మెయిన్ ఫీచర్

చేతలే ముఖ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘క్షమయా ధరిత్రి’ అనగానే నువ్వే జ్ఞాపకం వస్తావమ్మా. ఆపదలో వున్నా ఏ పనిలో వున్నా, అమ్మా అనే మాట పాటలా సాగుతూనే వుంటుంది. ఆ రోజుల్లో అమ్మతనాన్నీ, ఆడతనాన్నీ కూడా మాటల ద్వారా, పాటల ద్వారా చెప్పుకున్నా ఆనందంగా వుండేది. మా మాటలకి అమ్మ కూడా మురిసిపోయేది. ఎంత వయస్సొచ్చినా ఇంట్లో పెద్దది అమ్మ వుంటే, ఆమెకిచ్చే మర్యాదే వేరు.
అదొక పెద్దరికం, గౌరవంగా భావించేవారు. ఆనందించేవారు అమ్మలందరూ. అమ్మలేని కొరతను కోడళ్లూ కూతుళ్లూ కూడా కొరతగా భావించే వారు, బాధపడేవారు. ముఖ్యంగా మనదేశంలో మదర్స్‌డే, ఫాదర్స్‌డే అంటూ ఏమీ వుండేవి కావు. నిత్యం అమ్మ మనింట్లోనే వుంటూ, మన పన్లలో భాగం పంచుకుంటూ, పిల్లలతో ఆడుతూ పాడుతూ కథలు చెప్పే అమ్మ కనిపించే దేవతలా అనిపించేది. అమ్మ కూడా నావాళ్లూ, నా మనవలూ, నా మనవరాళ్లూ అంటూ మురిసిపోయేది.
నేడు ‘అమ్మ’లకి వృద్ధాశ్రమాల్లో నివాసాలు కల్పిస్తున్నారు పిల్లలు. మనవలూ మనవరాళ్లతో చనువుండదు. పిల్లలందరూ ఉద్యోగస్తులే అవడంతో, ఇంట్లో మాట్లాడేవాళ్లుండరు. అందరివీ న్యూక్లియర్ ఫామిలీలే కనుక, పిన్నులూ, బాబాయిలూ, అత్తయ్యలూ, మామయ్యలూ ఎవరూ వుండరు. కాకపోతే అమ్మలందరికీ ఒక సెల్‌ఫోన్ కొనిస్తున్నారు. అందరూ అన్ని విషయాలూ ఆ ఫోన్లోనే. కొత్తలో ఫోన్లో అందరితో మాట్లాడుతూ అమ్మ ఆనందాన్ని పొందుతుంది. రాను రాను ఫోను తప్ప, కంటికి కనిపించడం వుండదు.
‘అదేంటర్రా.. బొత్తిగా కనబడ్డం లేదు’ అంటే, రోజూ మాట్లాడుతూనే ఉన్నాంగా అన్ని విషయాలూ ఫోన్లో! ఇంక అక్కడికొచ్చినా ఏం మాట్లాడాలి? అంటున్నారు. ఈ సెల్లు లేనప్పుడే బాగుండేది. అప్పుడప్పుడు అందరూ వచ్చి కనబడుతూ వుండేవారు అని వాపోతోంది అమ్మ. తన వాళ్లని తన చుట్టూ తిరుగుతూంటే చూసి ఆనందించే అవకాశాన్ని కోల్పోయి, ఏదో గొంతు విని సంతోషించడం, తట్టుకోలేకపోతోంది.
కాస్త అనారోగ్యం పాలయితే చాలు.. ఎలా ఎలా అంటూ వృద్ధాశ్రమాల అడ్రస్సుల కోసం దేవుళ్లాడుతున్నారు. అక్కడ చేర్పించేసి, వారానికో పదిహేను రోజులకో ఒకసారి, ఒక పండో కాయ తీసుకుని వెళ్లి ఆమె చేతిలో పెట్టి చేతులు దులుపుకుంటున్నారు.
ప్రతీవారూ ఈ రోజున అమ్మతనాన్నీ, ఆమె గొప్పతనాన్ని గూర్చి కథలూ, కవితలూ, వ్యాసాలూ రాసేస్తున్నారు. ఆమెని దేవతనుచేసి వర్ణించేస్తున్నారు. కానీ,
అమ్మని తాము ఎంతవరకు సంతోషపెడుతున్నామని ఆలోచించట్లేదు. ఆమెని దేవతను చేసి స్తుతించక్కర్లేదు. ఒక మామూలు మనిషిగా గౌరవించండి. ఆమె పొంగిపోతుంది. ఆమె ఆశీర్వచనం, అభిమానం, ఆప్యాయత అన్నింటికన్నా గొప్పది అని గ్రహిస్తే చాలు. ఆమె చిన్న చిన్న కోరికలని తీర్చుతూ సంతోషంగా వుంచితే చాలదూ? తన శక్తినంతా ధారపోసి నడిపించిన అమ్మ, బతుకు బాటలో ఎలా నడుచుకోవాలో నడత నేర్పించిన అమ్మ, మన అభివృద్ధికోసం పాటుపడి, మనం బాగుంటే చూసి గర్వపడుతూ, ఆనందించే అమ్మని అనాథని చెయ్యకండి. ఆదిరంచండి, అభిమానించండి. అది ఆమెకీ, మీకూ, ఇంటిల్లిపాదికీ సౌభాగ్యం.. సంతోషం!

-శారదా అశోకవర్థన్