మెయన్ ఫీచర్

కేసుల భారంతో న్యాయవ్యవస్థ డీలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరాలు మారుతున్నా పరిష్కారం కాని వివాదాలు ఎనె్నన్నో.. న్యాయం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి.. సామాన్యుడికి న్యాయం దక్కేసరికి దశాబ్దాలు గడుస్తున్నాయి.. అమూల్యమైన సమయం గడిచిపోయాక న్యాయం చేకూర్చినా, వాటి ప్రతిఫలాలు అనుభవించే స్థితి దాటిపోతోంది. జనాభాకు సరిపడా న్యాయస్థానాలు ఏర్పాటు చేసే పరిస్థితులు కరువై, కుంటినడకన కేసులు నడుస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో బాధితులుగా మిగిలిపోతున్నది మహిళలు, గిరిజనులు, హరిజనులు, బీద బడుగు బలహీన వర్గాల వారే.
భారత ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు న్యాయవ్యవస్థ. పౌరుల కనీస హక్కులకు భరోసాగా నిలుస్తున్న వౌలిక వ్యవస్థ అది. ప్రజాస్వామ్య పథంలో దేశం అనేక సవాళ్లను ఎదుర్కోంటోంది. వైరుధ్యాల సమాహారంగా నిలుస్తున్న భారత్‌లో రోజుకో కొత్త రూపంలో సమస్యలు పుట్టుకొస్తున్నాయి. అడ్డంకులను అధిగమించి నిజమైన ప్రజాస్వామ్య దేశంగా నిలదొక్కుకోవడంలో మన న్యాయవ్యవస్థ పాత్ర కొట్టి పారేయలేనిది. ప్రజస్వామ్య పురోగమనానికి ఇరుసుగా ఉపయోగపడుతున్న న్యాయవ్యవస్థ- ‘కొండల్లా పేరుకుపోతున్న పెండింగ్ కేసులతో కుంగిపోతుండటం’ ఆందోళన కలిగిస్తున్న అంశం. చట్టబద్ధమైన పాలనకు ఆటంకం కలిగిస్తున్న పరిణామమిది. దేశవ్యాప్తంగా ఉన్నత న్యాయస్థానాల్లోనే 3 కోట్లకు పైగా పెండింగ్ కేసులు ఉన్నాయని ఇటీవల సుప్రీం కోర్టు విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం చేస్తున్న కొత్త చట్టాలకు సమాంతరంగా న్యాయవ్యవస్థలో వౌలిక సదుపాయాలు, కొత్త కోర్టులు, వ్యవస్థలు ఏర్పాటు చేయకపోవడం, న్యాయమూర్తుల పోస్టులను పెంచకపోవడం, ఖాళీలను భర్తీ చేయకపోవడంతో కేసులు పేరుకుపోతున్నాయనేది నిర్వివాదాంశం. కోట్లాది కేసులు పెండింగ్‌లో ఉన్నమాట నిజమేనని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ఒక ప్రశ్నకు బదులుగా సమాధానం చెప్పింది.
సుప్రీం కోర్టు వరకూ తీసుకుంటే మే 1, 2018 నాటికి పెండింగ్ కేసులు 55,272 ఉన్నాయి. అందులో అడ్మిషన్ స్థాయిలో 32,160, రెగ్యులర్ కేసులు 23099 ఉన్నాయి. విచారణ జరుగుతున్నవి, అందుకు సిద్ధంగా ఉన్నవి 41 వేల వరకూ కేసులు ఉండగా, మరో 13వేలకు పైగా కేసులు ఇంకా విచారణ దశకు కూడా రాలేదు. ఇంకోమాటలో చెప్పాలంటే 13645 పిటిషన్లు ఇంకా పరిశీలనకు కూడా రాలేదన్నమాట. హైకోర్టులు, జిల్లా కోర్టులు, సబార్డినేట్ కోర్టుల్లో కలిపి 3.2 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని న్యాయశాఖ నివేదిక తెలుపుతోంది. జిల్లా కోర్టుల్లో 2.8 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సుప్రీం కోర్టు నియమించిన పరిశోధన విశే్లషణ విభాగం నివేదిక ప్రకారం భారత్‌లో 61 కిలోమీటర్లకు ఒక పోలీసు ఇనస్పెక్టర్ పోస్టు ఉండగా, 157 కిలోమీటర్లకు ఒక న్యాయాధికారి పోస్టు ఉంది. అంటే కనీసం ఒక ఇనస్పెక్టర్ దాఖలు చేసే కేసులు చూసేందుకైనా కనీసం ఇద్దరు లేదా ముగ్గురు న్యాయాధికారుల అవసరం ఉంది. మరో చిత్రమైన విషయం ఏమంటే ఉన్న న్యాయాధికారుల సంఖ్యే చాలదు అనుకుంటే వారు కూర్చునేందుకు కోర్టు గదుల సంఖ్య ఇంకా తక్కువగా ఉండటం గమనార్హం. దేశంలో జిల్లా కోర్టులు, సబార్డినేట్ కోర్టుల్లో 5018 తగిన గదులు లేక సతమతమవుతున్నారు. ప్రస్తుతం 15540 కోర్టు గదులున్నా సదుపాయంగా లేవు. 2016 జనవరి 1 నాటికి న్యాయాధికారుల సంఖ్య 20,558 అందులో 8538 మందికి క్వార్టర్స్ లేవు. 41,775 మంది సహాయక సిబ్బంది కొరత ఉంది. నేషనల్ కోర్టు మేనేజిమెంట్ ప్రస్తావనను 1958లోనే ‘లా కమిషన్’ తన 14వ నివేదికలో తెచ్చింది. కాని అది నేటికీ కార్యరూపం దాల్చలేదు. అమెరికాలో 10 లక్షల మందికి 107 మంది న్యాయాధికారులు ఉండగా, ఆస్ట్రేలియాలో 42 మంది, కెనడాలో 76 మంది, ఇంగ్లాండ్‌లో 51మంది ఉన్నారు. కానీ భారత్‌లో మాత్రం 10 లక్షల మందికి (1981 జనాభాలెక్కల ప్రకారం) 10 మంది మాత్రమే న్యాయాధికారులున్నారు. మన దేశంలో కనీసం 10 లక్షల మంది జనాభాకు 50 మంది న్యాయాధికారులు ఉండాలని, కోర్టుల సంఖ్య కూడా రెట్టింపు చేయాలని సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది. ‘ఆల్ ఇండియా జడ్జీల సంఘం, ఇతరులు వెర్సస్ కేంద్ర ప్రభుత్వం (2002)’ కేసులో 2002 మార్చి 21న సుప్రీం కోర్టు తీర్పు చెబుతూ దేశంలో వ్యాజ్యాల నివారణకు, కేసుల సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలను కేంద్రం తీసుకోవాలని ఆదేశించింది. 2013 నాటికి కోర్టుల సంఖ్యను రెట్టింపు చేయాలని పేర్కొంది. దీనిని గమనంలోకి తీసుకున్న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు.
2011 నాటి జనాభా లెక్కల ప్రకారం దేశంలో న్యాయాధికారుల సంఖ్యను 60,530కి పెంచాలని లెక్కలు వేశారు. అలా పెంచగలిగితేనే దేశంలో కేసులను పరిష్కరించడం సాధ్యమవుతుందని గుర్తించారు. చైనాలో 136 కోట్ల మంది జనాభాను పరిగణనలోకి తీసుకుంటే 10 లక్షల మందికి 147మంది న్యాయాధికారులు అందుబాటులోన్నారు. ఆ విధంగా చూసినా భారత్‌లో పరిస్థితి ఎంతో దారుణంగా ఉందని సుప్రీం వ్యాఖ్యానించింది. సుప్రీం కోర్టులో ఆరు, వివిధ హైకోర్టుల్లో 464 మంది న్యాయమూర్తుల పోస్టులు , జిల్లా కోర్టుల్లో 4166 మంది న్యాయాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ సంఖ్య ప్రస్తుత అవసరాలకు ఏ విధంగా చూసినా సరిపోదు. 2040 నాటికి దేశంలో అన్ని కేసులను ఎప్పటికపుడు పరిష్కరించాలంటే 75,594 మంది న్యాయాధికారులు కావాలని సుప్రీం కోర్టుకు చెందిన ‘సెంటర్ ఫర్ రీసెర్చి అండ్ ప్లానింగ్’ విభాగం అంచనా వేసింది. ప్రస్తుతం సుప్రీంలో 55,272 కేసులు పెండింగ్‌లో ఉండగా, 24 హైకోర్టుల్లో 38,91,076 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా సబార్డినేట్ కోర్టుల్లో 2 కోట్ల 68,92,249 కేసులు పెండింగ్‌లో పడ్డాయి. ఇందులో సివిల్ కేసులు 81,52,799 కాగా క్రిమినల్ కేసులు 1,87,39,450 కేసులున్నాయని నేషనల్ జ్యుడిషియల్ గ్రిడ్ పేర్కొంటోంది. రాష్ట్రాల వారీ చూస్తే- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోర్టుల్లో 5.08 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 10 ఏళ్లు దాటిన కేసులు 6163 ఉన్నాయి. 5 నుండి 10 ఏళ్లలోపు ఉన్నవి 37,799, 2 నుండి 5 ఏళ్లలోపు కేసులు 1,45,934, రెండేళ్లలోపు కేసులు 3.18 లక్షలు ఉన్నాయి. రోజుకు 30వేల కేసులు పరిష్కారం అవుతున్నా, అంతకు మించి కేసులు నమోదు కావడంతో పెండింగ్ కేసులు తరగడం లేదు. యుపీలో 53,00,063, మహారాష్టల్రో 31,00,054, గుజరాత్‌లో 21,00,098, బీహార్‌లో 14,00,033, పశ్చిమ బంగలో 13,00,042 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని జె మార్క్ రామ్‌సేయర్ అండ్ ఎరిక్ బి రామసేయర్ (హార్వర్డు లా స్కూల్ ) తమ నివేదికలో పేర్కొంది. ఇన్ని కేసులను పరిష్కారం కావాలంటే 320 ఏళ్లు పడుతుందని న్యాయ నిపుణులు అంచనా. ఏ రోజుకారోజు ఏ కోర్టులో ఎన్ని కేసులు దాఖలయ్యాయో, ఎన్ని కేసులు పరిష్కారం అయ్యాయో, గమనిస్తూ విశే్లషణ చేసేందుకు కేంద్రం నేషనల్ కోర్టు మేనేజిమెంట్ సిస్టంను అమలులోకి తెచ్చింది. కోర్టుల అభివృద్ధి, ప్రణాళిక విధానంపై సుప్రీం నియమించిన జస్టిస్ బదర్ దుర్రేజ్ అహ్మద్ ఎన్‌సిఎంబి బేస్‌లైన్ నివేదిక కూడా ఇదే అభిప్రాయంతో కోర్టుల్లో పనితీరును మెరుగుపరచాలని సూచనలు చేసింది. న్యాయస్థానాల్లో ఆధునిక సౌకర్యాలను కల్పించడం, సిబ్బందికి, న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, వ్యాజ్యాల్లో వాది, ప్రతివాదులకు సౌకర్యాలను కల్పించాలని సూచించింది.
వివిధ హైకోర్టుల్లో 10 ఏళ్లు దాటిన కేసులే దాదాపు ఆరు లక్షలు ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్క నెలలోనే దాదాపు 11.5 లక్షల కేసులు దాఖలవుతున్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో మూడు నెలలు ఆగి వాటినే తిరిగి కేంద్రం మార్చిలో దాఖలు చేసింది. దాంతో సుప్రీం వాటిని గుర్తించి ఆగ్రహం చెందడమే గాక, లక్ష రూపాయలు జరిమానా విధించింది. అవే అంశాలకు సంబంధించి మరో బ్యాచ్ పిటిషన్లను కేంద్రం మరో మారు దాఖలు చేయడంతో జస్టిస్ మదన్ బి లోకూర్, దీపక్ గుప్తాలతో కూడిన డివిజన్ బెంచ్ గత పక్షం కేంద్రం తీరును తీవ్రంగా దుయ్యబట్టింది. ‘ఈజ్ ఆఫ్ బిజినెస్’ పేరుతో న్యాయవ్యవస్థను అతలాకుతలం చేస్తారా? అంటూ నిలదీసింది. దేశవ్యాప్తంగా ఉన్న 3.2 కోట్ల వ్యాజ్యాల్లో 46 శాతం వాటా కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలదే. తమ స్థాయిలోనే పరిష్కరించదగిన అంశాలను వ్యాజ్యాలుగా న్యాయస్థానాలపైకి కార్యనిర్వాహక వ్యవస్థ నెడుతోందని, ప్రభుత్వాలు గుణపాఠం నేర్వడం లేదని బెంచ్ ఆవేదన చెందింది. ప్రభుత్వాలు నిద్రమత్తు వీడటం లేదని పేర్కొంది. 46 శాతం మేర కేసులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రైల్వే, ఆర్థిక, కమ్యూనికేషన్లు, హోం, రక్షణ శాఖలకు చెందినవే. కేసులు వేయడం, డజన్ల కొద్దీ న్యాయవాదులను, అదనపు సొలిసిటర్ జనరల్ స్థాయి అధికారులను నియమించడంతో కేంద్రం తన పని అయిపోయిందని భావిస్తోంది. వ్యాజ్యాలను తగ్గించడానికి ఎలాంటి కృషి చేయడం లేదు.
నేషనల్ లీగల్ మిషన్‌ను సీరియస్‌గా నిర్వహించడానికి, కేసులను 15 ఏళ్ల పెండింగ్ నుండి కనీసం మూడేళ్లకు తగ్గించడానికి ఉన్న మార్గాలను గుర్తించడానికి కేంద్రం ఎలాంటి చర్యలూ చేపట్టలేదన్నది సుప్రీం బెంచ్ ఆరోపణ. నేషనల్ లిటిగేషన్ పాలసీని రూపొందిస్తే బావుంటుందేమో ఆలోచించాలని బెంచ్ పేర్కొంది. కేసులు పరిష్కారం కావాలంటే కేంద్రం చిత్తశుద్ధితో ఆలోచించాల్సి ఉంది. రాష్ట్రాలు ఆర్థిక భారం నెపం మోపకుండానే కేంద్రంతో కలిసి ముందుకు వెళ్లాలి, కేసుల పెండింగ్ వల్ల కనిపించని పెను ఆర్థిక భారం ఆయా ప్రభుత్వాలకే అన్నది సుస్పష్టం. లక్ష రూపాయలు చెల్లింపునకు సంబంధించిన కేసుల్లో ప్రభుత్వాలు పంతాలకు పోయి కోట్లాది రూపాయలు వెచ్చించిన సందర్భాలు అనేకం. ప్రభుత్వం కొన్ని కేసులు గెలిస్తే గెలవచ్చు గాక, కాని వృథా అవుతున్న నిధులు ప్రజలవే అనే స్పృహ లేనంతకాలం కోర్టుల్లో వ్యాజ్యాలు మురుగుతూనే ఉంటాయి. పెండింగ్ కేసులను తగ్గించేందుకు గొప్ప ప్రత్యామ్నాయంగా సామాన్యులకు న్యాయం అందించేందుకు అందుబాటులోకి వచ్చిన న్యాయ పరిష్కారమే ప్రత్యామ్నాయ న్యాయ వివాదాల పరిష్కారం (ఎడిఆర్). శతాబ్దాల చరిత్ర ఉన్న ప్రత్యామ్నాయ పరిష్కారాల మార్గానికి శాస్ర్తియతను తెచ్చేందుకు ప్రభుత్వం 1996 చట్టాన్ని విస్తృతం చేసి 2015 సమగ్ర చట్టం తెచ్చింది. దీనికి మరింత స్వరూపాన్నిచ్చేందుకు 2018 సవరణలు రూపొందించింది. ఈ సవరణలు అమలులోకి వస్తే రాత్రికి రాత్రి లక్షల కేసులు తేలికగా పరిష్కారం అయ్యే అవకాశం లేకపోలేదు. మధ్యవర్తిత్వం, రాజీ కుదర్చడం, ఉభయ పక్షాలు చర్చించుకోవడంతోపాటు అనేక ప్రత్యామ్నాయ పరిష్కారాల మంత్రాంగాన్ని కేంద్రం , న్యాయశాఖ సూచిస్తోంది. వాటిని వినియోగించుకోగలిగితే తొందర్లో ఈ కేసుల భారం నుండి భారత్ బయటపడటం ఖాయం.

-బీవీ ప్రసాద్ 98499 98090