మెయన్ ఫీచర్

కేసులు ఎందుకు వీగిపోతాయి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంతమంది న్యాయమూర్తులు అవినీతికి, అక్రమాలకు పాల్పడినా, కేసుల పరిష్కారానికి దశాబ్దాల కాలం పట్టినా, స్వయంగా న్యాయమూర్తులే రచ్చకెక్కినా- భారతదేశ న్యాయవ్యవస్థ అత్యున్నత ఔన్నత్యం ఇప్పటికీ మసకబారలేదు. ప్రజల నమ్మకాన్ని ఎప్పటికీ ఇనుమడించే ఘనకీర్తి, అమాయకులకు ఎన్నడూ శిక్ష పడకూడదనే అంశమే ఇందుకు కారణాలు. నిందితులు శిక్ష నుండి తప్పించుకోవచ్చు గాక, కానీ అమాయకులకు శిక్ష పడరాదనే భావనతోనే కొన్ని కేసుల విచారణకు అత్యధిక సమయం పట్టడం మనం చూస్తుంటాం. తాజాగా మక్కా మసీదు పేలుళ్ల కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కొట్టివేశారు. దాదాపు11 ఏళ్లపాటు సాగిన ఈ కేసును- ప్రాసిక్యూషన్ నేరారోపణలను రుజువు చేయకపోవడంతో కేసును కొట్టివేశారు. రాష్ట్ర పోలీసులు, సిబిఐ, ఆ తర్వాత ఎన్‌ఐఏ ఈ కేసును పరిశోధించినా, చివరికి సాక్ష్యాధారాలు లభించలేదు. ఇంతకాలం ఆరోపణలు ఎదుర్కొన్నవారు ఇపుడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారు. దీనిపై ఎన్‌ఐఎ ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేస్తుందా? లేదా? అన్నది వేరే అంశం. ప్రస్తుతానికి కేసు కొట్టి వేసిన విషయమే ప్రధానం.
మక్కా మసీదు పేలుళ్ల కేసులోనే కాదు, ఇంతకు మించిన కేసుల్లో కూడా నిందితులకు శిక్షలు పడతాయని భావించినప్పటికీ వారు బయటపడటం మనం చూస్తుంటాం. దీనికి కారణం ఆయా కేసులతో వారికి సంబంధం లేకపోవడం ఒక అంశమైతే, దర్యాప్తు సంస్థలు సాక్ష్యాధారాలను న్యాయస్థానాల్లో ప్రవేశపెట్టడంలో విఫలం చెందడం మరో కారణం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్కాం కేసులో డిఎంకే పార్టీ అధినేత కరుణానిధి కుమార్తె కనిమొళి, మాజీ కేంద్ర మంత్రి ఎ.రాజాలు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కేసు అప్పటి యుపిఎ ప్రభుత్వం మెడకు చుట్టుకుంది కూడా. ఇంత తీవ్రమైన కేసును గత ఏడాది డిసెంబర్ 21న సరైన సాక్ష్యాధారాలు లేవంటూ పాటియాల కోర్టు కొట్టి వేయడం దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అలాగే, 2005 అక్టోబర్ 12న టాస్క్ఫోర్సు ఆఫీసుపై మానవ బాంబు దాడికి కార్యాలయం తునాతునకలైపోయింది. ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడటంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది. దేశాన్ని కుదిపేసిన స్వామినిత్యానంద కేసు కూడా కంచికి చేరింది. ఈ పరిస్థితి కేవలం క్రిమినల్ కేసులకే పరిమితం కాలేదు. క్రీడాకారులు, సినీనటులు, రాజకీయ ప్రముఖులు నిందితులుగా ఉన్న కేసులు, తీవ్రమైన నేరాలు చేసిన వారు, దొంగనోట్ల కేసులు, హత్య, అత్యాచారం వంటి కేసులను కూడా కొట్టి వేసిన సందర్భాలున్నాయి. సివిల్ సర్వీసు అధికారులు, ముఖ్యమంత్రులపై దాఖలైన కొన్ని కేసులను కోర్టులు కొట్టివేయడం సహజంగానే జరుగుతోంది. జడ్జీలు తమ తీర్పులో పేర్కొనే ప్రధాన అంశం ఏమంటే-‘నేరం రుజువు చేసే సాక్ష్యాలను ప్రవేశపెట్టడంలో ప్రాసిక్యూషన్ విఫలం కావడంతో కేసును కొట్టివేయడమైనది’ అని.
గతంలో సాక్ష్య శాస్త్రానికి సంబంధించిన సూత్రాలు ఇంగ్లీషు చట్టాల్లో, భారతీయ శాసనాల్లో స్పష్టంగా లేవు. కఠిన పరీక్షలకు గురి చేయడం ద్వారా,పందెం, యుద్ధం ద్వారా సాక్ష్యాలను రాబట్టి వాటిని విచారణకు నిరూపణ పద్ధతిలో వాడుకునేవారు. హిందూ న్యాయశాస్త్రంలో దైవ సంబంధమైన పరీక్షలను నిర్వహించేవారు (పెద్ద ప్రియనాథ్- జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హిందూ జ్యురిస్‌ప్రుడెన్స్ పేజీ 371). ఇప్పటి సాక్ష్య చట్టానికి ఇంగ్లీషు సాధారణ న్యాయశాస్తమ్రే మూలం . సాక్ష్య చట్టంలో కొన్ని భాగాలు మధ్య యుగాల కాలం నాటి గురుతులే. సాక్ష్యానికి సంబంధించి ముఖ్యమైన ప్రసిద్ధ లక్షణాలు 16-17వ శతాబ్దంలో జరిగింది. అపుడు న్యాయ నిర్ణయ సంఘం వారు సాక్ష్యం మీద కేసులను పరిష్కరించేవారు ( హోల్డ్‌వర్త్- సోర్సెస్ ఆఫ్ లిటరేచర్ ఆఫ్ ఇంగ్లీషు లా). మొదటి సారి సాక్ష్యం గురించి ఒక పుస్తకాన్ని చీఫ్ బారన్ గిల్‌బర్డ్ రాశారు. ఆయన 1726లో మరణించగా, ఆ పుస్తకాన్ని 1756లో ప్రచురించారు. బ్రిటిష్ కాలంలోనే సాక్ష్యాలకు సంబంధించి సూత్రాలను మద్రాసు, బొంబాయి, కలకత్తా ప్రెసిడెన్సీ పట్టణాల్లోని న్యాయస్థానాల్లో వర్తింపచేశారు. భారత శాసన నిర్మాణ మండలి 1835,1853 మధ్య దీనిని ఆమోదించింది. సాక్ష్య చట్టంలోని అంశాలన్నింటినీ క్రోడీకరించాలని గుర్తించడంతో అది 1868లో మూడో లా కమిషన్ ఆ పనిని పూర్తిచేసింది. 39 క్లాజులు మాత్రమే ఉండటంతో ముసాయిదా చాలా చిన్నదిగా ఉండేది. ఈ బిల్లు అంసపూర్ణంగా ఉందని, తప్పు క్రమంలో ఉందని, దేశ పరిస్థితులకు అనుగుణంగా లేదని దానిని ఆమోదించలేదు. 1871లో సర్ జేమ్స్ స్టీఫెన్ తయారుచేసిన మరో ముసాయిదాను పరిషత్‌లో ప్రవేశపెట్టారు. 1872లో భారత సాక్ష్య చట్టం పేరుతో దీనిని ఆమోదించారు.
తర్వాత ఆ చట్టానికి పలు సవరణలు చేశారు. అయినా నేటి కోర్టు తీర్పులు చూస్తుంటే ఇంకా ఏదో లోపం కనిపిస్తోంది. సాక్ష్య చట్టంలో ఉన్న అంశాలు ఏమిటి? ఎందుకిలా జరుగుతోంది? విచారణ సమయంలో అనేక మంది సాక్షులను ప్రవేశపెడుతుంటారు కదా. ఇటీవల సుప్రీం కోర్టు 2008 నాటి గుజరాత్ బాంబు పేలుళ్లకు సంబంధించిన ఒక కేసును విచారిస్తూ అత్యధికంగా సాక్షులను ప్రవేశపెట్టడంపై దర్యాప్తు అధికారులకు చివాట్లు పెట్టింది. పెద్ద సంఖ్యలో సాక్షులను ప్రవేశపెట్టడం అంటే అంత గట్టిగా తమ వాదనలను వినిపించినట్టు కాబోదని కోర్టు పేర్కొంది. దర్యాప్తు సంస్థలు సాక్షుల సంఖ్యపైనే ఎందుకు ఆధారపడుతున్నాయని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. గుజరాత్ పేలుళ్ల కేసులో పోలీసు అధికారులు 1500 మందిని సాక్షులుగా చేయడాన్ని గమనించి, ‘ప్రతి కేసులో 100 నుండి 200 మందిని సాక్షులుగా పెడుతున్నారు, ఒక రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో 200 మందిని ప్రాసిక్యూషన్ సాక్షులుగా చూపింది, కాని వాస్తవానికి అందులో ఒక్కరు కూడా ప్రత్యక్ష సాక్షి లేరు. ఇలా ఎందుకు చేస్తున్నారు?’ అంటూ దర్యాప్తు అధికారులను జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. మక్కా మసీదు పేలుళ్ల కేసులోనూ అదే జరిగింది. 226 మంది సాక్షులను ప్రవేశపెట్టారు. అందులో 64 మంది పొంతన లేని సాక్ష్యాలను చెప్పారు. 396 ఎగ్జిబిట్స్ , 28మెటీరియల్ ఆబ్జెక్ట్సును దర్యాప్తు అధికారులు సమర్పించినా ఫలితం లేకపోయింది. ఇందుకు కారణం దర్యాప్తు అధికారులు శాస్ర్తియ పద్ధతిలో సాక్ష్యాధారాలను సేకరించలేకపోవడమే. సాక్ష్యాధారాలను ఏ విధంగా సేకరించాలి? ఎలా భద్రపరచాలి? ఏ క్రమంలో వాటిని సమర్పించాలనేది ఒక శాస్త్రం. దానిని చట్టరూపంలో ‘లా ఆఫ్ ఎవిడెన్స్’గా రూపొందించారు. దానినే మనం సాక్ష్య చట్టం అని వ్యవహరిస్తున్నాం.
న్యాయశాస్త్రాన్ని సిద్ధాంత న్యాయశాస్త్రం, కార్యపద్ధతి న్యాయ శాస్త్రంగా విభజించవచ్చు. సిద్ధాంత న్యాయశాస్త్రం అంటే లిఖిత శాసనం, సంప్రదాయక ధర్మం ఏ విషయాలు హక్కును లేదా బాధ్యతను ఏర్పరుస్తాయనే దాని గురించి నిర్వచిస్తుంది. నిర్దిష్ట కేసులకు సిద్ధాంత న్యాయశాస్త్రాన్ని కార్య పద్ధతి న్యాయశాస్త్రం ద్వారా వర్తింపచేస్తుంటారు. సాక్ష్య చట్టం, కార్యపద్ధతి న్యాయశాస్త్రం ముఖ్యమైన విభాగాల్లో ఒకటి. ఈ సాక్ష్య చట్టం భారతదేశంలో అప్పటి బ్రిటిష్ పాలకులు 1872లో ఆమోదించి అదే ఏడాది సెప్టెంబర్ 1 నుండి అమలులోకి తెచ్చారు. స్వాతంత్య్రానంతరం దానినే మనం కొంత స్వల్ప మార్పులు, చేర్పులతో కొనసాగిస్తున్నాం. ఆర్బిట్రేషన్, అఫిడవిట్లకు తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లో ఈ చట్టం జమ్మూ కాశ్మీర్ మినహా దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. ఏ కేసు గెలవాలన్నా, ఏ కేసు విఫలమైనా దానికి అత్యంత ప్రధానమైన అంశం సాక్ష్యం. సాక్ష్యం ఎలా ప్రవేశపెట్టాలి? సాక్ష్యాలను ఎలా సేకరించాలి? సాక్షులిచ్చే సమాచారాన్ని ఎలా శాస్ర్తియంగా అనుశీలనం చేయాలనే అంశాలపై సమర్ధత, అవగాహన దర్యాప్తు అధికారికి చాలా ముఖ్యం. ఈ శాస్ర్తియ అనుభవం కొరవడి, కొన్ని సందర్భాల్లో దర్యాప్తు అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడడంతో కేసులు వీగిపోతున్నాయి. సాక్ష్య చట్టం చాలా విస్తృతమైంది. సమాచార సాంకేతిక విజ్ఞాన చట్టం అమలులోకి తీసుకువచ్చిన తర్వాత దానిలో కూడా మరికొన్ని సవరణలు తెచ్చారు. దాంతో సాక్ష్య చట్టంలో ఐటి చట్టం నేడు చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది. వాదాంశ నిర్ణయ విషయాల సిద్ధాంతం (డాక్ట్రిన్ ఆఫ్ రెసిగెస్టి), గుర్తింపు పరేడ్, కుట్ర, స్థలాంతర ఉనికి (ఎలిబీ), హక్కు, మానసిక దేహస్థితి, దేహభావం, ప్రమాదవశాత్తు జరిగిందా? లేదా ఉద్దేశ పూర్వకంగా జరిగిందా? అంగీకరణలు, స్వయం సేవక ప్రకటనలు, ఒప్పుకోలు, సాక్షుల ప్రకటనలు, నిపుణుల అభిప్రాయాలు, వౌఖిక సాక్ష్యం, పత్రపూర్వక సాక్ష్యం, వాద నిషేధం (ఎస్టాపెల్), సాక్షుల పరీక్ష చాలా కీలకమైనవి. ఈ క్రమం ఏ మాత్రం గాడితప్పినా, ప్రాసిక్యూషన్ వైఫల్యం అనివార్యమైపోతుంది.
కేసును సమర్ధంగా వాదించి, నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చేయడంలో కీలకపాత్ర న్యాయస్థానానిది ఎంత మాత్రం కాదు, ఆ బాధ్యత దర్యాప్తు అధికారులదే. వారు ఎంత సమర్ధంగా కేసు దర్యాప్తు కొనసాగిస్తే అంత కఠినమైన శిక్షలు నిందుతులకు పడతాయి. దర్యాప్తు అధికారులపై పనిభారం, వౌలిక సౌకర్యాలు , నిధుల కొరత తదితర కారణాలతో పాటు ఇతర కేసుల దర్యాప్తు బాధ్యతలు, తరచూ బదిలీలు, విధుల మార్పు వంటి కారణాలతో కేసులు నీరుగారుతున్నాయి. కొన్ని కేసులు అత్యంత కీలక ఘట్టంలో ఉన్న తరుణంలో ఆయా దర్యాప్తు అధికారులకు ఎలాంటి కారణాలు చూపకుండానే బదిలీ చేయడం , తదుపరి వచ్చిన దర్యాప్తు అధికారికి ఆ కేసుపై పట్టులేకపోవడం కూడా సాక్ష్యాలను బలంగా ప్రవేశపెట్టలేకపోవడానికి ప్రధాన కారణం అవుతోంది. కేసుల దర్యాప్తులో శాస్ర్తియతను మెరుగుపరిచేందుకు, అందుబాటులో ఉన్న సమాచార సంలీనానికి, విశే్లషణకూ, సంశే్లషణకూ సాక్ష్యాల చట్టం ఎంతో దోహదపడుతుంది. ఈ చట్టంలో మూడు భాగాలు, 11 చాప్టర్లున్నాయి. సాక్ష్యాన్ని వివాదంలో ఉన్న అంశాలకే పరిమితం చేయడం ఒకటైతే, వినికిడి (అటభోగట్టాలు) అంశాలను సాక్ష్యాలుగా చేర్చకపోవడం మరో ముఖ్యమైన అంశం. భారత సాక్ష్య చట్టం-1872 సెక్షన్-5 ప్రకారం ఏదేనీ దావాలో లేదా కార్యనిర్వాహక వ్యవహారంలో గానీ, వివాదంలో గానీ ఉన్న ప్రతి విషయం మనుగడలో ఉందనీ గానీ లేదా మనుగడలో లేదని గానీ పేర్కొన్న సందర్భంలో , స్పష్టంగా వివరించబడిన లేదా తత్సంబంధమైన విషయాల గురించి ఎవరైనా శ్రేష్టమైన సాక్ష్యాన్ని అందించవచ్చు. ఇంత స్పష్టత ఉన్నా కేసులు వీగిపోవడానికి కారణం బలమైన సాక్ష్యం లేకపోవడం, దర్యాప్తు అధికారుల్లో చిత్తశుద్ధి కొరవడటమే.

-బీవీ ప్రసాద్ 98499 98090