మెయన్ ఫీచర్

వ్యాపార రహస్యాల చట్టానికి ఏదీ పదును?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ మార్కెట్‌లో మన దేశం వ్యాపార లావాదేవీలతోప్రత్యేక గుర్తింపునూ, గట్టి పోటీనీ ఇస్తున్నా వ్యాపార రహస్యాల చట్టాలను అనుసరించడంలో లోపాల వల్ల మనకంటే బలహీనమైన మార్కెట్ల ఒత్తిడిని కూడా తట్టుకోలేక వైఫల్యం చెందుతోంది. అంతర్జాతీయ వాణిజ్య మండలిలో ఎదురవుతున్న సవాళ్ల నుండి సకాలంలో తేరుకోలేక బోల్తాపడుతోంది. ఇదంతా ఇప్పటికపుడు జరుగుతున్న తతంగం కాదు, గత 70 ఏళ్లుగా వాణిజ్యరంగంలో వస్తున్న కొత్త పోకడలను అర్థం చేసుకోకపోవడం, మేధోసంపత్తి హక్కులపై పట్టుసాధించకపోవడంతో ప్రపంచంలోనే ‘అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ’మైన భారత్ వేగంగా ముందుకు అడుగులు వేయలేకపోతుంది. వాస్తవానికి దేశంలో అనేక చట్టాలు ఉన్నా వాటిలో సమగ్రత లోపించింది. మేధోసంపత్తి హక్కుల పరిధిలోని అంశాలకు వేర్వేరు చట్టాలు అందుబాటులోకి వచ్చినా, సమగ్ర కంపెనీ చట్టం (2013) అమలులోకి వచ్చినా, పూర్వపు కాంట్రాక్టు చట్టం (1872), ఇండియన్ పార్టనర్ షిప్ యాక్టు(1932), ఆస్తి బదలాయింపు చట్టం (1882)తో పాటు కార్మిక చట్టం, ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారాలు వంటివి అందుబాటులోకి వచ్చినా, ఇంకా లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
దేశంలో వ్యాపారానికి సంబంధించిన చట్టాలు వేరు, వ్యాపార రహస్యాల చట్టాలు వేరు. వ్యాపారానికి సంబంధించిన చట్టాలు కొంచెం పటిష్టంగానే ఉన్నా, వ్యాపార రహస్యాల పరిరక్షణ చట్టాలు మాత్రం మిగిలిన దేశాలతో పోలిస్తే బలహీనంగానే ఉన్నాయి. చాలా దేశాలతో ఎగుమతులు, దిగుమతుల్లో భారత్ ప్రధాన భాగస్వామిగా ఉంటోంది. ఆహారోత్పత్తులు, వౌలిక సదుపాయాల కల్పన, అంతరిక్ష రంగం, రక్షణ రంగం, లవణాలు, ఖనిజాలు సహా అనేక రంగాల్లో ఎగుమతి, దిగుమతులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భారతదేశంలో వ్యాపార రహస్యాలు, వాణిజ్య రహస్యాల రక్షణ అనేది అత్యంత కీలకమైన అంశంగానూ, హక్కుగానూ మారింది. దానికి రాజ్యాంగపరమైన, చట్టపరమైన సంపూర్ణ రక్షణపై ఇపుడిపుడే చైతన్యం మొదలైంది. సమగ్రమైన చట్టాలను రూపొందించే దిశగా పయనిస్తున్నా, ప్రస్తుత చట్టాలు చాలవనేది సుస్పష్టం.
వ్యాపార రహస్యం అనేది మేధోసంపన్న చట్టంలో భాగం. యాజమాన్య సమాచారాన్ని ఇతరులు వాణిజ్య అవసరాలకు వినియోగించకుండా ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది. ‘ట్రేడ్ సీక్రెట్స్ చట్టం-1996’లో ఆర్థికాంశాల గూఢచర్య నిరోధక చట్టాన్ని దుర్వినియోగం చేయడాన్ని నిషేధించారు.
పేటెంట్లు, కాపీరైట్లు, ట్రేడ్ మార్కులు వంటి ఇతర మేధో సంపత్తి హక్కుల మాదిరి ఒక నిర్ధిష్టమైన బహిరంగ రికార్డు అంటూ ఏమీ ఉండదు. దాంతో వాణిజ్య రహస్యాల దుర్వినియోగ సమయంలో చర్యలకు చట్టపరమైన రక్షణ కల్పించడం జరిగింది. ఇతరుల పోటీ నుండి తట్టుకునేందుకు సమాచారం అనివార్యంగా రహస్యంగా ఉంచాల్సిరావడంతో వాణిజ్య రహస్యాల రక్షణను నిర్ధారించడానికి న్యాయపరమైన జోక్యం కూడా తప్పనిసరైంది. వాణిజ్య రహస్యాలను అభ్యసించే న్యాయవాదులు తమ క్లయింట్ రహస్య యాజమాన్య సమాచారాన్ని కాపాడటానికి సహాయం చేస్తుంటారు. కొన్నిసార్లు వారు కూడా దుర్వినియోగానికి పాల్పడిన సందర్భాలుంటాయి. వ్యాపార రహస్యం అనేది సంస్థ అత్యంత కీలకమైన ఆస్తుల్లో ఒకటి. ఉత్పత్తి సూత్రీకరణలు, వినియోగదారుల జాబితాలు, తయారీ ప్రక్రియలు, ఉద్యోగులు, వ్యాపార భాగస్వాములు, ఇతర సమాచారం చాలా తేలికగా పోటీదారులు చౌర్యం చేసే వీలుంది. దేశీయ ఇంధన రంగంలో బాగా అభివృద్ధి చెందుతున్న రంగం చమురు పరిశ్రమ. చమురు బావుల తవ్వకాల కోసం ఒక సంస్థపై మరో సంస్థ రకరకాల వ్యాజ్యాలను దాఖలు చేసి, వ్యాపార ఆధిపత్యం కోసం నిరంతరం ప్రయత్నిస్తుంటాయి. సంస్థ అత్యుత్తమ పురోగతికి బాధ్యులైన ప్రతిభావంతులను పోటీ సంస్థ తీసుకువెళ్లిందనో లేదా తమ వ్యాపార రహస్యాలను చౌర్యం చేసి దెబ్బతీయాలని చూస్తుందనో పరస్పరం వ్యాజ్యాలు దాఖలు చేసుకోవడం అత్యంత సంపన్నమైన దేశాల్లో కూడా చూస్తున్నాం.
ఒక సంస్థ నిపుణులు మరో సంస్థకు వెళ్లినపుడు వారితో పాటు పూర్వ సంస్థపై ఉన్న జ్ఞానం బదలాయింపు అవుతుంది. అంటే పూర్వ సంస్థలో విజయవంతమైన అంశాలను కొత్త సంస్థలో ప్రయోగించడం ద్వారా అక్కడ వైఫల్యాలను అధిగమించే వీలుంటుంది. ఫలితంగా పూర్వ సంస్థ నష్టాలను చవిచూడటం లేదా దివాలాకు దారి తీయడం జరుగుతుంది. యాజమాన్య రహస్య సమాచారాన్ని, వాణిజ్య రహస్య చట్టాలను కాపాడేందుకు వ్యాపార రహస్య చట్ట నిపుణులకు ప్రాధాన్యత పెరిగింది. నిజానికి వ్యాపార రహస్యం అంటే ఏమిటో సాధారణ ప్రజలకు తెలియనే తెలీదు. ఈ సమాచారం బహిరంగంగా ఎవరికీ తెలియకపోయినా తద్వారా లభించే ఆర్థిక ప్రయోజనం మాత్రం ప్రతి ఒక్కరికీ చేరుతుంది. అంతర్జాతీయ చట్టం ప్రకారం ఈ సామాన్య సూత్రం ‘ట్రిప్స్ ఒప్పందం- ఆర్టికల్ 39’లో చేర్చడమైంది.
వ్యాపార రహస్యాల గూఢచర్య చట్టం-1996 ప్రకారం మూడు అంశాలను అంతర్లీనంగా చర్చించడమైంది. అందుకే వ్యాపార రహస్యం అనే అంశానికి సంబంధించి నిర్ధిష్టత లేకున్నా అదో విస్తృత పరిధితో కూడిన ఫార్ములా, నిరంతరం అమలు చేసే ఒక విధానం, అభ్యాసం, డిజైన్, ఉపకరణం, నమూనా,వాణిజ్య పద్ధతి లేదా ఇతరులకు సాధారణంగా తెలిసే లేదా సహేతుకంగా నిర్ధారించిన సంగ్రహ సమాచారమే వ్యాపార రహస్యం. మరో విధంగా చెప్పాలంటే ట్రేడ్ సీక్రెట్ అనేది మేధోసంపదలో ఒక అదృశ్య భాగం. సంస్థ విలువ, వారి వాటా, మార్కెట్ క్యాపిటల్ ప్రధానంగా మార్కెట్ రహస్యంగా పరిగణిస్తారు. ఈ మొత్తం వ్యవహారం అదృశ్యంగా ఉండటం వల్ల నిక్కచ్చిగా కొలవలేం, కాకపోతే దానిని సుమారుగా, రమారమి గణించవచ్చు. కంపెనీ పేటెంట్లు కంటికి కనిపించే గణనీయ అంశమే అయినా అంతర్గత ఆవిష్కరణలకు ఇదో పెద్ద జాప్యమైన అంశం అవుతుంది. కంపెనీ రహస్యం ఎంత ఎక్కువగా ఉంటే, అంత మేరకు పోటీదారులు లేదా వినియోగదారులపై వ్యాపార పరమైన ప్రయోజనాన్ని పొందవచ్చు. చాలా దేశాల్లో వ్యాపార రహస్యం అనేది గోప్యత అంశంగానే పరిగణించబడుతోంది. వ్యాపార రహస్యం అనే అంశంపై వివిధ దేశాలు విభిన్నంగా నిర్వచించాయి.
భారతదేశంలో వాణిజ్య రహస్యాలను కాపాడేందుకు అనేక చట్టాలు ఉన్నాయి. డిజైన్ యాక్ట్, ట్రేడ్ మార్కు యాక్ట్, పేటెంట్ యాక్ట్, కాపీరైట్ యాక్ట్, కంపెనీ లా, కాంట్రాక్టు లా, లిమిటేషన్ యాక్టు, లాబర్ లా, ప్రాపర్టీ యాక్టులలో ఉన్న అనేక నిబంధనలు వ్యాపార రహస్యాల పరిరక్షణకు తోడ్పడుతున్నాయి. మన దేశంలో ఈ శాసనాలతో పాటు వ్యాపార సంబంధమైన మేధోసంపత్తి హక్కులు(ట్రిప్సు)కు అదనంగా యుఎస్, యుకెలోని చట్టాలను అనుసరించడం జరుగుతుంది. ప్రపంచంలో ఇతర దేశాల్లో ఒప్పంద ఉల్లంఘన జరిమానాలు సహజంగా భారీగానే ఉంటాయి. మన దేశంలో ఉద్యోగులు తమ సంస్థలు మారిన ప్రతిసారీ ఈ రహస్య ఒప్పంద ఉల్లంఘనలు సర్వసాధారణంగా మారిపోయింది.
అన్యాయమైన పోటీకి వ్యతిరేకంగా సమర్ధవంతమైన రక్షణ కల్పిస్తూ ‘పారిస్ బిస్‌లో ఆర్టికల్ 10’ ద్వారా భాగస్వామ్య పక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. పారా 2, పారా 3 కింద సంస్థలు తమ అజ్ఞాత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకునే వీలు దీని ద్వారా కలిగింది. సహజ, చట్టపరమైన వ్యక్తులు వాణిజ్య రహస్యాలను బహిర్గత పరచకుండా నివారించే నిబంధనలు కూడా ఇందులో ఉన్నాయి. 1817లోనే న్యూబెరీ వెర్సస్ జేమ్స్ కేసు అనంతరం ఇంగ్లాండ్‌లో వాణిజ్య రహస్యాలకు సంబంధించిన చట్టాలకు రూపకల్పన చేశారు. వికిరీ వెర్సస్ వీచ్ కేసులో అమెరికాలో 1837లో వాణిజ్య రహస్యాల చట్టాలకు రూపం వచ్చింది. కామనె్వల్త్ దేశాల ఉమ్మడి చట్టాల పరిధిలో కూడా ఈ అంశంపై గత మూడు దశాబ్దాలుగా విస్తృతమైన చర్చలు జరుగుతునే ఉన్నాయి. వాణిజ్య రహస్యమనేది ఆస్తి హక్కుగా హాంకాంగ్ గుర్తించింది. 2016 మే 27న యురోపియన్ యూనియన్ వాణిజ్య రహస్యాల రక్షణ చట్టం మార్గదర్శకాలను ఆమోదించింది. కివానీ ఆయిల్ కంపెనీ వెర్సస్ బైక్రాన్ కార్పొరేషన్ యునైటెడ్ స్టేట్స్ సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాలు తమకు తోచిన విధంగా వాణిజ్య రహాస్యాల రక్షణ చట్టాలను చేసుకోవచ్చని ఆదేశించింది. దాంతో అమెరికాలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రీతిన ఈ చట్టాలు రూపొందాయి. 1979లో యూనిఫార్మ్ ట్రేడ్ సీక్రెట్స్ యాక్టు అమలులోకి వచ్చింది. చైనా, బ్రెజిల్ వంటి దేశాలు ముందుగానే తేరుకున్నా భారత్‌లో మాత్రం ఇంకా సమగ్రత లోపించింది.
భారత్‌లో ఇందుకు సంబంధించి స్పష్టమైన ఏకీకృత చట్టం లేకున్నా వివిధ చట్టాల్లోని నిబంధనలను గుర్తిస్తూ న్యాయస్థానాలు వాణిజ్య రహస్యాల రక్షణకు ప్రయత్నిస్తున్నాయి. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకు వెర్సస్ ప్రియా పూరి కేసులో ఢిల్లీ హైకోర్టు వాణిజ్య రహస్యాన్ని నిర్వచించింది. మైఖేల్ హెథ్ నాథన్ జాన్సన్ వెర్సస్ సుభాష్ చంద్ర అండ్ అదర్స్, జాన్ రిచర్డు బ్రాడీ వెర్సస్ కెమికల్ ప్రాసెస్ ఎక్వీప్‌మెంట్ ప్రైవేటు లిమిటెడ్ కేసుల్లో ఇంగ్లాండ్‌లో నిర్వచనాలను పునఃవివరణకు ప్రయత్నించడం జరిగింది.
అనిల్ గుప్తా అండ్ అదర్స్ వెర్సస్ కునాల్ దాస్ గుప్తా అండ్ అదర్స్ కేసులో ఢిల్లీ హైకోర్టు ప్రతి ఉత్పత్తి వెనుక ఆలోచన, మెదడుతో కూడిన జ్ఞానం , విజ్ఞానం ఇమిడి ఉంటాయని పేర్కొంది. జ్ఞానానికి సరిహద్దులను, నాణ్యతను , పరిమితులను గణించడం ద్వారా గుర్తించడం కష్టమనే భావనను కూడా వ్యక్తం చేసింది. కాపీరైట్ యాక్టు 1957లో సెక్షన్ 51, 55 , 63తో పాటు ద డిజైన్ యాక్టు -2000, ఐటి యాక్టు -2000లో 65, 72 సెక్షన్లు ఇండియన్ పీనల్ కోడ్ 408, 415 సెక్షన్లు, ఇండియన్ కాంట్రాక్టు యాక్టు -1887 సెక్షన్ 27, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్టు -1963 సెక్షన్ 42, ద కాంపిటీషన్ యాక్టు 2002లో సెక్షన్ 3, జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటక్షన్ యాక్టు 1999, సివిల్ ప్రొసీజర్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లలో కూడా వాణిజ్య రహస్యాల రక్షణకు సంబంధించి నిబంధనలున్నాయి. బర్లింగ్టన్ హోం షాపింగ్ లిమిటెడ్ వెర్సస్ రజనిష్ చిబ్బర్, దీల్జీత్ టైటస్ వెర్సస్ ఆల్ఫ్రెడ్ ఎ అదిబరే, పునీత్ ఇండస్ట్రియల్ కంట్రోల్స్ ప్రైవేటు లిమిటెడ్ వెర్సస్ క్లాసిక్ ఎలక్ట్రానిక్స్ కేసుల్లో కాపీరైట్‌పై స్పష్టమైన తీర్పులున్నాయి. ట్రాక్టర్స్ అండ్ ఫాం ఎక్విప్‌మెంట్ లిమిటెడ్ వెర్సస్ గ్రీన్ ఫీల్డు ఫాం ఎక్విప్‌మెంట్ ప్రైవేటు లిమిటెడ్ కేసులో డిజైన్ యాక్టు ప్రాధాన్యతను ఉన్నత న్యాయస్థానం సుస్పష్టం చేసింది. ప్రమోద్ వెర్సస్ ఉదయ నారాయణ కేసు, కంట్రోల్ ప్రింట్ ఇండియా లిమిటెడ్ వెర్సస్ సంజయ్ శ్రీబస్తబ్ కేసులోనూ డిజైన్ యాక్టు నిబంధనల ఉల్లంఘనలపై న్యాయస్థానం తీవ్రమైన జరిమానాలనే విధించింది. ప్రపంచంలోని చాలా దేశాల్లోని వాణిజ్య రహస్యాల రక్షణ చట్టాలకు యుకె పేటెంట్ యాక్టు 1977, యుఎస్ ట్రేడ్ సీక్రెట్స్ యాక్టు 1979 ఒక విధంగా మార్గదర్శకమని చెప్పాలి. మన దేశంలో వాణిజ్య రహస్యాల చట్టానికి ప్రాధాన్యత ఒక విధంగా నిరంజన్ శంకర్ గోలికరి వెర్సస్ సెంచురీ స్పిన్నింగ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ (ఎఐఆర్ 1967 ఎస్సీ 1098) కేసుతో మొదలైందనే చెప్పవచ్చు. మారుతున్న మార్కెట్ పోకడలకు అనుగుణంగా దేశంలో ఎప్పటికపుడు చట్టాలకు కొత్త రూపం తీసుకురానిదే అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీ అంత తేలిక కానే కాదు.

-బీవీ ప్రసాద్ 98499 98090