మెయన్ ఫీచర్

ఆసక్తి కలిగిస్తున్న అమెరికా ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికలు సహజంగానే ప్రపంచం అంతటా ఆసక్తి కలిగిస్తుంటాయి. సంవత్సరం పైగా జరిగే ఈ ప్రక్రియ కలిగించే ఆసక్తి బహుశా మరే దేశాధినేత ఎన్నిక కలిగించదు. అయితే ఈ సంవత్సరం జరుగుతున్న ఎన్నికలు తీవ్రమైన అలజడిని కలిగిస్తున్నాయి.
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి రోనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ల మధ్య పోటీ జరుగనున్నది. గత ఏడాది తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పుడు ఆమెకు పోటీపడగలవారు దాదాపు ఆమె పార్టీలోనే కాకుండా ప్రత్యర్థి పార్టీలో కూడా ఎవరూ లేరనే అభిప్రాయం కలిగింది. అయితే ఆలస్యంగా పోటీలోకి వచ్చినా ట్రంప్ అనూహ్యమైన సంచలనాలు సృష్టిస్తున్నారు. దూకుడుగా ఆయన చేస్తున్న ప్రచారాన్ని ప్రత్యర్థులతో పాటు మద్దతుదారులు కూడా ఖండిస్తున్నారు. ఆయన ఎన్నికైతే తాము దేశం వదలి వెళ్లిపోతామని చాలామంది ప్రకటిస్తున్నారు.
దేనికైనా సరే అంతుతేల్చాసిందే అన్న రీతిలో సాగుతున్న ఆయన ప్రసంగాలు ఒక విధంగా పలువురిలో భయం కలిగిస్తున్నాయి. ముస్లింలు, మెక్సికన్‌లపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు సంచలనాలకు దారితీస్తున్నాయి. ఆయన గెలిస్తే తాము ఇతర దేశాలకు వెళ్లిపోదామనుకుంటున్నామని 28 శాతం మంది అమెరికన్లు తెలిపినట్టు ఒక సంస్థ జరిపిన సర్వేలో వెల్లడైంది. దీనికి మరింత బలం చేకూర్చే విధంగా ఏడు రిపబ్లికన్ రాష్ట్ర ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన రోజున, తాము కెనడాకు ఎలా వెళ్లగలమని ఎక్కువశాతం అమెరికన్లు సెర్చ్ చేసినట్టు గూగుల్ ప్రకటించింది.
మొదట్లో తనకు పోటీ వచ్చేవారు లేరనుకున్న హిల్లరీకి సొంత పార్టీలోనే బెర్ని సాండర్స్ నుండి తీవ్రమైన పోటీ ఎదురైంది. ఆయన్ను ఎదుర్కొని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా నిలబడినా, ప్రత్యర్థి ట్రంప్ నానాటికీ బలం పెంచుకోవడం ఆమెకు పెద్ద సవాలు. ఒక దశలో ప్రజాదరణ విషయంలో హిల్లరీని మించిపోవడం కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ముస్లింలు, వలసవచ్చే వారికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్న ట్రంప్ హిల్లరీని కూడ వదలడం లేదు. వారిద్దరి మధ్య జరుగుతున్న విమర్శలు, ప్రతి విమర్శలు స్థాయిని మరచి జరుగుతున్నాయి. గత సాంప్రదాయాలకు విరుద్ధంగా అమెరికా అధ్యక్షుడు, బరాక్ ఒబామా సైతం బహిరంగంగా ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. హిల్లరీ భర్త, మాజీ దేశాధ్యక్షుడు బిల్ క్లింటన్‌ను రేపిస్ట్ అంటూ ట్రంప్ నిందించారు. అభివృద్ధి చెందిన అమెరికా స్థాయిని, చైనా ముందు దిగజార్చిన ‘అవివేకి’ ఒబామా అంటూ అధ్యక్షుడిని నిందించారు.
అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్ తగిన వ్యక్తికాడని అంటూ ఆయన సామర్ధ్యాలపై హిల్లరీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రేట్ బ్రిటన్‌ను నిందించడం, అమెరికాపై క్షిపణులు ఎక్కుపెడతానంటున్న ఉత్తరకొరియాను ప్రశంసించడం, నాటోలో అమెరికా సభ్యత్వాన్ని ప్రశ్నించడం వంటి బాధ్యతా రహిత వ్యాఖ్యలతో ట్రంప్ దేశానికి ప్రమాదకారి కాగలడని హిల్లరీ హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దేశ ప్రజలు రెండు శిబిరాలుగా విడిపోతున్నారు. శే్వత వర్ణులు పెద్ద సంఖ్యలో ట్రంప్‌కు మద్దతు తెలుపుతుండగా, నల్లజాతివారు ఇతర దేశాలనుండి వలస వచ్చిన వారు హిల్లరికీ అండగా ఉంటున్నారు. ఒక తాజా న్యూస్ సర్వే ప్రకారం హిల్లరీకి మద్దతు 48 నుండి 45 శాతానికి తగ్గింది.
ట్రంప్ పట్ల మహిళల్లో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అందుకనే మగవారి అభ్యర్థిగా ప్రచారం పొందుతున్నారు. అమెరికా ఓటర్లలో 51శాతం మంది మహిళా ఓటర్లు ఉండడమే కాకుండా, సాధారణంగా మగవారికన్నా 10 శాతం ఎక్కువగా ఉన్న మహిళలు ఓటింగ్‌లో పాల్గొంటారు. అందుకనే అధ్యక్ష పదవికి నెగ్గాలంటే మహిళా ఓటర్లు కీలకం. ప్రస్తుతం వారిలో హిల్లరీపట్ల మొగ్గు కనిపిస్తున్నది.
తనపై మహిళా వ్యతిరేకి అనే ముద్రను చెరిపి వేసుకోవడానికి ట్రంప్ ఎంతో కృషి చేస్తున్నారు. గతంలో మిస్ యూనివర్స్ పోటీలు నిర్వహించడం, ముగ్గురు భార్య లు ఉండడమే కాకుండా ఇప్పుడు వ్యాపారంలో తనకు కుడిభుజం కూతురు అంటూ ఇవన్నీ గుర్తు చేస్తున్నారు. అయినప్పటికీ ఆయన మద్దతు దార్లలో మహిళలు పెద్దగా కనిపించడం లేదు.
ఈ సందర్భంగా అనాలోచితంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సైతం ఇబ్బంది కలిగిస్తున్నాయి. అయినప్పటికీ రాష్ట్రాల్లో శే్వతవర్ణుల వారే ఎక్కువగా మద్దతు తెలుపుతున్నారు. రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికలలో మగవారి మద్దతుతో నెట్టుకొచ్చినా, సాధారణ ఎన్నికల్లో మహిళల మద్దతు లేకుండానే నెట్టుకు రావడం సాధ్యం కాదు. అయితే రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థులలో చివరిగా మహిళా ఓటర్ల మద్దతును 1988లో జార్జ్ బుష్ మాత్రమే సాధించగలిగారు. తల్లులకు భద్రత కల్పిస్తానని ఆయన ఇచ్చిన హామీ అందుకు కారణం.
మహిళల్లో 43 శాతం మంది మాత్రమే ట్రంప్ అభ్యర్థిత్వానికి ఆమోదం తెలుపుతున్నట్లు గత డిసెంబర్‌లో ఒక సర్వే తెలిపింది. మార్చి 24న, సిఎన్‌ఎన్ జరిపిన సర్వేలో 73 శాతం మంది మహిళలు ఆయన అభ్యర్థిత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. ఒక దశలో ఫ్రాన్స్‌కు చెందిన యాంకర్‌ను విమర్శించడం పెద్ద దుమారమే సృష్టించింది. అదేవిధంగా ‘‘నా వైవాహిక జీవితంలో సంతోషంగా లేనిపక్షంలో నా కుమార్తె అందం చూడండి’’ అంటూ కూతురుపై చేసిన వ్యాఖ్యలు ఆయనకు సానుభూతి కలిగించడం లేదు.
ఇన్ని ప్రతిబంధకాలు, వ్యతిరేకతల మధ్య రోజురోజుకూ తన మద్దతును పెంచుకుంటూ పోవడం వెనుక ట్రంప్ వ్యూహం అర్థంకాకుండా ఉంది. ఆయన చేస్తున్న వివాదాస్పద ప్రకటనలు, హెచ్చరికలు ఎంతమందిని శత్రువులుగా మారుస్తున్నాయో, అంతమందిని మద్దతు దారులుగా కూడా మారుస్తున్నట్టు కనిపిస్తున్నది.
ట్రంప్-హిల్లరీల మధ్య ప్రస్తుతం నువ్వా నేనా అన్నట్టు తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. నవంబర్‌లో అసలు ఎన్నికలు జరిగే సమయానికి ఈ పోటీ ఎటువైపునకు దారితీస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టం. హిల్లరీ క్లింటన్ అధ్యక్ష అభ్యర్థిగా సొంత పార్టీ మద్దతుకోసం బయలుదేరినప్పుడు విదేశాంగ కార్యదర్శిగా ఆమె రహస్య సందేశాలను సొంత మెయిల్ నుండి పంపుతుండడం పెద్ద దుమారం రేపింది.
అదేవిధంగా ఆమె కుటుంబ ఫౌండేషన్‌కు సేకరించిన విరాళాలు, ఆమె కుటుంబ వ్యాపార ప్రయోజనాలు సహితం వివాదంగా మారాయి. అయితే ట్రంప్ రంగంలోకి వచ్చిన తర్వాత చర్చ అంతా ఆయనపైకి మరలుతోంది. గత ఆరు అమెరికా అధ్యక్ష ఎన్నికల సరళిని పరిశీలిస్తే, 31 రాష్ట్రాలు నికరంగా రెండు ప్రధానపార్టీలు ఏదో ఒక పార్టీకి మద్దతుగా ఉండిపోతూ వస్తున్నాయి. అందుచేత మిగిలిన రాష్ట్రాలలోని ఓట్లు అభ్యర్థుల జయాపజయాలను నిర్ణయించే అవకాశం ఉంది. ప్రైమరీ ఎన్నికల్లో ఈ రాష్ట్రాలు ఇరు పార్టీలకు హోరాహోరీగా మద్దతు కనిపిస్తున్నది. ఏ పార్టీకి చెప్పదగిన ఆధిక్యత కనిపించడం లేదు.
దానితో ఎన్నికల ఫలితాలపై ఇప్పుడే ఊహాగానాలు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికలకు మరో ఆరు నెలల వ్యవధి ఉండడంతో ప్రజాభిప్రాయం సహితం ఎటయినా మారే అవకాశముంది. అందుకనే ట్రంప్ హిల్లరీ ప్రచార కర్తలు ఉత్కంఠతతో ఎత్తుగడలను రూపొందించుకుంటున్నారు. ప్రైమరీ ఎన్నికలు పూర్తయిన తరువాత రెండు పార్టీల మద్దతు దారులు ప్రత్యర్థులకు ఓటు వేసే అవకాశం లేకపోలేదు. రిపబ్లికన్ పార్టీకి చెందిన పలువురు ఇప్పటికే ట్రంప్ అభ్యర్థి అయితే తాము ఓటు వేయబోమని ప్రకటించారు.
ప్రస్తుతం అమెరికా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. గతం లో విదేశాంగ మంత్రిగా పనిచేసిన హిల్లరీ క్లింటన్ యుద్ధోన్మాద ధోరణులను ప్రదర్శించారు. భారత, పాకిస్తాన్‌ల మధ్య ఆమె దాగుడుమూతలు ఆడారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో రిపబ్లికన్‌లదే ఆధిక్యత ఉన్నది. అందుకనే అమెరికా ఎదుర్కొంటున్న కీలక సమస్యల పరిష్కారానికి సాహసోపేత నిర్ణయాలు తీసుకొని అమలు పరచాలంటే రిపబ్లికన్ అభ్యర్థి గెలుపొందడం అవసరం అని ఒక వాదన వినిపిస్తున్నది.
గతంలో ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికాలో పర్యటించకుండా వీసాను నిరాకరించిన బృందంలో హిల్లరీ సైతం ప్రముఖంగా ఉన్నారు. అదేవిధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇబ్బందులు సృష్టిస్తున్న పలువురు ఎన్‌జిఓలతో హిల్లరీకి మంచి సంబంధాలున్నాయి. వాటికి నిధుల సమీకరణలో ఆమె పాత్ర కూడా ఉన్నది. అయితే అధ్యక్ష పదవికి ఆమె ఎన్నిక కాగలిగితే ఇటువంటి సమస్యలు భారత-అమెరికా సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉండనవసరం లేదు. ఆమె ప్రాధాన్యతలు సైతం మారే అవకాశం ఉంటుంది. వలసలపై ట్రంప్ కఠినంగా మాట్లాడడం అమెరికాలోని యువతను ఆకట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. పలు సందర్భాల్లో ఆయన నోటి దురుసుతనం ఆయన్ను వివాదాస్పదుడిగా మారుస్తున్నది. హిల్లరీ క్లింటన్ బలమైన వ్యక్తిత్వాన్ని ఎదుర్కొనడానికి ట్రంప్ మరింతగా కష్టపడాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ, హిల్లరీ క్లింటన్‌కు మద్దతు క్రమంగా పెరిగే అవకాశాలు లేకపోలేదు. భారత్ విషయానికి వస్తే, మారిన అమెరికా వైఖరి నేపథ్యంలో ఏ పార్టీ వారు అధికారంలోకి వచ్చినా ఒబామా ప్రభుత్వం అనుసరించిన సానుకూల వైఖరే కొనసాగే అవకాశముంది. ఆసియాలో చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవాలంటే భారత్ మాత్రమే సరైన దేశం. అందుకని ఎవరు అధికారంలోకి వచ్చినా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమెరికా విదేశాంగ నీతిలో ప్రస్తుతం భారత్‌కు ఇస్తున్న ప్రాధాన్యత ఇదేవిధంగా కొనసాగుతుందని చెప్పవచ్చు.

చిత్రాలు డోనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్

- చలసాని నరేంద్ర