ఎడిట్ పేజీ

తెలుగువారి నోట్లో మట్టికొట్టిందెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా ఢిల్లీయాత్ర చేశారు. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో వివిధ పార్టీల నాయకులతో మంతనాలు సాగించారు. ఈ ప్రయత్నంలో ఆయన మూడు ప్రయోజనాలు సాధించారు. అవి- 1.రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి అన్యాయం జరిగిందనే అంశాన్ని జాతీయ స్థాయి నేతల దృష్టికి తీసుకొనిరావడం. 2. ప్రత్యేక హోదా సాధనకు పోరాటాన్ని తీవ్రతరం చేయడం. 3. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వీయ నేతృత్వంలో మరో ఫ్రంట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడం.
నిజానికి యూపీఎ హయాంలో ‘విభజన’ చట్టానికి రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీయే. ‘మీ వల్ల మాకు అన్యాయం జరిగింది’ అని కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్‌తో చంద్రబాబు అన్నపుడు- ‘ఇందులో మా తప్పు ఏముంది? మీరంతా లేఖలు ఇచ్చి ఆమోదం తెలిపిన తరువాతనే కదా విభజన జరిగింది’ అని ఆయన జవాబిచ్చారు. జైరామ్ రమేష్ చెప్పింది సత్యమే. రాష్ట్ర విభజనకు మొదటి లేఖ చంద్రబాబు నుండే వెళ్లింది. ‘హోదా’పై తాత్సారానికి నిరసనగా మోదీ క్యాబినెట్ నుంచి టీడీపీ మంత్రుల చేత రాజీనామా చేయించింది చంద్రబాబే. ‘హోదా’ సెంటిమెంటును ప్రజలలో రెచ్చగొట్టి రాబోయే ఎన్నికల్లో లాభపడాలని తెదేపా వ్యూహరచన చేసింది. ఇవన్నీ రాజకీయపుటెత్తులు. ప్రత్యేక హోదాను ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు, కొండ ప్రాంతాలకు ఇస్తారు. పోనీ- దాన్ని ఏపీకి ఇచ్చేలా చిన్న రాజ్యాగ సవరణ చేస్తే నష్టం ఏమిటి? ఇలా చేస్తే బిహార్ వంటి రాష్ట్రాలు కూడా ‘హోదా’ కోసం పట్టుబడతాయని మోదీ సర్కారు భావిస్తోంది. ‘హోదా’ తేనెతుట్టను కదిలించడం తలనొప్పి వ్యవహారమని కేంద్రం భయపడుతోంది. ఏపీకి ఎన్‌డిఏ ప్రభుత్వం కొత్తగా అన్యాయం చేసిందని ఆడిపోసుకోవడంలో అర్థం లేదు. అనాదిగా తెలుగుజాతి అన్యాయాలకు గురవుతూనే ఉంది. నెహ్రూ కాలం నుండి తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉందని మంత్రి కేటీఆర్ అనడం సమంజసమే!
గురునింద చేయటం తప్పు. కానీ గత్యంతరం లేక అర్జునుడు భీష్మునితో, ద్రోణునితో యుద్ధం చేశాడు. ప్రొఫెసర్ భద్రిరాజు కృష్ణమూర్తి అంతర్జాతీయ స్థాయి భాషా శాస్తవ్రేత్త. ఐతేనేం, ఆయన తెలుగు భాషకు ఓ విధంగా అన్యాయం చేశాడు. ‘క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్’ తమిళానికి ఇవ్వాలని వాదించినవాడు ఈయనే. తమిళంలో ‘సంగం’ యుగంలో శిలప్పాదిగారం, మణిమేఖలై వంటి రచనలు వచ్చాయి. ఐతే తెలుగు భాషకు రెండువేల సంవత్సరాల చరిత్ర వుంది. గుణాఢ్యుడు తెలుగువాడు. ఈయన కరీంనగర్ ప్రాంతం వాడని అనడానికి కొన్ని ఆధారాలు దొరికాయి. ఇతను జీవించిన కాలం క్రీ.శ.25వ సంవత్సరం. అప్పటికే ‘దేశి’ అనబడే తెలుగు భాష బాగా జన వ్యవహారంలో వికసించి ఉంది. ఈ విషయాలు ఇపుడు ఎందుకు చెప్పుకోవలసి వచ్చిందంటే తెలుగువారికి ఎవరు అన్యాయం చేశారు? అనే చర్చ నేడు తీవ్రంగా జరుగుతున్నది. రాజకీయ కోణంలో చూచినపుడు- కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, తెలంగాణ సీఎం కేసీఆర్ వల్ల తాము అనాథలమైనట్టు సీమాంధ్రులు భావిస్తున్నారు. చరిత్ర పుటలను కొంచెం విప్పి చూస్తే తెలుగువారికి మొదట టంగుటూరి ప్రకాశం పంతులు కాలంలో తొలిసారి అన్యాయం జరిగింది. ‘విశాలాంధ్ర’ ఏర్పడినప్పుడు మద్రాసు నగరాన్ని తమిళనాడుకు వదిలేశారు. తిరుత్తని, హోసూరు వంటి తెలుగు ప్రాంతాలు తెలుగువారికి దక్కలేదు. పర్లాకిమిడి, బరంపురం, ఒరిస్సాలో కలిసినప్పుడు గిడుగు రామమూర్తి పంతులు తిండి మానేసి ఆ ప్రాంతాలను వదలిపెట్టి తిరిగి ఆంధ్రా సరిహద్దులోకి వచ్చాక నీళ్లు తాగాడు. ఒకసారి బరంపురం తెలుగు సంఘం వారు ఓ కార్యక్రమానికి రమ్మని పిలిచారు. నేను వెళ్లినపుడు వారొక సూచన చేశారు. ‘మీ ప్రసంగంలో శ్రీకృష్ణదేవరాయలను మాత్రం పొగడకూడదు’ అని. ఎందుకంటే రాయలవారు గజపతులను జయించాడు కదా. అందుకని ఒరిస్సా వారికి నేటికీ రాయలవారంటే కోపం ఉంది. హైదరాబాద్‌లో ఈమధ్యనే శ్రీకృష్ణదేవరాయల పంచమశత పట్ట్భాషేక మహోత్సవాలు నిర్వహిస్తే ‘ఈ రాయలసీమ రాజుతో మనకేం పని?’ అని చాలామంది అన్నారు. ఇపుడు ఆలోచించండి. తెలుగువారికి అన్యాయం చేసిందెవరు? తెలుగువారి నోట్లో తెలుగువారే మట్టికొడుతున్నారు. 1952లో కర్నూలును విశాలాంధ్రకు రాజధాని చేశారు. అపుడు ఆఫీసర్లు టెంట్లు వేసుకొని పాలనా వ్యవహారాలు ప్రారంభించారు. ఆ రాజధాని అలాగే ఉంటే ఇపుడు కర్నూలు మహానగరం అయి ఉండేది. 1956లో బలవంతంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిని హైదరాబాద్‌కు మార్చారు. ఇక్కడికి వచ్చి వారు సుఖపడింది లేదు. 1969లో కాసు బ్రహ్మానందరెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుండి దింపటం కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన మర్రి చెన్నారెడ్డి మహోద్యమం నడిపాడు. అపుడు చిక్కడపల్లి ప్రాంతంలో గోడలపైన కాసు రాఘవమ్మ గారిమీద తప్పుడు రాతలు రాస్తే స్వాతంత్య్ర సమరయోధురాలు ఎల్లాప్రగడ సీతాకుమారి సున్నపు డబ్బాలు, కుంచె చేతబట్టుకొని ఆ గోడలకు వెల్లవేయటం నాకు తెలుసు.
1948లో ‘మాకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే రష్యా సహాయం తీసుకొనైనా సాధిస్తాం’ అని కమ్యూనిస్టులు ప్రకటించారు. 2014లో ‘ప్రత్యేక తెలంగాణ ఇవ్వకపోతే ప్రత్యేక దేశం కోరుతాం’ అని టిఆర్‌ఎస్ కార్యకర్తలు హైదరాబాదులో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా విభజించాలని తీర్మానం చేసింది బిజెపి. ‘ఒక ఓటు-రెండు రాష్ట్రాలు’ అని కాకినాడ మహాసభల్లో బిజెపి తీర్మానం ఆమోదించింది. తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్‌ను వేరుచేయండని 1970లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం నడిచింది. దానికి ఎం.వెంకయ్యనాయుడు వంటివారు నాయకత్వం వహించారు. ఈ ఉద్యమం వెనుక ఆంతర్యం అప్పటి ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావును గద్దె దింపడమే.
ఇక, విభజన రాజకీయాలు దేవుళ్లకు కూడా తప్పలేదు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నుండి వేములవాడ రాజరాజేశ్వరి స్వామికి చేరే ప్రసాదాలను ఉద్యమకాలంలో కొందరు అడ్డుకున్నారు. సీమాంధ్ర నుండి పూలు, పళ్లు కొనడం మానేసి ఎక్కువ ధర పెట్టి బెంగళూరు నుండి తెప్పించారు. తిరుపతి వెంకన్న దర్శనానికి తెలంగాణ నుండి వెళ్లిన కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావును కొందరు అడ్డుకున్నారు. విజయవాడలో వంగవీటి మోహన రంగా నిరశన దీక్ష చేస్తుంటే ఆయనపై ప్రత్యర్థి వర్గీయులు దాడి చేసి హత్య చేశారు. ఇలా సమయం దొరికినపుడల్లా తెలుగువారు పరస్పరం స్వీయ హననానికి సిద్ధపడ్డారు. సోనియా గాంధీ తన కొడుకు రాహుల్‌ను ప్రధానిగా చూడాలని కోరుకోగా, అందుకు కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారు. ఫలితంగా 2014 జూలై 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అప్పుడు లోక్‌సభలో పెట్టిన తీర్మానానికి చంద్రబాబు, సుష్మా స్వరాజ్, కాంగ్రెస్‌కు చెందిన రేణుకాచౌదరి, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, పళ్లంరాజు వంటి నేతలు మద్దతునిచ్చారు.
రాష్ట్ర విభజన జరిగిన మరుసటి రోజు నుంచే కృష్ణా గోదావరి నదీ జలాల కోసం పోరాటం మొదలైంది. నవ్యాంధ్రలో రాజధాని నిర్మాణం కోసం కేంద్రం నుండి అనుకున్న ఆర్థిక సహాయం అందలేదు. హైదరాబాదులో తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలు జరిపితే రాజధానిలోని ఐదు లక్షలమంది ఆంధ్రులలో ఒక్కరికీ ఆహ్వానాలు అందలేదు. ‘్భవన విజయం సాంస్కృతిక ప్రదర్శన పెట్టించండి’ అని డాక్టర్ నిడమర్తి నిర్మల వెళ్లి అడిగితే- ‘సీమాంధ్ర ప్రభువుతో మాకేం సంబంధం? సర్వజ్ఞ సింగభూపాల విజయం ప్రదర్శించండి’ అని అన్నారట! ఇంతకూ ఈ సింగభూపాలుడు ఎవరో తెలుసా? మహాకవి పోతనకు తిండి లేకుండా చేసినవాడు. ‘ఆంధ్ర సారస్వత పరిషత్’ పేరును సి.నారాయణరెడ్డి తనకు ఇష్టం లేకపోయినా ప్రభుత్వం ఒత్తిడివల్ల ‘తెలంగాణ సారస్వత పరిషత్’గా మార్చారు. ‘నటరత్న’ ఎన్.టి.రామారావు ప్రేరణతో ‘వచ్చిండన్నా.. వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా’ అని సినారె ఓ సినిమా పాట రాశాడు. ఉద్యమ కాలంలో సినారె ఆ పాట పాడవద్దు అంటూ హైదరాబాద్‌లోని గాయనీ గాయకులను స్వయంగా అర్థించాడు.
రెడ్డి,కమ్మ కులాలు ఇపుడు రాజకీయాధికారం కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలలోను సంఘర్షించుకుంటున్నాయి. ఈ రెండు సామాజిక వర్గాలు కలిసి రాష్ట్భ్రావృద్ధి చేస్తే దేశంలో తెలుగువారు ఎంతో గౌరవం పొందగలుగుతారు. ఆర్థికంగా, సాంస్కృతికంగా కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు ప్రథమ స్థానంలో ఉంటాయి. ఐనా అది జరుగటం లేదు. ఎందువలన?
సారాంశం ఏమంటే- 1950కి ముందు చక్రవర్తుల రాజగోపాలాచారి తెలుగువాళ్ల నోట్లో మట్టి కొట్టాడని కొందరు రోదించారు. ఇపుడు సోనియా గాంధీ, నరేంద్ర మోదీలు అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు. వాస్తవం ఏమంటే తెలుగు ప్రాంత రాజకీయ నాయకులలో ఐకమత్యం లోపించి, తమ నోట్లో తామే మట్టి కొట్టుకుంటున్నారు. ఢిల్లీలో కొద్దిరోజుల క్రితం చంద్రబాబు విలేఖరులతో మాట్లాడుతూ, బిజెపి ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని ఆరోపించారు. రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీ. హామీలు ఇచ్చింది సోనియా గాంధి. వారిని చంద్రబాబు ఎందుకు విమర్శించడం లేదు? ‘ఇచ్చిన డబ్బుకు గతి లేదు.. కాని మరో 20 వేల కోట్లు కావాలని బాబు అంటున్నారు’ అని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆక్షేపించారు. జనసేన-బిజెపిల మద్దతుతోనే తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఇపుడు అలాంటి పరిస్థితి లేదు. రాం మాధవ్ రంగప్రవేశం చేయడం ఏపీలో బిజెపికి ఏ మేరకు మేలు చేస్తుందో త్వరలోనే తేలిపోతుంది. ‘జనసేనాని’కి చెక్ పెట్టేందుకు ఓ పోలీసు ఉన్నతాధికారి త్వరలోనే రాజకీయాల్లోకి వస్తారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. రాజకీయ నేతలు ఆధిపత్యం కోసమే వ్యూహరచన చేస్తున్నారు తప్ప, తెలుగు సీమకు న్యాయం చేద్దామన్న చిత్తశుద్ధి ప్రశ్నార్థకమే!

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040- 2742 5668