మెయన్ ఫీచర్

కూటమి సరే.. సారథి ఎవరు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాని నరేంద్ర మోదీని ఓడించాలి.. విపక్షాలన్నీ ఏకత్రాటిపైకి రావాలి’ అనే నినాదం బీజేపీయేతర పక్షాలకు తారకమంత్రంలా మారింది. ప్ర జాస్వామ్యంలో అధికార పక్షం తప్పులు చేస్తే వాటిని ఎత్తి చూపేందుకు ప్రతిపక్ష పార్టీలు పోరాటం చేయడం సర్వసాధారణం. కానీ, ఇప్పుడు విపక్షాలన్నీ తమ సిద్ధాంతాలను పక్కనపెట్టి, బీజేపీని ఓడించడమే ధ్యేయంగా కొత్తకూటమి ఏర్పాటుకు వ్యూహరచన చేస్తున్నాయి. కాంగ్రెస్ ఓ జాతీయ ప్రాంతీయ పార్టీగా, ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, టిఆర్‌ఎస్, తెదేపాలు ప్రాంతీయ జాతీయ పార్టీలుగా అవతరించాయి. ప్రాంతీయ పార్టీల పొత్తులేకుండా మనుగడ సాధించలేని స్థితికి కాంగ్రెస్ దిగజారింది. కొన్ని ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగాయి.
సమాజ్‌వాదీ పార్టీ యూపీకే పరిమితం. యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్‌ల్లో బీఎస్పీకి పట్టుంది. కేరళలో తప్ప మిగతా రాష్ట్రాల్లో వామపక్ష పార్టీల బలం నామమాత్రమే. కర్నాటకలో కాంగ్రెస్ మద్దతుతో అధికారంలోకి వచ్చిన జేడీఎస్ కావేరి డెల్టాను దాటలేదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వచ్చే ఎన్నికల్లో వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, బీజేపీలతో ఢీ కొనాల్సి ఉంటుంది. ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ మొదటి నుంచి ‘ఫ్రంట్’లకు దూరంగా ఉంటున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా ‘ఫెడరల్ ఫ్రంట్’ ఏర్పాటు చేస్తామని ఉత్సాహపడ్డారు. కాని కాంగ్రెస్ లేకుండా బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు అసాధ్యమని మోదీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఒక కూటమిగా అవతరించాలనే నినాదం ఊపందుకోవడంతో ఇప్పటికైతే కేసీఆర్ కాస్త వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోంది. తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్. కాంగ్రెస్‌తో రాష్ట్రంలో పోరాడుతూ, జాతీయ స్థాయిలో ఆ పార్టీ ప్రధానపాత్ర పోషించే కూటమిలో టీఆర్‌ఎస్ ఉంటే, తన గొయ్యిని తాను తవ్వుకున్నట్లే. రాజకీయ చతురుడైన కేసిఆర్ అందుకే కర్నాటకలో కుమారస్వామి పట్ట్భాషేకానికి ఒక రోజు ముందు బెంగళూరు వెళ్లి కాబోయే ముఖ్యమంత్రిని పలుకరించి వచ్చేశారు. ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగిన తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు బీజేపీపై అలుపెరుగని పోరాటం చేస్తానని ప్రకటించారు. ఏపిలో కాంగ్రెస్‌కు ఉనికే లేదు. చంద్రబాబు కుమారస్వామి పట్ట్భాషేకానికి వెళ్లి, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియాగాంధీ పాల్గొన్న వేదికపై సందడి చేశారు. తమిళనాడులో డిఎంకే ఇప్పటికైతే బీజేపీయేతర కూటమికి మద్దతు ఉంటుందని ప్రకటించింది. ద్రవిడ రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నికల తర్వాత తమ నిర్ణయాన్ని మార్చుకుంటాయి.
యూపీలో భాజపాను మట్టికరిపించేందుకు ఎవరితోనైనా పొత్తుకు కాంగ్రెస్ ‘సై’ అంటోంది. అయితే అక్కడ సమాజ్‌వాదీ, బీఎస్పీ పార్టీలు కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు కేటాయిస్తాయి ? యూపీలోని 80 ఎంపీ సీట్లలో కాంగ్రెస్‌కు 5 సీట్లు కేటాయిస్తే గొప్పే. మిగిలిన సీట్లలో ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డి పార్టీలకు సీట్ల పంపకం సాఫీగా జరగాలి. బిహార్‌లో ఆర్జేడీ-కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరినా అక్కడ బీఎస్పీకి కూడా కొన్ని సీట్లు వదలాల్సి ఉంటుంది. బిహార్ సీఎం నితీష్ కుమార్ అనివార్యంగా బీజేపీతో ప్రయాణించక తప్పదు. మధ్యప్రదేశ్‌లో తమ పార్టీ విస్తరణకు కసరత్తు చేస్తున్నట్లు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సింహభాగం సీట్లలో పోటీ చేస్తూనే, బీఎస్పీ, ఎస్పీకి సీట్లను కేటాయించాలి. రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌లలో కాంగ్రెస్ పార్టీ బీఎస్పీకి తగినన్ని సీట్లు కేటాయించకపోతే మాయావతి ఊరుకోరు. యూపీలో లోక్‌సభ సీట్లకు సంబంధించి పేచీ లేకుండా మాయావతి పొత్తు చేసుకునే అవకాశం లేదు. కర్నాటక పరిణామాలను చూసి సంబరాలు జరుపుకుంటున్న బీజేపీయేతర పార్టీలు కూటమిగా ఏర్పడతాయా? అదే జరిగితే దానికి నేత ఎవరు?
కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఎస్పీ, బీఎస్పీలు అంగీకరిస్తాయా? బీజేపీయేతర పక్షాలకు ఎక్కువ సీట్లు దక్కినా ఆ కూటమిలో 50 నుంచి 60 సీట్లు ఎవరికైతే వస్తాయో ఆ పార్టీ అధినేత ప్రధానమంత్రి రేసులో ఉంటారని చెప్పవచ్చు. యూపీలో లోక్‌సభ ఉపఎన్నికల ఫలితాలతో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రస్తుతం ఇదే పనిలో ఉన్నారు. 60కి మించి ఎంపీ సీట్లను గెలుచుకుంటే ఎవరైనా ప్రధాని పదవికి రేసులో ఉండవచ్చు. రాహుల్ కంటే మాయావతి, అఖిలేష్ యాదవ్‌కు పాలనానుభవం ఉంది. మాయావతికి పలుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన పాలనానుభవం ఉంది. ఆమె ప్రధాని రేసులో ఉండకుండా ఎలా ఉంటారు? ప్రస్తుతం లోక్‌సభలో 44 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో కనీసం వంద సీట్లు వస్తాయా? రాహుల్ ప్రధానమంత్రి అయ్యేందుకు బీఎస్పీ, ఎస్పీ వంటి పార్టీలు మద్దతు ఇస్తాయా? మమతా బెనర్జీ బెంగాల్‌కే పరిమితం. వచ్చే ఎన్నికల్లో ఆమె వామపక్ష పార్టీలు, కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తారా? ఈ రెండు పార్టీలతో రాష్ట్రంలో పోటీ పడి, జాతీయస్థాయిలో బీజేపీయేతర కూటమిలో ఆమె ఎలా ఉంటారు? బెంగాల్‌లో మొత్తం 42 ఎంపీ సీట్లను తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంటే ప్రధాని పదవి రేసులో మమత కూడా ఉంటారు. రాహుల్ , మాయావతి, అఖిలేష్,మమతలతో పాటు ప్రధాని పదవికి పోటీపడే ఎందరో నేతలు అజ్ఞాతంగా ఉన్నారు. శివసేన, అకాలీదళ్ పార్టీలు మిగతా సమయాల్లో బీజేపీతో గిల్లికజ్జాలు పెట్టుకున్నా, తుది దశలో ఆ పార్టీ పంచనే చేరుతాయి. మహారాష్టల్రో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా కేంద్రంలో చక్రం తిప్పేందుకు వెనకాడరు.
1996లో 37 మంది ఎంపీలతో జనతాదళ్ తరఫున ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన దేవెగౌడ కొన్ని నెలల పాటు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి సారథ్యం వహించారు. కర్నాటకలో ప్రస్తుతం 37 సీట్లున్న కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. కర్నాటక తరహాలోనే- కేంద్రంలో ఎన్డీఏకి మెజార్టీ రాకపోతే, ఇతర పార్టీ నేతలకైనా మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ మానసికంగా సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. జాతీయ రాజకీయాల్లో మారుతున్న రాజకీయ సమీకరణలు, ఎత్తుగడలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మన దేశంలో ఏకపార్టీ పాలన నుంచి సంకీర్ణ ప్రభుత్వాలకు అధికార మార్పిడి జరిగింది. 2014 నుంచి కొత్త తరహా రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. పార్టీలతో నిమిత్తం లేకుండా నాయకుడిని చూసి ఓట్లు వేసే సంస్కృతి పెరిగింది. సైద్ధాంతికంగా దివాలాకోరు తనంలో అన్ని పార్టీలు కూరుకుపోవడంతో ప్రజలు అనివార్యంగా వ్యక్తి ఆరాధన వైపు మొగ్గుచూపే పరిస్థితి తలెత్తింది. రాబోయే ఎన్నికల్లో ఒక వైపు మోదీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని, మరోవైపు మోదీని వ్యతిరేకించే పార్టీల కూటమిని దేశ ప్రజలు చూస్తారు.
ఒక వేళ బీజేపీయేతర కూటమి ముందుగానే ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తే రాజకీయాలు వేరుగా ఉంటాయి. కానీ, ఈ కూటమి ఎన్నికలకు ముందే మాయావతి, రాహుల్, మమత వంటి నేతల పేర్లలో ఎవరో ఒకరిని తమ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే పరిస్థితి లేదు. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్‌ల తరహా రాజకీయ కూటములను ప్రజలు 2019లో ఆదరిస్తారన్న నమ్మకం తక్కువే. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకైక పెద్దపార్టీగా అవతరించింది. మిత్రపక్షాల మద్దతుతో అధికారంలోకి వచ్చింది. కాగా, రాష్ట్ర విభజన తర్వాత ఇపుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంపీ సీటును కూడా గెలిచే పరిస్థితి లేదు. తెలంగాణలో కాంగ్రెస్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీల మద్దతుపై ఆధారపడాల్సిన అవసరం ఏర్పడింది.

-కె.విజయ శైలేంద్ర 98499 98097