మెయన్ ఫీచర్

సర్దుబాటు లేకుంటే సిగపట్లు యథాతథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యాయమూర్తుల నియామకాల్లో, పదోన్నతుల్లో మరోమారు కేంద్ర ప్రభుత్వం అగ్నిపరీక్షను ఎదుర్కొంటోంది. ఎంత ఒత్తిడి వచ్చినా ఆచితూచి వ్యవహరిస్తోంది. సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా నియమించాల్సిందిగా మరో జాబితా కేంద్రానికి చేరింది. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. వివిధ కోర్టుల్లో లక్షలాది కేసులు పెండింగ్‌లో పడిపోవడానికి న్యాయమూర్తుల కొరత ఓ ప్రధాన కారణం. సుప్రీం కోర్టులోనూ, వి విధ హైకోర్టుల్లో ఉన్న న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. ఆ దశలోనే కొలీజియం- కేంద్ర ప్రభుత్వం సిగపట్లకు దిగుతున్నాయి. రాజ్యాంగ వ్యవస్థల మధ్య సర్దుబాటు కుదిరితే ఎలాంటి ఘర్షణ లేకుండానే సజావుగా అన్నీ జరిగిపోతాయి. ‘మాది పైచేయి అంటే మాదే పైచేయి’ అంటూ ఎవరికివారు తమ సత్తా చూపించాలనే భావన ఏర్పడినపుడు ఘర్షణ అనివార్యం అవుతుంది.
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్‌ను దోషిగా తేలుస్తూ తీర్పు ఇచ్చినపుడు ప్రపంచం యావత్తు ఆ దేశంలోని సుప్రీం కోర్టు వైపు చూసింది. ప్రభుత్వం ఒక పక్క, మిలటరీ మరో పక్క తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్న సమయంలోనూ పాక్ సుప్రీం కోర్టు సంచలన నిర్ణయాలు ప్రకటించడం చర్చనీయాంశం అయింది. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత సుప్రీం కోర్టు స్వేచ్ఛగా తన పనిని ప్రారంభించింది మొదలు అనునిత్యం సంచలన తీర్పులతో అటు శాసనవ్యవస్థనూ, కార్యనిర్వాహక వ్యవస్థలను గాడిలో ఉంచడం భారత సుప్రీంకోర్టు ప్రత్యేకతగా చెప్పవచ్చు. కార్యనిర్వాహక వ్యవస్థకు ఎప్పటికపుడు దాని పరిధిని గుర్తుచేస్తూనే, కాలానుగుణంగా చట్టాలను రూపొందించడంలో శాసనవ్యవస్థకు మార్గదర్శకంగా ఉంటూ సుప్రీంకోర్టు తన పని తాను విజయవంతంగా పూర్తి చేస్తోంది. అయితే అడపాదడపా కొన్ని కీలక కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ప్రభుత్వానికి మింగుడుపడడం లేదు. అలాంటి సందర్భాల్లో అందుకు అనుగుణమైన వివరణలతో కూడిన చట్టాలతో భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయాలు మరో సవాలుగా తయారయ్యాయి.
సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసఫ్‌ను నియమించేలా కేంద్రానికి మరోసారి సిఫార్సు చేయాలని సుప్రీం కొలీజియం రెండోమారు నిర్ణయించడంతో వివాదం అందరి దృష్టినీ ఆకర్షించింది. దేశం మొత్తం ఈపరిణామాలపై ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇందూ మల్హొత్రా, జెఎం జొసఫ్‌లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులగా నియమించాలని సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కొలీజియం జనవరిలో సిఫార్సు చేసింది. అయితే దీనిపై చాలా కాలం తర్వాత మల్హొత్రా నియామకానికి సంబంధించిన సిఫార్సులను కేంద్ర న్యాయశాఖ స్వీకరించి, ఆమెను నియమించడం, మల్హొత్రా బాధ్యతలు స్వీకరించడం జరిగిపోయింది. అయితే జేఎం జోసఫ్ నియామకం విషయంలో పున:పరిశీలించాలని కేంద్రం ఆ ఫైలును వెనక్కు పంపింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి, కొలీజియం చీఫ్ అయిన దీపక్ మిశ్రాకు కేంద్ర న్యాయశాఖామంత్రి రవిశంకర్ ప్రసాద్ ఒక లేఖ రాశారు. సుప్రీం న్యాయమూర్తిగా జోసఫ్‌ను ఎందుకు నియమించకూడదో మూడు అంశాలను ఆ లేఖలో మంత్రి ప్రస్తావించారు. ఆ లేఖలోని మూడు అంశాల్లో మొదటిది సుప్రీం కోర్టులో కేరళ నుండి ఇప్పటికే ఒక న్యాయమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది రాష్ట్రాల ప్రాతినిధ్య స్ఫూర్తికి అనుగుణం కాదు, ఇక రెండో అంశం దేశంలో సీనియారిటీ ప్రకారం చూస్తే జోసఫ్ 42వ స్థానంలో ఉన్నారు. అతని కంటే చాలామంది సీనియర్లు ఉన్నారనేది కేంద్రం వాదన. ఇక మూడో కారణం సుప్రీం న్యాయమూర్తుల్లో ప్రస్తుతం ఎస్సీ,ఎస్టీల సామాజిక వర్గాల నుంచి ఒక్కరూ లేరు. కేంద్ర మంత్రి రవిశంకర్ లేఖ అందిన తర్వాత సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయమూర్తుల్లో ఒకరైన కురియన్ జోసఫ్ స్పందించారు. ‘కొలీజియం సిఫార్సులను మరోమారు పంపిస్తాం, జోసఫ్ నియామకానికి సంబంధించిన సిఫార్లును తిప్పి పంపించే ముందు ప్రభుత్వం గత అనుభవాలను కూడా పట్టించుకోలేదనే విషయాన్ని వాస్తవాన్ని గణాంకాల ఆధారంగా తెలియజేస్తాం’ అని జస్టిస్ కురియన్ పేర్కొన్నారు.
న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఎన్‌జెఎసిని సుప్రీం కోర్టు రాజ్యాంగ విర్ధుమని పేర్కొంటూ 2015 అక్టోబర్ 16న కొట్టివేసింది. దాంతో కొంతకాలం ఎన్‌జెఎసి లేక, మరోపక్క కొలీజియం కూడా ఏర్పాటు కాక న్యాయమూర్తుల నియామకంలో కొంత జాప్యం జరిగింది. పదవీ విరమణ చేసే ముందు అప్పటి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తనకున్న రాజ్యాంగపరమైన విశేష అధికారాన్ని ఉపయోగించి కొంతమంది న్యాయమూర్తులను నియమించారు. తర్వాత కొలీజియం అందుబాటులోకి వచ్చింది. కొలీజియం సిఫార్సుల మేరకే న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలు జరుగుతున్నాయి. కొలీజియం తన సిఫార్సులను ప్రభుత్వానికి పంపడం, ప్రభుత్వం వాటిని పరిశీలించి రాష్టప్రతికి ఆమోదానికి పంపడం రివాజు. రాష్టప్రతి కార్యాలయం నోటిఫికేషన్‌ను ఇస్తుంది. తర్వాత కొత్త న్యాయమూర్తులు తమ బాధ్యతలు స్వీకరిస్తారు. సాధారణంగా కొలీజియం చేసే సిఫార్సులను తుచతప్పకుండా ప్రభుత్వం అంగీకరిస్తుంది. అంగీకరించాలి కూడా. కానీ జస్టిస్ జోసఫ్ నియామకం విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోగా, తమ నిర్ణయాన్ని పునరాలోచన చేయాలని కొలీజియంను కోరింది. కొలీజియం తమ సిఫార్సులను మరోమారు ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వం తప్పకుండా వాటిని అంగీకరించాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి అనుభవం- అర్హతలకు సంబంధించిన వివరణ ఉన్నదే తప్ప, న్యాయశాఖామంత్రి పేర్కొన్న మూడు అంశాలు గతంలో ఎన్నడూ ప్రాధాన్యత చేకూరినవి కానే కాదు.
చాలా రాష్ట్రాల నుండి ఒకరి కంటే ఎక్కువ మంది న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో ప్రాతినిధ్యం వహించారు, వహిస్తున్నారు కూడా. ఆంధ్రప్రదేశ్ నుండి జస్టిస్ ఎన్ వి రమణ, జస్టిస్ చలమేశ్వర్‌లు ఉండగా, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ ఎస్ కే కౌల్, జస్టిస్ ఏకే సిక్రీలు ఢిల్లీకి చెందినవారే కదా అనే మరో వాదన లేకపోలేదు. అలా చూసుకుంటే జస్టిస్ సి ఎ వైద్య లింగం, జస్టిస్ కేకే మాధ్యూ , జస్టిస్ వి ఆర్ కృష్ణ అయ్యార్ , జస్టిస్ వి బాలకృష్ణ, జస్టిస్ టికె తోమ్మన్ , జస్టిస్ ఎం ఫాతిమా బీవీ, జస్టిస్ కె ఎస్ పరిపూర్ణం, జస్టిస్ కే టి థామస్, జస్టిస్ కేజీ బాలకృష్ణన్, జస్టిస్ పి కే బాలసుబ్రమణియన్, జస్టిస్ సైరిక్ జోసఫ్ , జస్టిస్ కేఎస్‌పీ రాథాకృష్ణన్‌లతో పాటు న్యాయమూర్తి కురియన్ జోసఫ్‌లు సుప్రీంకోర్టులో ప్రాతినిధ్యం వహించలేదా? వీరంతా కేరళకు చెందిన వారే కదా.. అదే రీతిన గౌహతి హైకోర్టును తీసుకున్నా జస్టిస్ రంజన్ గొగాయ్, జస్టిస్ అమితవరాయ్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా లేరా? కొన్ని రాష్ట్రాల నుండి ఏకకాలంలో ముగ్గురు న్యాయమూర్తులు ప్రాతినిథ్యం వహించిన సందర్భాలున్నాయి. కేంద్ర మంత్రి లేవనెత్తిన మరో అంశం సీనియార్టీ. వాస్తవానికి కురువృద్ధులైన న్యాయవాదులు దేశంలో ఎంతో మంది ఉన్నా వారి నుండి యువ న్యాయవాదులను న్యాయమూర్తులుగా ఎంపిక చేసిన సందర్భాలు లేవా? అపుడు కేవలం సీనియార్టీనే ప్రాతిపదికగా ప్రభుత్వం తీసుకుందా? అనే ప్రశ్నకు సరైన సమాధానం లేదు. అవన్నీ కానప్పుడు జోసఫ్‌ను న్యాయమూర్తిగా నియమించడంలో కేంద్రం ఎందుకు వెనుకడుగు వేస్తోంది? ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధించడాన్ని చట్టవిరుద్ధమని జస్టిస్ జోసఫ్ చెప్పడం వల్లనే ఆయన పట్ల కేంద్రం ఇలా వ్యవహరిస్తోందా? అనే చర్చ ఎవరుదాచినా దాగనిదే. న్యాయవాదుల సంఘం ప్రతినిధి ఇందిరా జైసింగ్ సహా దాదాపు వంద మంది న్యాయవాదులు సుప్రీంకోర్టులో చెప్పేమాట అదే. 2016లో ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం చట్టవిర్ధుమని జస్టిస్ జోసఫ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు చెప్పింది. ఇదొక కారణం కావచ్చు, కాకపోవచ్చు, అయితే దానికంటే ముందే మరో సంఘటన కూడా జరిగింది. చల్లగా ఉండే పర్వతప్రాంతంలో తన శరీరం తట్టుకోవడం లేదు కనుక ఉత్తరాఖండ్ నుండి తనను బదిలీ చేయాలని ఆయన కోరారు. దానిని కొలీజియం ఆమోదించి కేంద్రానికి సిఫార్సు చేస్తూ ఆయనను హైదరాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సూచించింది. ఆ ఫైలుపై కేంద్రం ఇంత వరకూ స్పందించనే లేదు. సుప్రీంకోర్టు చరిత్రలో ఎపుడూ ఇలా జరలేదని న్యాయమూర్తులు సైతం వాపోవడంతో వ్యవహారం తీవ్రరూపాన్ని సంతరించుకుంది.
కేరళకు చెందిన జస్టిస్ కురియన్ ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు ఒక లేఖ కూడా రాశారు. కొలీజియం సిఫార్సులను కేంద్రప్రభుత్వం పెండింగ్‌లో పెట్టడం సుప్రీంకోర్టు అస్తిత్వానికే ప్రమాదకరమని అన్నారు. దీనికి కొనసాగింపు జస్టిస్ కురియన్‌తో పాటు మరో ముగ్గురు న్యాయమూర్తులు కలిసి విలేఖరుల సమావేశం నిర్వహించి సుప్రీంకోర్టులో సంఘటనలపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు స్వతంత్రతను కాపాడాలనే ఒత్తిడి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై పడిందనేది నిర్వివాదాంశం. న్యాయమూర్తుల నియామకం విషయంలో కేంద్రానికి, సుప్రీంకోర్టుకు మధ్య మాటల యుద్ధం ఈనాటిదే కాదు. ఈశాన్య రాష్ట్రాల్లో కనీసం 40 మంది న్యాయమూర్తులను నియమించాల్సి ఉంది. కొలీజియం సుప్రీంకోర్టుకు సంబంధించి మూడు పేర్లను మాత్రమే సిఫార్సు చేయడంతో దుమారం చెలరేగింది. పేర్లు ఇవ్వకుంటే హైకోర్టుల్లో న్యాయమూర్తులను ఎలా నియమించగలుగుతాం? అంటూ అటార్నీ జనరల్ ద్వారా సుప్రీంకోర్టు కొలీజియంను కేంద్రం ప్రశ్నించింది. దీంతో కొలీజియం కూడా మాటల యుద్ధానికి దిగింది. తాము గతంలో చేసిన సిఫార్సులనవు ఎంత వరకూ అమలు చేశారో చెప్పాలని నిలదీసింది. జస్టిస్ యాకుబ్ మీర్, జస్టిస్ రామలింగం సుధాకర్‌లను మేఘాలయ మణిపూర్‌ల హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులుగా నియమించమని సిఫార్సు చేశామని, దానిని ఏం చేశారో చెప్పాలని కొలీజియం ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ కురియన్ జోసఫ్‌లతో కూడిన కొలీజియం ఈ నెల 16వ తేదీ సాయంత్రం మరోమారు భేటీ అయింది. ఈ భేటీలో వచ్చిన ఏకాభిప్రాయానికి అనుగుణంగా హైకోర్టులు, సుప్రీంకోర్టులకు న్యాయమూర్తుల జాబితాను కేంద్రానికి పంపుతారు. మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇందిరా బెనర్జీ, గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ సుభాష్‌రెడ్డి, కర్నాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ దినేశ్ మహేశ్వర్‌లకు సైతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించే అవకాశం ఉంది. ఇరు వ్యవస్థలపై సమాజం విస్తృతంగా చర్చించుకునేందుకు తావివ్వని రీతిలో నియంత్రణ పాటించడంతోపాటు ఏది న్యాయం అయితే దానినే అనుసరించడమే ప్రస్తుతం అందరి ముందు ఉన్న ఏకైక పరిష్కారం.

-బీవీ ప్రసాద్ 98499 98090