మెయన్ ఫీచర్

మోదీ నోట ‘జమిలి’ జపం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉండడంతో రాజకీయ పక్షాల, ప్రజానీకం దృష్టి ఎన్నికలపైనే ఉండడంతో అభివృద్ధి మరుగున పడుతోందని ప్రధాన మంత్రి మోదీ అంటున్నారు. దీనికి విరుగుడుగా లోక్‌సభ, అసెంబ్లీ లకు ఒకేసారి ఎన్నికలు జరపాలనే ఆలోచనను ఆయన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగాల్సిన తరుణంలో ఈ ప్రతిపాదనపై ఆయన వేగంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. భాజపా తన రాజకీయ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి మాత్రమే కాకుండా మోదీ రాజకీయ భవిష్యత్‌కు సహితం ఇప్పుడు జమిలి ఎన్నికలు అనివార్యంగా పరిణమిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు కీలకమైన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇపుడు ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తోంది. ఆ రాష్ట్రాల్లో పార్టీ ఓటమి చెందిన తర్వాత లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఆ ప్రభావం మోదీ ఎదుర్కొనక తప్పదు. రాజకీయ పరిణామాలను తమకు అనుకూలంగా మలచు కోవడానికి భాజపాకు జమిలి ఎన్నికలు అత్యవసరంగా కనిపిస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర ఉత్తరాది రాష్ట్రాల బలంతో కేంద్రంలో పూర్తి మెజార్టీ సాధించిన బీజేపీ ఆయా రాష్ట్రాల్లో ఎదురుగాలి వీచినా లోక్‌సభ ఎన్నికలపై ఆ ప్రభావం పడకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేయవలసిన పరిస్థితి ఏర్పడింది. 2014లో వచ్చినన్ని ఎంపీ సీట్లు ఆ రాష్ట్రాల్లో 2019లో రాకపోతే ఎలా? అన్న సందేహం బీజేపీ వ్యూహకర్తలను కొద్దీ నెలలుగా పీడిస్తున్నది. ఈ నేప థ్యంలో జమిలి ఎన్నికల ద్వారా జాతీయ స్థాయి అంశాలను ముందుపెట్టి రాష్ట్రాల్లో అధికారం సాధిం చడంతోపాటు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది బీజేపీ ఎత్తుగడగా కనిపిస్తున్నది. వచ్చే ఏడాది ప్రారంభమయ్యే విధంగా లోక్‌సభ, అసెంబ్లీలకు రెండు విడతల్లో జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుందా? అనే అంశంపై తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఎన్నికల సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం కోరనుంది. ఈ విషయమై లా కమిషన్ సానుకూలత వ్యక్తం చేస్తున్నది. 2019, 2024లో రెండు విడతలుగా లోక్‌సభకు, అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించాలని నీతి ఆయోగ్, లా కమిషన్ సిఫారసు చేస్తుండడంతో మార్గం సుగమం అయిన్నట్లు భావిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఒకే దేశం.. ఒకే ఎన్నిక (వన్ నేషన్.. వన్ ఎలక్షన్) సిద్ధాంతానికి ఒక రూపాన్ని కల్పిస్తూ 2019లో ప్రారంభమయ్యే విధంగా లోక్‌సభ, అసెంబ్లీలకు జమిలి ఎన్నికలు నిర్వహించాలని భావి స్తున్నారు. ఇప్పటికే జమిలి ఎన్నికలకు పూర్వరంగంగా పార్లమెంట్ లో రాష్టప్రతి రాంనాథ్ కోవింద్ బలమైన సిఫార్సు చేశారు. లా కమిషన్ నివేదిక ప్రకారం రెండో విడత జమిలి ఎన్నికలు 2024లో జరిగే అవకాశం ఉన్నది. 2021 వరకు ఎన్నికలు జరగాల్సి ఉన్న రాష్ట్రాలకు మొదటి దశలో భాగంగా 2019లో ఎన్నికలు నిర్వహించాలని నివేదిక ప్రతిపాదిస్తున్నది. మొదటి దశలో ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అసోం, బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఉంటాయ. 2024లో రెండో విడత జమిలి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ, పంజాబ్ ఉంటాయ. లోక్‌సభతోపాటు అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలంటే అసెంబ్లీల కాల పరిమితిని పొడిగించడం లేదా తగ్గించడం అనివార్యం. దీనికోసం రాజ్యాంగానికి, ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాల్సి వస్తుంది. మరోవైపు ఎన్నికల సంఘం సూచించిన విధంగా అవిశ్వాస తీర్మానం తర్వాత విశ్వాస తీర్మానం కచ్చితంగా ఉండాలని కూడా రాజ్యాంగ సవరణకు మోదీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. దీనివల్ల ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసే సంఖ్య ప్రతిపక్షాల వద్ద లేనప్పుడు ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉండదు.
ఆరు నెలల క్రితం వరకు సమీప భవిష్యత్‌లో మోదీని ఎదుర్కొనగల నాయకుడు లేడని ప్రతిపక్షాలు సహితం భావిస్తూ వచ్చాయి. అయితే వరుసగా పలు పాలనపర వైఫల్యాలతో మోదీ ప్రభుత్వం ప్రతిపక్షాలలో ఆశలను చిగురింప చేస్తున్నది. 2014లో కేవలం 31 శాతం ఓట్లతోనే బిజెపి లోక్‌సభలో ఆధిక్యతను సంపాదించుకోవడంతో, తాము ఒకే అభ్యర్హ్డిని నిలబెడితే భాజపాను ఓడించడం సులభమే అన్న భరోసా ఇప్పుడు ప్రతిపక్షాలలో వ్యక్తం అవుతున్నది. బిజెపికి వ్యతిరేకంగా పరస్పర వైరుధ్యాలు గల రాజకీయ పక్షాలు చేతులు కలపడానికి సిద్ధపడుతున్నట్లు ఉత్తరప్రదేశ్ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రాజకీయంగా బద్ద విరోధులుగా భావిస్తున్న ఎస్పీ, బీఎస్పీ మొదటిసారిగా చేతులు కలపడంతో రెండు లోక్ సభ సీట్లకు జరిగిన ఉపఎన్నికలలో బిజెపి ఘోరంగా ఓటమి చవి చూడవలసి వచ్చింది. ఇప్పటి వరకు జరిగిన 9 లోక్‌సభ ఉపఎన్నికలలో వరుసగా భాజపా ఓటమి చూడవలసి రావడం గమనార్హం. అందుకనే కొన్ని లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుపకుండా కుంటి సాకులతో కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాశ్మీర్ లోయలో అనంతనాగ్ ఉపఎన్నికను రెండేళలుగా శాంతిభధ్రతల సమస్య పేరుతో జరపడమే లేదు. మరో నాలుగు లోక్‌సభ సీట్లకు ఉప ఎన్నికలు జరుపవలసి ఉన్నా ఆ ప్రస్తావన ఇప్పుడు కర్ణాటక ఎన్నికలతో పాటు తేవడం లేదు.
మరోవంక ఐదురుగు వైకాపా ఎంపీలు ఇటీవల రాజీనామా చేశారు. ఆ రాజీనామాలను ఆమోదించడంలో కాలయాపన చేయడం ద్వారా ఉపఎన్నికలు లేకుండా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ జమిలి ఎన్నికలు జరుపగలిగితే తప్ప రాజకీయంగా పెనుముప్పు ఎదుర్కోవలసి వస్తుందనే ఆందోళన బిజెపి వర్గాలలో వ్యక్తం కావడాన్ని సూచిస్తున్నాయి. జమిలి ఎన్నికలకు ప్రభుత్వ పరంగా సన్నాహాలు చేస్తున్నా రాజకీయంగా ఏకాభిప్రాయం సాధించేందుకు ఎటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేపట్టలేదు. చివరకు బీజేపీ మిత్రపక్షాలు సహితం ఈ ప్రయత్నాలకు ఏమేరకు సహకారం అందించగలవో చూడవలసి ఉంది.
రాజ్యాంగ సవరణలు తీసుకు రావాలంటే ప్రతిపక్షాలతో పాటు, మిత్రపక్షాల సహకారం అనివార్యం కాగలదు. సహేతుక కారణం లేకుండా డిసెంబర్ లో జరుగవలసిన అసెంబ్లీ ఎన్నికలను కొన్ని రాష్ట్రాలలో వచ్చే సంవత్సరం మేలో లోక్‌సభ తో పాటు జరపడం సులభం కాక పోవచ్చు. బిజెపి పాలిత రాష్ట్రాలలో శాసనసభల గడువు ముగిసిన తర్వాత రాష్త్రపతి పాలన విధించడం ఆయా ప్రభుత్వాలకు సమ్మతం అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. ఎన్నికలు జరుగ వలసిన రాష్ట్రాలలో కొత్త పార్టీ అధ్యక్షులను తీసుకు రావడం ద్వారా బిజెపి ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కాగానే జమిలి ఎన్నికల పైననే బిజెపి దృష్టి సారించే అవకాశం ఉంది.
2014 ఎన్నికలలో సుమారు 90 శాతం సీట్లను హిందీ బెల్ట్ లోనే బిజెపి గెల్చుకోంది. 2019లో ఈ సీట్లు తగ్గే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన అమిత్ షా పార్టీ అధ్యక్ష పదవి చేపట్టగానే దక్షిణం, తూర్పు రాష్ట్రాలలో పార్టీని పటిష్ఠపరచడమే లక్ష్యంగా ప్రకటించారు. ఇప్పటి వరకు బీజేపీ ఒకసారి కూడా గెలుపొందని 125 నియోజకవర్గాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్, ఒడిశాలో పరిమితంగా విజయాలు సాధించినా, దక్షిణాదిన మాత్రం బలమైన పునాది వేయలేక పోయారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో బలమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకొనే ప్రయత్నాల పట్ల అమిత్ షా దృష్టి సారించలేక పోయారు. కేరళలో బిజెపి ఏమేరకు నిలదొక్కుకో గలదో చూడవలసి ఉంది. ఈశాన్య రాష్ట్రాలపై దృష్టి సారించి, అక్కడ ఘన విజయాలు సాధిస్తున్నా ఆ ఎనిమిది రాష్ట్రాలలో కలసి ఉన్న సీట్లు 25 మాత్రమే. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే అన్ని సీట్లు ఉన్నాయి.
బిజెపితో కలసి ఉన్న బలమైన మిత్రపక్షాలు ఒకొక్కటి దూరం కావడం తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైనది. దానితో కొత్తగా బలమైన ప్రాంతీయ పార్టీలు ఏవీ ఎన్డీయేలో చేరే అవకాశాలు కనిపించడం లేదు. రాష్ట్రాలలో బిజెపి నాయకులు చాలామంది చేతులు ఎత్తివేసి కేవలం మోదీ మేజిక్ వైపే చూస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికలలో అదే జరుగుతున్నది.
కాగా, పుష్కరకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి, ఆ సమయంలో కేంద్రం అనుసరిస్తున్న వివక్ష పూరిత విధానాల పట్ల గొంతెత్తుతూ వచ్చిన మోదీ ఇపుడు ప్రధాని హోదాలో రాష్ట్రాలను బలోపేతం చేసే ప్రయత్నం చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం అవుతుండడం విస్మయం కలిగిస్తుంది. రాష్ట్రాలకు కేంద్ర పనులలో ఇచ్చే వాటాను 32 శాతం నుండి 42 శాతానికి పెంచినా, ఆచరణలో తమకు వస్తున్న నిధులు తగ్గుతున్నాయని రాష్త్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయమై దక్షిణాదిలోనే ఎక్కువగా అసంతృప్తి వ్యక్తం కావడం గమనార్హం. ఈ పరిణామాలు దక్షిణాదిలో బిజెపి పుంజుకోవడానికి అడ్డంకిగా మారే ప్రమాదం లేకపోలేదు. బిజెపి పాలిత రాష్ట్రాలలో ఎస్సీ వర్గాలలో అభద్రతాభావం, లైంగిక వేధింపులు, వ్యవసాయ సంక్షోభం వంటి అంశాలు బిజెపి కార్యకర్తలలోనే అసంతృప్తికి దారితీస్తున్నది. బిజెపి పాలిత రాష్ట్రాలలో ఆయా ప్రభుత్వాల పనితీరు ఆ పార్టీ కార్యకర్తలకే సంతృప్తి కలిగించడం లేదు.
ఇటువంటి రాజకీయ, పాలనాపర అంశాల పట్ల దృష్టి సారించకుండా కేవలం జమిలి ఎన్నికలు జరపడం ద్వారా - ప్రజా అసంతృప్తిని అధిగమించవచ్చని అంచనా వేస్తే ఎదురు దెబ్బలు తప్పకపోవచ్చు. జమిలి ఎన్నికలు నిర్వహించే విషయంలో రాజకీయ ఏకాభిప్రాయం సాధించే ప్రయత్నం చేయడంతో పాటు విస్తృత ప్రాతి పదికన వివిధ వర్గాలతో సంప్రదింపులు జరుపవలసి ఉంది. రాజకీయ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొనే ఏకపక్షంగా అమలు చేసే ప్రయత్నం చేస్తే ప్రతికూల ప్రభావాలు అనివార్యం కాక తప్పదు.

-చలసాని నరేంద్ర సెల్ : 98495 69050