ఎడిట్ పేజీ

‘కర్నాటకం’తో రాహుల్‌లో కొత్త జోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుష్కర కాలంగా పదవుల వెంట పడకుండా, ఒక నాయకుడిగా ఎదగడానికి రాహుల్ గాంధీ చేసిన ప్రయత్నం బహుశా వర్తమాన భారత రాజకీయ చరిత్రలో మరే నాయకుడు చేయలేదని చెప్పవచ్చు. ఆయన ఎక్కడ ప్రచారం చేసినా అక్కడ తన పార్టీకి విజయం సాధించి పెట్టలేక పోయారు. కాంగ్రెస్ విజయం సాధించిన పంజాబ్ వంటి చోట్ల ఆయన పరిమితమైన పాత్రే పోషించారు. మూడేళ్లపాటు తాత్సారం చేశాక రాహుల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత కర్నాటక ఎన్నికలు సైతం నిరాశనే మిగిల్చాయి. నాలుగు నెలల పాటు ఆయన తీవ్రంగా ప్రచారం చేసినా, కర్నాటకలో కాంగ్రెస్ బలం 124 సీట్ల నుండి 78 సీట్లకు తగ్గింది. దీంతో ఇక 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రేక్షక పాత్ర వహించవలసిందేనని అందరూ అంచనావేస్తూ వచ్చారు.
అయితే, అనూహ్యంగా రాహుల్ ప్రదర్శించిన రాజకీయ చతురత దేశంలో తిరుగులేని నేతగా గుర్తింపు పొందిన ప్రధాని నరేంద్ర మోదీకి దిమ్మ తిరిగేటట్లు చేసింది. పోలింగ్ కన్నా ముందే కర్నాటకలో తన పార్టీ ఓటమి ఖాయమని గుర్తించిన రాహుల్ భాజపాకు అధికార పగ్గాలు దక్కకుండా పకడ్బందీగా వ్యూహం రూపొం దించారు. ఓట్ల లెక్కింపునకు ముందే జేడీ ఎస్ నేతలు కుమారస్వామి, దేవెగౌడలతో మంతనాలు జరిపి, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ఒప్పించారు. కర్నాటకలో ఓట్ల లెక్కింపు రోజున మధ్యాహ్నం వరకూ తమకే ఆధిక్యం అంటూ బిజెపి నేతలు సంబరాలు జరుపుకోవడం ప్రారంభించారు. తమ ఖాతాలోకి 21వ రాష్ట్రం వచ్చిందంటూ ఆనందపడిపోయారు. అదే సమయంలో కుమారస్వామిని ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రతి పాదించడం, జేడీఎస్ ఒప్పుకోవడంతో బీజేపీ నేతలు షాక్‌కు గురయ్యారు. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కుమారస్వామిని ప్రోత్సహించిన నేతలలో మమతా బెనర్జీ, మాయావతి, సీతారాం ఏచూరి వంటి వారున్నారు. కేవలం 37 సీట్లు గెల్చుకొని, 140 సీట్లలో డిపాజిట్‌లు కోల్పోయిన కుమారస్వామి ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండగా- 13 జాతీయ, ప్రాంతీయ పార్టీల అగ్రనేతలు హాజరు కావడం ఒక విధంగా భారత రాజకీయాలలో వినూత్న పరిణామం అని చెప్పవచ్చు. కుమారస్వామి పట్ట్భాషేకాన్ని సాకుగా తీసుకొని మోదీకి వ్యతిరేకంగా జతకట్టేందుకు ఆరాటపడుతున్న నేతలంతా వేదికను పంచుకున్నారు. 1996 తర్వాత బిజెపికి వ్యతిరేకంగా ఇంతమంది నాయకులు ఒకచోట గుమికూడటం కూడా ఇదే కావడం గమనార్హం.
బిజెపి ప్రధాని అభ్యర్థిగా మోదీని ప్రకటించిన తర్వాత ఆయనకు వ్యతిరేకంగా ఇన్ని పార్టీల నాయకులు స్వరం కలపడం కూడా బెంగుళూరులోనే జరిగింది. అదే సమయంలో లోక్‌సభలో బిజెపి మైనారిటీలో పడిపోయే పరిస్థితులు మోదీకి ప్రతికూలంగా మారుతున్న సంకేతాన్ని ఇస్తున్నాయి. 1984 తర్వాత లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీ పొందిన పార్టీగా 282 మంది సభ్యులతో 2014లో బిజెపిని మోదీ నిలిపారు. కర్ణాటకకు చెందిన ఎంపీలు యడ్యూరప్ప, శ్రీరాములు ఇటీవల రాజీనామా చేయడంతో లోక్‌సభలో బీజేపీ బలం 271కి తగ్గిపోయింది. ఇప్ప టివరకు జరిగిన ఉపఎన్నికల్లో ఆరు సీట్లను బీజేపీ కోల్పోగా, ఆ పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు మరణించడంతో ఆ స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. దీంతో 543 మంది సభ్యులున్న లోక్‌సభలో కనీస మెజారిటీ అయిన 272 సీట్లకు బీజేపీ ఒక స్థానం దూరంలో (271) ఉంది. బిహార్‌కు చెందిన కీర్తీ ఆజాద్‌ను భాజపా సస్పెండ్ చేసింది. అదే రాష్ట్రానికే చెందిన శత్రుఘ్న సిన్హా అనునిత్యం మోదీకి వ్యతిరేకంగా అసమ్మతి గళం వినిపిస్తున్నారు. యూపీకి చెందిన ఎంపీ సావిత్రీ బాయి సైతం దళితుల పట్ల కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. లోక్‌సభలో బీజేపీ ఎంపీల సంఖ్య తగ్గినప్పటికీ ఇప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ముప్పేమీ లేదు. ఎన్డీయేలోని భాగస్వామ్య పక్షాల మద్దతుతో ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉంది. అయితే బీజేపీ గతంలో వలే మిత్రపక్షాల పట్ల నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శింపలేదు. ఇటువంటి సమయంలో జాతీయ, ప్రాంతీయ పక్షాలు బిజెపికి వ్యతిరేకంగా స్వరం కలపడం, 2019 ఎన్నికలలో బిజెపికి వ్యతిరేకంగా ఒకే అభ్యర్థిని పోటీకి దింపాలని ఆలోచనలు చేస్తుండటం మోదీకి కలవరం కలిగించే అంశమే. అందుకు రాహుల్ గాంధీ కేంద్రబిందువు కావడం గమనార్హం.
వాస్తవానికి కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రాహుల్ ప్రదర్శించిన చొరవ కారణమైనప్పటికీ, ఆయన పేరును ప్రస్తావించడానికి ప్రాం తీయ పక్షాల నేతలు ఎవ్వరూ ఇష్టపడటం లేదు. వారంతా కుమారస్వామి, దేవగౌడలను అభినందించారు గాని రాహుల్ పేరు ప్రస్తావించలేదు. ప్రమాణస్వీకార వేదికపై కనిపించిన నేతలు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉన్నవారే. మమతా బెనర్జీని సీపీఎం నేత సీతారాం ఏచూరి పలకరించినా వారిద్దరి పార్టీలు బెంగాల్‌లో కలసి అడుగులు వేయలేవు. తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాహుల్ భుజంపై చేయి వేసినా, తన రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మిత్రపక్షంగా చూడలేరు. అలాగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా కాంగ్రెస్‌తో కలవలేరు. ఎన్డీయే నుండి వైదొలిగిన తర్వాత తొలిసారిగా చంద్రబాబు ప్రతిపక్షాల వేదికపై కనిపించారు, ప్రాంతీయ పక్షాల, వామపక్షాల నేతలతో మంతనాలు జరిపా రు. ఇదంతా చూస్తుంటే బిజెపికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో క్రియాశీలకంగా వ్యవహరించడానికి ఆయన సిద్ధపడుతున్నట్లు స్పష్టమవుతున్నది. మొదటగా, బిజిపేతర సీఎంల సదస్సును ఢిల్లీలో ఏర్పాటు చేయనున్నారు. బెంగళూరు వేదికపై కనిపించిన నేతలు- అవసరమైతే కాంగ్రెస్ మద్దతుతో తాము అందలం ఎక్కడానికి సిద్ధప డతారేమో గాని రాహుల్ గాంధీకి నాయకత్వ బాధ్యత అప్పచెప్పడానికి సుముఖత చూపరు. ఆయా పార్టీల పరిమితులు తెలిసినవే కావడంతో రాహుల్ వ్యూహా త్మకంగా ఒక్కడుగు వెనుకకు వేసి, ముందుగా అం దరినీ ఒక్క చోట కలవనీయండన్నట్లు వ్యవహరిస్తున్నారు. అయితే రాహుల్ లేకుండా మోదీని ఓడించడం సాధ్యం కాదని అందరికీ తెలుసు. ఎక్కువ సీట్లు ఉన్న పార్టీకి నాయకత్వం అప్పచెప్పకుండా సుస్థిరంగా కొనసాగడం సాధ్యం కాదని నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకనే కుమా రస్వామి ప్రభుత్వం ఎక్కువకాలం మనుగడ సా గించలేదని అందరికీ తెలుసు.
ప్రాంతీయ పక్షాలతో స్నేహంగా ఉండాలను కొంటు న్నానని, వారికి తగిన గౌరవం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాననే సంకేతం ఇవ్వడం కోసమే కర్ణాటక ప్రభుత్వానికి ప్రస్తుతం రాహుల్ మద్దతు ఇస్తున్నారు. అవాంతరాలను ఎదుర్కొని 2019 ఎన్నికల వరకు కుమారస్వామి కొనసాగినా, ఆ తర్వాత ఆ ప్రభుత్వం భవిష్యత్ ఏమిటన్నది ఎవరూ చెప్పలేరు. శరద్ యాదవ్ మాత్రమే వాస్తవ పరిస్థితులను అద్దంపట్టే విధంగా కాంగ్రెస్ లేకుండా బిజెపికి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు సాధ్యం కాబోదని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంతగా పతనమైనా ఇంకా 250 లోక్‌సభ సీట్లలో అంటే దాదాపు సగం సీట్లలో బిజెపికి ప్రధాన ప్రత్యర్థి. ఈ సీట్లలో కమలనాథులను ఓడించగలిగితేనే బిజెపి లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు సాధ్యం కాగలదు. చంద్రబాబు వంటి నాయకులు గతంలో వలే ఇపుడు జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర వహించలేరు. ఉమ్మడి ఏపీలో 42గా ఉన్న యంపీ సీట్లు ఇప్పుడు 25కు తగ్గిపోవడమే అందుకు కారణం. అందుకనే మాయావతి, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ వంటి నేతల తర్వాతనే చంద్రబాబుకు తగు ప్రాధాన్యత లభిస్తుంది. బిజెపికి వ్యతిరేకంగా పోరాడాలంటే కేం ద్రంలో మరో అండ చంద్రబాబుకు అవసరం కాగలదు. అందుకోసమేనా కాంగ్రెస్‌తో వ్యూహాత్మక సంబంధాలు ఏర్పాటు చేసికొనక తప్పదు. కాంగ్రెస్‌తో నేరుగా చేతులు కలపలేని నాయకులకు ఇప్పుడు వారధిగా సీతారాం ఏచూరి కనిపిస్తున్నారు. 2019 ఎన్నికలలో మోదీని ఎదు ర్కోవడం ఎవ్వరికీ సాధ్యం కాదనే పరిస్థితి నుండి, భాజపాకు వ్యతిరేకంగా బలమైన కూటమి ఆవిర్భావానికి అవసరమైన ప్రాతిపదికను ఏర్పర్చడం ద్వారా రాహుల్ ఇప్పుడు జాతీయ రాజకీయాలలో కీలక శక్తిగా మారారని చెప్పవచ్చు.
ఎన్నికలకు ముందే ఈ పార్టీలు మహాకూటమిగా ఏర్పాటు కాకపోవచ్చు. కాంగ్రెస్ ఉన్న కూటమిలో చేరడానికి చంద్రబాబు, కేజ్రీవాల్, మమత వంటి వారు ఇప్పుడు సుముఖత వ్యక్తం చేయలేరు. కేరళలో సిపిఎంతో పోరాడుతున్న కాంగ్రెస్ బెంగాల్‌లో ఆ పార్టీతో పొత్తు ఏర్పరచుకోవడం కష్టమే. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో బిజెపికి వ్యతిరేకంగా ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దళ్ లతో పాటు మరి కొన్ని చిన్న చిన్న పార్టీలు చేతులు కలుపుతున్నాయి. బిహార్‌లోనూ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. కర్నాటక ఫలితాలు రాగానే కాంగ్రెస్‌కు మాయావతి చేసిన హెచ్చరిక ఈ సందర్భంగా గమనార్హం. తమలోని వైరుధ్యాల కారణంగా బీజేపీకి ప్రయోజనం కలగకుండా చేయాలని ఆమె స్పష్టం చేశారు. ఉదాహరణకు ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న నియోజక వర్గాలలో జేడీ ఎస్‌ను బిజెపి - బిటీం గా రాహుల్ ప్రచారం చేయడంతో బిజెపి ప్రయోజనం పొందిన్నట్లు ఆమె చెప్పారు. అటువంటి పొరపాట్లు కాంగ్రెస్ ఇక ముందు చేయరాదన్నారు. కర్ణాటకలో జరిగిన పొరపాట్లను వోటింగ్ కన్నా ముందే గ్రహించి, తద్వారా జాతీయ స్థాయిలో వ్యూహరచనకు రాహుల్ సన్నద్ధమవుతున్నట్లు కనిపిస్తున్నది.
మరోవంక బిజెపికి అపారమైన ఆర్థిక వనరులు సమకూరుతున్నాయి. పారిశ్రామికవేత్తలు కాంగ్రెస్ వైపు చూడడం లేదు. ఏఐసీసీ కార్యాలయంలో సందర్శకులకు టీ ఇవ్వడంపైనా కూడా ఆంక్షలు విధించడం చూస్తే ఆ పార్టీ ఎటువంటి దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదు ర్కొంటుందో వెల్లడి చేస్తుంది. ప్రస్తుత లోపాలను సరిదిద్దుకొని బిజెపిని ఎదుర్కోవడం రాహుల్‌కు అంత సులువు కాబోదు. సీనియర్ నాయకులను పక్కన పెట్టి, తనతో ఉన్న యూత్ బ్రిగేడ్‌కు పార్టీ బాధ్యతలు అప్పచెబితే ఎన్నికల సమయంలో తీవ్రమైన పరాభవం తప్పదు. అందుకనే ఒక వంక ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేయడానికి సంస్థాగత వ్యవహారాలను చక్కదిద్దుకోవలసి ఉంది. ఇదివరకు ఈ విషయాలను సోనియా గాంధీ పట్టించుకోలేదు. కాంగ్రెస్ అధికారంలో ఉండటం లేదా అధికారానికి దగ్గరగా ఉండడంతో నిధుల సమస్య ఏర్పడలేదు. మరోవంక నేతలు ఎవరికి వారు అహంకార ధోరణులను ప్రదర్శిస్తూ ఉంటే ప్రాంతీయ పార్టీలతో చెలిమి చేయడం కఠిన పరీక్ష కాగలదు.
ఇప్పటి వరకు ఉద్ధృతంగా ఎన్నికల ప్రచారం చేయడం, ప్రత్యర్థుల విమర్శలకు దీటుగా స్పందించడం, ఎదురు దాడి చేయడంలో రాటుతేలిన రాహుల్ ఇక పలు పక్షాలతో కలసి ముందుకు సాగడంతో సరికొత్త నిపుణతను ప్రద ర్శించవలసి ఉంది. ఇక, బిజెపి తన బలహీనతల నుండి పాఠాలు నేర్చుకోవలసి ఉంది. ప్రజలతో సంబంధం లేని, ఢిల్లీలో నేతల చుట్టూ తిరిగే రాజ్యసభ సభ్యులు ఇప్పుడు మోదీ ప్రభుత్వంలో పెత్తనం చేస్తున్నారు. ఏది ఏమైనా, ‘ప్రచారానికి రాహుల్ వస్తే పరాజయమే’ అన్న అపవాదు నుండి కర్నాటక ఎన్నికలు ఆయనకు ఒక పెద్ద బ్రేక్ ఇచ్చి, 2019లో మోదీ ప్రభావానికి చెక్ పెట్టేందుకు బలంగా అడుగులు వేసే మనోధైర్యం కలిగించినట్లు చెప్పవచ్చు.

-చలసాని నరేంద్ర 98495 69050