మెయిన్ ఫీచర్

ఆత్మాభిమాన పోరాట పటిమ పెంచే మంత్రగత్తె యద్దనపూడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా తమ్ముడు చిన వీరభద్రుడు ‘‘సులోచనారాణిగారు మా అక్క ఆరాధ్య రచయిత్రి’’ అన్నాడు.
నేను ఈ నిజాన్ని ఒప్పుకుంటూనే దానికి కారణాలు చెప్పాలనుకుంటున్నాను.
ఆమె నాకు ఆరాధ్య కావటానికి కారణం ఆమె ప్రభావమే నా మీద ఉండడమే.
చాలామంది చెప్తున్నట్టు ఆమె తన రచనల ద్వారా నన్ను కలల్లో ముంచి తేల్చలేదు. అపురూపంగా, ప్రేమగా, కాస్త గౌరవంగా చూసుకునే సహచరుడు తనకు దొరకాలని ప్రతీ ఆడపిల్లా కోరుకుంటుది ఆమె నవలలు చదవకపోయినా కోరుకుంటుంది. మధురమైన వివాహ జీవితం కోసం కలలు కంటుంది. ఇది తప్పయితే ఆమె నవలలలో ఈ తప్పు ఉంది.
అయితే ఆమె నాయికలు ఆర్థికంగా తమ కాళ్లమీద తాము నిలబడాలనుకుంటారు. ఎవరిమీదా దేనికీ ఆధారపడకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు. ధనవంతుడైన నాయకుడు తన భర్త కావాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశపడరు.
పెద్దకారూ, సంపదా ఆరడుగుల పొడుగూ వున్నవాడు అతను తమను గౌరవించకపోతే దూరంగా ఉంచగల నిబ్బరం ఉన్నవాళ్లు. సెక్రటరీ గానీ జీవన తరంగాలు కానీ చదివితే ఆ పేద అమ్మాయిలు తమ ఆత్మగౌరవం నిలబెట్టుకోవడానికి ఎన్నింటిని తిరస్కరించుకుంటూ వచ్చేరో తెలుస్తుంది.
ప్రధానంగా సెక్రటరీ నవలలో జయంతి నవల చివరిదాకా రాజశేఖరం నుంచి పారిపోతూనే వుంటుంది. శివరామ్ లాంటి చిన్న ఉద్యోగితో స్నేహంగా ఉంటూ అతని తోడు బావుంటుందనుకుంటుంది.
ఇలాంటి ఆర్థిక స్వావలంబన, ఆత్మగౌరవం కలిగి ఉండడం. దానికి భంగం కలిగించేవారిని దూరంగా ఉంచగలగడం ఇలాంటివి నాకు నా పదో ఏటనుంచే ఆమెను చదవడంవల్ల ఏర్పడ్డాయనుకుంటాను. ఇనే్నళ్ల జీవితంలో ఆ లక్షణాలు నాకు గౌరవానే్న అందించేయి. అందుకే ఆమెను నా ఆరాధ్య అని నిర్భయంగా చెప్పగలను.
ఆమె తన నాయికల అందాలను ఎక్కడా వర్ణించలేదు. వారి అలంకరణనూ వర్ణించలేదు. అందం కోసం వారు పాకులాడినట్టు ఎక్కడా రాయదు. సరదా ఉండడం వేరు, పాకులాడడం వేరు అని నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
నవలలు చదివి ఒక తరం అమ్మాయిలు పాడైపోయారంటే నాకు ఎక్కడా దాఖలాలు కనపడడంలేదు. పాడయ్యే బలహీనతకు ఈ నవలలే చదవక్కరలేదు. ఒకరిద్దరు వ్యాపార రచయితలతో ఈమెను పోల్చడం కూడా నేను అంగీకరించను. సులోచనారాణిలోని నిజాయితీ ఆమెను మిగిలినవారినుంచి వేరు చేస్తుంది. ఆమె నవలలు పాపులర్ కావడం ఆమె తప్పు కాదు. పనిగట్టుకొని ఆమె పాపులారిటీ కోసం రాసి ఉంటారని అనుకోను.
ఆమె చిన్నతనంలో శరత్ నవలలు విరివిగా చదివేనని ఆమె చెప్పేరు. ఆ ప్రభావాలు స్ర్తి పాత్రలమీద ఉన్నాయని అనిపిస్తుంది.
పదేళ్ల కిందట దివిసీమ ఉత్సవాల్లో ఆమెకు సన్మానం చేసినపుడు ఎమెస్కో విజయ్‌కుమార్‌గారు ఆమె గురించి నన్ను మాట్లాడమని అడిగారు.
జీవన వాస్తవాన్ని రంగులమయం చేసిన మంత్రగత్తె యద్దనపూడి సులోచానారాణి.
ఆ పదకొండవ ఏట బహుశా 1964లో అనుకుంటా సెక్రటరీ అనే నవల చదివేను. దాదాపు ఏకబిగిన చదివితే పది గంటలు పట్టింది. ఆ తర్వాత ఆ నవల రాసిన రచయిత పేరు చూశాను.
అయితే ఈమధ్యకాలం దాదాపు నలభై ఏళ్ళు. ఆ కాలంలో నేను ఎందరో గొప్ప కవులను, రచయితలను చదివేను. ఎంతో గొప్ప సాహిత్యాన్ని అర్థం చేసుకుని విశే్లషించే ప్రయత్నం చేశాను. సాహిత్యపు స్థారుూ భేదాలు కూడా బాగానే అవగతమయ్యాయి. ఈ నేపథ్యం నుంచి తిరిగి మళ్లీ ఈ నవల చదివితే తిరిగి పూర్వంలాగే నచ్చడం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ కాలంలో కూడా ఆ నవల విశేష ప్రాచుర్యాన్ని పొందింది. దీనితోపాటు ఆమె వ్రాసిన మరికొన్ని నవలలు కూడా ఇలా ఎన్నో ముద్రణలు పొందేయి.
ఆమె ఇంతకీ ఎవరు? యద్దనపూడి సులోచనారాణి అనే ఒక మంత్రగత్తె ఆమె. ఆమె చేసిన మాయాజాలం గురించే ఈ మాటలు. ఏ కారణం చేత ఆమె నవలలకు ఇంత ప్రాచుర్యం లభించింది? ఆ నవలలో ఇంత పఠనాసక్తిని కలిగించే అంశమేది అని ఆలోచిస్తే అందరూ చెప్తున్నట్టు నాయకీ నాయకుల మధ్య వర్ణించిన రొమాంటిక్ భావజాలం కారణం కాదేమో అనిపిస్తుంది.
సులోచనారాణి కథ చెప్పడంలో చూపించే నేర్పు ఆమె యొక్క అసాధారణ ప్రతిభను తెలియజేస్తుంది. ఒక కథ ఆమె మొదలుపెట్టిన తర్వాత ఒక్కొక్క పూల మొక్క నాటుకుంటూ వెళ్లి పూర్తయ్యేసరికి ఒక అద్భుతమైన ఉద్యానవనాన్ని చేసేస్తుంది ఆమె. ఆ రంగు రంగుల అందాలు, సువాసనలు నిండిన తోటలో మనం మైమరిపోతాం.
సులోచనారాణిలోని మరి రెండు విశిష్టమైన రచనా గుణాల గురించి చెప్పాలి.
అవి ఒకటి వాతావరణ కల్పన. వాతావరణ చిత్రణ వేరు, వాతావరణ కల్పన వేరు. చిత్రణల రచయిత కదలికను చూపెట్టలేడు. ఒక వాతావరణాన్ని చిత్రించడంవల్ల మనకు అది కళ్లకు కనిపిస్తుందేమోగాని మనం అందులో ప్రవేశించలేం. తన భావనాశక్తితో వాతావరణాన్ని కల్పించగలిగితే పాఠకుడు తన ప్రమేయం లేకుండానే అందులోకి నడిచి వెళ్తాడు.
రెండో లక్షణం గొప్ప నాటకీయత. ఆమె రచనలన్నీ ఎంతో మాయ చేస్తాయి అనడానికి ప్రధాన కారణం డ్రామా. ఆమె కల్పించే ప్రతి సన్నివేశంలోనూ డ్రమెటిక్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ఏ మాత్రం శిథిలమయినా క్షుద్ర నాటకీయత (మెలో డ్రామా) అయ్యే ప్రమాదం ఉంది కానీ ఆ మొదటి నవలల్లో ఎక్కడా ఈ నాటకీయత ఏ మాత్రం కూడా అటూ ఇటూ అవదు.
సులోచనా రాణి నవలా నాయిక పొడుగాటి కారులో వచ్చే ఆరడుగుల హీరోకోసం కలలు కంటూ ఉంటుంది అని అంటూ ఉంటారు. ఇటువంటి అపవాదు ఎందుకొచ్చిందోగానీ ఆమె నాయికలు ఎక్కువగా ఆత్మగౌరవం కోసం పోరాడుతూ ఉంటారు. ప్రేమ కలిగినా అంతకంటే తమ ఆత్మ గౌరవమే ముఖ్యమని భావిస్తూ దాన్ని కాపాడుకోవడమే ధ్యేయంగా ఉంటారు. ఎవరి అణచివేతనూ సహించరు, ఆఖరికి తల్లి అయినా సరే. మీనా నవలలో మీనాకి ఆమె తండ్రికీ మధ్య సంభాషణ జరుగుతుంది. అందులో రచయిత్రి ఈ విషయంలో తన అభిప్రాయాన్ని చెప్పారు. తెలివితేటలు, సమర్థత ఉన్న భర్తతో సంసారం ఎలా ఉంటుందని మీనా అడుగుతుంది. ఆ రెండూ చాలవు. వాటికి మంచితనమూ, ప్రేమా కూడా ఉండాలంటాడు తండ్రి. భార్యకు కూడా తెలివీ, సమర్థతా ఉంటేనో అంటుంది. అప్పుడు వారిద్దరి మధ్య బద్ధ వైరం ఏర్పడుతుందంటాడు. చివరకు తేల్చి చెప్పిందేమిటంటే, ఇద్దరూ తెలివిగలవాళ్లూ, సమర్థులూ అయి మంచితనమూ, ప్రేమా అలవరచుకుంటే అది మంచి సంసారం అవుతుందని, మానవ సంబంధాలలో దయ అతి ప్రధానమైన అంశమనీ.
ఇవన్నీ మరుగునపడి కలల రచయిత్రిగా ఆమె ముద్రపడడానికి కారణం ఏమిటో ఒకసారి ఆలోచించవలసి వుంది. వ్యాపార ప్రపంచంలోకి ఒరగడం కొంత కారణం కావచ్చు. ఏది ఏమైనా ఆడపిల్లలకు వెనె్నముకతో నిలబెట్టడానికి సులోచనారాణిగారు కూడా తమ వంతు ప్రయత్నం చేశారు. జాతీయోద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్న స్ర్తిలు స్వాతంత్య్రం తర్వాత ఇళ్ళలోకి వెళ్లిపోయారు. భర్తలకు నీడలా మారిపోయారు. దాదాపు పదేళ్ల కాలం అలా గడిచింది. 1957లో శ్రీదేవిగారి కాలాతీత వ్యక్తులు వచ్చింది. ఇందిరలాంటి రాడికల్ పాత్రతో తర్వాత రంగనాయికమ్మ భర్తలకు నీడలుగా మారబోతున్న భార్యలను ఇళ్లనుంచి ఇవతలకు లాక్కొచ్చే పనిచేశారు. ఆ నేపథ్యంలో సులోచనా రాణి కూడా తన నాయిక చేత రొటీన్‌గా టీచరు, నర్సు ఉద్యోగాలు కాక సెక్రటరీ ఉద్యోగం చేయిస్తూ ఆత్మాభిమాన పోరాటం చేయించారు. అయితే ఆమె నాయికలు ఏ పోరాటాలు చేసినా అవన్నీ మోహభరితంగా ఉంటాయి. అలవోకగా చదివింపచేసే శక్తి వున్న ఈమె నవలలవల్ల ఈనాటి యువతకు చదివే అలవాటుతోపాటు కొంత ఊహాశక్తి కూడా పెరిగే అవకాశం ఉంది. ఆత్మగౌరవం అనేది ఒకటి అవసరం అని తెలుసుకుంటారేమో!

-వీర లక్ష్మీదేవి వాడ్రేవు