మెయిన్ ఫీచర్

మనసు కన్నీరు కారుస్తోంది..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విరిసీ విరియని
పసిమొగ్గలపై
కసాయి విచ్చుకత్తులా?
ఇదెక్కడి న్యాయం?
ఇప్పుడున్న చట్టాలు..
స్వార్థపరుల చేతిలో చుట్టాలా?
సవరణలు, లొసుగులు,
బ్లాక్‌మెయిలింగ్..
అరాచకులకు ఆయుధాలా!?
ఇదేనా మన భారతదేశం?
ఈ దేశంలో ఆడపిల్లగా పుట్టకూడదని
భారతమాతే శోకించేంతగా
మారిన పరిస్థితికి కారణం ఎవరు?
చట్టాలా? శిక్షలా?
సాధారణంగా ఎక్కడైనా అత్యాచారం జరిగితే నిందితులను అరెస్ట్ చేయాలని నిరసన ప్రదర్శనలు జరుగుతాయి. కానీ జమ్మూలో మాత్రం ఎనిమిదేళ్ళ అభం శుభం తెలియని చిన్నారికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా చంపేస్తే.. నిందితులను విడుదల చేయమని ధర్నాలు చేస్తున్నారు. ఆడపిల్లకు రక్షణగా నిలవాల్సిన రక్షక భటులు అమ్ముడుపోయారు. నాయకులు జాతీయ జెండాలు పట్టుకుని నిందితులకు అండగా నిలబడ్డారు. ఎక్కడైనా ఉందా ఈ సంప్రదాయం? మనం అసలు మనసున్న మనుషులమేనా? పసిబిడ్డలపై కామాంధులు పైశాచికానికి తెగబడుతుంటే నిందితులను విడుదల చేయమని కోరుకుంటారా? ఇది మానవత్వానికి మచ్చ కాదా? ఏమైపోతుంది మన సభ్యసమాజం? ఉత్తరప్రదేశ్‌లో పదహారేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేశాడు నాయకుడైన మరో ప్రబుద్ధుడు. తర్వాత ఆ బాధితురాలి తండ్రి జైలుపాలై కస్టడీలో మరణించాడు. ఇవన్నీ చూస్తుంటే అసలు మనం మానవ ప్రపంచంలో బతుకుతున్నామా? లేక అరణ్యాల్లో జీవిస్తున్నామా? అనిపిస్తోంది. జంతువులు కూడా సాటి జంతువులను ఏమీ చేయవు. కానీ మృగాళ్లు మాత్రం ఆడపిల్ల కనిపిస్తే చాలు.. ఆటబొమ్మలా.. వారి విలాసాల కోసమే పుట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు.. చంపేస్తున్నారు. మగాడితో సమానంగా బతికే హక్కు మహిళకు లేదా?
ఆధునిక యుగమైనా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. వందేళ్ల క్రితం మహిళా దినోత్సవాన్ని ప్రకటించి, మహిళల సంరక్షణ కోసం చట్టాలను రూపొందించినా.. అవి రికార్డులకే పరిమితమవుతున్నాయి. చట్టాల అమలులో పాలకుల నిర్లక్ష్యం, వాటిల్లోని లొసుగులను వెతికే ప్రబుద్ధుల తెలివితేటలతో, సమాజపు అసంబద్ధ పోకడలతో అతివ ఊబిలో కూరుకుపోతోంది. లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలు, పైశాచికాలు.. వీటికి అంతం ఎక్కడ? నిర్భయ చట్టం వచ్చినా మృగాళ్లకు కళ్లాలు పడటం లేదు. పండు ముదుసలి మొదలుకొని పసి పిల్లల వరకూ కామాంధుల చేతిలో కరిగిపోతూనే ఉన్నారు.
అవని, ఆకాశంలో సగం, మానవజాతి కొనసాగింపునకు మూలం మహిళ.. ఎక్కడైతే స్ర్తీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారు. అలాంటి దేశమే మన భారతదేశం.. స్ర్తీని ఆదిశక్తి స్వరూపంగా కొలిచిన సనాతన సంస్కృతి మనది. అది ఈనాడు మంటగలిసింది.. అన్నింటా సగమై అతివ.. అన్ని రంగాల్లోనో వెనుకనే నిలబడింది. దీనికి అనాదిగా మనల్ని పాలిస్తోన్న పితృస్వామ్య వ్యవస్థ ఓ కారణమైతే.. అత్యాచారాలు, లైంగిక దాడులతో కూడిన నేటి సమాజం మరో కారణం. అనాదిగా మహిళలపై వివక్ష కొనసాగుతున్నా.. బ్రిటీష్ పాలనలో మహిళలకు సంబంధించిన సామాజిక దురాచారాల నివారణకు అనేక చట్టాలను రూపొందించారు. వాటి సహాయంతో భారతదేశంలో కూడా మహిళల రక్షణ కోసం అనేక చట్టాలను రూపొందించారు. వాటి ఆధారంగా వివిధ రకాల కమిషన్లు వేసి వాటి అమలుకు అహరహరమూ కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎక్కడ? ఎప్పుడు? వీటి అమలులో మన నాయకులు అతి ఘోరంగా విఫలమయ్యారు. కమిటీలు, కమిషన్లు కాగితాల్లోనే ఉండిపోయాయి. అత్యాచారం, లైంగికదాడుల వంటి ఘోరాలు చేసినవాడికి కఠిన శిక్షలు వేసి, వాటిని అక్కడికక్కడే అమలుచేస్తే మళ్లీ ఇలాంటివి జరుగుతాయా? చేసే ధైర్యం ఎవరికైనా ఉంటుందా?
2013లో ‘నిర్భయ’ చట్టం వచ్చింది. మహిళలపై హింసను నిరోధించేందుకు మునుపు ఉన్న చట్టాలను సవరించి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం వచ్చాక కూడా పరిస్థితిలో ఎటువంటి మార్పులేదు. పసిమొగ్గలు, బాలికలు, యువతులు, ముసలివాళ్ళు.. ఇలా ఏ ఆడదానిపైనా లైంగిక హింసలు, అత్యాచారాలు ఆగడం లేదు. కొంతమంది మహిళలు తమపై జరుగుతున్న లైంగిక దాడులకు, అత్యాచారాలను సమాజానికి, సమాజం నుంచి ఎదురయ్యే అసౌకర్యానికి జడిసి బయటకు చెప్పడం లేదు. శరీరం బాధపెడుతున్నా, మనసు ఎదురు తిరుగుతున్నా నోట్లో గుడ్డలు కుక్కుకుని ఏడుస్తున్నారే తప్ప గొంతు పెగల్చడం లేదు. అసలు.. మన దేశంలో స్ర్తీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. గర్భంలో పడింది మొదలుకొని.. చచ్చేంత వరకు ఎన్ని గండాలను గట్టెక్కాలో.. ఎన్ని మురికి కూపాలను దాటాలో.. ఆ దేవుడికైనా తెలుసా!? దేశవ్యాప్తంగా జరుగుతున్న అఘాయిత్యాల దౌర్భాగ్య సంస్కృతికి చరమగీతం పాడాల్సిందే.. లైంగికదాడులు, అత్యాచారాలు, హత్యలు, అమ్మాయిల అక్రమ రవాణా చాలా ప్రమాదకర స్థితిలో సాగుతూనే ఉన్నాయి. పోలీసుల రక్షణ కరువైంది. వారుకూడా నిందితులతో కలిసి బాధితులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. ఇలా అందరూ కూడగట్టుకుని చేసే దాడికి బలైన అభాగ్యులు లెక్కకు మిక్కిలి. మహిళా రక్షణకు ప్రభుత్వాలు చట్టాలు రూపొందించినా వాటి అమలుకు పోలీసులు, నాయకులు, లాయర్లు అడ్డుకట్టలు వేస్తున్నారు. ముందుగా ప్రతి ఒక్కరిలో మనసు, మానవత్వం ఉండాలి. మహిళలూ మనతో పాటు సమానంగా సమాజంలో బతకాలి అనే సౌశీల్యం ప్రతి ఒక్కరిలో ఉండాలి. బాధ్యతాయుతమైన రేపటి ఆడపిల్లను రక్షించేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. నైతిక విలువలతో కూడిన విద్యా ప్రణాళికలు రూపొందించి వాటి అమలుకు తగిన చర్యలను తీసుకోవాలి. సాటి వ్యక్తుల పట్ల మర్యాద కనబరచాలి అనేది స్వజాతి లక్షణమైనప్పుడు లింగ వివక్ష ఎక్కడి నుండి వస్తుంది? ఇది ఎవరో చెబితే వచ్చేది కాదు. ఎవరికివారు ఎప్పటికప్పుడు తమ తమ వ్యక్తిగత పురోగతిని సమీక్షించుకున్నప్పుడు కలుగుతుంది. రాజకీయ నాయకుల దగ్గర నుంచి సమాజంలో బాధ్యతాయుత రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ మహోద్యమంలా సంకుచిత రాజకీయాలను విడనాడి మహిళా భద్రతను చేపట్టినప్పుడే మహిళలపై హింస తగ్గుతుంది. అందమైన సమాజం ఆవిష్కృతమవుతుంది.

-మహేశ్వరి