మెయిన్ ఫీచర్

విశ్వనాథ కథల్లో ఆణిముత్యం.. చామర గ్రాహిణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు కథ సాహిత్యంలో చారిత్రాత్మక కాల్పనిక కథలు (్హజఒఆ్యజష్ఘ జషఆజ్యశ డఆ్యజళఒ) ఓ ప్రత్యేక ప్రక్రియగా ఎదగలేదు. తొలి తరం కథకులు చరిత్రలోని పలు అంశాలను, వీర గాథలను కథల రూపంలో ప్రదర్శించారు. కానీ తరువాత రాను రాను ఈ ప్రక్రియ వెనుక పడింది. హిస్టారికల్ ఫిక్షన్ ప్రక్రియకు మరో రూపం హిస్టారికల్ ఫాంటసీ కథలు. ‘హిస్టారికల్ ఫిక్షన్ కథ నిజం’గా భావించిన ఘటనల ఆధారంగా చారిత్రకంగా ఉన్నట్టు భావించిన వ్యక్తుల చుట్టూ అల్లిన కథ అంటే, ‘చరిత్రలో ఇలా జరిగింది’ అని నిరూపితమైన అంశాన్ని ఆధారం చేసుకొని అది ఎలా జరిగి ఉంటుందో ఊహించి రాసిన కథ అన్న మాట. అంటే ఘటనలు కల్పితమైనా, కొన్ని పాత్రలు కల్పితమైనవి అయినా, ప్రధానంగా పాత్రలు కానీ, చారిత్రక అంశాలు కానీ ప్రామాణికమైనవి అయి ఉంటాయి. ఇందుకు భిన్నం ‘హిస్టారికల్ ఫాంటసీ’ కథలు. ఈ కథల నేపథ్యం చరిత్ర అయినా, ఇందులో పాత్రలు కానీ, సంఘటనలు కానీ ప్రాథమికమైనవి కావు. పూర్తిగా కల్పితమైనవి. కానీ ఈ పాత్రలు చారిత్రాత్మక పాత్రలతో కలిసి వ్యవహరించటంవల్ల కల్పన అయినా నిజమేమో అన్న భ్రమను కలిగిస్తాయి. ఇలాంటి రచనలు తెలుగు సాహిత్యంలో నవలల రూపంలో అధికంగా వచ్చాయి. కథలు ఆరంభంలో వచ్చాయి కానీ తరువాతి కాలం రచయితలు వస్తువు, సామాజిక స్పృహ, ఉద్యమాలు, విప్లవాలకు ఇచ్చిన ప్రాధాన్యం ‘కథ’కు ఇవ్వకపోవటంతో ప్రపంచ సాహిత్యంలో ఓ ప్రత్యేక ప్రయోజనంగల కథాప్రక్రియగా వచ్చిన హిస్టారికల్ ఫిక్షన్, ఫాంటసీ రచనలు తెలుగులో అంతగా గుర్తింపు పొందలేదు. పలువురు విమర్శకులు ఇలాంటి రచనలను రచనలుగా పరిగణించటమే నేరంగా భావించే స్థితిలో ఉన్నారు.
ఒక దేశ చరిత్రలోని కీలకమైన అంశాలను హిస్టారికల్ ఫిక్షన్, హిస్టారికల్ ఫాంటసీ రచనలను రూపొందించి ప్రదర్శించటంవల్ల సామాన్యులకు తమ దేశ చరిత్రను, గొప్పతనాన్ని, దేశ ఆత్మను సన్నిహితంచేసే వీలు రచయితలకు చిక్కుతుంది. తద్వారా జాతి ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపచేస్తూ ప్రజలను ఉత్తేజపరిచే అవకాశం కూడా దక్కుతుంది. విశ్వనాథ సత్యనారాయణ రచయితగా భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, చరిత్ర సమాజం వంటి అంశాలలోని ఔన్నత్యాన్ని సమాజం ముందు నిలిపి జాతీయ భావనలు పెంపొందింపచేసి, ప్రజలలో దేశం పట్ల గౌరవాన్ని, గర్వాన్ని కలిగించి ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని ఉత్తేజపరచేందుకు ఈ హిస్టారికల్ ఫిక్షన్, ఫాంటసీ ప్రక్రియలను ఎంచుకుని అత్యంత సృజనాత్మకంగా ఆయా ప్రక్రియలలో కథలు, నవలలు సృజించారు. విశ్వనాథ సృజించిన హిస్టారికల్ ఫాంటసీ కథలకు మచ్చుతునక చామర గ్రాహిణి.
భారతదేశంలో ప్రత్యేకంగా ఉండే చమరీ మృగాలు అనే లేళ్ల పట్టు కుచ్చుల్లాంటి తోకలనుంచి తయారయిన వీవెనలు చామరాలు. రాజుల వెనుక నిలబడి వీవెనలు వీచేవారు చామర గ్రాహిణులు. ఇలాంటి చామర గ్రాహిణుల ఉద్యోగం చేసేందుకు విదేశాలనుంచి యువతులు పెద్దఎత్తున భారతదేశం వచ్చేవారు. రాజుల వద్ద కొన్నాళ్లు పనిచేసి తమ దేశం వెళ్లిపోయేవారు, లేదు ఇక్కడ ఎవరినో వివాహమాడి స్థిరపడేవారు. వారు రాణివాసంలో ఉండటంవల్ల వారివైపు ఎవ్వరూ చెడు దృష్టిని ప్రసరింపచేసేవారు కారు. రాజులు సైతం వారిని అత్యంత గౌరవంతో చూసేవారు. ఎంత అందగత్తెలయినా వారివైపు ఆకర్షితులయ్యేవారు కారు. అంటే మధ్యయుగంలో ఇస్లామీయుల పాలనలో ‘జనానా’ వ్యవస్థ ఏర్పడి రాజులు ఓ రాత్రి అనభవించి వారిని విస్మరించి జనానాలో భాగం చేసే దానికి పూర్తిగా భిన్నంగా అత్యంత సంస్కారవంతము, గౌరవనీయమైన సంప్రదాయం భారతీయ సమాజంలో నెలకొని ఉండేదన్న మాట. కానీ చరిత్రకారులు మధ్యయుగంనాటి వికృతాన్ని చూపి మొత్తం భారతీయ సమాజంపై బురద జల్లి, సమస్త భారత చరిత్రను దిగజారుడుగా చూపి, ప్రజలలో తమ పూర్వీకులన్న, ప్రాచీనమైనదన్న నేర భావనను, న్యూనత భావనను కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి వికృత విషపు ప్రయత్నాలకు వ్యతిరేకంగా విశ్వనాథ ఎక్కుపెట్టిన కథా శరం ‘చామర గ్రాహిణి’.
ఈ కథ ‘శాలివాహన శకము నూట రెండవ సంవత్సరము నాటిది’ అని ఆరంభించటంలోనే భారతీయుల చరిత్రకు విదేశీ పండితులు ఏర్పాటుచేసిన కాలక్రమాదిని విశ్వనాథ ఆమోదించటం లేదని స్పష్టం అవుతుంది. భారతదేశ ప్రాచీనతను తగ్గించేందుకు చారిత్రక కాలాన్ని కుచింపచేసి, కురచ చేసి చూపాలన్న విదేశీ పండితుల ప్రయత్నాలను జాతీయ భావాలుకల మరెవరూ ఆమోదించరని మొదటి వాక్యంలోనే స్పష్టం చేస్తాడు విశ్వనాథ. రోమ్‌లో ఓ మధ్యతరగతి సామాన్య సంసారుల బిడ్డ హెలీనా. ఆమె గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణికి చామర గ్రాహిణిగా వెళ్తుంది. అలా వెళ్లే సమయంలో చక్రవర్తి ఆ కుటుంబానికి బోలెడంత ధనం ఇస్తాడు. వారి దరిద్రం తీరుతుంది. నాలుగేళ్ల తరువాత మళ్లీ బోలెడంత ధనంతో హెలీనా తిరిగి వస్తుంది. అందరూ ఆమె చుట్టూ మూగుతారు కానీ, ఆమె ఎవరితో మాట్లాడదు. అందరికీ దూరంగా ఉంటుంది. ఆమె భారతదేశం వెళ్లకముందు ఆమెని ప్రేమించిన డర్టిమో ఆమెచుట్టూ తిరుగుతుంటాడు. ఆమె విశ్వాసం చూరగొంటాడు. వివాహం చేసుకోమంటాడు. ఆమె తిరస్కరిస్తుంది. కానీ అందుకు కారణం చెప్తుంది. అదీ చామర గ్రాహి కథ. ఇంతకీ ఆమె ఎందుకని తిరిగి వస్తుందంటే, హెలీనాకు చక్రవర్తి భార్య కావాలని కోరిక ఉంటుంది. ఆమెది లోకోత్తర సౌందర్యం. చక్రవర్తి కూడా ఆమె సౌందర్యం వైపు ప్రశంసా పూర్వకంగా చూస్తాడు. అంతే తప్ప ఆమెని కోరటమో, వేధించటమో చేయడు. ఆమె చక్రవర్తిని ప్రేమిస్తుంది. ఇది తెలిసికూడా రాణి ఆమెని గౌరవిస్తుంది. మర్యాదగా చూస్తుంది. ఒకరోజు చక్రవర్తి, రాణి కలిసే దినం. అనుకోని అవాంతరంవల్ల రాణి చక్రవర్తిని కలవలేదు. ఆ కబురు చెప్పమని హెలీనాకు చెప్తుంది. చక్రవర్తి గదికి వచ్చేసరికి అతడు నిద్రపోతూంటాడు. హెలీనా నియంత్రణ కోల్పోయి చక్రవర్తిని కౌగలిస్తుంది. చుంబిస్తుంది. కానీ ఆమె రాణి కాదని తెలుస్తుంది చక్రవర్తికి. ఆమెని వదిలి వెళ్లిపోతాడు. నిజానికి అలాంటి నేరానికి మరణశిక్ష విధించాలి. కానీ ఆ చక్రవర్తి ‘ప్రేమ లేనివాడే కానీ, దయలేని వాడు కాదు’. దాంతో ఆమెకి ధనం ఇచ్చి మర్యాదగా, కూతురిని అత్తవారింటికి పంపినట్టు ఆమెని పుట్టింటికి పంపుతాడు. అయితే కథ చివరలో రచయిత ముగింపు వాక్యంతో తన ఉద్దేశ్యాన్ని స్పష్టంచేస్తాడు. ‘గిరిశేఖరమునందు దొరముగా నున్న ఒక చిన్న ఏకైక వృక్షము మీద గుడ్లగూబ కూసినది’ అంటూ కథ ముగిస్తాడు.
గుడ్లగూబ అన్నది చెడుకు, దురదృష్టానికి ప్రతీక. భారతీయ ధర్మంలో గుడ్లగూబ లక్ష్మీదేవి వాసన అయినప్పటికీ ప్రధానంగా గుడ్లగూబ అరుపును దురదృష్టకరంగా, భవిష్యత్తులో రాబోయే ప్రమాద సూచనగా భావిస్తారు. ‘చామరగ్రాహిణి’ కథ భారతీయ రాజుల సంస్కారాన్ని ఔన్నత్యాన్ని, స్ర్తిలపట్ల వారి గౌరవాన్ని ఉత్తమ ప్రవర్తనను ప్రదర్శిస్తుంది. కానీ చరిత్రకారులు, సామాజిక శాస్తవ్రేత్తలు పాశ్చత్య రాజుల ప్రవర్తనను, వికృత చేష్టలను భారతీయ రాజులకు అంటగట్టి వ్యాఖ్యానిస్తారు. ఇప్పటి నాయకుల విపరీత ప్రవర్తనలు, మధ్యయుగం తరువాత అనాగరిక జాతుల ఆధిపత్యంలో ఉండటంవల్ల అబ్బిన అసహ్యాలను భారతీయ సంస్కృతి, ప్రాచీన సమాజానికి అన్వయించి వ్యాఖ్యానిస్తారు. ఈ గుడ్లగూబల వికృత కూతలను చివరి వాక్యం ప్రస్తావిస్తుంది. అధర్వణ వేదంలో గుడ్లగూబను జ్యేష్ఠాదేవి దూతగా భావించటం కనిపిస్తుంది. దురదృష్టానికి, వినాశనానికి, పేదరికానికి ప్రతీక జ్యేష్టాదేవి. అంటే ఇంత గొప్ప నాగరికత కూడా వికృత వ్యాఖ్యలకు లొంగి తమ ఔన్నత్యాన్ని విస్మరించి, లేని లోపాలను సృష్టించి, ఆపాదించిన నైచ్యాన్ని నిజమని భావించి న్యూనత భావానికి గురవటాన్ని ఈ ఒక్క వాక్యంతో సూచిస్తున్నాడు రచయిత. ఆరంభ వాక్యంలో పాశ్చాత్యులు ఏర్పరచిన కాల పట్టికను ఒప్పుకోని ఆత్మాభిమానాన్ని ఈ చివరి వాక్యం బలపరుస్తోంది. అత్యద్భుతమైన రచన శైలి ఇది. కథలో ఎక్కడా కూడా మనం గొప్పవారమని, మన రాజులు ఇంతవారు, అంతవారు అని కానీ ఎక్కడా ఉండదు. కేవలం కథ ద్వారా దాన్ని స్ఫురింపచేస్తూ, అత్యంత ఆసక్తికరంగా, సుందరంగా కథ సాగుతుంది. పూర్తయ్యే సరికి ఎనలేని ఆలోచనలను కలిగిస్తుంది. మన ప్రాచీన చరిత్ర గొప్పదనాన్ని మనసుకు స్ఫురింపచేసి ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది. అయితే మన లోపాలు ఎంచి, దూషించి మనం పనికిరానివారమని నిరూపించే కథలకు ఇచ్చిన ప్రాధాన్యం తెలుగు సాహిత్యంలో మన ఔన్నత్యాన్ని ప్రదర్శించే కథలకు ఇవ్వకపోవటంవల్ల ఆణిముత్యం లాంటి చామరగ్రాహిణి కథ న్యూనత భావాల బురద అడుగున అణగిపోయింది.

- కస్తూరి మురళీకృష్ణ, 9849617392