మెయన్ ఫీచర్

పంతాలకు పోయి.. పరువు తీశారు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యున్నత దేవాలయం- పార్లమెంట్’ అని నాలుగేళ్ల క్రితం తొలిసారి పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అలాంటి పార్లమెంటు పట్ల దేశ ప్రజల్లో విశ్వాసం తగ్గిపోతుండడం ఆం దోళనకర పరిణామం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఎటువంటి చర్చ చేపట్టకుండానే వ్యర్థంగా ముగించడం ప్రజాస్వామ్య సంస్థలు బలోపేతం కావాలని కోరుకునే వారందరికీ నిరాశ కలిగిస్తోంది. సమావేశాలు జరుగకుండా బాధ్యతగల సభ్యులే అడ్డంకులు కల్పించడం, ఎవరికివారు ప్రత్యర్థులపై నెపం వేసే ప్రయత్నాలు చేయడం తాజా పరిణామం. ఎందుకు ఇట్లా జరుగుతున్నదని ఆత్మపరిశీలన చేసుకొనే ప్రయత్నం ఎవరూ చేయడం లేదు. తాము అన్ని విషయాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని, ప్రతిపక్షాలే చర్చకు అవకాశం లేకుండా రాద్ధాంతం చేస్తున్నాయని అధికార పక్షం పేర్కొంటున్నది. తాము లేవనెత్తిన అంశాలపై చర్చ జరుగకుండా ప్రభుత్వం పారిపోతూ ఉండడంతో ఆందోళన చేయడం మినహా తమకు మరో గత్యంతరం లేదని ప్రతిపక్షాలు వాపోతున్నాయి.
గత రెండు దశాబ్దాలలో ఈ విధంగా ఒక పార్లమెంట్ సమావేశ కాలం వ్యర్థంగా ముగియడం 12వసారి కావడం గమనార్హం. దీనిపై అటు అధికార పక్షంలో గాని, ఇటు ప్రతిపక్షాలలో గాని ఎటువంటి ఆందోళన కనిపించక పోవడం విస్మయం కలిగిస్తుంది. సమావేశాలను ‘విజయవంతంగా’ అడ్డుకోగలిగామని ప్రతిపక్షాలు విజయ మందహాసం చేస్తూ ఉంటే, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అంశాలపై చర్చలు జరుగకుండా నివారింపగలిగామనే సంతోషం అధికార పక్షంలో కనిపిస్తున్నది. ప్రధాని, లోక్‌సభ స్పీకర్ సమావేశాలు అర్థవంతంగా జరిగేందుకు ప్రయత్నించిన దాఖలాలే కనిపించక పోవడం దురదృష్టకరం.
చట్టసభల్లో అర్థవంతమైన చర్చలకు ఏ పార్టీ కూడా సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. బడ్జెట్ సమావేశాల రెండో విడతలో తాము అవిశ్వాస తీర్మానం పెడుతుంటే చర్చకు రాకుండా అధికార పక్షం ప్రోద్బలంతోనే మొదలు కొన్ని రోజులు టిఆర్‌ఎస్, అన్ని రోజులు అన్నా డియంకె సభ్యులు రభస సృష్టిస్తూ వచ్చారని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. కానీ సమావేశాల మొదట్లో ఎటువంటి చర్చలకు ఆస్కారం లేకుండా టిడిపి సభ్యులు అడ్డుకోలేదా? సమావేశాలు వ్యర్థంగా మారి ప్రారంభమైన సెకండ్లకే వాయిదావేస్తూ ఉంటే బాధ్యతగల వారెవ్వరూ జోక్యం చేసుకొనే ప్రయత్నం చేయకుండా వినోదం చూస్తున్నట్లు ఉండిపోయారు. సంపన్నులు ఎక్కువగా ఎంపీలుగా ఢిల్లీకి వెడుతూ ఉండడంతో వారికి పార్లమెంట్ ఒక సామాజిక పరిచయాల వేదికగా మారుతున్నది. తమ వ్యాపారాలు, ఆర్థిక ప్రయోజనాలకు దాన్ని దోహదకారిగా మార్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్ సభ్యుల అత్యంత బాధ్యతాయుతమైన కర్తవ్యం బడ్జెట్ ప్రతిపాదనలపై లోతయిన చర్చలు జరపడం, బడ్జెట్ కేటాయింపులు, ప్రభుత్వ వ్యయంలో గల తేడాలను గమనించడం. సభలో రభస జరుగుతూ ఉండగానే ఎటువంటి చర్చలేకుండా ఫైనాన్స్ బిల్ ఆమోదం పొందటం అంటే ప్రజలు తమపై ఉంచిన కర్తవ్యాలను నెరవేర్చడంలో ఎంపీలు ఘోరమైన వైఫల్యం చెందుతున్నారని చెప్పవచ్చు. తమను ఎన్నుకున్న ప్రజలకు వారు ద్రోహం చేస్తున్నట్లే భావించాలి. పార్లమెంట్ సమావేశాలకు ఆటంకం కలిగించడాన్ని నేరంగా పరిగణించి, అందుకు సభ్యులను బాధ్యులుగా చేయవలసి ఉంది.
ఈసారి బడ్జెట్ సమావేశాలు జరుగకుండా అధికార పక్షమే తమకు ‘అనుకూల’మైన పక్షాలను ఉపయోగించుకున్నదనే ఆరోపణలు రావడం దురదృష్టకరం. బహిరంగ సభలలో ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలు గుప్పించడం మినహా ముఖాముఖీ చర్చలకు సొంత పార్టీ వారితో కూడా ఎప్పుడు సిద్ధపడని ప్రధాని మోదీని ఈ విషయంలో దోషిగా భావించవలసి ఉంటుంది. తన ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొనలేక ఒక విధంగా ‘పిరికితనం’తో ఆయన పారిపోయారన్న అభిప్రాయం కలుగుతున్నది.
గతంలో ఇందిరా గాంధీ కూడా పార్లమెంట్‌లో కనిపించేవారు కాదు, ప్రతిపక్షాలు ఎంతగా రాద్ధాంతం చేస్తున్నా ఆమె స్పందించేవారు కాదు. ఆమెను పార్లమెంట్‌కు రప్పించేందుకు తరచూ ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెడుతూ ఉండేవి. అందుకనే మరే ప్రధానమంత్రి ఎదుర్కోనన్ని అత్యధిక సంఖ్యలో 15 అవిశ్వాస తీర్మానాలను ఆమె ఎదుర్కోవలసి వచ్చింది. కానీ, నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా అవిశ్వాస తీర్మానం ఎదురైతే- తన ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలకు దీటైన సమాధానం చెప్పే ప్రయత్నం చేసి ఉంటే మోదీ రాజకీయంగా ఇంకా ఎదిగి ఉండేవారు.
తెలంగాణ ప్రభుత్వం ముస్లింలు, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి పంపిన ప్రతిపాదనలపై కేంద్రం సానుకూలంగా స్పందించాలని తెరాస ఎంపీలు వత్తిడి తెచ్చారు. సుప్రీం కోర్టు ఆదేశం మేరకు కావేరి జలాల యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని అన్నా డిఎంకె సభ్యులు ఆందోళన చేశారు. తెరాస, అన్నా డిఎంకె లేవనెత్తిన అంశాలపై సభలో చర్చకు ప్రభుత్వం సిద్ధపడితే సమస్య ఉండేది కాదు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కూడా చర్చకు సిద్ధపడితే ప్రభుత్వానికి ఇబ్బంది ఉండేది కాదు. ప్రతి అంశాన్నీ సంకుచిత రాజకీయ ప్రయోజనాలు, వోట్ బ్యాంకు రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని అధికార, ప్రతిపక్షాలు వ్యవహరించడంతో పార్లమెంట్ ప్రజాస్వామ్య వ్యవస్థ అప్రతిష్టపాలవుతోంది. ప్రస్తుతం కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా సుప్రీం కోర్టు ఆదేశాన్ని ఆమోదించి కావేరి జలాల యాజమాన్య బోర్డును ఏర్పాటుచేస్తే అక్కడ ప్రజలు నుండి ప్రతికూలత ఏర్పడుతుందనే భయం బిజెపి నాయకత్వానికి పట్టుకొంది. అందుకనే మొత్తం బడ్జెట్ సమావేశాలు వ్యర్థంగా ముగుస్తున్నా వారిలో చలనం కనిపించలేదు.
ఇక, రాజ్యసభ సమావేశాలను అర్థవంతంగా జరిపే ప్రయత్నాలను చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఉప రాష్టప్రతి యం.వెంకయ్యనాయుడు కొంతమేరకు చేశారు. అధికార, ప్రతిపక్షాల నుండి తగు సహకారం లేకపోవడంతో పలుసార్లు ఆయన అసహనం వ్యక్తం చేశారు. పదవీకాలం ముగియబోతున్న సభ్యులకు వీడ్కోలు చెప్పడానికి మాత్రం రాజ్యసభ ప్రశాంతంగా జరిగేటట్లు చేయగలిగారు. ఒకరోజు 11సార్లు సభ వాయిదాపడటం గమనిస్తే అన్నిపక్షాల సభ్యులు ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారో అర్థం అవుతుంది. లోక్‌సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్ అటువంటి కనీస ప్రయత్నం కూడా చేయలేదు. సభలో గొడవ చేస్తున్న సభ్యులను బయటకు పంపే అవకాశం ఉన్నా ఆమె ఆ దిశగా దృష్టి పెట్టనే లేదు. ప్రతిరోజూ ఉదయం సభ ప్రారంభం కాగానే కొద్దిసేపటికే వాయిదా వేస్తూపోవడం గమనిస్తే ఆమె- సభ జరిపే ఉద్దేశం లేకుండానే పార్లమెంట్‌కు వస్తున్నట్లు భావించాలి.
బడ్జెట్ సమావేశాలు వ్యర్థంగా మారడానికి దక్షిణాది రాజకీయ పక్షాలే కారణం కావడం గమనార్హం. ఒకవైపు ఆర్థిక అంశాలలో తమ పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నట్లు ఆరోపణలు చేస్తూ, మరోవంక ఆయా అంశాలను లేవనెత్తే ప్రయత్నం దక్షిణాది ఎంపీలు చేయకపోవడం గమనార్హం. అన్నా డియంకె, టిడిపి, టిఆర్‌ఎస్, వైసిపి సభ్యులు సమావేశాలను స్తంభింపజేయడం దక్షిణాదికి గర్వకారణం కాబోదు. ఈ పార్టీలు లేవనెత్తిన అంశాలు పూర్తిగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినవే. అందుకనే ఇతర ప్రాంతాలకు చెందిన పార్టీలు పెద్దగా ఆసక్తి చూపలేదు. దేశాన్ని కదిలించివేస్తున్న అనేక అంశాలు, మోదీ ప్రభుత్వాన్ని దోషిగా చూపుతున్న అంశాలు చర్చకు రాకుండా వీరు సహకరించినట్లు అయింది.
విమానాలు తయారు చేయడంలో అసలు ప్రవేశమే లేని ఒక పారిశ్రామిక వేత్తను స్వయంగా ప్రధాని మోదీ విదేశాలకు తీసుకువెళ్లి, ‘అసంబద్ధమైన’ మార్పులతో రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం కుదుర్చుకోవడం ప్రజలలో ఆందోళన కలిగిస్తున్న అంశం. ఈ విషయమై ప్రభుత్వం ఎటువంటి చర్చకు సిద్ధపడటం లేదు. వరుసగా వెలుగు చూస్తున్న బ్యాంకింగ్ కుంభకోణాలు, ఆర్థిక నేరస్థులు దేశం విడిచి పారిపోవడం వంటి అంశాలు ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడవేస్తున్నాయి. మరో వంక కేంబ్రిడ్జి అనలైటికా డేటా వివాదం, పశ్చిమ బెంగాల్, బీహార్‌లలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా మత కలహాలు, ఇరాక్‌లో భారతీయుల వధ, వ్యవసాయ సంక్షోభం.. ఇవ్వన్నీ మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేస్తున్న అంశాలే. ఇదే సమయంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆయా వర్గాలలో తీవ్ర ఆగ్రహావేశాలు కలిగిస్తే స్పందించి, రివ్యూ పిటిషన్ వేయడానికి ప్రభుత్వం వ్యవధి తీసుకోవడం అసహనానికి దారితీసింది.
బీజేపీ ఒక విధంగా ఆత్మరక్షణలో పడింది. ప్రజలు పార్లమెంట్ సమావేశాలు ఈ విధంగా వృథా కావడాన్ని ఆమోదించరని, వారి ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి వస్తుందని గ్రహించినట్టు కనిపిస్తుంది. సమావేశాలు వృథా కావడంతో బడ్జెట్ సమావేశాలు జరిగిన మొత్తం 23 రోజులకు బిజెపి సభ్యులు జీతాలు తీసుకోరని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ ప్రకటించారు. సమావేశాలు అర్థవంతంగా జరిగేటట్లు చేసుకోవడంలో ప్రభుత్వమే ప్రధాన బాధ్యత వహించాలి. అధికార, విపక్ష సభ్యుల మధ్య గతంలో ఎన్నడూ లేనంతంగా సంబంధాలు దిగజారడంతో మొత్తం వ్యవస్థ పనిచేయకుండాపోయే ప్రమాదం ఏర్పడింది.

-చలసాని నరేంద్ర సెల్ : 98495 69050