మెయన్ ఫీచర్

‘చక్రం తిప్పిన’ దక్షిణాది నేతలెందరో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ రాజకీయాలను శాసించి, జాతీయ సమగ్రతను, సంస్కృతిని సుసంపన్నం చేసిన దక్షిణాది నాయకులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. వీరిలో కొందరు ఉన్నతమైన రాష్టప్రతి, ప్రధానమంత్రి పదవులను నిర్వహించారు. మరి కొందరు కాంగ్రెస్, భాజపా, జన్‌సంఘ్, ఉభయ కమ్యూనిస్టు పార్టీల్లో కీలక పదవులను చేపట్టి వనె్న తెచ్చారు. రాజకీయాల్లో అధికారం ఇస్తే పుచ్చుకునే వారుంటారు, ఇవ్వకపోతే లాక్కొనే వారూ ఉంటారు. అధికారాలు ఇచ్చీ ఇవ్వనట్లు ఉంటే తమకు సంక్రమించిన పదవులతో ఆధిపత్యం చలాయించిన గొప్పనేతలూ ఉన్నారు. రాజకీయంగా మరుగుజ్జులైన వారు మాత్రమే ఉత్తరాది, దక్షిణాది పేరిట వివాదాలు రాజేస్తుంటారు. వాస్తవానికి సమర్థమైన నాయకత్వం ఉంటే ఢిల్లీ పాదాభివందనం చేసి పట్ట్భాషేకం చేస్తుంది. భారతదేశ చరిత్ర,సంస్కృతిలో ఉన్న విశిష్టత అదే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో రాజకీయాలకు, ప్రస్తుత రాజకీయాలకు మధ్య చాలామార్పులు చోటు చేసుకున్నాయి. రాజకీయాధికారం ఎవరి సొత్తూ కాదు.
దేశ రాజకీయాలను శాసించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కచ్చితంగా ఆకాంక్ష, పట్టుదల, రాజకీయ చతురత, ఎత్తుగడలు ఉండాలి. జాతీయ రాజకీయాల్లో రాణించిన దక్షిణాది నేతల వ్యక్తిత్వాలను విశే్లషిస్తే పటాటోపం, ఆడంబరాలకు అతీతంగా ప్రజాజీవితానికి అంకితమైన వారు చాలామంది కనిపిస్తారు. వీరికి ‘గాడ్ ఫాదర్’లు లేరు. స్వశక్తి, సమర్ధత వల్ల వీరిని కీలక పదవులు వరించాయి. ప్రస్తుతం దక్షిణాది నుంచి- దేశ రాజకీయాల్లో జెండా ఎగురవేయాలనే నేతల్లో అగ్రస్థానంలో టిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారు. జాతీయ రాజకీయాల్లో తగిన వేదికను ఇటీవల కాలంలో ఆయన తన రాజకీయ చతురతతో ఏర్పాటు చేసుకుంటున్నారు. గాంధేయ పద్ధతుల్లో తెలంగాణ రాష్ట్ర సాధనకు 14 ఏళ్లు పోరాడి ప్రజల కలను సాకారం చేసి దేశ రాజకీయాలపై తనదైన ముద్రవేశారు. గతంలో ఢిల్లీలో చక్రం తప్పిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం జాతీయ రాజకీయాల పట్ల తనకు ఆసక్తి లేదని ప్రకటించారు. తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో గతంలో మాదిరిగా దేశవ్యాప్తంగా పేరున్న నేతలు ఇప్పుడు లేరు. ప్రస్తుతం దేశం దృష్టి తెలంగాణ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయబోయే కొత్త ఫ్రంట్‌పై ఉంది.
స్వాతంత్య్రం వచ్చాక చివరి గవర్నర్ జనరల్ పదవిని అలంకరించిన తొలి భారతీయుడు తమిళనాడుకు చెందిన సి.రాజగోపాలాచారి. ఆంధ్ర ప్రాంతానికి చెందిన భోగరాజు పట్ట్భా సీతారామయ్య కాంగ్రెస్ అధ్యక్ష పదవిని సమర్థంగా నిర్వహించిన ఉద్ధండుడు. తమిళనాడులో కామరాజ్ పాలన అని ఇప్పటికీ పేరుంది. దేశ రాజకీయాల్లో ప్రతి పార్టీ కామ్‌రాజ్ ఫార్ములాను రాజకీయంగా మార్పులు చేసేటప్పుడు అనుసరిస్తుంటారు. కామరాజ్ నాడర్ కాంగ్రెస్ పార్టీకి మూడు సార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇది సామాన్య విషయం కాదు. కర్నాటకకు చెందిన ఎస్ నిజలింగప్ప కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండుసార్లు పనిచేసి ఆ పదవికి వనె్న తెచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో పేద దళిత కుటుంబంలో జన్మించి కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అలంకరించిన దామోదరం సంజీవయ్య స్వీయ ప్రతిభతో పైకి వచ్చారు. రాష్టప్రతి పదవిని చేపట్టిన డాక్టర్ నీలం సంజీవరెడ్డి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. రాష్టప్రతి పదవికి ఒకసారి అధికార కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెంది, అజ్ఞాత వాసంలోకి వెళ్లిన సంజీవరెడ్డి రాజకీయ జీవితం నేటితరం నేతలకు ఆదర్శం. కాలం కలిసి రానప్పుడు వౌనంగా ఉండడం సంజీవరెడ్డి ఎన్నుకున్న మార్గం. రాష్టప్రతి ఎన్నికలో ఓటమి తర్వాత అనంతపురం జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లి ఆయన వ్యవసాయం చేశారు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి జనతా పార్టీ తరఫున నంద్యాల నుంచి పోటీచేసి గెలిచి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాష్టప్రతి పదవి సంజీవరెడ్డిని వరించింది. ఒకసారి అత్యున్నత పదవిని వచ్చినట్లే వచ్చి జారిపోయి, మళ్లీ ఆరేడేళ్ల తర్వాత అదే పదవి వెదుక్కుంటూ రావడం సంజీవరెడ్డి విషయంలో చోటు చేసుకుంది.
ఆధునిక భారత్ నిర్మాతగా, ఆర్థిక సంస్కరణలకు మార్గనిర్దేశనం చేసిన పాములపర్తి వెంకట నరసింహారావు రాజకీయ జీవితం మహోన్నతమైంది. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎన్నడూ ఏ పదవినీ ఆశించలేదు. అన్ని పదవులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. తెలుగుబిడ్డ పీవీ నరసింహారావు ఇక ఢిల్లీలో తన పని పూర్తయిందని, హైదరాబాద్‌కు వచ్చి శేష జీవితం గడుపుదామనుకున్నారు. 1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురికావడంతో రాజకీయాలు ఉన్నట్లుండి మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రి పదవికి నరసింహారావు యోగ్యుడని తీర్మానించింది. ప్రధానమంత్రి పదవిలో ఆయన ఐదేళ్లపాటు పూర్తి కాలం పనిచేశారు. మైనార్టీ ప్రభుత్వమైనా అన్ని పక్షాలను ఆకట్టుకుని, కాంగ్రెస్‌లో అంతర్గత పోరును తట్టుకుని నిలబడ్డారు. కుదేలైన ఆర్థిక రంగాన్ని సురక్షిత తీరానికి చేర్చారు. ఆ తర్వాత ఎంత మంది ప్రధానమంత్రులు వచ్చినా ఆర్థిక శాస్త్రంలో పీవీ నిర్దేశించిన సిలబస్‌ను దాటి ఎవరూ ముందుకు పోలేదు. దేశ చరిత్ర వైభవోపేతమైన మలుపు తిరగడంలో ఆయన అత్యంత కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ ఆయనను మరచిపోయినా, దేశచరిత్ర మాత్రం మరచిపోదు.
వామపక్ష పార్టీల్లో అత్యున్నత పదవులను అలంకరించిన వారిలో దక్షిణాది నేతలు చాలా మంది ఉన్నారు. సీపీఎం ఆవిర్భావం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పుచ్చలపల్లి సుందరయ్య, కేరళ పూర్వ ముఖ్యమంత్రి ఇఎంఎస్ నంబూద్రిపాద్, యుపిఏ ప్రభుత్వం ఏర్పాటులో కీలక సూత్రధారి ప్రకాశ్ కారత్ ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తెలుగు వాడైన సీతారాం ఏచూరి మరోసారి ఆ పదవికి ఎన్నికైన విషయం విదితమే. సిపిఐ ప్రధాన కార్యదర్శిగా సురవరం సుధాకర్ రెడ్డి ఉన్నారు. భారతీయ జన్‌సంఘ్ అధ్యక్ష పదవిని అలంకరించిన వారిలో రాజమహేంద్రవరానికి చెందిన అవసరాల రామారావు (1961) ఉన్నారు. ప్రస్తుత ఉప రాష్టప్రతి ముప్పవరపు వెంకయ్యనాయుడు 2002 నుంచి 2004 వరకు భాజపా జాతీయ అధ్యక్ష పదవిలో ఉన్నారు. లోక్‌సభ స్పీకర్‌గా అనంతశయనం అయ్యంగార్, జిఎంసి బాలయోగి రాణించారు. రాష్టప్రతిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి స్పీకర్ పదవిని రెండు సార్లు నిర్వహించడం విశేషం.
దేశ రాజకీయాల్లో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ముఖ్య భూమికను పోషించింది. తెదేపా వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటులో ప్రధాన భాగస్వామి. నేషనల్ ఫ్రంట్ తరఫున వీపీ సింగ్ ప్రధానమంత్రి పదవికి ఎన్నిక కావడంలో ఎన్టీఆర్ విశేష కృషి చేశారు. 1992లో పీవీ నరసింహారావు నంద్యాల నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు తన అభ్యర్థిని తెదేపా బరిలోకి దింపలేదు. 1996-98 మధ్య యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కర్నాటకకు చెందిన దేవెగౌడ్, ఆ తర్వాత ఐకె గుజ్రాల్ ప్రధానమంత్రి కావడంలో ప్రస్తుత ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారు.
దక్షిణాదికి చెందిన అనేక మంది నేతలు ముఖ్యమంత్రులుగా ఉంటూ జాతీయ రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. కేరళ ముఖ్యమంత్రులుగా ఎకె ఆంటోనీ, కరుణాకరన్, తమిళనాడు ముఖ్యమంత్రులుగా కామరాజ్, అన్నాదొరై, కరుణానిది, ఎంజీ రామచంద్రన్, జయలలిత, కర్నాటక ముఖ్యమంత్రులుగా నిజలింగప్ప, వీరేంద్రపాటిల్, రామకృష్ణ హెగ్డే, దేవరాజ్ అర్స్, దేవగౌడ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా మర్రి చెన్నారెడ్డి, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్‌కు దిశ, దశ నిర్దేశించడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీని గడ్డుకాలంలో ఆదుకున్న నేతలుగా చరిత్రలో నిలిచిపోతారు. 1989లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటులోను, కాంగ్రెస్‌తో వైరాన్ని పక్కనపెట్టి పీవీ నరసింహారావు ప్రభుత్వం ఏర్పాటుకు పరోక్షంగా మద్దతు ఇవ్వడంలో ఎన్టీరామారావు వెనుదన్నుగా నిలిచారు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో టిడిపి 30 సీట్లు పొంది ప్రతిపక్ష పాత్రను పోషించింది. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. తాజాగా కేంద్ర రాజకీయాల్లో చురుకైన పాత్రను పోషించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాల్సిందే. రాజకీయాల్లో ఏ క్షణం ఏమవుతుందో ఎవరూ అంచనావేయలేరు. హిందీ భాషాపటిమ, వాక్చాతుర్యం కలిగి, లౌక్యం ఉన్న కేసీఆర్ ఈ నెల 27న జరిగే టిఆర్‌ఎస్ ప్లీనరీ నేపథ్యంలో ప్రకటించనున్న రాజకీయ వ్యూహంపై దేశం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది.

-కె.విజయ శైలేంద్ర 98499 98097