మెయిన్ ఫీచర్

చిన్న సినిమాకు దారేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా అంటేనే వినోదం! సినిమా అంటేనే రెండుమూడు గంటల కాలక్షేపం!! సినిమా అంటేనే మానసికోల్లాసం!!! మరి సినిమా అంటేనే.. మొన్న అయినా, నిన్న అయినా, నేడు అయినా... రేపటి రోజున అయినా, సామాన్య ప్రేక్షక జీవిని ఫుల్‌లెంగ్త్ హ్యాపీ హ్యాపీగా ఉంచడానికి ఉపయోగపడే సరదాసరదా టైంపాస్ సాధనం. ప్రత్యామ్నాయాలు ఎన్నొచ్చినా ప్రేక్షకుడికి సినిమాయే అసలైన ప్రపంచం!
అలాంటప్పుడు సినీ దర్శక నిర్మాతలు, ఆల్‌జీబ్రాలు- జామెట్రీల్లాంటి లెక్కలుకట్టి కోట్లు కుమ్మరించి చుట్టేసిన సినిమానా... లక్షలు వెచ్చించి ముస్తాబు చేసిన సినిమానా... అన్నది సామాన్య ప్రేక్షకుడి బుర్రకి ఎక్కని విషయం. అందుకే సినిమా సరుకెంత కిక్కెక్కించిందన్నదే అతను పట్టించుకునే మ్యాటరు. అలాంటి సినిమానే.. తన గుండెని కుదిపేసిన సినిమానే, తనని మధురోహల్లో ఊరేగించిన సినిమానే, ఎదపై వాలి చిలిపి ఊసులు పలికించిన సినిమానే... ఆ ప్రేక్షక మహాశయుడు అందలమెక్కిస్తున్నాడు, ఎంచక్కా బాక్సాఫీసుకి రికార్డుల కిరీటాన్ని అలంకరింపచేస్తున్నాడు. ఇది సినీ చరిత్ర చెబుతున్న ప్రేక్షక సత్యం!
మరి అలాంటప్పుడు నిర్మాతలు సమకూర్చిన ఆర్థిక వనరులతో, దర్శకులు చెక్కిన సినీ సౌందర్య శిల్పాల్ని.. ప్రేక్షకుల్ని అలరింపచేయడానికి మార్కె ట్లో (్థయేటర్స్‌లో) పెట్టే (రిలీజ్ చేసే) అనుసంధాన బాధ్యతని మోసే డిస్ట్రిబ్యూటర్స్‌కి తెలిసీ... ఇప్పటికీ (చేతులు కాలుతున్నా, జేబులకి చిల్లులు పడుతున్నా) పెద్దపెద్ద బడ్జెట్ సినిమాలంటేనే మోజు చూపుతున్నారు తప్పితే, చిన్నతరహా (లోబడ్జెట్ లేదా న్యూ లేదా అప్‌కమింగ్ యాక్టర్స్ నటించిన) సినిమాలవైపు మొగ్గుచూపడం లేదు. ఆ వివక్ష స్పష్టంగా కనపడుతోంది సినిమా పరిజ్ఞానం కలిగిన ఏ మనిషికైనా!
ఎన్నో చిన్నాచితక సినిమాలు... మరెన్నో బడాబడా పిక్చర్స్‌కి ధీటుగా... వాటి గతకాలపు వైభవ చిహ్నాల ర్యాంకుల్ని చెరిపేసి డబ్బు కూడబెట్టిన బాక్సాఫీసు ఘటనల లెక్కలెన్నో మన ముందున్నాయి. అయినా ఇన్ని పరాభవాలు హైబడ్జెట్ సినిమాల వలన కలిగినా, ఇప్పటికీ డిస్ట్రిబ్యూటర్స్ చిన్న సినిమాల్ని కొనేసి హత్తుకొని మోయడానికి భయపడ్తున్నారెందుకనో! మొన్న మొన్నటి చిన్న గోల్డెన్ ఉదాహరణ ప్రస్తావించుకుందాం.
ఎలాంటి అం చనాలు లేవు. ఎ లాంటి స్టార్‌కాస్ట్ లేదు. అసలు ఆ దర్శకుడి పేరే ఇదివరకు వినే్లదు. అందులో భాగస్వామ్యమైన ఏ ఒక్క నటు డూ ప్రేక్షకులకు అస్సలు పరిచయం లేదు. కానీ కొత్తదనం, సహజత్వం, విభిన్నత్వం ప్రేక్షక హృదయాలకు సరికొత్త పరిమళాలు అద్దాయి. అంతే! అక్కున చేర్చుకున్నారు. థియేటర్లకు క్యూకట్టారు. సినిమాని మనసారా ఆస్వాదించారు. ఆనందించారు. అందుకే ఆశీర్వదించారు. డిస్ట్రిబ్యూటర్స్ ఖజానాని ఊహించని విధంగా నింపేసారు. 19 జూలై 2016 నాడు విడుదలైన ‘పెళ్ళిచూపులు’ అనబడే అచ్చతెలుగు సినిమా ముచ్చటిది. 75 లక్షల పెట్టుబడితో నిర్మింపబడిన ఆ సుపరిమళాల చిన్న సినిమా బాక్సాఫీసు లెక్కల ప్రకారం 16.3 కోట్లవరకు కొల్లగొట్టింది. అంటే సుమారు 20రెట్ల లాభాల్ని ఆర్జించి పెట్టిందన్నమాట. విడుదలకి ముందు ఈ సినిమా స్థితి అంటే! దర్శకులు ‘రీలు’పట్టుకొని వీలైనంతగా తిరిగాడు, ఒకరు ముందుకొచ్చారు. సినిమా సూపర్ సక్సెసయ్యింది. మరి సర్దార్ గబ్బర్‌సింగ్, స్పైడర్ లాంటి హైబడ్జెట్ సినిమాలు ఎంత మిగిల్చాయో డిస్ట్రిబ్యూటర్స్‌కే తెలుసు!
సరే. ఇది స్ట్రెయిట్ చిన్న తెలుగు సినిమా విషయం. ఈ సినిమాకి కాస్త రెండు నెలలు ముం దుకెళితే ఓ చిన్న డబ్బింగ్ సినిమా వసూళ్లు ఇలాగే ఉన్నాయి. అదే ‘బిచ్చగాడు’ చిత్రం. 50 లక్షలతో డబ్బింగ్ రైట్స్ కొన్న సదరు తెలుగు చిత్ర నిర్మాత అదనంగా మరికొంత డబ్బుని పబ్లిసిటీకి వెచ్చించి 13.05.2016నాడు రిలీజ్ చేస్తే..లాంగ్ రన్‌లో సుమారు 20 కోట్ల దాకా ఆర్జించి... డిస్ట్రిబ్యూటర్స్ కూడా లాభాల్లో భాగస్వామ్యమయ్యారు. అదే తమిళనాట నుండి డబ్బింగ్ హక్కులకోసం అధిక రొక్కం చెల్లించి కొనుక్కున్న ‘లింగ’ లాంటి సినిమాల వసూళ్లు ఏమేర మేలు చేసాయో డిస్ట్రిబ్యూటర్స్ ఎరుగనివి కావు. అయినా డిస్ట్రిబ్యూటర్స్ మరల మరల పెద్దపెద్ద చిత్రాల వైపే దృష్టిసారిస్తున్నారు. తప్పితే చిన్న చిత్రాల గురించి ఆలోచించడం కాదు కదా, వాటిని తలపుల్లోకే రానివ్వడం లేదనిపిస్తోంది. కొన్ని చిన్న సినిమాలు డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు రాకపోవడం వలన ల్యాబుల్లోనే పడి ఉన్నాయని తెలుస్తోంది. ఉత్సాహంగా సినిమాలు నిర్మిద్దామని ముందుకొచ్చిన ఆయా నిర్మాతలు, సినిమా క్లైమాక్స్‌కి రాగానే బడ్జెట్ ఖాళీ అవడంతో తెల్లమొహం వేస్తున్నారు. ఇక స్వంతంగా (్థయేటర్స్‌కి ముందుగా రెంట్ కట్టే పద్ధతిలో) రిలీజ్ చేసుకొనే ఆర్థిక సాహసం చేయలేక చతికిలపడి పోతున్నారు. ఆదుకొని చేయి అందివ్వాల్సిన డిస్ట్రిబ్యూటర్ ఎవరు చూపుతారు... పరిస్థితులు చక్కదిద్దేది ఎవరు. అన్నీ యక్ష ప్రశ్నలే! కానీ సమాధాన పరిచే ధర్మరాజు లాంటి డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. ఉండాలి. అలాంటివారు ముందుకు కదలాలి. సినిమా వ్యాపారమే అయినా కరుడుకట్టిన వ్యాపారమవకూడదు. కన్నీళ్లొలికించే వ్యాపారమై పోకూడదు.
ఇరవై నుండి ముప్పై కోట్లవరకు డీల్ కుదుర్చుకున్న డబ్బింగ్ సినిమాలు మట్టికరుచుకుపోయిన దృశ్యాలీమధ్య చూస్తున్నాం. డిస్ట్రిబ్యూటర్స్ కుక్కిన పేనయ్యారు. ఆ డబ్బులో పావువంతుతో లేదా సగం ఎవౌంట్‌తో ఒకట్రెండ్ లేదా 4,5 సినిమాల్ని కొనేసి రిలీజ్ చేసేసుకుంటే... ఆ చిన్న సినిమాల్లో ఏ ఒక్కటి హిట్ టాక్ తెచ్చుకున్నా మిగతావాటి లాస్ బ్యాలెన్స్ అవుతుందికదా! ఓ మోస్తరు లాభాలు మొత్తంగా జమకూడినా చిన్న సినిమాల్ని బతికించిన వారవుతారు కదా! ఫ్రెష్ టాలెంట్‌తో, విభిన్న ఆలోచనలతో.. ఎందరెందరో కొత్తవాళ్లు చిన్న చిన్న సినిమాలతో సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేస్తున్నారు. చేయూతనందిస్తే వండర్స్ క్రియేట్ చేసేస్తారు, అలాంటి వారిని ప్రోత్సహిస్తూ.. ఆ కొత్త దర్శక నిర్మాతలకు అండగా నిలుస్తూ, చిన్న సినిమా బొమ్మ ముఖం మీద చిరునవ్వులద్దితే బావుంటుందేమో కదా!
ఈమధ్య నాఫ్రెండ్ ఓ చిన్న తెలుగు సినిమా తీసాడు తన దర్శకత్వంలో! అష్టకష్టాలు పడి, ఆపసోపాలు పడి ఒకరిద్దరు పెట్టుబడిదారుల్ని వెతుక్కొని నిర్మాతలుగా వ్యవహరింపచేసి సినిమాకు రూపురేఖలద్దాడు. సెన్సార్ కూడా అయ్యింది. ఫిబ్రవరి పధ్నాలుగు ‘ప్రేమికుల రోజు’న రిలీజ్ చేద్దామనుకొన్నాడు. డిస్ట్రిబ్యూటర్స్ దొరకలేదు. తిరుగుతున్నారింకా! వెతుకుతున్నారింకా! డిస్ట్రిబ్యూటర్స్ కరుణించడం లేదు. స్టార్ కాస్ట్ లేదంటూ ఒకరిద్దరు డిస్ట్రిబ్యూటర్స్ పెదవి విరిచారు. సొంతంగా రిలీజ్ చేసుకోలేని (ఆర్థిక) పరిస్థితి ఈ టీమ్‌ది. వడ్డీ పెరుగుతోంది. ఆల్రెడీ తెచ్చిన డబ్బుకి! ఈ మొదటి (సినిమా) ప్రసవమే సరిగ్గా కా(వడం)లేదు! ఇక రెండో బిడ్డ(సినిమా) గురించి ఆ దర్శకుడేం ఆలోచిస్తాడు? ఏ నిర్మాతలెలా ముందుకు వస్తారు? నా మిత్రుడొక్కడనే కాదు.. ఎందరో చిన్న సినిమాల నూతన దర్శక నిర్మాతల మనోభావాలివి!
అందుకే అంటున్నా! చిన్న సినిమాకు కూడా దారి చూపండని, అలాంటి వాటికి పూలబాటలు పరవక పోయినా... అందులో ఏ కొన్ని చిన్న సినిమాలైనా రిలీజయ్యాక బాక్సాఫీసు గలగలల సౌరభాలు వెదజల్లుతాయి కదా! అప్పుడందరూ హ్యాపీనే కదా!

-ఎనుగంటి వేణుగోపాల్