ఎడిట్ పేజీ

దేశానికి మార్గదర్శి తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు జిల్లాల పార్టీ’ అని అవహేళన చేసిన వారు విస్తుపోయేలా నాలుగేళ్ల వ్యవధిలోనే మహావృక్షంగా విస్తరించిన ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ తన 17వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశానికి కొత్త దిశను చూపడానికి సన్నద్ధం అవుతోంది. ‘కాంగ్రెస్ రహిత, బీజేపీయేతర..’ అంటూ ఇంత కాలం సాగిన రాజకీయాలకు భిన్నంగా- దేశ సమగ్రాభివృద్ధే ప్రధాన సిద్ధాంతంగా వినూత్న రాజకీయాలకు నాంది పలికేందుకు తెరాస ప్లీనరీకి సర్వం సిద్ధమైంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రకటనతో- తెరాస ప్లీనరీపై దేశం అంతా ఆసక్తి చూపుతోంది. దేశ రాజకీయాలకు కొత్త దారి చూపడం తెరాసకు సాధ్యమా? అంటే సరిగ్గా 17 ఏళ్ల క్రితం ఆ పార్టీ ఆవిర్భవించినపుడు తెలంగాణ సాధ్యమా? అన్న ప్రశ్నలు వినిపించాయి. రాజకీయాల్లో సరైన వ్యూహంతో వెళితే... కాలం కలిసి వస్తే ఏదైనా సాధ్యమే! గత నాలుగేళ్లలో తెలంగాణ ఇంతగా అభివృద్ధి సాధిస్తుందని, అనేక రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర విభజన సమయంలో ఎవరైనా అనుకున్నారా? కేసీఆర్ నాయకత్వంలో ఇది సాధ్యమైంది. దేశానికి మంచి జరుగుతుందంటే- ‘అది సాధ్యమా?’ అన్న అనుమానాలు ఎందుకు?
***
హైదరాబాద్‌లోని ‘జలదృశ్యం’లో సరిగ్గా 17 ఏళ్ల క్రితం కనిపించిన దృశ్యం ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని కోటి ఆశలు.. ‘అసాధ్యం’ అని అంత కన్నా గట్టి నమ్మకం.. ఉదయం నుంచి ఒక్కరొక్కరు వస్తున్నారు. కొన్ని వందల మంది మాత్రమే నిలుచోవడానికి వీలున్న ఖాళీ స్థలం అది. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ. అప్పటి వరకు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కేసీఆర్ ‘సెక్యూరిటీ కోసం ఆ పదవిలో కొనసాగుతారు’ అని మీడియాలో వార్తలు. దమ్ముంటే డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేయాలంటూ అప్పుడు అధికారంలో ఉన్న టిడిపి నేతల డిమాండ్.
మైకు ముందుకు వచ్చిన కేసీఆర్ రూపం చూస్తే- ‘పీలగా ఉన్న ఈయన వల్ల ఏమవుతుందిలే’ అన్న వ్యాఖ్యానాలు.. మైకు అందుకున్న తరువాత ఆయన విశ్వరూపం కనిపిస్తుంది. ‘మీరు ఒక్క రాజీనామా అడిగారు కదా.. ఒకటి కాదు.. ఇదిగో మూడు రాజీనామాలు ఇస్తున్నా.. డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసన సభ్యత్వానికి, టిడిపి సభ్యత్వానికి రాజీనామాలు ఇక్కడి నుంచే ఇస్తున్నాను’ అంటూ మూడు కవర్లను వేదికపై నుంచే ఇచ్చారు. కేసీఆర్ విసిరిన బౌన్సర్‌ను ఎవరూ ఊహించలేదు. నక్సల్స్ సమస్యతో ఆయన తన పదవిని అంటిపెట్టుకుని ఉంటారని ఊహించిన వర్గాలకు ఆ నిర్ణయం మింగుడు పడలేదు. ‘ఇతను అల్లాటప్పా కాదు.. ఇతనిలో ఏదో ఉంది. అనుకున్నది సాధిస్తాడ’నే నమ్మకం రాజీనామా ప్రకటనతో అక్కడికి వచ్చిన వారిలో కలిగింది.
ప్రత్యేక తెలంగాణ కోసం అంతకుముందు ఉద్యమించిన వారు ఎక్కడ తప్పటడుగులు వేశారో గ్రహించిన కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అప్పటివరకు మేధావులు, మీడియా, ఉద్యోగ సంఘాలు, ఉద్యమ సంఘాల చర్చలకే పరిమితమైన తెలంగాణ నినాదానికి ఆయన రాజకీయ రూపం ఇచ్చారు. ‘రాజకీయాలను నువ్వు వ్యతిరేకిస్తున్నావా? అభిమానిస్తున్నావా? అనేది అనవసరం ఈ దేశంలో మనిషి జీవితాన్ని రాజకీయాలు శాసిస్తాయి. రాజకీయ పరిణామాల ద్వారానే తెలంగాణ సాకారం అవుతుంది కానీ మేధావుల చర్చలతో కాదు’ అనే విషయాన్ని గ్రహించి, రాజకీయ ఎత్తుగడల ద్వారానే తెలంగాణ ప్రజల కల సాకారం చేయవచ్చునని భావించారు. ఆచరణలో దాన్ని నిరూపించారు.
రోజుకో పార్టీ పుడుతుంది.. అందులో తెరాస ఒకటని అన్న వాళ్లున్నారు. ఆరు నెలలు బతికితే ఎక్కువ అనుకున్న వాళ్లు ఉన్నారు. ‘రెండు జిల్లాల పార్టీ’ అని ఎకసెక్కాలు ఆడిన వాళ్లున్నారు. రోజుల గడిచాక ‘ఉప ప్రాంతీయ పార్టీ’ అన్నారు. కార్యసాధకుడు ఎవరెలా గేలిచేసినా పట్టించుకోడు. తన లక్ష్యం, దాన్ని చేరుకునే మార్గం ముఖ్యం. 2001లో తెరాస ఆవిర్భావం నుంచి తెలంగాణ సాకారం అయ్యేంత వరకు బహుశా దేశ రాజకీయాల్లో కేసీఆర్‌లా ఇంత తీవ్ర స్థాయిలో వ్యక్తిగత దూషణలను భరించిన మరో నాయకుడు లేడు. ‘నువ్వు రాళ్లు విసురుతుంటే- వాటిని నేను భవన నిర్మాణానికి ఉపయోగించాను’ అన్నట్టు ఆ తిట్లే తెలంగాణ ఉద్యమానికి చోదక శక్తిగా మారింది. ప్రత్యర్థుల తిట్లు ఎంత తీవ్రంగా ఉంటే, అంత ఉద్ధృతంగా ఉద్యమం సాగింది. తెలంగాణను కోరుకున్న వారికి, వ్యతిరేకించే వారికి కేసీఆర్ కేంద్ర బిందువు అయ్యారు. 2001లో ఉద్యమం ప్రారంభం కాగా, 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది.
రెండు ప్రాంతాల్లో రెండు భిన్నమైన అభిప్రాయాలు. తెలంగాణ ప్రజలు కోరుకోవడంతో తెలంగాణ ఏర్పడింది. ఆంధ్రప్రజలు ఇష్టపడక పోయినా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అన్నదమ్ములు విడిపోయినప్పుడు ఆవేశకావేశాలు కలిగినా, విడిపోవడం అంటూ జరిగిన తరువాత ఇద్దరూ బాగుండాలని అంతా కోరుకుంటారు. తెలంగాణ విషయంలో అలాంటి విశాల భావన కొంత మందిలో కనిపించలేదు. తెలంగాణ ఉద్యమం సాగుతున్న కాలంలోనే ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు ‘జై ఆంధ్ర.. జై తెలంగాణ’ పేరిట 450 పేజీల పుస్తకం రాశారు. ఎంతో శ్రమకోర్చి ఎన్నో వివరాలు సేకరించారు. తెలంగాణ ఏర్పడితే ఏమవుతుందో ఇందులో రాశారు. ‘వద్దంటే తెలంగాణ కోరుతున్నారు కదా? ఇదే మా శాపం..’ అన్నట్టుగా ఆయన అభిప్రాయం ఉంది.
‘వేర్పాటువాదం పేరుతో కొందరు సాలెగూడు అల్లుతున్నారు. భూత ప్రేత చర్యలకు మంత్రం వేస్తాం.. నరబలి, డబ్బు కావాలని చెప్పే మంత్రగాళ్ల కంటే సర్వరోగ నివారిణి ప్రత్యేక తెలంగాణ’ అని సంకుచిత వేర్పాటువాద నాయకుల విద్వేష ప్రచారం ఇంకా ప్రమాదకరం. హిట్లర్ కూడా ఇలానే పోరాటం చేసి ప్రపంచ వినాశనానికి కారణమయ్యాడు. ‘ఉగాండాలో ఉద్యోగాలు, వ్యాపారాలు అక్కడి ముఖ్య జాతులకే అని ఉద్యమం మొదలు పెట్టి అధికారంలోకి వచ్చిన తరువాత సొంత వారినే ఈడీ అమీన్ పీక్కు తిన్నాడు, నరమాంస భక్షణ చేశాడు (పేజీ నంబర్ 370-371) తెలంగాణ ఏర్పడితే ఈడీ అమీన్‌లా నరమాంస భక్షణ జరుగుతుంది..’ అనే స్థాయికి చేరుకున్నాయి వీరి విమర్శలు. ఇది ఒక్క ఆంధ్రా మేధావి సంఘం అధ్యక్షుడి అభిప్రాయం మాత్రమే కాదు. ఆయన పుస్తక రూపంలో తన అభిప్రాయం రికార్డు చేశారు. తెలంగాణను వ్యతిరేకించిన చాలా మంది ఇదే తరహాలో- ‘విభజన జరిగితే తెలంగాణ కుక్కలు చింపిన విస్తరి కావాల’ని కోరుకున్నారు.
ఈరోజు తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకు వెళుతుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం మితిమీరిన రాజకీయాలతో సతమతమవుతోంది. ఏపీలో అస్తవ్యస్త పాలన గురించి రిటైర్డ్ ఐఎఎస్‌లు పలువురు పుస్తకాలే రాస్తున్నారు. ప్రజలు సైతం బహిరంగంగానే కేసీఆర్ లాంటి నాయకుడు ఆంధ్రకు కావాలని అంటున్నారు. ఒకప్పుడు తీవ్రంగా తిట్టిన ప్రాంతంలోనే ఆయనకు జై కొడుతున్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు కావాలని కోరుకోవడం అంటే- అది తెలంగాణ నాయకత్వం సాధించిన విజయం. అధికార పక్షం అధికారం నిలుపుకోవడానికి, ప్రతిపక్షం అధికారంలోకి రావడానికి ప్రయత్నించడం సహజం. తెలంగాణలోని రాజకీయ పక్షాలన్నీ తమ ప్రాంత అభివృద్ధికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఏపీలో రాజకీయాలు ఆ ప్రాంత ప్రజలకు తీవ్ర ఆవేదనను మిగుల్చుతున్నాయి.
సామాన్యులు, మేధావి సంఘాధ్యక్షులు మొదలుకొని సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి వరకు తెలంగాణను వ్యతిరేకించిన వారిలో చాలామంది ‘తాము వద్దంటే ఏర్పడ్డ’ తెలంగాణ చెడిపోవాలనే కోరుకున్నారు. ‘బతుకు- బతికించు’ అంటూ తెలంగాణలో ఆటోలపై కూడా కనిపించే నినాదమే తెలంగాణ తత్వం. తాము బాగుపడాలని కోరుకోవడంతో పాటు పొరుగు రాష్ట్రం కూడా బాగుండాలని తెలంగాణ కోరుకుంది. ఉద్యమ కాలంలోనే విజయవాడలో బహిరంగ సభ నిర్వహించి ఆంధ్ర అభివృద్ధికి ఉన్న అవకాశాలను వివరించేందుకు ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ప్రయత్నిస్తే, కొందరు సభ జరగకుండా అడ్డుకున్నారు. చిత్రంగా ఈరోజు అదే ప్రాంతం నుంచి- ‘కేసీఆర్ తలుచుకుంటే ఆంధ్రకు ప్రత్యేక హోదా సాధ్య అవుతుంది’ అనే మాట వినిపించడం విశేషం. కేవలం నాలుగంటే నాలుగేళ్లలోనే తెలంగాణ స్వరూపాన్ని మార్చింది తెరాస నాయకత్వం.
విద్యుత్, శాంతిభద్రతలు వంటివి ప్రధానంగా తెలంగాణను భయపెట్టిన సమస్యలు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఎవరూ ఊహించని విధంగా వ్యవసాయానికి కూడా నిరాటంకంగా 24 గంటల పాటు విద్యుత్ సరఫరా జరుగుతోంది. శాంతిభద్రతల విషయంలో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారు. ‘వ్యవసాయానికి పెట్టుబడి’ అనేది దేశంలో తొలిసారిగా తెలంగాణలో అమలు జరుగుతోంది. వృద్ధిరేటులో దేశానికి తెలంగాణ తలమానికంగా నిలించింది. చివరి దశలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే సగం తెలంగాణ జిల్లాలు సస్య శ్యామలం అవుతాయి. ఇంటింటికీ తాగునీరు పథకం కూడా చివరి దశకు చేరుకుంది. కోటి ఎకరాలకు సాగునీరు అందిన తరువాత- మహా అయితే ఇంకో ఏడాది రెండేళ్లు నిరీక్షిస్తే తెలంగాణ పల్లెలు పచ్చదనంతో కళకళలాడుతాయి. ‘చీకట్లో మగ్గిపోతుంది.. నక్సల్స్ చేతుల్లోకి పాలన వెళ్లిపోతుంది.. జనం ఆకలితో అలమటిస్తారు..’ అని తెలంగాణ ఆవిర్భావ కాలంలో బహిరంగంగానే కొందరు హెచ్చరికలు చేశారు. అందుకు విరుద్ధంగా నేడు తెలంగాణ దేశంలో అభివృద్ధి రేటులో మొదటి స్థానంలో ఉంది. కుల వృత్తులకు ప్రోత్సహం ఇవ్వడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగు పడుతోంది. సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మారిపోతుంది. తెలంగాణలో అమలవుతున్న మిషన్ కాకతీయ, భగీరథ, ఎకరానికి ఎనిమిదివేల రూపాయల పెట్టుబడితో పాటు పలు సంక్షేమ పథకాలను అనేక రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయి. తెలంగాణ పాలన తీరు దేశానికి దిశానిర్దేశం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. తెలంగాణలో సాకారమైన అభివృద్ధి నమూనా మొత్తం దేశానికి ఉపయోగపడవచ్చు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే!

-వౌర్య