మెయన్ ఫీచర్

అతని కంటె ఘనుడు సిద్దరామయ్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎలాంటి రాజకీయ విలువలు ప్రదర్శించకుండా, ఎన్నికల్లో గెలుపుకోసం ఎంతటి దుశ్చర్యకైనా వెనుకాడని నేతగా పేరుతెచ్చుకొని, దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న భాజపా అధ్యక్షుడు అమిత్ షాకు కర్నాటకలో ఆయనతో ఢీకొట్టగల- ‘బలమైన రాజకీయ నేత’ ముఖ్యమంత్రి సిద్దరామయ్య రూపంలో ఎదురుపడినట్లు చెప్పవచ్చు. అందుకనే మే 12న జరిగే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు తీవ్ర ఆసక్తి కలిగిస్తున్నాయి. అతి కొద్దికాలంలోనే పార్టీలో మరే నేతకూ సాధ్యం కాని విధంగా పట్టును సంపాదించి, ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న అమిత్ షా ఎత్తుగడలను మట్టిగరిపించే నాయకుడు ఇప్పటి వరకు ఎదురు కాలేదు. భాజపాలో నేడు సర్వాధికారం ప్రధాని మోదీదే అని అంతా భావిస్తున్నా, కీలక నిర్ణయాలను షా తీసుకుంటున్నారు. రాష్టప్రతి, ఉప రాష్టప్రతి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను నిర్ణయించడంలో అయినా, హర్యానా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో సీఎంలను నిర్ణయించడంలో అయినా అమిత్ షా తన వాదనలను మోదీ సమర్ధించక తప్పని పరిస్థితులు ఏర్పరిచారు. షా నేతృత్వంలో మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అస్సాం, మణిపూర్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వాలను గద్దె దించి భాజపా అధికారంలోకి రాగలిగింది. గతేడాది యూపీలో ఘన విజయం సాధించింది. ఇతర పార్టీల్లోని బలమైన నాయకులను ప్రలోభాలకు లొంగదీసి పార్టీ ఫిరాయించేటట్లు చేయడమో, దర్యాప్తు ఏజెన్సీలను చూపించి నోరు మెదపకుండా చేయడమో, పార్టీ సిద్ధాంతాలతో సంబంధం లేని ‘అవకాశవాదుల’కు పెద్దపీట వేయడం ద్వారా తన ‘ఏకపక్ష’ నిర్ణయాలకు ఎవ్వరూ ప్రశ్నించకుండా చేసుకోవడంలో అమిత్‌షా ప్రదర్శిస్తున్న నైపుణ్యం ప్రత్యర్థులను సహితం ఆశ్చర్యపరుస్తున్నది. ఇంతటి నేతకు కర్నాటకలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అత్యంత ప్రతిష్టాకరం. 2019 ఎన్నికల తర్వాత మోదీ ప్రధాని పదవిలో కొనసాగాలన్నా, ఇటీవలి ఉపఎన్నికల్లో ఎదురైన పరాజయాలతో నిస్పృహకు గురైన భాజపా శ్రేణుల్లో మనోధైర్యం నింపి, ఈ ఏడాది భాజపా పాలిత రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని గెలిపించాలన్నా కర్నాటకలో గెలుపు అత్యవసరం. దేశ ప్రజల్లో మోదీ ఆకర్షణ శక్తి తగ్గలేదని నిరూపించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం భాజపా ఆధిపత్యం సాధిస్తున్న ‘హిందీ బెల్ట్’లో ఆ పార్టీ కోల్పోయిన సీట్లను భర్తీచేసుకోవాలనుకున్నా- దక్షిణాది, తూర్పు ప్రాంతాలలో బలం పెంపొందించుకొనక తప్పదు. అందుకు కర్నాటక ఎన్నికలు కీలకం. 2019 ఎన్నికలకు మెగా సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఈ ఎన్నికలు ఏ విధంగా చూసినా రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయి.
కర్నాటకలో బిజెపి, కాంగ్రెస్‌ల జయాపజయాలు ఈ ఏడాది చివర్లో జరిగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న మిగిలిన ఏకైక పెద్ద రాష్ట్రం కర్నాటక కావడంతో ఆ పార్టీకి, ఈమధ్యనే పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన రాహుల్ గాంధీ సామర్థ్యానికి ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలని బిజెపి ప్రయత్నిస్తుండగా, కమలనాథుల జైత్రయాత్రను అడ్డుకొని ఈ ఎన్నికల నుంచి తిరిగి పుంజుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది. కర్నాటకలో తాము ఓటమిపాలైతే పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారగలదని కాంగ్రెస్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కర్నాటక ప్రజలు గత మూడు దశాబ్దాలలో ఏ పార్టీకీ వరుసగా రెండోసారి అధికారాన్ని అప్పగించలేదు. 1989 నుంచి వరుసగా ఇక్కడ ప్రభుత్వాలు మారుతున్నాయి. ఈ సంప్రదాయం తమకు కలిసివస్తుందని బిజెపి ఆశిస్తున్నది. కానీ చరిత్రను తిరగరాస్తానని అమిత్‌షాను మించిపోతున్న సిద్దరామయ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన పార్టీలన్నీ ‘ప్రభుత్వ వ్యతిరేకత’పైనే ఆధారపడటం గమనార్హం. సిద్దరామయ్య ప్రభుత్వాన్ని దేశంలోనే అత్యంత అవినీతిమయ ప్రభుత్వమని ప్రకటించడం ద్వారా ఆ ప్రభుత్వ వ్యతిరేకత తమ ప్రధాన ఆయుధమని అమిత్‌షా స్పష్టమైన సంకేతం ఇచ్చారు. గతంలో యడ్డ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై తలెత్తిన అవినీతి ఆరోపణలను, నాలుగేళ్ల మోదీ పాలనలో రైతులు, యువకులు, మైనారిటీలలో ఏర్పడిన అసంతృప్తిని ప్రధాన ఆయుధంగా సిద్దరామయ్య ప్రయోగిస్తున్నారు. ఈ రెండు పార్టీలపై ఉన్న వ్యతిరేకతను జెడి (ఎస్) ఉపయోగించుకొనే ప్రయత్నం చేస్తున్నది.
రాజకీయ ప్రత్యర్థులనే కాదు, సొంత పార్టీలోని వారు సైతం నోరు విప్పకుండా ఎత్తుగడలు వేయడంలో సిద్దరామయ్య కూడా ఎటువంటి ‘రాజకీయ విలువలు’ ప్రదర్శించరు. అందుకనే అమిత్‌షా మొదటిసారిగా సిద్దరామయ్య ఎత్తుగడలతో ఖంగారుపడుతున్నట్లు కనిపిస్తున్నది. గోవా, మణిపూర్, మేఘాలయ వంటి రాష్ట్రాలలో అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ గెలిచినా, ఎత్తుగడలతో తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన భాజపాకు సిద్దరామయ్య ఎత్తుగడలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దేవెగౌడ శిష్యుడిగా రాజకీయాలలో పెరిగిన సిద్దరామయ్య- జెడి(ఎస్) ప్రభుత్వం ఏర్పడే సమయంలో తనకు బదులు దేవెగౌడ కొడుకు కుమారస్వామిని సీఎంగా చేయడంతో కంగుతిన్నారు. కొంతకాలం ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినా, ఆ పార్టీలో తానెప్పటికీ సీఎం కాలేనని గ్రహించి గుంపుగా కాంగ్రెస్‌లో చేరి ముఖ్యమంత్రి కాగలిగారు. కాకలు తీరిన కాంగ్రెస్ నాయకులను పక్కకునెట్టి, సీఎం పదవిని చేపట్టడమే కాకుండా సగం మంది మంత్రులను తనతోపాటు జెడి(ఎస్)నుండి వచ్చినవారినే చేశారు. కాంగ్రెస్ రాజకీయాలలో ఐదేళ్లు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగడం ఒక రికార్డుగానే చెప్పవచ్చు. ఇంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా కాంగ్రెస్‌వారు ఆయనను ఇప్పటికీ సొంత పార్టీ మనిషిగా అంగీకరించలేకపోతున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలలో ఉద్వేగాలను పెంపొందింపచేసి వారి దృష్టిని మళ్లించడంలో సిద్ధరామయ్య సఫలం అవుతున్నారు. ప్రజల భావోద్వేగాలతో లబ్ది పొందుతున్న బిజెపినే మాటరాని స్థితిలో పడవేస్తూ, ఎప్పటికప్పుడు ఏదో ఒక వియాన్నీ లేవనెత్తుతున్నారు. ‘కన్నడ జాతీయవాదం’ అంశాన్ని లేవనెత్తి బిజెపి ‘జాతీయవాదాన్ని’ ఆత్మరక్షణలో పడవేశారు.
రాష్ట్రంలో ఉద్యోగం చేయాలంటే కన్నడ భాష వచ్చి ఉండాలనడమే కాకుండా, హిందీ ఆధిపత్య ధోరణులను ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో తప్ప మరెక్కడా లేని విధంగా తన రాష్ట్రానికి ప్రత్యేక పతాకాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీటన్నింటికి మించి బిజెపికి మద్దతుదారులుగా, రాష్ట్ర జనాభాలో 17శాతంగా ఉన్న లింగాయత్‌లకు ప్రత్యేక మతం హోదా కల్పిస్తానంటూ సంచలనం సృష్టించారు. సిద్దరామయ్య ఎత్తుగడలను ఎదుర్కోవడంలో బిజెపి తడబడుతోంది. ‘యడ్యూరప్ప అవినీతి ప్రభుత్వం’ అంటూ ‘పొరపాటున’ అమిత్‌షా పేర్కొనడం ఈ అంశాన్ని వెల్లడి చేస్తున్నది. సిద్దరామయ్య ప్రభుత్వం పట్ల ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదని ఇటీవల కొన్ని సర్వేలలో వెల్లడి కావడం కాంగ్రెస్ వర్గాలలో ఉత్సాహం నింపింది. ఇంతకాలం తమ ‘సిఎం అభ్యర్థి’ యడ్యూరప్పపై ఆధారపడిన బిజెపి గత మూడునెలల నుంచి తమ కేంద్ర నాయకత్వాన్ని, జాతీయ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నది. మూడో పక్షంగా ఉన్న జనతాదళ్(ఎస్) అధికారంలోకి వచ్చే అవకాశం లేకున్నా, హంగ్ అసెంబ్లీ ఏర్పడితే తాము ‘కింగ్ మేకర్లు’ కావచ్చని మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ ఎదురు చూస్తున్నారు.
దేవెగౌడకు ప్రాబల్యం గల పాత మైసూర్ ప్రాంతంలో సుమారు 70 సీట్లలో బిజెపికి చెప్పుకోదగిన బలం లేదు. ఏదో అద్భుతం జరిగితే తప్ప బిజెపి అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ ప్రమాదం గ్రహించి జెడి (యస్)తో అవగాహనకు ఒక దశలో బిజెపి ప్రయత్నం చేసినా ఫలించలేదు. యడ్యూరప్ప బలమైన ప్రజాబలం గల నాయకుడు కావడంతో, ఆయన అధికారంలోకి వస్తే తామంతా ‘జీరోలం’ అవుతామనే భయం బిజెపిలోని నాయకులందరిలో ఉన్నది. గతంలో కుట్ర పూరితంగా కొందరు బిజెపి నాయకులే తనను అధికారానికి దూరం చేసారని యడ్యూరప్పకు తెలుసు. యడ్యూరప్పను జేడీ(ఎస్) మోసం చేసిందన్న సానుభూతితో 2008లో బిజెపి గెలుపొందింది. బిజెపి పాలనలో అవినీతిని చూపించి 2013లో కాంగ్రెస్ అధికారానికి వచ్చింది. యడ్యూరప్ప ‘లింగాయత్ కార్డు’ ఉపయోగించి, సొంత పార్టీ ఏర్పాటుచేసుకొని గత ఎన్నికలలో బిజెపిని అధికారానికి దూరం చేశారు. ఇప్పుడు బిజెపి అధికారంలోకి రాకుండా- సిద్దరామయ్య కూడా ‘లింగాయత్ కార్డు’నే బ్రహ్మాస్త్రంగా ప్రయోగిస్తున్నారు. బిజెపి ఓటు బ్యాంక్‌కు గండికొట్టేందుకు ఇటీవల ఆయన లింగాయత్‌లు, వీరశైవులకు మతపరమైన మైనారిటీ హోదాను ప్రకటించారు.
తన ప్రజాకర్షక పథకాల ద్వారా సిద్దరామయ్య దళితులు, బీసీలు, మైనారిటీలకు దగ్గరయ్యారు. కాంగ్రెస్ సర్కార్‌పై అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ, వాటితో సిద్దరామయ్యకు సంబంధం ఉన్నట్టు నిరూపించలేకపోయిన బిజెపి ఈ ఎన్నికలను సిద్దరామయ్య, మోదీకి మధ్య పోరుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నది. ఉత్తరాది-దక్షిణాది విభేదాలు కొద్దికాలంగా పెరుగుతూ ఉండడంతో మోదీపై ఎక్కువగా ఆశలు పెట్టుకొంటే బిజెపికి పరిస్థితి ప్రతికూలంగా మారే ప్రమాదం లేకపోలేదు.
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ‘ముగిసిన అంశంగా’ భావిస్తున్న ప్రత్యేక హోదా అంశాన్ని దాదాపు అన్ని రాజకీయ పక్షాలు తెరపైకి తీసుకురావడంతో బిజెపి ఒంటరిగా మిగిలింది. చంద్రబాబును ‘దోషి’గా నిలబెట్టేందుకు ఎదురుదాడులు జరుపుతున్నా, తెలుగు ప్రజల దృష్టిలో మోదీ ‘నమ్మకద్రోహం’ చేశారనే అభిప్రాయం కలిగించడంలో తెదేపా విజయం సాధించిందని చెప్పవచ్చు. కర్నాటకలో సుమారు 40 నియోజకవర్గాలలో తెలుగు ప్రజలు కీలకం కావడంతో ఏపీలోని పరిణామాలు బిజెపి విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.
జాతీయస్థాయిలో మహాకూటమిని ఏర్పాటు చేసి బిజెపితో తలపడవచ్చునని భావిస్తున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి. ఇటీవల సోనియా గాంధీ నిర్వహించిన విందు భేటీకి 20 ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. కర్నాటకలో గెలిస్తే కాంగ్రెస్‌తో మహాకూటమి ఏర్పాటుకు ఇతర పార్టీలు ముందుకు వస్తాయి. లేనిపక్షంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు లేని మూడో కూటమి ఏర్పాటుకు మమతా బెనర్జీ, శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్ వంటి వారు ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ అటువంటి ప్రయత్నం ప్రారంభించారు. కర్నాటకలో భాజపా పాగావేస్తే దక్షిణాదిలో ఆ పార్టీ బలం పుంజుకొనే వీలుంది. బిజెపి పట్ల విముఖంగా ఉంటున్న శివసేన, పీడీపీ వంటి పార్టీలు తమ వైఖరిని మార్చుకొనే అవకాశం లేకపోలేదు. ఏపీలో వైసీపీతో, తమిళనాడులో రజనీకాంత్ పార్టీతో జతకట్టే అవకాశాలు మెరుగుపడతాయి. 2014 నుండి రాజకీయ ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడవేస్తూ వచ్చిన బిజెపి మొదటిసారిగా కర్నాటకలో ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నది. అందుకనే ఈ ఎన్నికల ఫలితాలు 2019 ఎన్నికలపై నిర్ణయాత్మక ప్రభావం చూపే అవకాశం ఉంది.

-చలసాని నరేంద్ర సెల్ : 98495 69050