మెయిన్ ఫీచర్

స్నేహానికి పరిధులున్నాయ్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్నేహమేరా జీవితం,.. స్నేహమేరా శాశ్వతం...సృష్టిలో అన్నిటికన్నా మధురమైనది స్నేహం. బంధువులతో అనుబంధంకన్నా స్నేహానుబంధం చాలా గొప్పది. బంధువులను మనం ఎన్నుకోలేం. కానీ మన మనస్సుకు నచ్చిన వాళ్లనూ, మన కష్టసుఖాల్లోపాలుపంచుకునేవాళ్లనూ మనసు పూర్తిగా మనలను అర్థం చేసుకొనేవాళ్లనూ స్నేహితులుగా ఎన్నుకోగల అవకాశం మనకే పూర్తిగా ఉంటుంది. ఒకసారి స్నేహమాధుర్యాన్నిచవిచూసినవారు స్నేహాన్ని మరవలేరు. స్నేహితులనీ వదలలేరు.
ఇంత స్నేహం మనిషికి అవసరమా? అంటే అవసరమే. అసలు మనిషి మరో మనిషి సాంగత్యం లేకుంటే ఉండనే ఉండలేడట. మనిషి వినోదం పేరిట నాటకాలు, సినిమాలు చూడడానికి అసలు కారణం తాను ఏమి చేస్తున్నాడో, తన గురించి ఇతరులు ఏమనుకొంటున్నారో, ఇతరులు ఏమి చేస్తున్నారో ఇట్లాంటి విషయాలు తెలుసుకోవడానికే అంటే తన్ను తాను విమర్శించుకుంటూ ముందుకు వెళ్లడానికి ఈ నాటకాలు, సినిమాలు అవసరమవుతాయని మానసిక శాస్తవ్రేత్తలు చెబుతారు.
అందుకే మనిషి మరో మనిషితో స్నేహం చేస్తాడు. తన్ను తాను తెలుసుకోవడానికి. మంచిస్నేహం అంటే చెడు దారిలో వెళ్లే స్నేహితుని మార్గం మార్చి సన్మార్గంలోకి తెచ్చేదే అని పెద్దలంతా ఏనాడో చెప్పారు కదా.
పుస్తకానికి మించిన స్నేహితుడు లేరు అని చెప్పుకున్నా బాధను తీర్చుకోవడానికైనా, సుఖాన్ని రెట్టింపు చేసుకోవడానికైనా సరే మొట్టమొదట చూసేది స్నేహం కోసమే. అయితే రాను రాను ఈ స్నేహాలు పక్కదారి పడుతున్నాయి.
ఈ పరుగెత్తే ప్రపంచంలో నిజమైన స్నేహితులెవరో, పైకి స్నేహం నటిస్తూ వెనుక గోతులు తవ్వే మేక వనె్న పులులూ, గోముఖ వ్యాఘ్రాలు ఎవరో తెలుసుకోలేని రోజులుగా మారిన ఈ కాలంలో నిస్వార్థంగా స్నేహం చేసే వాళ్లే కరువై పోతున్నారు. అందుకే ఫ్రెండ్స్‌ను ఎన్నుకొనే విషయంలో ఎవరి జాగ్రత్తలో వారుండడం మంచిది.
నేడు స్కూల్స్‌లోను, కాలేజీల్లోనూ, అమ్మాయిలు అబ్బాయిలు చదువుల పేరిట కలసిమెలసి స్నేహంగా ఉంటూ చదువుకుంటున్నారు. కాని వారిలో కొంతమంది స్నేహం నటిస్తూ మోసం చేస్తున్నవారు ఉన్నారని మనకు పత్రికలు చెబుతున్నాయి. మన కళ్లూ కొన్ని సంఘటనలనూ చూస్తునే ఉన్నాయి. దీనికి కారణం మానసిక పరిపక్వత చెందని వీరు ఇతరులు చెప్పే మాయమాటలు నమ్మేస్తున్నారు. తమ బలహీనతలను ఇతరులతో చెప్పుకోవడం స్వాంతన మాట దేవుడెరుగు గానీ స్నేహం ముసుగులో ఘోరాలు జరిగే అవకాశాలు చోటు చేసుకొంటున్నాయి.
ఎంత స్నేహం చేసినా సరే ముఖ్యంగా అమ్మాయిలు అమాయకంగా తమ వ్యక్తిగత విషయాలు మగస్నేహితులకు చెప్పేటప్పుడు ఒకటి పదిసార్లు ఆలోచించుకోవాలి.
ఈ మధ్య సాంకేతిక రంగం బాగా అభివృద్ధి చెందింది. ఫోనులేని వారు అరుదే అని చెప్పుచ్చు. ఇక ఏముంది ఫోన్ ఉంటే చాలుకదా అందులో ఫేస్‌బుక్‌లు,
వాట్స్‌అప్‌లు స్నేహాలు ముదిరిపోతున్నాయి. ముక్కు మొహం తెలీని వారు ఎంతో ఆత్మీయులుగా మారిపోతున్నారు. అసలు వీరు మగవారో, ఆడవారో కూడా తెలుసుకోకుండా ఈమెయిల్స్‌తోనో, చాటింగులతోనో స్నేహం చేస్తున్నారు.
ఇట్లాంటివన్నీ బాగున్న దాకా బాగున్నట్టే. కాని స్నేహం పేరుతో మోసం చేసే వారు, బ్లాక్‌మెయిలర్స్ వల్ల ఎంతో మంది అభాగినులుగా తయారవుతున్నారు. ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. అందుకే అమ్మాయిలూ జాగ్రత్త! అరాచకాలకూ, అవాంఛనీయమైన సంఘటనలకూ అఘాయిత్యాలకు అమ్మాయిలను గురి చేస్తున్న దుష్టులూ, కిరాతకులూ ఎక్కువైపోయారు. స్నేహం చేసే ముందు ఎవరైనా సరే అప్రమత్తతగానే ఉండాలి. పొరపాటున కూడా తెలీని వారికి ఫోటోలు, అడ్రస్సులు ఫోన్ నెంబర్లు ఇట్లాంటివి పంపకూడదు. ఎదుటివారు చెప్పే మోసపూరిత తియ్యని మాటలకు కరిగిపోకూడదు. వాళ్ల మాటలకు ఒదిగిపోయి వాళ్లు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్లేపోయి కోరి కష్టాలను తెచ్చుకోకూడదు.
ఇవే కాదండోయ్...
ఇంకా ఇంట్లో ఉండేగృహిణులూ ఈ పరిచయాలు, స్నేహాల వల్ల బాధపడే వారున్నారు. తమ పని అయిన తరువాత ఇతరుల ఇండ్లకు వెళ్లి కూచుని బాతాఖానీ కొట్టేవాళ్లు నేడు అక్కడక్కడా కనిపిస్తూనే వున్నారు. వాళ్లు అవతలి వారి సమయసందర్భాలు చూడకుండా వెళ్లి కూచుని ఉబుసుపోని కబుర్లు చెప్పుతూ ఉంటారు. అడక్కుండానే ఉచిత సలహాలిస్తుంటారు మరికొంతమంది. ఇంకొందరు ఇరుగుపొరుగులతో రాసుకొని పూసుకొని తిరుగుతూ అయిన దానికి కాని దానికి అతి చేస్తుంటారు. ఈ అతి అనేది ఎక్కడా పనికి రానిదే కదా. అతివల్ల అవతలి వారు ఇబ్బంది కలుగుతుందేమోనని ఆలోచించుకోకపోతే వీరిద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావచ్చు. క్షణికోద్రేకంలో ఇరుపక్షాల వారు నోరు జారవచ్చు. కాలుజారితే తీసుకోవచ్చు. కాని నోరు జారితే కష్టం కదా. అందుకే ఈ స్నేహాల పట్ల జాగ్రత్త తీసుకోవడం అవసరమే. అవసరాలకు మించిన అట్టహాసలకు పోయి అనవసర గొప్పలకు పోయి మంచి స్నేహానికి దూరమవచ్చు. కనుక మనస్పర్థలకు తావివ్వకుండా ఎవరి లిమిట్స్‌లో వారు ఉంటూ మంచి స్నేహానికి మచ్చుతునకల్లామారాలి అంటే మనలను మనం సమీక్షించుకోవాలి. పరీక్షించుకోవాలి. స్నేహానికి పరిమితులు, పరిధులు పెట్టుకుంటే చాలు మంచి స్నేహితులం మనం కావచ్చు.

-మాధవపెద్ది ఉష