ఎడిట్ పేజీ

దక్షిణాదిన ‘కావేరి’ చిచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వోన్నత న్యాయస్థానం ఒక వివాదాస్పద అంశంపై తీర్పు ఇచ్చినప్పుడు ప్రజల మధ్య కలతలు రేపుతున్న సున్నితమైన సమస్యకు ఒక పరిష్కారం చూపాలి. దశాబ్దాలుగా కర్ణాటక, తమిళనాడు ప్రజల మధ్య విద్వేషాలు రగిలిస్తున్న కావేరి జలాల పంపిణీ వివాదంపై ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆ రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చకపోగా అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. తమిళనాడుకు లభిస్తున్న జలాలను 192 టియంసిల నుండి 117.25 టియంసిలకు, అంటే 14.5 టియంసి మేర తగ్గిస్తూ, ఈ నదీ పరివాహక ప్రాంతంలో లేని బెంగళూరు నగరానికి అదనంగా 4.75 టియంసిల మేరకు కేటాయిస్తూ తీర్పు ఇచ్చింది. నీటి కొరతను భూగర్భజలాలను అనే్వషించడం ద్వారా భర్తీచేసుకోమని తమిళనాడుకు సలహా ఇచ్చింది. ఈ విషయమై కేంద్రం తీసుకొనే తుది నిర్ణయం మేరకు ఈ ‘పరిష్కారం’ 15 ఏళ్లపాటు అమలులో ఉంటుందని కూడా కోర్టు చెప్పింది. వర్షాల రాకపోకలు ఊహకందని విధంగా ఉన్నప్పుడు 15 ఏళ్లపాటు నీటి లభ్యతను ఇప్పుడే అంచనావేయడం సాధ్యం కాగలదా?
కావేరి యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయమని సుప్రీం సూచించింది. అందుకు ఆరువారాల గడువు ఇచ్చింది. వచ్చే నెల 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకోవడం మోదీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. బోర్డును సత్వరం ఏర్పాటు చేయమని తమిళనాడుకు చెందిన అన్నాడిఎంకె సభ్యులు లోక్‌సభ బడ్జెట్ సమావేశాలను 23 రోజులపాటు నిరసనలతో అడ్డుకోవడం గమనార్హం. బోర్డును ఏర్పాటుచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంటే కర్ణాటక ప్రయోజనాలకు వ్యతిరేకంగా బిజెపి వ్యవహరించిందని కాంగ్రెస్ దండెత్తి ఎన్నికల్లో ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఆరువారాలలో బోర్డును ఏర్పాటు చేయకపోవడంతో కేంద్రంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. మే 3లోగా బోర్డు ఏర్పాటు చేయమని ఆదేశించడం చూస్తే ఆచరణీయ పరిష్కారం చూపడానికి సుప్రీం ఏమాత్రం ఆసక్తిగా ఉన్నదనే అనుమానం కలుగక మానదు. కర్ణాటక ఎన్నికలు పూర్తికాగానే బోర్డు ఏర్పాటు చేయమన్నా ప్రజల ఉద్వేగాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపకుండా అత్యున్నత న్యాయస్థానం ఒక జాగ్రత్త తీసుకున్నదని భావించేవారు. మరో తొమ్మిదిరోజులు వాయిదావేస్తే మునిగిపోయెడిది ఏముంటుంది?
అసలు అటువంటి బోర్డును ఏర్పాటు చేయడం సమస్యకు పరిష్కారం చూపగలదా? సున్నిత సమస్యలకు పరిష్కారం అనే్వషించడంలో మన రాజకీయ నాయకులు ఎవ్వరు బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు. ప్రజల ఉద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నాలు చేస్తన్నారు. కర్ణాటక, తమిళనాడు పరస్పరం ‘ఇచ్చిపుచ్చుకొనే’ విధంగా పరిష్కారం కనుగొనలేకపోయాయి. కేంద్రం కూడా ఒక పరిష్కారాన్ని రెండు రాష్ట్రాలకు చూపలేకపోయింది. ట్రిబ్యునల్స్ చూపే పరిష్కారాలు సహితం అమలుకు నోచుకోవడం లేదు. నదీ జలాల వివాదాలు మనదేశంలో దశాబ్దాలపాటు ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ఉపయోగపడటం మినహా పరిష్కారాలకు మార్గాలు ఏర్పడటం లేదు.
ఇటువంటి వివాదాలు కేవలం కావేరి నదీ జలాలకు మాత్రమే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా నదీ జలాల పంపిణీలో పలు రాష్ట్రాల మధ్య వివాదాలు సుదీర్ఘకాలంగా నెలకొంటూనే ఉన్నాయి. ఈ విషయమై ఉన్నత న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చినా అమలు జరుపగలిగింది ఎవ్వరు? అనుమతులు లేకుండా, న్యాయస్థానాల తీర్పులను లెక్కచేయకుండా కృష్ణానదిపై ఎగువ ప్రాంతంలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పలు అక్రమ కట్టడాలు నిర్మించినా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమిచేయగలిగింది? పైగా, ఈ మూడు రాష్ట్రాలలో ఒకే పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సహితం సమష్టిగా పరిష్కారం కనుగొనలేకపోయారు.
చెన్నై నగరానికి త్రాగునీటి సమస్య తీర్చడంతోపాటు, రాయలసీమ ప్రాంతానికి నీరందించడానికి మహోన్నత హృదయంతో తెలుగుగంగ ప్రాజెక్ట్ ఎదురొడ్డి నిర్మించిన ఎన్టీరామారావు వంటి పట్టుదల గల నాయకులు నేడున్నారా? ప్రజల ఉద్వేగాలతో రాజకీయావేశాలు రెచ్చగొట్టేవారే ఉన్నారు. ఇప్పుడు కావేరి వివాదంపై జాతీయ రాజకీయ పార్టీలు సహితం రెండు రాష్ట్రాలలో రెండు భిన్నవాదనలు వినిపించడం మినహా జాతీయస్థాయిలో సమగ్ర పరిష్కారం గురించి మాట్లాడే సాహసం చేస్తున్నాయా?
దశాబ్దాల కాలంగా దేశంలో చెలరేగుతున్న నదీ జల వివాదాలను పరిశీలిస్తే ఇటువంటి బోర్డు ఏర్పాటు వల్ల గాని, కోర్టు తీర్పుల వల్ల గాని పరిష్కారం కనుగొనడం అసాధ్యం. అయితే తన ముందున్న పరిమిత అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ‘మధ్యేమార్గం’గా సుప్రీం ఈ విషయంలో ఒక పరిష్కారం సూచించినట్లు భావించవచ్చు. కానీ అసలు ప్రధానమైన ‘నీటి కొరత’ సమస్యకు పరిష్కారం కోర్టులలో లభ్యం కాదు. కేవలం నీటికొరత మాత్రమే కాకుండా, పరిమితంగా ఉన్న జలాలను అత్యధికంగా నీటిని వినియోగించవలసి వచ్చే పంటలకు వృధాచేస్తున్నాము. ఈ సమస్య గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించడం లేదు.
ఇటువంటి సమస్యలను నీటి యాజమాన్య బోర్డులు పరిష్కరించలేవు. రాష్ట్ర ప్రభుత్వాలే పంటలను క్రమబద్ధంచేసి, నీటి వృథాకు దోహదపడే పంటలను వేసిన రైతులకు జరిమానాలు విధించడం ద్వారా, నీటిని పొదుపు చేసిన రైతులకు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా నూతన నీటి వినియోగ సంస్కృతిని అవలంబించడానికి దోహదపడాలి. అటువంటి వినూత్న పరిష్కారాలు కనుగొని, అమలు పరచగల రాజకీయ సంసిద్ధత నేడెక్కడా కనబడటం లేదు.
కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు తమకు విశేషంగాగల సముద్ర జలాలను వినియోగంలోకి తెచ్చుకొనే అవకాశాలపట్ల ఏమాత్రం దృష్టిసారించడం లేదు. సముద్ర జలాలను వినియోగంలోకి తెచ్చుకోవడంలో ప్రపంచానికే నాయకత్వం వహిస్తున్న ఇజ్రాయిల్ అతిపెద్దదైన ఒక ప్లాంట్ ద్వారా రోజుకు 6.27 లక్షల క్యూబిక్ మీటర్ల సముద్ర నీటిని ఉపయోగించుకొంటున్నది. ఈ ప్లాంట్‌ను సంవత్సరంలో 300 రోజులపాటు ఉపయోగించుకొంటే 6 టియంసిల జలాలను అందిస్తుంది. ఇటువంటి ప్లాంట్‌లను అనేకం ఏర్పాటైతే విస్తారమైన సముద్ర తీరంగల భారతదేశంలో నీటికొరత ఉండే అవకాశమే ఉండదు. ప్రస్తుతం కర్ణాటక, తమిళనాడు అటువంటి ప్లాంట్‌లను చెరొకటి ఏర్పాటు చేసుకున్నా కావేరి జలవివాదం పరిష్కారం అయినట్లే కాగలదు.
ఈ విషయంలో సుప్రీం క్రియాత్మకంగా వ్యవహరింపదలిస్తే, కర్ణాటక, తమిళనాడు ముఖ్యమంత్రులు, సాగునీటి మంత్రులు తమ ఇంజనీర్లతోసహా తక్షణం ఇజ్రాయిల్ వెళ్లి, అక్కడ నెలకొల్పిన సముద్ర జలాలను వినియోగించుకొనే ప్లాంట్‌లను, తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ పంటలు పండిస్తున్నవారి సాంకేతిక పద్ధతులను పరిశీలించి, ఒక సంవత్సరంలోపుగా తమ రాష్ట్రాలలో ఆచరణలోకి తీసుకురావాలని, అందుకు అవసరమైన నిధులను కేంద్రం సమకూర్చాలని ఆదేశించి ఉంటే చారిత్రాత్మకంగా ఉండెడిది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలమధ్య కృష్ణాజలాలకు సంబంధించి తరచు తలెత్తుతున్న వివాదాలను కృష్ణా యాజమాన్య బోర్డు పరిష్కారం చూపగలుగుతున్నదా? రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో ఒక అవగాహనకు రాలేని పక్షంలో ఇటువంటి బోర్డులు ఏమీ చేయలేవు. కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం మినహా మరేమీ చేయలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కేంద్రం సైన్యాన్ని పంపి న్యాయస్థానాల తీర్పులను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరిపేటట్లు చేయడం సాధ్యం కాగలదా?
అంతరాష్ట్ర జల వివాదాలకు పరిష్కారం నదీ జలాలను ఉమ్మడి జాబితా నుండి కేంద్ర జాబితాకు మార్చడంగా కొందరు నిపుణులు సూచిస్తున్నారు. ఆ విధంగా చేస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకొనే అవకాశమే ఉండదు. కేంద్రం వద్ద అధికారాలు ఎంతగా కేంద్రీకృతం అయితే అటువంటి సమస్యలు మరింత జటిలం కాగలవని గమనించాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ బాధ్యతలు మోయలేనంత భారంగా మారాయి. ఇప్పుడున్న పలు అధికారాలను వికేంద్రీకరణకావించడం ద్వారా మాత్రమే కేంద్ర ప్రభుత్వం మరింత సమర్ధవంతంగా పనిచేసేటట్లు చేయగలదని గమనించాలి.

-చలసాని నరేంద్ర సెల్ : 98495 69050