మెయన్ ఫీచర్

జమిలి ఎన్నికలకు అవరోధాలెన్నో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ఏడాది జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై రాజకీయ పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఆచరణ సాధ్యమేనా? అనే అంశంపై ‘లా కమిషన్’, కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయి. లోక్‌సభ, అసెంబ్లీలకు ఎన్నికలు ఒకేసారి జరపాలంటే రాజ్యాంగ పరమైన సమస్యలు తలెత్తుతాయని ‘లా కమిషన్’ ప్రకటించడమే కాకుండా దీనికి కొన్ని పరిష్కార మార్గాలను కూడా సూచించింది. ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, వివిధ సంస్థల నుంచి అభిప్రాయాలను సైతం సేకరించింది. ఈ గడువు ఈనెల 8వ తేదీతో ముగిసింది.
‘లా కమిషన్’ ప్రతిపాదనల ప్రకారం లోక్‌సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే ఐదు రాజ్యాంగ సవరణలు అవసరం. రాజ్యాంగంలోని 83, 85, 172, 174, 356 అధికరణలతో పాటు పదవ షెడ్యూల్‌కు కూడా సవరణలు చేయాలని ప్రతిపాదించారు. ‘ప్రజాప్రాతినిధ్య చట్టం-1951’కు సైతం సవరణలు చేయాల్సి ఉంటుంది. ఈ సవరణలు సంక్లిష్టతతో కూడుకున్నవి. న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా భావిస్తున్నారు. రాజ్యాంగం వౌలిక స్వభావాన్ని సవరణల ద్వారా పార్లమెంటు మార్చలేదని ‘కేశవానంద భారతి వర్సెస్ కేరళ-1973’ కేసులో 13మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కొన్ని రాజ్యాంగ సవరణల వల్ల ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతింటుందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.
లోక్‌సభకు 2019 జూన్‌లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఆ గడువులోగా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే శాసనసభలకు ఎన్నికలు జరపాల్సి ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు 2019 జనవరిలోగా ఎన్నికలు జరగాలి. ఈ మూడు రాష్ట్రాలకు 2019 జూన్‌లోగా లోక్‌సభతో పాటు ఎన్నికలు నిర్వహించాలంటే వీటి గడువును ఐదు నెలలు పెంచాలి. లోక్‌సభతో పాటు ఎన్నికలు జరపాలంటే ఝార్ఖండ్ అసెంబ్లీ కాలపరిమితిని ఏడు నెలలు, హర్యానా అసెంబ్లీ కాలపరిమితిని ఐదు నెలలు, మహారాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితిని ఐదు నెలలు, న్యూఢిల్లీ అసెంబ్లీ కాలపరిమితిని ఎనిమిది నెలలు తగ్గించాలి. ఏ శాసనసభకైనా కాలపరిమితి ఐదు సంవత్సరాలే. వాటి కాలపరిమితిని కుదించాలంటే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాలి. మిగిలిన రాష్ట్రాల సంగతి చూస్తే- గోవా అసెంబ్లీ 2022 మార్చి, గుజరాత్ 2023 జనవరి, హిమాచల్ ప్రదేశ్ 2023 జనవరి, కర్నాటక అసెంబ్లీ 2023, మణిపూర్ అసెంబ్లీ 2022 మార్చి, మేఘాలయ 2023 మార్చి, నాగాలాండ్ 2023 మార్చి, పంజాబ్ 2022 మార్చి, త్రిపుర 2023 మార్చి, ఉత్తరాఖండ్ 2022 మార్చి, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ 2022 మే, పశ్చిమబెంగాల్ 2021 జూన్, పుదుచ్ఛేరి 2021 జూన్ వరకు కాలపరిమితి ఉంది.
స్వాతంత్య్రం వచ్చాక మొదటి రెండు దశాబ్దాల పాటు అంటే- నాలుగు సార్లు అసెంబ్లీలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 1952 నుంచి 1967 వరకు ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత దేశ రాజకీయ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యాన్ని, నియంత్రృత్వ ధోరణులను వ్యతిరేకిస్తూ ఉత్తర, దక్షిణ భారతంలో అనేక పార్టీలు పుట్టుకొచ్చాయి. ఈ పార్టీలు కాంగ్రెస్ వ్యతిరేకంగా సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. ఈ సంకీర్ణ ప్రభుత్వాలను కాంగ్రెస్ తొక్కేయడానికి చూసింది. రాజ్యాంగంలోని 356వ అధికరణ ప్రయోగించి ఆ ప్రభుత్వాలను రద్దు చేసింది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా 1977లో జనతాపార్టీ అధికారంలోకి వచ్చి కొన్నాళ్లకే ముక్కలైంది. కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు ప్రాంతీయ పార్టీలు వచ్చాయి. తమిళనాడులో ద్రవిడ పార్టీలు, ఉమ్మడి ఆంధ్రలో టిడిపి, ఉత్తరాదిన లోక్‌దళ్, జనతాదళ్, బీజేపిల హవా సాగింది.
కేంద్రంలో ఏ పార్టీకి మెజారిటీ దక్కకపోవడంతో 1989 నుంచి 2014 వరకు సంకీర్ణ ప్రభుత్వాల యుగం నడిచింది. 2014 ఎన్నికల తర్వాత భాజపా ఆధిపత్యం ప్రారంభమైంది. ప్రస్తుతం లోక్‌సభతో పాటు అసెంబ్లీలకు ఏకకాలంలో రెండు దశల్లో నిర్వహించాలని కేంద్రం ఆదేశాల మేరకు ‘లా కమిషన్’ ప్రతిపాదించింది. కొన్ని అసెంబ్లీల కాలపరిమితిని పెంచడం, మరి కొన్నింటికి కాలవ్యవధిని తగ్గించి 2019లో ఒకసారి, రెండవ సారి 2024 లోక్‌సభ ఎన్నికలతో ఏకకాలంలో నిర్వహించాలనే ప్రతిపాదన చేసింది.
చట్టసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉంటుందని, ఎన్నికల నిర్వహణ వ్యయం తగ్గుతుందంటారు. తరచూ ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల కోడ్ అమలులోకి రావడం, దీని వల్ల అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు సజావుగా అమలు జరగడం లేదన్న వాదన ఉంది. ఒకేసారి ఎన్నికలు జరిగితే కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీకి ప్రజలు అధికారం అప్పగిస్తే- అభివృద్ధి వేగవంతమవుతుందన్న భావం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వస్తుసేవా పన్ను (జీఎస్టీ) అమలు చేస్తున్నారు. రాజ్యాంగ సవరణ ద్వారానే ఇది సాధ్యమైంది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, సుపరిపాలన అందించడమే లక్ష్యమైతే రాజ్యాంగ సవరణలు చేయడం సులువే. ప్రస్తుతం దేశంలో ఎక్కడో ఒక చోట ప్రతి ఏడాదీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి ఎన్నికలోనూ గెలవాలని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తాయి. ఈ ఎన్నికల్లో ఓటమి చెందితే కేంద్రం లేదా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేక ప్రభంజనం మొదలైందనే వాదనల వల్ల అధికారంలో ఉన్న పార్టీలు పరిపాలనను సక్రమమంగా అందించడంలో విఫలమవుతున్నాయి. దీనికి తోడు ప్రతిపక్ష పార్టీలు కూడా ఒక ఎన్నికలో గెలిచిన వెంటనే ఇక అధికారంలోకి రావడం తథ్యమంటూ కేంద్రం లేదా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలపై నిందలు వేయడం పనిగా పెట్టుకుంటున్నాయి. పైగా అధికార యంత్రాంగం కూడా అధికారంలో ఉన్న పార్టీల మాట వినే ప్రసక్తి ఉండదు. మరో మూడేళ్ల పాటు అధికారంలో ఉండాల్సిన ప్రభుత్వం, ఒక ఎన్నికల్లో ఓటమి చెందిన వెంటనే ఆ పార్టీ పనైపోయిందనే నిర్లక్ష్యంతో అధికారులు వ్యవహరిస్తున్నారు.
లా కమిషన్ సిఫార్సుల మేరకు, కేంద్రం అన్ని కసరత్తులను చేసి రాజ్యాంగ సవరణలు చేసినపుడే- లోక్‌సభ, అసెంబ్లీలకు ఏక కాలంలో ఎన్నికలు మహా అయితే ఒక సారి నిర్వహించగలదేమో. విలక్షణమైన రాజకీయ పార్టీలు, కులాలు, మతాలు,వర్గ్ధాపత్యాల వల్ల ప్రజలు గంపగుత్తగా ఒక పార్టీకి అధికారాన్ని కట్టబెడుతారని ఆశిస్తే పప్పులో కాలేసినట్లే. ఒకేసారి ఎన్నికల వల్ల ‘జాతీయ భావం, జాతీయ సమగ్రత, ఒకే జాతి-ఒకే ఎన్నికలు’ అనే నినాదాలు ఆకర్షణీయంగానే కనపడుతాయి. ఉదాహరణకు తాజాగా కర్నాటకలో బీజేపీ ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించింది. జేడీఎస్, కాంగ్రెస్, బీజేపి మధ్య ముక్కోణపు పోటీ జరిగింది. ఎవరి అజెండా వారిదే. కాని చివరికి ఏమైంది? బీజేపీని అధికారానికి దూరంగా పెట్టేందుకు కాంగ్రెస్,జేడీఎస్‌లు ఒకటయ్యాయి. ఈ ప్రభుత్వం ఐదేళ్లు ఉంటుందా? రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు పతనమైతే, మళ్లీ మధ్యంతర ఎన్నికలు వస్తాయి. మళ్లీ లోక్‌సభతో పాటు ఆ రాష్ట్రానికి ఎన్నికలు జరగవు. లోక్‌సభలో 20 ఏళ్ల తర్వాత బీజేపీకి మెజార్టీ వచ్చింది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి మెజార్టీ వస్తుందా? సంకీర్ణ ప్రభుత్వం వస్తే ఐదేళ్ల పాటు ఉంటుందా? అన్ని పార్టీలు ఏకత్రాటిపైకి వస్తే బీజేపీ పరిస్థితి ఏమిటి ? ఈ ప్రశ్నలకు రాజ్యాంగ సవరణలు జవాబు ఇవ్వవు.
రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీల కాలపరిమితిని పెంచడమో లేక ఈ రాష్ట్రాలతో పాటు లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించే నిర్ణయం బీజేపీ తీసుకోగలదా ? జనవరిలోనే ఎన్నికలంటే తెలంగాణలో తెరాస, ఏపీలో తెదేపా ప్రభుత్వాలు ఒప్పుకునే పరిస్థితులు లేవు. పైగా మన దేశంలో రాజకీయ పార్టీల మధ్య సయోధ్య తక్కువ. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా లోక్‌సభ, అసెంబ్లీలకు ఏక కాలంలో ఎన్నికలన్న ప్రతిపాదన మంచిదైనా, ఆచరణలో అనేక సవాళ్లు ఎదురవుతాయి. ప్రజలు ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక పార్టీకి మెజార్టీ ఇస్తారనే నమ్మకం ఏ రాజకీయ పార్టీకైనా ఉందా? . ప్రజలు గంపగుత్తగా ఒకే పార్టీకి ఓట్లు వేస్తారని చెప్పలేం. లోక్‌సభకు,అసెంబ్లీలకు ఏక కాలంలో ఎన్నికలు జరిగితే రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు ఖర్చు తగ్గుతుంది. ఎక్కువ కాలం అభివృద్ధిపై పాలకులు దృష్టి పెట్టేందుకు ఆస్కారం ఉంటుంది. ఒకేసారి ఎన్నికలు జరిగితే భద్రతా దళాలు, పోలీసులు శాంతిభద్రతలపై దృష్టి సారించే వీలుంటుంది. జాతీయ పార్టీల పెత్తనం పెరుగుతుంది. ప్రాంతీయ పార్టీల మనుగడకు ప్రమాదం వాటిల్లుతుందనే అభిప్రాయం కూడా ఉంది.

-కె.విజయ శైలేంద్ర 98499 98097