మెయన్ ఫీచర్

కర్నాటక ఫలితాలపై ‘చంద్రుల’ ఆసక్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం మొత్తం దేశం ఆసక్తితో ఎదురు చూస్తున్నది. ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్పల మధ్య పోటీగా ఉండాల్సిన ఈ ఎన్నికలు ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలకు సవాలుగా మారాయి. 2019 సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తూ ఉండడంతో సహజంగానే జాతీయ స్థాయిలో కర్నాటక ఎన్నికలు ప్రాధాన్యతను సంతరింప చేసుకున్నాయి. దేశంలో 19 రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసినా దక్షిణాదిన చెప్పుకోదగిన స్థావరం ఏర్పాటు చేసుకోలేక పోవడంతో కర్ణాటకలో పాగా వేసేందుకు భాజపా చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసింది. కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో రాహుల్ గాంధీ ఈ ఎన్నికలను ప్రతిష్టాకరంగా తీసుకొని విస్తృతంగా ప్రచారం జరిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న చివరి పెద్ద రాష్ట్రం ఇదే కావడంతో, ఇక్కడ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ద్వారా కాంగ్రెస్ నేతలు తాపత్రయ పడుతున్నారు.
వాస్తవానికి కర్నాటక ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలలో చెప్పుకోదగిన ప్రభావం చూపే అవకాశం లేదని భావించాలి. ఇక్కడ ఓటమి చెందినంత మాత్రాన 2019 ఎన్నికలలో భాజపాకి ప్రతికూల పరిస్థితులు ఎదురు కాగలవని చెప్పలేం. 2013లో కర్నాటకలో ఓటమి చెందినా, ఆ మరుసటి సంవత్సరం లోక్‌సభ ఎన్నికలలో భాజపా ఘన విజయం సాధించింది. కర్నాటకలో గెలుపొందితే జాతీయ రాజకీయాలపై కాంగ్రెస్ ఆధిపత్యం తిరిగి ఏర్పడుతుందని కూడా అనలేం. బిజెపి- కాంగ్రెస్‌ల మధ్య నిజమైన సవాల్ ఈ సంవత్సరం చివరిలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే కాగలవు. ఈ రాష్ట్రాలలో ఫలితాలు 2019 ఎన్నికలపై నిర్ణయాత్మక ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్రాలలో చెప్పుకోదగిన విజయాలు సాధించలేని పక్షంలో ఉత్తర ప్రదేశ్, బిహార్‌లలో కూడా బిజెపి వెనుకడుగు వేయక తప్పదు. అటువంటప్పుడు 2019 ఎన్నికలలో తిరిగి అధికారం చేపట్టడం అసంభవం కాగలదు.
ఐదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ కర్నాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం చెప్పుకోదగిన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవడం లేదు. 2013 ఎన్నికలలో మూడు ముఠాలుగా చీలిపోయిన బీజేపీ పరివారం ఇప్పుడు ఒకటిగా పోటీ ఇస్తూ ఉండడంతో కాంగ్రెస్ పై వత్తిడి పెరుగుతున్నది. దీంతో ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు బిజెపి, కాంగ్రెస్ పార్టీలపై కన్నా పొరుగున ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలలో అధికార పక్షాల రాజకీయ భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉండటం విశేషం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ కర్ణాటక ఎన్నికలపై దృష్టి సారించారు. కర్నాటకలోని సుమారు 40 నియోజక వర్గాలలో గెలుపోటములపై తెలుగు ప్రజలు ప్రభావం చూపే అవకాశం ఉంది. తీవ్రమైన పోటీ ఏర్పడినప్పుడు రెండు, మూడు వేల ఓట్లు కూడా కీలకం అవుతాయి. అందుకనే తెలుగు ప్రజలు ఏ విధంగా వోటు వేస్తారో అన్నది ఆసక్తిగా మారింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి ప్రధాని మోదీ మోసం చేసారని సిద్దరామయ్య సానుభూతి చూపడం కేవలం తెలుగు ఓటర్లను ఆకట్టుకోవడం కోసమే అని వేరే చెప్పనవసరం లేదు.
కర్ణాటక జనాభాలో 15 శాతం వరకు తెలుగు ప్రజలు ఉండటమే కాకుండా రాష్ట్రంలో కన్నడ తర్వాత ఎక్కువగా మాట్లాడే భాష కూడా తెలుగు. 12 జిల్లాల్లో తగు సంఖ్యలో తెలుగు వారున్నారు. బెంగళూరు నగరంలో అయితే 49 శాతం, బెంగళూరు రూరల్‌లో 65 శాతం ఓటర్లు తెలుగు వారే. కోలార్ జిల్లాలో 76 శాతం, బళ్ళారి జిల్లాలో 63 శాతం, రాయచూరు జిల్లాలో 64 శాతం తెలుగు వారున్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని బిజెపి రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జ్ గా తెలంగాణకు చెందిన మురళీధరరావును, సహాయ ఇన్‌ఛార్జ్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పురంధేశ్వరిని నియమించి, వారిద్దరిని ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా తిరిగేటట్లు భాజపా చేసింది. 28 సీట్లు ఉన్న బెంగళూరు నగరంలో 25 లక్షల మంది తెలుగు ఓటర్లు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీల నేతలు ఎన్నడూ కర్ణాటకలోని తెలుగు వారికి సం బంధించిన ఏ సమస్యల గురించి గాని పట్టిం చుకోలేదు. తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించినా కర్ణాటకలో దానిని విస్తరింప చేసే ప్రయత్నమే చేయలేదు. బిజెపి, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎన్నికల సమయంలో తెలుగు రాష్ట్రాల నుండి వెళ్లి కర్ణాటకలోని తమ పార్టీ నేతలకు సహకారం అందించడం చాలాకాలంగా జరుగుతున్నది.
మొట్టమొదటి సారిగా చంద్రబాబు, చంద్రశేఖరరావు కర్ణాటక ఎన్నికలపై ఎన్నడూ చూపని ఆసక్తిని కనబరుస్తున్నారు. తెలుగు ప్రజలను మోసం చేసిన ప్రధాని మోదీని, బిజెపిని ఓడించాలని తెలుగు ఓటర్లకు చంద్ర బాబు బహిరంగంగానే పిలుపు ఇచ్చారు. ప్రత్యక్షంగా తెలుగు దేశం పార్టీ నాయకులు ప్రచారంలో పాల్గొనక పోయినా సోషల్ మీడియా ద్వారా బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఎన్డీయే నుండి వైదొలిగిన చంద్రబాబు ఇప్పుడు బిజెపిపై కత్తిగట్టిన్నట్లు వ్యవహ రిస్తున్నారు. భాజపాను కర్ణాటకలో ఓడించడం ద్వారా తన పగను తీర్చుకోవాలి అన్నట్లు చూస్తున్నారు. కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాల నుండి ఆవిర్భవించిన పార్టీ తెదేపా. కాంగ్రెసేతర పార్టీలను ఒక వేదికపైకి తెచ్చి, జాతీయ స్థాయిలో ఆ పార్టీని గద్దె దింపడంలో తెదేపా కీలక పాత్ర వహించింది. ఎన్నడూ ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని కాంగ్రెస్‌ని గెలిపించడానికి పనిచేసిన సందర్భం లేదని చెప్పవచ్చు. మొదటిసారిగా కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించడం కోసం చంద్రబాబు కంకణం కట్టుకున్నట్లు వ్యవహరించడం విస్మయం కలిగిస్తున్నది. నేరుగా కాం గ్రెస్‌కు వోటు వేయమని చెప్పక పోయినప్పటికీ బిజెపిని ఓడించమని పిలుపు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ విజయానికి దోహదపడే విధంగా వ్యవహరిస్తున్నారు.
కర్ణాటకలో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే జాతీయ స్థాయిలో బిజెపి బలహీన పడుతుందని, మోదీ ప్రభావం తగ్గుతుందని చంద్రబాబు అంచనా వేస్తున్నట్లు కన బడుతున్నది. 15వ ఆర్ధిక సంఘం విధివిధానాలు వ్యతిరేకంగా అమరావతిలో జరిపిన రాష్ట్ర ఆర్ధిక మంత్రుల సమావేశంలో పుదుచ్చేరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నారా యణస్వామి కూడా పాల్గొనడం, ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి మోదీ అన్యాయం చేశారని విమర్శిస్తూ చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించడం గమనార్హం. కర్ణాటకలో బిజెపి గెలుపొందితే ఏపీలో ఆ పార్టీ బలం పుంజుకొనే అవకాశం లేకపోయినా నైతికంగా తెలుగుదేశం బలహీనపడే అవకాశం ఉంటుందని ఆ పార్టీ నాయకులకు తెలుసు. జాతీయ స్థాయిలో మోదీ నాయకత్వం బలపడితే ఇక్కడ చంద్రబాబు నాయకత్వం బలహీన పడటం అనివార్యం కాగలదు. చంద్రబాబును దెబ్బ తీసేందుకు ఇదే అదనుగా భావిస్తున్న వైకాపా నాయకులు కర్ణాటకలో బిజెపి గెలుపు కోసం తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. పైగా ఇప్పుడు బిజెపి తిరిగి దగ్గరకు తీసుకున్న గాలి జనార్ధనరెడ్డి సోదరులతో వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉండటం, బిజెపి-వైసిపిల మధ్య సయోధ్య కుదర్చడంలో ఆయన కీలకపాత్ర వహిస్తున్నారని కథనాలు వస్తున్నాయ. గాలి జనార్ధనరెడ్డి ప్రాధాన్యత పెరిగితే ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి - వైసిపిల మధ్య రాజకీయ అవగాహనకు దారితీసే అవకాశం ఉంది. ఈ పరిణామం చంద్రబాబుకు ఆందోళన కలిగించే అంశమే.
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆసక్తికి భిన్నమైన కారణం ఉంది. తాను ఏర్పాటు చేయబోయే రాజకీయ కూటమి కోసం అంటూ మాజీ ప్రధానమంత్రి దేవెగౌడను కేసీఆర్ బెంగళూరులో కలిశారు. కర్ణాటకలోని తెలుగు వారంతా జెడి(ఎస్)కు మద్దతు పలకాలని ఆయన పిలుపిచ్చారు. అవసరం అనుకొంటే తాను స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని కూడా చెప్పారు. అయితే ఆయనను ప్రచారం చేయమని దేవగౌడగాని, ఆయన కుమారుడు కుమారస్వామి గాని కోరలేదు. ఇప్పటికే కొత్త రాజకీయ కూటమి పేరుతో మమతా బెనర్జీ, స్టాలిన్, అఖిలేష్ యాదవ్ వంటి వార్లతో సమాలోచనలు జరిపిన చంద్రశేఖరరావు ప్రయత్నాన్ని ఇతర రాజకీయ పార్టీలు అనుమానంగా చూస్తున్నాయి. కాంగ్రెస్ లేకుండా భాజపాకు వ్యతిరేకంగా బలమైన కూటమి ఏర్పాటు సాధ్యం కాదని శరద్ పవార్, మమత, స్టాలిన్ వంటి నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. అయితే రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్హ్దిగా అంగీకరించడానికి మాత్రం వారు సందేహిస్తున్నారు. కాంగ్రెస్ మద్దతుతో తాము ప్రధాని పదవి చేపట్టాలని పలువురు నాయకులు ఆశలు పెంచుకొంటున్నారు.
ఇటువంటి పరిస్థితులలో కాంగ్రెస్,బిజెపి లేకుండా కూటమి ఏర్పాటు చేయాలని చంద్రశేఖరరావు పేర్కొనడం బిజెపి వ్యతిరేక కూటమి బలపడకుండా, బలమైన ప్రాంతీయ పార్టీలు ఏవీ కాంగ్రెస్ తో చేతులు కలపకుండా అడ్డుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నంగా పలువురు నాయకులు అంచనా వేస్తున్నారు. బిజెపి రాజకీయ ఎత్తుగడలతో కేసీఆర్ పావుగా మారారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకనే- కేసీఆర్ పర్యటనలకు చెప్పుకోదగిన ప్రాధాన్యత లభించడం లేదు.
తెలంగాణలో అధికారంలో ఉన్న టి ఆర్ ఎస్ కు బలమైన ప్రతిపక్షంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అధికార పక్షం పట్ల ప్రజా వ్యతిరేకత ఏర్పడితే రాజకీయంగా అనుకూలంగా మలచుకొని అధికారంలోకి రావాలని ఆ పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నది. అందుకనే కేసీఆర్‌కు ఇప్పుడు బిజెపి కన్నా కాంగ్రెస్ ప్రధాన రాజకీయ శత్రువుగా కనిపిస్తోంది. జాతీయ రాజకీయాలపై ఆయన చూపుతున్న ఆసక్తి సైతం తెలంగాణ ప్రజల దృష్టిని తన పాలనపై నుండి మళ్లించే ఒక ఎత్తుగడగా పలువురు భావిస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాజపా జాతీయ స్థాయిలో రాజకీయంగా ప్రయోజనం పొందినా తెరాసకు ఇబ్బంది లేదు. ఎందుకంటే తెలంగాణలో భాజపా బలం పెరిగే అవకాశం లేదు.
ఒకవేళ తెలంగాణలో భాజపా బలం పుంజుకున్నా అవసరాన్ని బట్టి ఆ పార్టీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సైతం కేసీఆర్‌కు ఇబ్బందులు ఉండకపోవచ్చు. కాంగ్రెస్‌ను తెలంగాణలో ఎదగకుండా చేయాలంటే జాతీయ స్థాయిలో ఆ పార్టీ బలం పుంజుకోవడానికి వీల్లేదు. ముఖ్యంగా కర్నాటకలో మోదీ ప్రభంజనాన్ని తట్టుకుని కాంగ్రెస్ అధికారాన్ని నిలుపుకుంటే సహజంగానే తెలంగాణలో ఆ పార్టీ నేతల్లో నూతన ఉత్సాహం కలుగుతుంది. అలాంటి ప్రమాదం రాకుండా చేయడానికే కర్నాటకలో జేడీ (ఎస్)కు మద్దతు తెలపడం ద్వారా కేసీఆర్ కాంగ్రెస్ వ్యతిరేక వైఖరిని అనుసరిస్తున్నారు.
ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాని పక్షంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి రానీయకుండా కుమారస్వామిని సీఎం చేయడానికి వెనుకాడబోమని భాజపా నాయకత్వం ఇప్పటికే సంకేతాలిచ్చింది. కర్నాటకలో కాంగ్రెస్ గెలుపును ఒక వరంలా తెదేపా భావిస్తుండగా, అది అపశకునమని తెరాస అంచనా వేస్తోంది. కర్నాటక ఎన్నికల ఫలితాలు తమ రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయాత్మక ప్రభావం చూపొచ్చని తెలుగు రాష్ట్రాల సీఎంలు భావిస్తున్నారు.

-చలసాని నరేంద్ర 98495 69050