మెయన్ ఫీచర్

అక్కర్లేని సిజేరియన్లతో అవస్థలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గర్భం దాల్చిన మూడో నెల నుంచి తొమ్మిదో నెల వరకు గైనకాలజిస్టును సంప్రదిస్తూ, వైద్య పరీక్షలు ఎప్పటికప్పుడు చేయంచుకుంటూ, మందులు వాడుతూ, చలాకీగా ప్రసవం అయ్యే ముందు రోజు వరకు ఇంటి పనులు చక్కబెడుతూ, ఆఫీసుకు వెళ్లి వస్తూండే 40 శాతం గర్భవతులకు- కాన్పు సమయం ఆసన్నమైన వెంటనే డాక్టర్ గారు నొసలు చిట్లించి గంభీరంగా చెప్పే ఆ రెండు వాక్యాలు నిరాశ కల్పిస్తాయి. ‘కడుపులో పిండం అడ్డం తిరిగిందనో, అమ్నియోటిక్ పొర వల్లో మరోటో ఏదో ఒక బలమైన కారణం చూపించి బిడ్డకు, తల్లికి ప్రాణగండం లేకుండా సిజేరియన్ సెక్షన్ తప్పక మరొక ఆప్షన్ లేదు’-అని అంటారు. దీనికి తోడు రోగి, వైద్యుల నిష్పత్తిలో తారతమ్యం పెరుగుతున్నందువల్ల సహజ ప్రసవం చేయడానికి వైద్యులకు తగినంత సమయం, ఓపిక మునుపటిలాగ ఉండడం లేదు. కొంతమంది డాక్టర్లు సిజేరియన్ డెలివరీ వల్ల ఎదురయ్యే నష్టాలను పూర్తిగా వివరించడం లేదు. ఆర్థిక ప్రయోజనాలను అడ్డం పెట్టుకొని సిజేరియన్ డెలివరీలకు హాస్పిటళ్లు, నర్సింగ్ హోంలు మొగ్గు చూపుతున్నాయనడానికి నిదర్శనం ప్రయివేటు హాస్పిటళ్లలో సిజేరియన్ డెలివరీల సంఖ్య అధికంగా ఉండడం.
అధిక సంఖ్యలో సిజేరియన్ ఆపరేషన్లు కావడానికి కారణం ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు, శారీరక పరిస్థితులు కారణమని డాక్టర్లు పేర్కొన్నా అది ఎంత వరకు నిజమో రూఢీ కావాల్సి ఉంది. ఇంత మంది తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వెళ్లి డెలివరీకి అమ్మో, అత్తయ్యనో పిలిపించుకొంటున్నారు కదా.. ‘మా అమ్మాయికి సిజేరియన్ అయ్యింది’ అని అమెరికా నుంచి పురుడు పోసి వచ్చిన ఏ తల్లి నోటివెంట మచ్చుకైనా వినపడదు. మరి తేడా ఎక్కడుంది? మన దేశంలో, ముఖ్యంగా పట్టణాల్లో అదీ ప్రయివేట్ ఆసుపత్రులలోనే సిజేరియన్లు ఎందుకు అత్యధికంగా ఉం టున్నాయి. 35 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్న మహిళలు గర్భం ధరిస్తే ప్రమాదం కాబట్టి సిజేరియన్ అవసరం కావచ్చు. కానీ- ఇపుడు వయస్సు, తొలిచూరు, ఆరోగ్యం, ఉద్యోగస్తురాలు, ఊబకాయం, ఇతర సామాజిక, ఆర్థిక,మానసిక కారణాలు లాంటి వాటితో నిమిత్తం లేకుండా ఇట్టే సిజేరియన్లు చేసేస్తున్నారు. అవసరం లేకుండా జరిపే సిజేరియన్ ఆపరేషన్లు అన్యాయమైనవి. సిజేరియన్ గణాంకాలను నియంత్రించాల్సిన అవస రముంది. ప్రతి వృత్తిలో కొన్ని చీడపురుగులు ఉన్నట్లే సి- సెక్షన్ల (సిజేరియన్) ద్వారా సులువుగా డబ్బు సంపాదించే వైద్యులు కూడా ఉన్నారు కాబట్టే నేడు ఈ పరిస్థితి. వాళ్ళ వల్ల డాక్టరలందరకూ అపవాదు. కొంత మంది వైద్యులు ఇప్పటికీ డబ్బును ఆశించక, సిజేరియన్ ధోరణికి దూరంగా ఉం టూ తమల్ని నమ్ముకొని వచ్చే గర్భిణులకు నైపుణ్యంతో సహజ ప్రసవం కలిగేటట్టు పాటుపడుతున్నారు.
అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ సిజేరియన్ సెక్షన్ రేటు 10-15 మధ్య ఉంచేలా మార్గదర్శకాలు నిర్దేశించింది. వైద్యపరంగా అవసరమైనప్పుడు, తల్లి మరియు శిశువు మరణాన్ని నిరోధించడానికే తొలుత సిజేరియన్ పద్ధతిని అవలంభించేవారు. ఇటీవలి దశాబ్దాల్లో సిజేరియన్ సెక్షన్ రేటు ప్రపం చవ్యాప్తంగా వేగంగా పెరిగింది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలలో చాలా ఇవి సాధారణం అయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం సగటు ప్రపంచ సిజేరియన్ విభాగం రేటు 28 శాతం ఉండగా, ఆసియాలో 27శాతం, యూరోప్‌మో 20 శాతం, లాటిన్ అమెరికాలో 30శాతం ఉంది. ప్రపంచంలో అత్యధిక సిజేరియన్ డెలివరీలు టర్కీలో 50 శాతం ఉండగా, అత్యల్పంగా సిజేరియన్ జరిగే దేశాలు ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. నైజీరియాలో 2 శాతం ప్రసవాలు మాత్రమే సిజేరియన్ సెక్షన్ ద్వారా అవుతున్నాయి. ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో మెరుగైన వైద్య సదుపాయాలు, పోషకాహారం, తాగునీరు కూడా లభ్యమవకపోవడం వలన, కొన్ని తెగల్లో మూఢనమ్మకాలు వలన గర్భిణుల, శిశు మరణాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, జర్ననీ, కెనడా, ఇటలీ, కొరియా, స్పెయిన్ లలో 25 నుంచి 35 శాతం సి-సెక్షన్ ప్రసవాలే. ఒఇసిడి దేశాల్లో అత్యల్ప సిజేరియన్ 15 శాతం నమోదయినవి స్వీడన్, హాలండ్లు. ఇక- సిజేరియన్ సెక్షన్ వృద్షి పర్యవేక్షణ చేసి పోల్చడానికి అంతర్జాతీయంగా ఆమోదించబడిన ప్రామాణికమైన వర్గీకరణ వ్యవస్థ ఇప్పటికీ లేక పోవడం దురదృష్టకరం. ఈ ధోరణి గురించి ప్రజల్లో, మహిళల్లో మరింత అవగాహన కలిగించాలి. రాబ్సన్ వర్గీకరణను అంతర్జాతీయంగా సిజేరియన్ విభాగం వర్గీకరణ వ్యవస్థగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదించినా దేశాలు నామమాత్రంగా పాటిస్తున్నాయి.
అవసరం లేకున్నా సిజేరియన్ చేయడం వలన ఇనె్ఫక్షన్, రక్తస్రావం, ఇతర శస్తచ్రికిత్సా సమస్యలు వంటి ప్రతికూల ఫలితాలకు దారి తీస్తుంది. సహజంగా అయ్యే డెలివరీ కన్నా అధిక ప్రమాదాలు ఇందులో ఉంటాయి. సిజేరియన్ ద్వారా పుట్టిన పిల్లలకు భవిష్యత్‌లో మధుమేహం, ఊబకాయం, మానసిక వ్యాధులు సంక్రమించే అవకాశం మెండుగా ఉందని ఎన్నో పరిశోధనలు తెలుపుతున్నాయి. పిల్లలు జన్మించిన సమయంలో శ్వాస సమస్యలను ఎదుర్కొంటారు. బాల్యంలో, యుక్తవయసులో ఆస్తమాను అనుభవించటానికి అవకాశం ఉంది.
ప్రైవేటు ఆసుపత్రులు ఒక సిజేరియన్ డెలివరీకి 40 నుంచి 60 వేలు వరకు వసూళలు చేస్తున్నాయి. సహజ సిద్ధమైన పద్ధతిలో ప్రసవం కోసం ఇందులో పదో వంతు ఖర్చు అవుతుంది. దానికి తోడు ఉద్యోగులకు లభించే ప్రసూతి ఖర్చుల బీమా, సిజేరియన్ కూడా కవర్ చేస్తున్న వివిధ ఆరోగ్య బీమా పాలసీలు వలన ఆర్ధికంగా అదనపు భారం పడకపోవడంతో సిజేరియన్ వైపు కొందరు మొగ్గు చూపుతున్నారు. విద్యావంతులైన స్ర్తీలు కూడా సిజేరియన్ విధానం ఎంచుకుంటున్నారు, వాళ్ల గైనకాలజిస్ట్, ఫ్యామిలి డాక్టరో, సహద్యోగులో చెప్పారనో, భర్త లేదా అత్తగారో చెప్పారనో ఇందుకు సిద్ధపడుతున్నారు.
మారుతున్న జీవనశైలి వల్ల మహిళలు సహజ ప్రసవం చేయడానికి కష్టతరం అవుతుందని కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారు. కొంతమంది భర్తలు, తల్లిదండ్రులు తమ బిడ్డ ప్రసవ వేదన పడలేదనో, తన భార్య పురిటి నొప్పులు తాను భరించలేకో ఈ సిజేరియన్ డెలివరీని ఎన్నుకొంటున్నారు. కొంతమంది సిజేరియన్ చేసినపుడే పిల్లలు పుట్టకుండా జాగ్రత్త పడుతున్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ప్రత్యేకంగా చేయిం చుకొనక్కరలేదు అని టూ ఇన్ వన్ లాగ భావిస్తున్నారు. గర్భస్థ శిశువులు సహజంగా జన్మించినపుడు ఆరోగ్యకరమైన సహజ బాక్టీరియాను స్వీకరిస్తారు. ఈ బ్యాక్టీరియా రోగనిరోధక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కీలకమైనది. చిన్ననాటి నుండి యవ్వనం వరకు రోగాల బారిన పడకుండా కాపాడుతుందని ఎన్నో పరిశోధనలు తెల్పుతున్నాయి. సహజ ప్రసవ విధానం వలన తల్లి, శిశువుల మధ్య చర్మం రాపిడి ద్వారా ఏర్పడే సంబంధం మెదడు అభివృద్ధికి, మెరుగైన అనుబంధం ఏర్పాటుకు దోహదపడుతుంది. అనేక శారీరక మానసిక ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
ప్రభుత్వం ఇప్పటికైనా కళళు తెరిచి చర్యలు తీసుకోవాలి. సిజేరియన్‌కు, సహజ ప్రసవానికి ఒకే ఫీజు, ఆసుపత్రి బిల్లు ఉండేలా చట్టం తీసుకొస్తే ఎంతోమందికి మేలు కలుగుతుంది. పుట్టిన శిశువులకు ఎన్నో వైద్యపరమైన జబ్బులు, వ్యాధులు సంక్రమించకుండా నివారించినట్లు అవుతుంది. 70 శాతం కంటే ఎక్కువ కేసులు ఉంటే, ఆస్పత్రి తప్పనిసరిగా బ్లాక్ లిస్టు చేయబడాలి. హాస్పిటల్స్,నర్సింగ్ హోంలలో ఎన్ని సిజేరియన్ డెలివరీలు ఎన్ని నార్మల్ డెలివరీలు అయ్యాయో సూచించే పట్టిక ప్రదర్శించాలి. గర్భిణి మొదటి సారి వెళ్లి నమోదు చేసుకొన్నప్పుడు ఈ పట్టిక గురించి వివరించి చెప్పాలి. ప్రతి నెలా సిజేరియన్ కేసుల సంఖ్య ఆరోగ్య శాఖకు విధిగా రిపోర్ట్ చేయాలి. అసాధారణ స్థాయి లో సిజేరియన్ ప్రోసీజర్ జరుగుతున్న ఆసుపత్రులు, మెటర్నిటీ హోంలపై డేగ కన్ను వేసి దర్యాప్తు జరిపించాలి. సిజేరియన్ ఏ పరిస్థితిలో, ఏ వయస్సు వారికి, ఏ సమస్యలున్నవారికి చేయాలి లాంటి నిర్దిష్ట నియమావళి, మార్గదర్శకాలను అన్ని ఆసుపత్రులపై విధించాలి.
రాష్ట్రాల జాబితా పరిశీలిస్తే 70 శాతం సిజేరియన్ ప్రొసీజర్లు ప్రయివేట్ ఆసుపత్రులలోనే జరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు సి-సెక్షన్ డెలివరీలు దేశంలో మొత్తం డెలివరీలలో 10-15 శాతం కన్నా మించకూడదు. 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నిర్వహించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2015-16 ప్రకారం, కొన్ని రాష్ట్రాల్లో సిజేరియన్ శస్తచ్రికిత్సల శాతం 87 శాతంగా ఉంది. ప్రతి సంవత్సరం భారతదేశంలో సి-సెక్షన్ డెలివరీలలో 18 శాతం పెరుగుదల ఉంది, ఇది ప్రపంచంలోనే అత్యధికం. గర్భం దాల్చగానే ఏ డాక్టర్ మంచివారు? ఏ హాస్పిటల్ దగ్గర్లో ఉంది? ఏ ఇన్సూరెన్సు ఎంత వరకు బిల్లు క్లయిం చెల్లిస్తాయి? లాంటివే కాకుండా ఏ హాస్పిటల్లో ఏ డాక్టర్ ఎన్ని సిజేరియన్ డెలివరీలు చేశారనే విషయాలు గూర్చి తెలుసుకోవడం ముఖ్యం.

-సునీల్ ధవళ సెల్: 97417 47700