మెయన్ ఫీచర్

మోదీకి ఇంట తప్పని ఇబ్బందులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాశ్చాత్యులు భారత్‌ను వదిపెట్టిపోతే దేశం అభివృద్ధి చెందుతుందనేది స్వాతంత్య్రోద్యమకాలంలో బహుళ ప్రాచుర్యంలో ఉన్న మాట. ఇది కొంతవరకు నిజమే కాని అసలు పాశ్చాత్యులు భారతదేశాన్ని ఎలా జయింపగలిగారనే అంశాన్ని గురించి ఎవరూ ఆలోచించడం లేదు. 1947 తరువాత మహాత్మాగాంధీ మాట్లాడుతూ స్వాతంత్య్ర సిద్ధి తర్వాత కాంగ్రెస్ అవసరం దేశానికి లేదు. అందుకని ఈ రాజకీయ పక్షాన్ని రద్దు చేయండి అని కోరాడు. అం దుకు కాంగ్రెస్ నాయకులు ససేమిరా అన్నారు. స్వాతంత్య్ర ఫలాలు తామే అనుభవించాలనుకున్నారు. ఫలితంగా దాదాపు ఆరు దశాబ్దాలపాటు భారతదేశంలో కాంగ్రెస్ పాలన కొనసాగింది.
పదవిలోకి వచ్చాక దాన్ని నిలబెట్టుకోవాలనే కోర్కె ఉండటం సహజం. భారత రాజ్యాంగం ఐదేళ్లకు పరిమితం చేసిన రిజర్వేషన్లను శాశ్వతం చేశారు. మైనారిటీల ఓట్ల కోసం వారి కోటాలు పెంచారు. జాట్, కాపు, పటేల్ వంటి కొత్తవర్గాలు ఇప్పుడు రిజర్వేషన్లు కోరుకుంటున్నాయి. బ్రాహ్మణులు జనాభా ప్రాతిపదికపై కాక ఆర్థిక ప్రాతిపదికపై వెనుకుబాటుతనం దృష్ట్యా తమకు రిజర్వేషన్లు కావాలంటున్నారు. ఇదంతా కాంగ్రెస్ పాలన ఫలితమే.
ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లో చాలా సుఖంగా ఉంటుంది. కాని దిగాల్సిన స్టేషన్ రాగానే మనం దిగిపోవాలి. అంతేకాని కోచ్‌ను అంటిపెట్టుకొని కూర్చుంటే ఎలా? సరిగ్గా భారత రాజకీయాల్లో ఇలాగే జరిగింది. మొన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఒక ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ యంకర్ కరణ్ థాపర్‌తో మాట్లాతూ, ‘‘ఇందిరాగాంధీ కాకుంటే సోనియా గాంధీ, ఆమె కాకుంటే రాహుల్ గాంధీ లేదా ప్రియాంకా గాంధీ ఇలా గాంధీ కుటుంబం ‘టాగ్’ (గుర్తు) లేకుండా మాకు అస్తిత్వం లేదు,’’ అని చాలా నిర్మొహమాటంగా చెప్పారు.
అయితే కుటుంబ పాలనకు రోజులు చెల్లాయన్న మాట చాలా కుటుంబాలకు వర్తిస్తుంది. కేరళలో కరుణాకరన్ తన రాజకీయ వారసునిగా మురళీధరన్‌ను ప్రోత్సహించారు. ఫలితంగా అక్కడ కుటుంబ పాలనతో పాటు ఆ పార్టీయే అంతరించిపోయింది. తమిళనాడులో కరుణానిధి తన కొడుకు, కూతురును రాజకీయ వారసులుగా ప్రోత్సహించారు. అక్కడ డిఎంకె పాలన అంతరించింది. కర్ణాటకలో దేవెగౌడ తన కొడుకు కుమారస్వామిని ప్రోత్సహించారు. అక్కడ జనతాదళ్ సెక్యులర్ అనే పార్టీకి నేడు అస్తిత్వం లేదు. అసోంలో తరుణ్ గోగోయ్‌కు ‘సన్ స్ట్రోక్’ తగిలింది. ప్రజలు ఆయనను ఇటీవలి ఎన్నికల్లో తిరస్కరించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన కుమారుణ్ణి ప్రోత్సహించారు. మధ్య ప్రదేశ్‌లో సింధియా, దిగ్విజయ్ కుటుంబాలు పాలన సాగించాయి. ఇప్పుడు రెండు కుటుంబాలు కనుమరుగయ్యాయి.
తెలంగాణ ఆవిర్భావం కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఉద్యమాలు నడిపాయి. దానికి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటి అని పేరు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఈ కమిటి ప్రధాన లక్ష్యం. 2014 జూన్‌లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే టిజెఎసి నుంచి వివిధ పార్టీలవారు బయటకు వెళ్లిపోయారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపులేని పోరాటం చేసినవారు కల్వకుట్ల చంద్రశేఖర్ రావు. వారి పార్టీకి తెలంగాణ రాష్ట్ర సమితి అనిపేరు. ‘రాష్ట్ర సాధన జరగగానే టిఆర్‌ఎస్ రద్దయిపోతుంది, తెలంగాణకు దళితుడు ముఖ్యమంత్రి అవుతాడు’ అని ఆయన నమ్మబలికారు. కాని రాష్ట్ర ఆవిర్భావం తరువాత ప్రజాభీష్టం మేరకు, బంగారు తెలంగాణ నిర్మాణ బాధ్యత కూడ తానే స్వీకరిస్తున్నట్టు చెప్పారు. ఆ విధంగా కెసిఆర్, ఆయన కుమారుడు, కుమార్తె, మేనల్లుడు, ఇతర బంధువులు బంగారు తెలంగాణ నిర్మాణం చేస్తున్నారు. ఇది ఏక కుటుంబ పాలన అని భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఆక్షేపించడం సహజం.
అంతేకాదు ఇక టిజెఎసి అవసరం ప్రస్తుతం లేదు కనుక ప్రొఫెసర్ కోదండరామ్ ఇక దాన్ని రద్దు చేయాలంటూ కోరారు. అలా చేయకుండా ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఇతగాడు కుబుసం విడిచిన ‘విష నాగు’ అన్నారు. దీనికి కాంగ్రెస్ నేత హనుమంతరావు స్పందిస్తూ, అవసరం ఉన్నంతవరకు కూరలో కరివేపాకు మాదిరిగా వాడుకొని ఇప్పుడు టిజెఎసిని రద్ధు చేయమనడం ఎంతరకు న్యాయం? మరి మీరు టిఆర్‌ఎస్‌ను ఎందుకు రద్దు చేయలేదు?’’ అని ప్రశ్నించారు. 1947లో భారత స్వాతంత్య్రం తర్వాత కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన తీరునే ఇది గుర్తు చేస్తున్నది. తెలంగాణలో ప్రొఫెసర్ కోదండరామ్ లేదా జానారెడ్డి ముఖ్యమంత్రి అయితే తప్పేంటి? 2019 ఎన్నికల్లో ప్రజలు లోకేశ్‌ను ఎన్నుకుంటే అతడు ముఖ్యమంత్రి అవుతాడు లేక జగన్‌ను ఎన్నుకుంటే ఆయనే ముఖ్యమంత్రి వుతారు.
2014-15, 2015-16 సంవత్సరాల తెలంగాణ బడ్జెట్ మొత్తం రెండు లక్షల పదిహేనువేల కోట్లు. పేదలకు కాక అస్మదీయులకు ఇవి అందుతున్నాయని ఆరోపణలు. గణాంకాలతో దీనికి సమాధానం చెబితే చాలు. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రభుత్వం ఒళ్లు దగ్గరపెట్టుకొని పనులు చేస్తుంది. ఢిల్లీలోకాని, హైదారాబాద్‌లో కాని బలమైన ప్రతిపక్షం లేకపోవడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలహీన పరచే విషయం. అందులో ఏవైనా డా డాక్టర్ లక్ష్మణ్ వంటివారు చేసే విమర్శలను సహృదయంతో స్వీకరించాలి. అంతేకాని ‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడు’ అని ఎదురుదాడికి దిగడం తగదు. అంతేకాదు సీమాంధ్రలో చంద్రబాబునాయుడుపై విమర్శలు చేసే సమయంలో జగన్ సంయమనం పాటించి ఉండాల్సింది.
కాంగ్రెస్ పార్టీకి నేడు కర్ణాటకలో తప్ప మరెక్కడా అస్తిత్వం లేదు. ప్రియాంకా గాంధీని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి తిరిగి అదే కుటుంబ పాలనను వారెందుకు కోరుకుంటున్నారు? వీరికి కారత్, ఏచూరి సీతారామ్‌లు మద్దతివ్వడమేంటి? అమెరికా పర్యటనలో నరేంద్రమోదీ చేసుకున్న ఒప్పందాలను చైనా వ్యతిరేకించడం సహజం. అంతవరకు బాగానే ఉంది, మరి ఏచూరి సీతారాం చైనా అధ్యక్షుడి ప్రసంగానికి తాళం వేయడం ఏమిటి? వారు పార్టీ నడుపుతున్నది ఇండియా కోసమా? చైనా కోసమా?
భాజపా అధికారంలోకి రాకముందు కొన్ని వాగ్దానాలు చేసింది. విదేశీ ఖాతాలనుంచి డబ్బు ఇండియాకు తెప్పించి దేశ ప్రజలకు తలసరి రూ.15 లక్షలు పంచిపెడతామన్నారు. నేరస్థులను అరెస్టు చేస్తామన్నారు. మొన్నటికి మొన్న ఒక భాజపా నాయకుడిని ప్రశ్నిస్తే, ‘అరెస్టు చేస్తే వారిపై సానుభూతి పెరుగుతుంది. అందుకే ఊరుకున్నాం’ అని సమాధానం ఇచ్చారు. అయితే లలిత్ మోదీ, విజయ్ మాల్యా, భండారీ వంటి వారిని అరెస్టు చేయవచ్చు కదా. అభ్యంతరం ఏమిటి?
నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక కళా సాంస్కృతిక రంగాల్లో వౌలికమైన మార్పు లు వస్తాయని దేశ ప్రజలు ఆశించారు. కనీసం ఢిల్లీలో అక్బర్ రోడ్, ఔరంగజేబ్ రోడ్డు పేర్లలోనైనా మార్పులు చేస్తారని భావించారు. కానీ జరిగిందేమిటి? ఔరంగజేబ్ రోడ్ పేరును అబ్దుల్ కలాం పేరుగా మార్చాలని ప్రభుత్వం భావిస్తే, ఆప్ పార్టీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు వ్యతిరేకించారని మోదీ తన ప్రతిపాదన విరమించుకున్నట్టు సమాచారం. ఇదీ దేశ పరిస్థితి. ఇక బిపిన్ చంద్ర, రొమిల్లా థాఫర్‌లు రాసిన పుస్తకాలు చదివితే కన్నయ్యకుమార్‌లు, నివేదితా నాయర్‌లు పుట్టుకొస్తారు. న్యూఢిల్లీ జెఎన్‌యులో జరిగింది ఇదే.
పనామా బ్యాంక్, స్విస్ బ్యాంక్, మారిషస్ వర్జిన్ ఐలాండ్స్, దుబాయి, సింగపూర్ బ్యాంకుల్లో ఎవరెవరికి ఎంతెంత డబ్బు ఏయే బినామీ పేర్లతో ఉన్నాయో ఆ సమాచారం సిద్ధంగా ఉంది. మేం సహకరించడానికి సిద్ధం గా ఉన్నాం అంటూ స్విస్ బ్యాంకు అధికార్లు భారత ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. మరి నరేంద్ర మోదీ ఆరువందల స్విస్ ఖాతాదార్ల పేర్లను బయటపెట్టడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? ఎందుకంటే అందులో కొందరు అస్మదీయులతో పాటు, మరికొందరు గుజరాతీ అస్మదీయుల పేర్లు కూడా ఉన్నాయి కాబట్టి. బిగ్ బి దేవుడేం కాదు. అతడు గొప్ప నటుడైతే ఆయన కళను అభినందించి ఆస్వాదించండి. కాని పనామా రహస్య ఖాతాల్లో ఆయన పేరు, ఐశ్వర్యారాయ్ పేర్లు ఉన్నాయని మరువకండి. జర్మనీ పత్రిక సూడెట్స్‌చీ ఝుంటుంగ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం మొత్తం రూ.1550 లక్షల కోట్ల నల్లధనం పనామాలో ఉంది. నరేంద్ర మోదీ రచ్చ గెలిచారు. కానీ ఇంట గెలవడం ప్రశ్నార్థకంగా ఉంది. మొన్న కోహినూర్ వజ్రం ఇండియాకు తిరిగి రాబోతున్నదన్నారు. ఇవ్వాళ, రావడం కష్టమేనంటున్నారు. మరి అమరావతి నుంచి తరలించుకొని పోయిన అపూర్వ చంద్రకాంత శిలా స్తంభాలు ఇండియాకు తెప్పిచడం కోసం మోదీ, చంద్రబాబు బ్రిటిష్ ప్రభుత్వంతో ఎందుకు మాట్లాడరు?
కేంద్రం నుంచి తెలంగాణ, ఆంధ్రలకు భారీగా నిధులు అందాయి. ఇందులో ఎవరెంత దుబారా చేసారో తెలియదు. కేంద్రం సవతితల్లి ప్రేమ చూపుతున్నదని ఆరోపించడం రాజకీయ ప్రయోజనాలకేకాని, మరొకటి కాదు. ఇటు వరంగల్, అటు అమరావతి వంటి ప్రాచీన నగరాలు హెరిటేజ్ సిటీస్, స్మార్ట్ సిటీస్‌గా గుర్తింపబడి ప్రత్యేకతను నిలుపుకున్నాయి. ఐనా కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నించడం సరికాదు. ఈ పాలకుల చేతిలో మరో మూడేళ్ల సమయం ఉంది. గత రెండేళ్ల పాలన పూర్తయిన తర్వాత చంద్రబాబు, చంద్రశేఖర్‌రావు, నరేంద్ర మోదీలు ప్రజలకు ప్రోగ్రెస్ రిపోర్టులు అందించారు. ఏడాది కాకముందే బిహారు ప్రజలు నితీశ్ కుమార్, లల్లూయాదవ్‌ల జుగల్ బందీ నృత్యాన్ని చూడటానికి ఇష్టపడటం లేదు.
ఎన్నికల్లో గెలిచిన తొంభయి రోజుల్లోగా తమ ఆస్తుల వివరాలను వెల్లడించాలన్న నియమం ఉంది. చాలామంది వెల్లడించలేదు. సమాజ్ వాదీ పార్టీలో ఒక్కరు కూడా తమ ఆస్తులు వివరాలు వెల్లడించలేదు. ఇదేం సోషలిజం? ‘‘ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందే, మేము మా ఆస్తుల అఫిడవిట్ సమర్పించాం కదా. అందులో దాపరికం ఏముం ది?’ అని కొందరు సమాధానం చెబుతున్నారు. అయితే ఎన్నికైన 90 రోజుల్లోగా ఆస్తుల ప్రకటనకు సంబంధించిన నిబంధన ఉన్నదని వీరు గుర్తుంచుకోవాలి. మచ్చలేని పార్టీ అని చెప్పుకునే ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి మరీ అధ్వాన్నం. అవినీతి ఆరోపణలపై ఇటీవల కొందరు మంత్రులు తొలగింపునకు గురయ్యారు. ఇలా ఆస్తులను వెల్లడించని పార్లమెంటు సభ్యుల సంఖ్య 90కి పైగానే ఉంది.

- ముదిగొండ శివప్రసాద్