస్ దాని యజమాని, పోతిన శ్రీనివాసరావు, 1933లో నిర్మించిన చిత్రం ‘పృథ్వీపుత్ర’. ఇందులో శ్రీరాముని పాత్రను ఈలపాట రఘురామయ్య పోషించారు. ఆయన అసలు పేరు ‘కల్యాణం వెంకట సుబ్బయ్య’. 8 సంవత్సరాల వయస్సులో ‘రామదాసు’ నాటకంలో బాలనటుడిగా ‘రఘురాముని’ పాత్రను పోషించారు. అది చూసి ముచ్చటపడ్డ, కాశీనాథుని నాగేశ్వరరావుగారు, ఆ బాలుడి పేరుమార్చి ఇక నుంచి నీ పేరు రఘురాముడు అని ఆశీర్వదించారు. ఆ తరువాత ఈల పాటలో ప్రావీణ్యం పొంది ‘ఈల పాట రఘురామయ్య’గా ప్రసిద్ధినొందారు. ఈయన శ్రీరాముని పాత్ర పోషించిన మరో చిత్రం 1945లో విడుదలయిన ‘పాదుకా పట్ట్భాషేకం.’
1934లో వేల్ పిక్చర్స్ పేరిట, పి.వి.దాసు నిర్మాతగా చిత్రపు నరసింహారావు దర్శకత్వంలో రూపొందిన ‘సీతాకల్యాణం’ చిత్రంలో ప్రముఖ రంగస్థల నటుడు ‘‘మాస్టర్ కల్యాణి’’ శ్రీరాముని పాత్రను పోషించి, కల్యాణరాముడు ఎలా వుంటాడో అంత చక్కటి రూపంతో అభినయంతో రాణించారు.
1934లో ఈస్టిండియా కంపెనీవారు, తారాబ్రహ్మగా పేరొందిన, సి.పుల్లయ్య దర్శకత్వంలో తీసిన, ‘లవకుశ’ చిత్రంలో ప్రముఖ రంగస్థల నటుడు పారుపల్లి సుబ్బారావు శ్రీరాముని పాత్రను పోషించి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. వీరికి జంటగా సీతాదేవి పాత్రలో సీనియర్ శ్రీరంజని ఉదాత్తంగా నటించారు. ఇదే సి.పుల్లయ్య 1963లో ఎన్.టి.రామారావు, అంజలిదేవి కాంబినేషన్‌లో తీసిన ‘లవకుశ’ చిత్రానికి, 1934లో వచ్చిన ఈ ‘లవకుశ’ చిత్రంలోని సన్నివేశాలు, అభినయం స్ఫూర్తినిచ్చాయి.
1936లో నిడమర్తి సోదరులు రాజమండ్రిలో తొలిసారిగా అవుట్‌డోర్‌లో తీసిన ‘సంపూర్ణ రామాయణం’లో ‘కడారురాజు’ శ్రీరామునిగా నటించారు. ఈ దశాబ్దంలో వచ్చిన చిత్రాల్లో శ్రీరాముని పాత్రను పోషించిన వారంతా సంగీత విద్యలో ప్రవీణులై, పద్యాలు పాడడంలో ప్రసిద్ధులైన రంగస్థల నటులే.
‘జీవనజ్యోతి’ సాంఘిక చిత్రంలో కథానాయకుడిగా పరిచయమైన నటుడు, సిహెచ్.నారాయణరావు. ఈయన 1942లో నటుడు నాగయ్య నటించిన వాహిని వారి ‘్భక్తపోతన’ (దర్శకునిగా కె.వి.రెడ్డి తొలి చిత్రం)లో శ్రీరామచంద్రుని పాత్రను పోషించారు.
రంగస్థలంపై కథానాయిక పాత్రలను సమర్ధవంతంగా పోషించి, రాగయుక్తంగా పద్యాలను, పాటలను ఆలపించటంలో ప్రసిద్ధుడైన అక్కినేని నాగేశ్వరరావును నిర్మాత ఘంటసాల బలరామయ్య సినీ రంగానికి శ్రీరామచంద్రుని పాత్రలో పరిచయం చేసిన చిత్రం ‘శ్రీ సీతారామ జననం’ 1944. అప్పటికి నాగేశ్వరరావు వయసు కేవలం 19 సం.లు. లేలేత వయసులో ‘గురుఃబ్రహ్మ’, ‘గురుఃవిష్ణు’ అంటూ శ్లోకాలు పాడి కల్యాణ రాముడి పాత్రను కమనీయంగా రక్తి కట్టించారు. వీరి సరసన రంగస్థల నటి ‘బాలాత్రిపురసుందరి’ సీత పాత్రను పోషించారు.
1956 ప్రాంతంలో ప్రముఖ నిర్మాత ఎం.ఏ.వేణు అక్కినేని నాగేశ్వరరావును కలిసి తాను తీయబోతున్న ‘సంపూర్ణ రామాయణం’ చిత్రంలో శ్రీరాముని పాత్ర ధరించవలసినదిగా కోరారు. అప్పుడు నాగేశ్వరరావు ఈ వ్యాసం ప్రారంభంలో వున్న శ్లోకాన్ని చదివి అర్ధాన్ని వివరించి ఆ పాత్రకు తనకంటే తన సహ నటుడు, నందమూరి తారకరామారావు అన్నివిధాల తగినవారని సూచించారు. ఆ సూచన ప్రకారం ఎన్.టి.రామారావు తొలిసారిగా శ్రీరామచంద్రునిగా నటించిన తమిళ చిత్రం ‘సంపూర్ణ రామాయణం’ ఇందులో సీతగా పద్మిని నటించారు.
1956లో నిర్మాత శంకరరెడ్డి రూపొందించిన సాంఘిక చిత్రం ‘చరణదాసి’లో ఒక సన్నివేశంలో అంతర్నాటకంలో అంజలిదేవి, ఎన్.టి.రామారావు ‘సీతారాములు’గా నటించారు. దానిని చూసి ముచ్చటపడ్డ నిర్మాత శంకర్‌రెడ్డి 1934లో లవకుశ తీసి, విజయం సాధించిన సి.పుల్లయ్య దర్శకత్వంలో రంగులలో ‘లవకుశ’ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 6 సంవత్సరాలు అనేక వ్యయప్రయాసలకోర్చి, దాన్ని పూర్తిచేసి 1963 మార్చిలో విడుదల చేశారు. ఆంధ్ర ప్రజానీకం, రామారావు, అంజలిదేవిల నటనకు నీరాజనం పట్టారు. రికార్డు స్థాయిలో ప్రదర్శింపబడి, కలెక్షన్స్ రాబట్టి చరిత్రను సృష్టించిన చిత్రంగా నిలిచిపోయింది.
శ్రీరామచంద్రుడు, సీతాసమేతుడై అయోధ్య నగరంలో పట్ట్భాషిక్తుడు కావటం నుంచి సీతాపరిత్యాగం, లవకుశల జననం, సీతాదేవి అవతార సమాప్తి, లవకుశుల పట్ట్భాషేకం వరకూ గల ముఖ్య ఘట్టాలను ఏర్చికూర్చిన నవరస భరిత చిత్రం ‘లవకుశ’.
పట్ట్భాషిక్తుడైన శ్రీరామచంద్రుడు మహారాజుగా, ప్రజారంజకమైన పరిపాలన అందిస్తానని, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని మాట ఇస్తాడు. సుదీర్ఘ విరామానంతరం, సీతాదేవితో అన్యోన్యంగా వుంటూ, తన ప్రేమానురాగాలను భర్తగా అందిస్తుంటాడు. సామాన్యుని నిందా వాక్కులకు విలువనిచ్చి, సీతాదేవిని, అడవులలో వదిలి రావటానికి నిర్ణయించే సందర్భంలో పరిపాలనా బాధ్యతను, స్వీకరించమని సోదరులను అర్ధించటం, రాజసింహాసనం, తననూ తన దేవేరిని దూరంచేయటం, ఆపైన సీతా వియోగంతో అంతర్మధనం చెందటం, రాజమందిరంలో లవకుశల గానాన్ని విని ముచ్చటపడి, వారు తమ కుమారులని తెలియకపోయినా, వారిని ఆశీర్వదించటం, లోక కల్యాణంకోసం, అశ్వమేధ యాగాన్ని తలపెట్టడం, యజ్ఞవాటికలో అర్ధాంగి సీతకు బదులు స్వర్ణ సీతను నిలపటం, అశ్వాన్ని బంధించిన లవకుశలతో పోరాటంలో ముందు బుజ్జగించి, ఆపై హెచ్చరించి, చివరి ప్రయత్నంగా అస్త్రప్రయోగం చేయటం, పోరు నిలవరించవచ్చిన సీతాదేవి వలన వారు తమ కుమారులని తెలిసి ఆనందించటం, తన జీవిత పరిసమాప్తి అని సీత భూమాత ఒడిలో ఐక్యం కావటం. ఆమెపట్ల గల ప్రేమ, ఆరాధనలను తలంచుకొని సామాన్య మానవునివలె శ్రీరాముడు విలపించటం, తుదకు వాల్మీకి సూచనతో లవకుశులకు పట్ట్భాషేకం చేయటం, ఈ ఘట్టాలన్నిటిలో ధీర, ఉదాత్త, మహోదాత్త నటనను ప్రదర్శించి శ్రీరాముని పాత్రకు, ప్రాణప్రతిష్టచేసి, త్రేతాయుగ శ్రీరామచంద్రుని మన కనులముందు సాక్షాత్కరింపచేసిన మహానటుడు నందమూరి తారక రామారావు. వారితో అంత ధీటుగా సీతాదేవి పాత్రకు ప్రాణం పోసి, సీతమ్మకు మారుపేరుగా నిలిచారు నటీమణి అంజలిదేవి. అంత ఉదాత్తంగా వారికి సమఉజ్జిగా లక్ష్మణుని పాత్రను పోషించారు నటులు కాంతారావు. వీరి చిత్రాలుగల కేలండర్లు, ఆరోజుల్లో ఆంధ్రదేశంలో ప్రతి ఇంటా దర్శనమిచ్చాయి.
1964లో నటులు నాగయ్య నిర్మించిన చిత్రం ‘రామదాసు’. ఆ చిత్రంలో అతిథి నటులుగా రామ, లక్ష్మణుల పాత్రలను ఎన్.టి.రామారావు, శివాజీ గణేషన్ పోషించారు.
‘రామ నామమా, లేక రామబాణమా’ ఏది శక్తివంతమైనది అనే కథాంశంతో కూడిన చిత్రం ‘శ్రీరామాంజనేయ యుద్ధం’. శ్రీరామ భక్తులలో ఒకడైన యయాతి మహారాజు విధి విలాసంవల్ల చేసిన తప్పు దాన్ని విని, అతనిని సంహరిస్తానని శ్రీరాముడు నిర్ణయించటం, ఆ సంగతి తెలియక శరణార్థియైన యయాతిని రక్షిస్తానని శ్రీరామభక్తాగ్రేసరుడు ఆంజనేయుడు అభయమివ్వటం, ఫలితంగా దైవమయిన శ్రీరామునికి భక్తుడైన ఆంజనేయునికి మధ్య పోరాటం. ఈ కథలో ఆంజనేయుని పట్ల గల అవ్యాజ్య ప్రేమ ఒకవైపు, తన శపథం నెరవేరాలని పంతగించి, ఆ ఆంజనేయుని పైనే ఆగ్రహంతో చండ్ర నిప్పులు కురిపించటం, ఈ రెండు పార్శాల నడుమగల సంఘర్షణను అద్భుతంగా ఆవిష్కరించారు, శ్రీరామ చంద్రునిగా ఎన్.టి.రామారావు, సీతాదేవిగా బి.సరోజాదేవి నటించారు.
పరస్పర విరుద్ధమైన, శ్రీరామ, రావణాబ్రహ్మ పాత్రలను పోషించి, స్వీయ దర్శకత్వంలో 1978లో ఎన్.టి.రామారావు రూపొందించిన చిత్రం ‘శ్రీరామ పట్ట్భాషేకం’. సీతగా సంగీత నటించారు.
ఆదుర్తి సుబ్బారావు తొలి చిత్రం ‘అమర సందేశం’ ద్వారా కథా నాయకుడిగా పరిచయమైన అమర్‌నాథ్ శ్రీరామునిగా నటించిన చిత్రం 1958లో విడుదలైన ‘శ్రీరామాంజనేయ యుద్ధం’.
దర్శకులు గుత్తా రామినీడు, ‘మా ఇంటి మహాలక్ష్మి’ చిత్రం ద్వారా పరిచయం చేసిన, ఆరడుగుల అందగాడు, స్ఫురద్రూపి, విశాల నేత్రుడు ‘హరనాథ్’. అతని రూపానికి ముచ్చటపడ్డ ఎన్.టి.రామారావు, తాను ప్రతినాయకుడైన రావణాబ్రహ్మ పాత్రను పోషిస్తూ తీసిన ‘సీతారామకల్యాణం’ చిత్రంలో శ్రీరాముని పాత్రనిచ్చి ‘హరనాథ్’ను ప్రోత్సహించారు. విశ్వామిత్రుని ఆజ్ఞననుసరించి దానవ సంహారం చేసినపుడు వీరోచితంగానూ, శివధనుర్భంగ సన్నివేశంలో గంభీరంగానూ, కల్యాణ ఘట్టంలో లాలిత్యంగానూ నటించి శ్రీరామ పాత్ర, పోషణకు ఎన్.టి.ఆర్.కు వారసుడేమో అనిపించుకున్నారు. హరనాథ్, శ్రీరామునిగా నటించిన మరో చిత్రం హాస్య నటుడు పద్మనాభం రూపొందించిన ‘శ్రీరామకథ’ (1968) సీతగా శారద నటించారు. హరనాథ్, శ్రీరామునిగా మరో చిత్రం ‘్భమాంజనేయ యుద్ధం’ (1966).
నారద పాత్ర పోషణకు తనకు తనేసాటి అనిపించుకున్న కాంతారావు శ్రీరామచంద్రునిగా నటించిన చిత్రాలు ‘మైరావణ’(1964), ‘పాదుకా పట్ట్భాషేకం’(1966) ‘వీరాంజనేయ’ (1968). సీత వియోగంలోగల బాధను ‘వీరాంజనేయ’చిత్రంలో చక్కగా ప్రదర్శించారు కాంతారావు. సీతాదేవిగా అంజలిదేవి నటించారు.
బాపు, రమణల కాంబినేషన్‌లో రూపొందిన కమనీయ, రమణీయ చిత్రం ‘సంపూర్ణ రామాయణం’ (1972) సాంఘిక చిత్రాలలో కథానాయకునిగా మహిళాప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న శోభన్‌బాబు ఈ చిత్రంలో శ్రీరాముని పాత్ర పోషించటం విశేషం. తండ్రి ఆజ్ఞ శిరసావహించే శ్రీరామునిగా గురువు విశ్వామిత్రుని లక్ష్యాన్ని సాధించి దనుజ సంహారం చేసిన శిష్యునిగా క్రీగంట సీతాదేవిని చూసి, అభిమానించిన, కల్యాణరామునిగా శివ ధనుర్భంగంచేసిన వీరునిగా, విర్రవీగిన పరశురాముని, విష్ణుచాపాన్ని సంధించి, అతని గర్వాంధకారాన్ని తొలగించి, కనువిప్పు కలిగించిన అవతారమూర్తిగా, సంగర రంగంలో తన వీరత్వంతో, ఔదార్యంతో చిరుమందహాసంతో రావణుని అంతరంగంలో కల్లోలం సృష్టించిన కారణజన్మునిగా తక్కువ మాటలతో, అత్యంత సంయమనంతో ఇది ‘బాపూ, రమణ’లు సృష్టించిన ‘శ్రీరామచంద్రుని’ పాత్ర అనే ముద్ర స్పష్టంగా కన్పించే విధంగా ప్రేక్షకులను మెప్పించారు శోభన్‌బాబు. సీతాదేవిగా చంద్రకళ నటించారు.
బాపూ రమణల మరోసృష్టి 1976లో నిర్మాత పింజల సుబ్బారావు తీసిన ‘సీతాకల్యాణం’. ఈ చిత్రంలో ‘రవి’ అనే నటుడిని, శ్రీరామునిగా పరిచయం చేశారు. కళాత్మక విలువలతో కూడిన ఈ చిత్రం విదేశాల్లో పాఠ్యాంశంగా ఫిలిం టెక్నిక్‌కోర్సు సిలబస్‌లో చేర్చబడింది. ఇదే నిర్మాత పౌరాణికబ్రహ్మ కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో రూపొందించిన ‘సీతారామ వనవాసం’ చిత్రంలో కూడా శ్రీరామునిగా రవి నటించారు. ఈ రెండు చిత్రాలలోనూ సీతాదేవిగా జయప్రద నటించారు.
1997లో అందరూ బాల నటీనటులతో సహజ కవి, మల్లెమాల గుణశేఖర్ దర్శకత్వంలో నిర్మించిన రామాయణం చిత్రంలో ఈనాటి మేటి, యువకథానాయకుడు జూనియర్ యన్.టి.ఆర్. శ్రీరామునిగా నటించి అగ్ర నటులు యన్.టి.ఆర్.కు నట వారసుడనిపించుకున్నారు.
2006లో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ‘శ్రీరామదాసు’ చిత్రంలో సాంఘిక చిత్రాలలో కథానాయకునిగా నటించిన ‘సుమన్’ను శ్రీరామచంద్రునిగా తీర్చిదిద్దారు. సీతగా అర్చన నటించింది.
నిర్మాత వై.సాయిబాబా, బాపూ, రమణల కాంబినేషన్‌లో ‘లవకుశ’ కథాంశంతో రూపొందించిన మహత్తర చిత్రం ‘శ్రీరామరాజ్యం’ (2011). ఈ చిత్రంలో పైన పేర్కొన్న ‘లవకుశ’ (1963) చిత్రంలోని ముఖ్యాంశాలన్నీ ఈ చిత్రంలోనూ కీలకమవటం వాటిని తన అభినయంతో రక్తికట్టించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. నందమూరి బాలకృష్ణ, నయనతార సీతాదేవిగా నటించారు.
శ్రీరామునిగా చిత్ర రంగప్రవేశం చేసిన అక్కినేని, రామాయణ కావ్యసృష్టికర్త వాల్మీకిగా ఈ చిత్రంలో నటించటం చెప్పుకోదగ్గ విశేషం.
ఒకే వంశానికి చెందిన నందమూరి తారకరామారావు, వారి తనయుడు నందమూరి బాలకృష్ణ, ఆయన మనవడు జూనియర్ ఎన్.టి.ఆర్, ఆంధ్రుల ఆరాధ్యదైవమైన శ్రీరామచంద్రుని పాత్రలను పోషించి మెప్పించటం. తెలుగు సినీ చరిత్రలో రికార్డుకాదగ్గ ప్రధాన అంశం.

- ఎస్.వి.రామారావు -సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి