మెయన్ ఫీచర్

నూతన దృక్పథంతో దళిత వికాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 127వ జయంతి దేశవ్యాప్తంగా ఘనంగా జరిగింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు, అనేక సంఘాలు, సంస్థలు నివాళులు అర్పించాయి. వాస్తవానికి ‘అంబేద్కర్’ అనేది దళితుడి పేరు కాదు. భీమ్‌రావు ప్రాథమిక పాఠశాలలో చేరినపుడు- అక్కడి బ్రాహ్మణ ఉపాధ్యాయుడు తన ఇంటి పేరు ‘అంబేద్కర్’ను భీమ్‌రావు ఇంటి పేరుగా నమోదు చేశాడు. భీమ్‌రావు అసలు ఇంటి పేరు అంబెవదే. కాని భీమ్‌రావు అంబేద్కర్‌గానే ఆయన ప్రాచుర్యం పొందారు. చివరికి భీమ్‌రావును సైతం పక్కనపెట్టి ‘అంబేద్కర్’గానే ఆయనను వ్యవహరిస్తున్నారు. అలనాటి బ్రాహ్మణ సమాజంతో సమానంగా భీమ్‌రావు తన తెలివితేటలను ప్రదర్శించడంతో, చురుగ్గా వ్యవహరించడంతో ఆ బ్రాహ్మణ పేరును ఆయన సార్థకం చేశారు. ఈ అంశం కొందరికి వివాదాస్పదంగా అనిపించినా ఇది వాస్తవం. ఈ సత్యాన్ని తొక్కిపెట్టడానికి ఎవరికి హక్కులేదు.
ఏప్రిల్ నెలలోనే జన్మించిన జ్యోతిబా ఫూలే సైతం అంతే చురుకుదనం ప్రదర్శించి, తెలివితేటల్ని కనబరిచి మహాత్ముడిగా అగ్రవర్ణాలచే కొనియాడబడ్డారు. అంబేద్కర్, ఫూలే దాదాపు సమకాలికులు. ఫూలే కూడా విద్యలో బ్రాహ్మణులతో పోటీపడ్డారు. నూటపాతిక సంవత్సరాల క్రితం వెనుకబడిన, అణగారిన వర్గాలకు ఆయుధంగా ఉపకరించిన- ‘జ్ఞానం, చదువు, తెలివితేటలు, చొరవ, చైతన్యం’ ఇప్పటికీ గీటురాళ్లుగా నిలిచాయి. ఈ కీలకమైన ప్రక్రియను కొంచెం పక్కనపెట్టి ఉద్యమాలపైనే ఊపిరి నిలపడంతో- అంబేద్కర్, ఫూలే స్థాయికి లేదా వారి దరిదాపుల్లోకి ఎవరూ ఎదగక పోవడం విచారకరం.
అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఉత్సవంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంచి ప్రసంగం చేశారు. చాలామందికి అది రుచించకపోయినా ఆయన మార్గదర్శనం ఆచరణ సాధ్యమైన, ఫలితాలనిచ్చేది. వాస్తవానికి దగ్గరగా ఉంది. అటు అంబేద్కర్, ఫూలే మాటల్నే ఈనాటి సందర్భంలో మంత్రి చెప్పారు. ఆ కోణాన్ని దశాబ్దాలుగా చాలామంది నాయకులు విస్మరించడమో లేదా అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం కారణంగానో అంబేద్కర్ ఆశించిన అభివృద్ధి అందుబాటులోకి రాలేదు.
మంత్రి కేటీఆర్ చెప్పింది ఏమిటంటే- విద్య మాత్రమే జీవితాల్ని ఉన్నతీకరిస్తుంది. ప్రభుత్వం అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తోంది. వాటిని అందిపుచ్చుకుని దళితులు ఎదగాలని అది వినా మరో మార్గం లేదని కుండబద్దలుకొట్టినట్టు చెప్పారు. రాబోయే రోజుల్లో కులానికి ప్రాధాన్యత ఉండదని కేవలం ‘పేద, ధనిక’ అన్న ‘కులాలు’ మాత్రమే ఉంటాయని, ఉన్నవాడిగా ఎదగాలంటే విద్య-జ్ఞానం, చొరవ, పట్టుదల, సత్‌ప్రవర్తన కీలకమని ఉద్భోదించారు. దళిత పారిశ్రామికవేత్తల్లో బిలియనీర్లున్నారని వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని, ఇప్పుడు అలాంటి కార్యక్రమాలపై, చిన్న-మధ్యతరహా పరిశ్రమలపై మనసు పెట్టాలని మంత్రి సూచించారు. వెనుకబడిన వర్గాలు మిగతావారితో కలిసి నడిచేందుకు రాజకీయంగా కన్నా జ్ఞానపరంగా ఎదగడంలోనే అర్థం, పరమార్థం ఉంది. వర్తమాన సమాజంలో గుమస్తాలు, అటెండర్లు లాంటి ఉద్యోగాల కల్పనతో సరిపెట్టుకుంటే- పెద్దపెద్ద అంగలువేస్తూ మారిన ప్రపంచంతో కలిసి నడిచే అవకాశం ఉండదు. కష్టమైనా, ఇబ్బంది అయినా ఉన్నత చదువులు, నైపుణ్యాలున్న కోర్సులు చేయడం వల్లనే అంబేద్కర్, ఫూలేల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు.
నాల్గవ పారిశ్రామిక విప్లవం వెలుగులో మొత్తం సమాజం పరివర్తనం చెందుతోంది. ఈ ఎరుక వెనుకబడిన వారిలో మరింత స్పష్టంగా ఉండాలి. ‘ఆటోమేషన్’ కారణంగా అనేక లక్షల ఉద్యోగాలు ‘హుష్‌కాకి’ అవుతాయని చాలాకాలంగా నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకునైనా ఉన్నత విద్య-సాంకేతిక విద్య- నైపుణ్యంగల కోర్సుల్లో చేరి దళితులు సత్తా చాటాల్సిన అవసరముంది. ఈ దారి కాదని వామపక్షాల, వామపక్ష తీవ్రవాద పార్టీల మాటలు నమ్మి రాజ్యాధికారం కోసం ఉద్యమిస్తే ఒరిగేదేమీ ఉండదు. వర్తమాన పరిస్థితులు, ప్రజాస్వామ్యంలో చోటుచేసుకున్న మార్పులు, పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం రీత్యా విద్యావంతులు, సాంకేతిక నిపుణులకే మాన్యత ఉంది. ఇవే కుటుంబాలను, వ్యక్తులను ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి. గత దశాబ్దానికి పైగా కంప్యూటర్ రంగ (ఐటి) విప్లవం దీన్ని రుజువుచేసిన సంగతి మన కళ్ళముందు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో డిజిటల్ విప్లవం కారణంగా అదే పరిస్థితి పునరావృతం కానున్నది. తదనుగుణమైన మార్గం ఎంచుకోవడంలోనే విజ్ఞత కనిపిస్తుంది. ఈ దృష్టికోణం సవ్యమైనది, ఆధునికమైనది. ఆ కోణంలో కులాలు, మతాలు, వర్గాలు, వైషమ్యాలు గాక వాస్తవికత స్పష్టంగా కనిపిస్తోంది. ఎంతో స్పష్టతతో, దూరదృష్టితో, రాబోయే సాంకేతిక మార్పులు సమాజంలో తీసుకువచ్చే విప్లవం నేపథ్యంలో అనేక పథకాలు ప్రవేశపెట్టి కొత్త తరాన్ని అందుకు తయారుచేస్తున్న వైనం ఎంతో నిండుగా కనిపిస్తోంది. ఓట్ల రాజకీయం, ఆధిపత్య భావం, అణచివేత ఆలోచన కనిపించదు.
రేపటి సమాజం ఎదుర్కోబోయే సమస్యలకు నిన్నటితరం రాజకీయ నాయకుల దగ్గర పరిష్కారం కనిపించదు. ఉన్నత విద్యను అభ్యసించి, అనుభవం సంపాదించి, ఎంతో వేగంగా విషయాలను గ్రాహ్యం చేసుకుని అద్భుతమైన రీతిలో సూచనలుచేసి ఎందరికో కేటీఆర్ మార్గదర్శనం చేస్తున్నారు. ఇక్కడ వర్గం-కులం, వర్ణం గాక జ్ఞానం, అవగాహన, ఆధునిక ఆలోచన మాత్రమే పనిచేస్తోంది. ‘డిక్కీ’లో ఉన్న అనేకమంది దళిత పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. దీన్ని పట్టుకోవడమే కీలకం.
ఇప్పుడు టి-హబ్, వి-హబ్, డిజిటల్ తెలంగాణ, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, ఐటి కారిడార్, సిలికాన్ వ్యాలీలో క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్, ఐఓటి.. ఇట్లా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వేగంగా విస్తరిస్తోంది. కృత్రిమ మేథ అన్నిరంగాలలో చొచ్చుకపోతోంది. రోబోలు మనుషులకు ప్రత్యామ్నాయంగా సమర్ధవంతంగా పనిచేస్తున్నాయి. ఈ వాతావరణం క్రమంగా చిక్కబడుతోంది. దీన్ని కేటీఆర్ కళ్ళకుకడుతూ అణగారిన వర్గాలు-దళితులు అనుసరించాల్సిన మార్గాన్ని ఎంతో స్పష్టంగా దళిత మేధావులు, నాయకులు, పారిశ్రామికవేత్తలు-వ్యాపారవేత్తలు, కార్యకర్తలు, ఉద్యమకారుల సమక్షంలో ఉత్తేజకరంగా వివరించారు. ఆబ్జెక్టివ్ (వస్తుగతం)గా ఎవరు సూచనలు చేసినా దాన్ని పరిశీలించడమేగాక ఆచరించినట్టయితే అద్భుతాలు సాధించవచ్చు.
గత 70 ఏళ్లుగా రాయితీల కోసం, రిజర్వేషన్ల కోసం చేసే పోరాటం క్రమంగా మసకబారనుంది. దానికి కారణం పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం, మారిన ప్రపంచ పరిస్థితులు. ఈ నేపథ్యంలో పోటీపడి దళితులు తమ ప్రతిభను, సృజనను చాటుకుని అగ్రభాగాన నిలవడం ముఖ్యం. అప్పుడే ప్రథమశ్రేణి పౌరులుగా ఎదిగే అవకాశాలున్నాయి. అందుకే అటువైపు దృష్టి నిలపాలి. పాత ఆలోచనలకు స్వస్తిపలికి నూతన ఆలోచనల్ని ఆహ్వానించి, ఆచరించినప్పుడే అంబేద్కర్, ఫూలే కలలు ఫలిస్తాయి.

-వుప్పల నరసింహం 99857 81799