మెయిన్ ఫీచర్

కుటుంబ విలువల్ని పెంచిన మీనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనె్నండు పదమూడేళ్ళ వయసు పిల్లలు, సాహిత్యం గురించి పెద్దగా అవగాహన లేనివాళళు కూడా హాయిగా చదువుకుని ‘‘అబ్బ, ఎంత బాగుంది!’’ అనగలిగేట్లుగా వుండే నవల యిది. ఈ మాట చెప్పుకోగానే అయితే ఇందులో పెద్దగా విశే్లషించవలసినంత ప్రతిభ ఏమీ లేదేమోననుకుంటే పొరపాటు పడ్డామన్నమాటే. పాఠకుల పరిజ్ఞానంలోను అభిరుచులలోను తేడాలు ఉండవచ్చును కానీ మంచి రచనలన్నిటికీ అవి ఏ భావజాలానికి సంబంధించినవైనప్పటికీ రచయితల ప్రతిభలోను, పరిణతిలోను పెద్దగా తేడా వుండదు. ఇంకా చెప్పాలంటే తలలు పండిన వృద్ధులకీ మేధావులకీ శాస్త్రాలు యిస్తే సరిపోతుంది. సారం వారే గ్రహిస్తారు. కానీ పిల్లలకి, సాధారణ పాఠకులకి శాస్తస్రారానే్న నేరుగా యివ్వాలి. కనుక వారు మెచ్చే శైలీ శిల్పాలు పైకి ఎంత అలవోకగా కనిపిస్తాయో లోపల అంత లోతైన ప్రతిభని, గంభీరతని ఇముడ్చుకుని వుంటాయి.
అందుకు ఈ నవల చక్కటి ఉదాహరణ. అటు రచనాప్రతిభ, ఇటు నవలలో ప్రతిపాదించిన విలువలూ - రెండింటిలోను తరచి చూసిన కొద్దీ కనబడే అందాలున్నాయి. రెండింటి గురించీ క్లుప్తంగా చెప్పుకుందాము.
రచనాప్రతిభ: సరళాతిసరళమైన శైలి, అందమైన సన్నివేశాలు, సంభాషణలు, అత్యంత సహజమైన పాత్రచిత్రణ - ఇలా రచనాప్రతిభకి సంబంధించిన ఒక్కొక్క అంశాన్ని గురించీ ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ నేను పాత్ర చిత్రణలో రచయిత్రి చూపిన ప్రతిభని ప్రధానంగా వివరిస్తూ అందులో భాగంగా మాత్రమే మిగిలిన అంశాలని స్పృశించాలనుకుంటున్నాను.
పాత్రచిత్రణకి కొన్ని పద్ధతులుంటాయి. ఉదాహరణకి మనం రామాయణం చూస్తే అందులో.. ఏ మధురపదార్థం పెట్టినా తమ్ముడి కోసం వెతుక్కునే బాల రామయ్య, సీతా ఈ చెట్టు చూడు ఆ పూలు చూడు అంటూ తనను ఆనందపరచిన ప్రతి విషయాన్నీ సీతతో పంచుకునే జానకిరామయ్య - ఇలా రాముడి ప్రవర్తనతోనే రాముడిని పాఠకుల కళ్ళకు కట్టడం ఒక పధ్ధతి. ఇతర పాత్రల సహాయంతో చెప్పడం - యజ్ఞానికి అన్ని ఏర్పాట్లూ చేసుకుని యజ్ఞరక్షణకి రాముడే కావాలి అంటూ ఆ పసివాడికోసం అయోధ్య దాకా వచ్చిన విశ్వామిత్రుడు, రాముడు వచ్చి వాకిట్లో నిలుచున్నాడని తెలియగానే ఆశ్రమంలో నుంచి పరుగెత్తుకు వచ్చిన అగస్త్యమహర్షి - ఇలా వారికి వారే మహామహులు, పూజ్యులు అయిన పాత్రలు రాముడిపై చూపే వాత్సల్యమూ ప్రేమా ఆధారంగా రాముడి వ్యక్తిత్వాన్ని పాఠకుల హృదయంలో నిలపడం మరో పధ్ధతి. పాత్ర చిత్రణకి ఇటువంటి మెళకువలు ఎన్నో చూపుతారు గొప్ప రచయితలు.
ఈ నవలలో అవన్నీ వున్నాయి. ప్రధాన పాత్రల దగ్గరనుంచి అతి చిన్న పాత్ర వరకూ ఈ నవలలోని ప్రతీ పాత్రా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎంతో సహజంగా మనకళ్ళముందు నిలిచిపోతుంది. ఈ నవలలోని మూడు ప్రధాన పాత్రలని తీసుకుని పరిశీలిద్దాము.
మొదటిది కథానాయిక మీనా. ఏమిటి ఈ మీనాలో ప్రత్యేకత? పెద్ద అందమైనది కాదు. ఏ విద్య నేర్పిస్తే ఆ విద్యని టక్కున పట్టుకుని తారాస్థాయికి ఎదిగిపోయే చురుకుతనమూ లేదు. వాళ్ళ అమ్మ డ్యాన్సర్‌ని చేద్దామనుకున్నా డాక్టర్‌ని చేద్దామనుకున్నా ఏదోరకంగా ఒక గొప్ప స్థానంలో నిలుపుదామనుకున్నా కుదరనివ్వని ఈ పిల్ల మీద, ఎప్పుడూ గోళళు కొరుక్కుంటూ కూర్చునే ఈ వింత కథానాయిక మీద సమర్థురాలయిన కృష్ణవేణమ్మగారికి పుట్టినంత చిరాకు పాఠకులకీ పుట్టవలసినదే నిజానికి. కానీ పుట్టదు. పైపెచ్చు బోలెడంత ఆకర్షణ, ఏళ్ళ తరబడి ప్రేమించేంత యిష్టం కలుగుతుంది. ఎలా జరుగుతుంది ఇది? ఒక్క ఆకర్షణీయమైన లక్షణం కానీ ప్రతిభ కానీ చెప్పకుండా ఈ మీనాని అందరికీ యింత నచ్చేలా ఎలా చేయగలిగారు రచయిత్రి? ఆమెని ఈ నవలకి నాయికగా ఎలా నిలపగలిగారు? పరిశీలిస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
కథ చెప్పడానికి మీనాని ఎంచుకోవడం ద్వారానే దాన్ని సాధించారు రచయిత్రి. ఎంత వివరంగా అందంగా చెప్తుంది మీనా కథని! ప్రతీ పాత్రనీ, సందర్భాన్నీ ఎంత చక్కగా వివరిస్తుంది? ఆ పరిశీలనాశక్తికి మనం ఆశ్చర్యపోతాం. అవతలి వారి మాటల్లోని అర్థానే్న కాదు ధ్వనినీ జాగ్రత్తగా పట్టుకుంటుంది. రాజేశ్వరి అన్నయ్యా అని పిలవడంలోని చిన్న గారాబం కావచ్చు, సుందరిని అత్తగారు నువవు కూడా భోంచేయమ్మా అన్నపుడు తర్వాత తింటానులెండి అనడంలోని కచ్చితత్వం కావచ్చు - ఇలా వంటమనిషి తాయారమ్మ దగ్గర్నుంచి పొరుగు రాష్ట్రానికి చెందిన మామీ వరకూ ప్రతి పాత్రనీ ఎంత బాగా పరిశీలిస్తుంది, వాళ్ళ మాటల్లో ప్రవర్తనలో అలవాట్లలో వున్న సూక్ష్మాతిసూక్ష్మమైన అంశాలని కూడా ఎంత బాగా అర్థం చేసుకుంటుంది, మరెంత బాగా మనకి వాళ్ళ గురించి చెప్తుంది! ఇంకా ముఖ్యంగా తనని తాను ఇంకెంత బాగా అర్థం చేసుకుంటుంది? - అన్న విషయం మనలని అబ్బురపరుస్తుంది. మీనాకి వున్న ఈ శక్తినీ ప్రతిభనీ ప్రత్యేకంగా చెప్పకుండానే మనకి అర్థమయేలా చేసి తద్వారా ఆ పాత్రని ఆకర్షణీయం చేశారు రచయిత్రి.
కొన్ని చోట్ల చాలా అమాయకంగాను ఉక్రోషంగాను ఆలోచిస్తుంది మీనా. మరికొన్ని చోట్ల చాలా తెలివిగాను పరిపక్వతతోను ఆలోచిస్తుంది. ఇవి నిజానికి వైరుధ్యాలుగా కనిపించాలి. కానీ అలా అనిపించదు. ఎందుకంటే తెలివిగాను పరిపక్వతతోను ఆలోచించించిన సందర్భాలన్నిటికీ అమె స్వభావంలో వున్న మంచితనం కారణమనీ రెండవరకం ప్రవర్తనకి తల్లి పెంపకం వలన ఏర్పడిన అసంతృప్తి కారణమని మనకి అర్థమవుతూనే వుంటుంది కనుక.
వాళ్ళ అమ్మ చూపించే ప్రేమకీ నాన్న చూపించే ప్రేమకీ మధ్యనున్న తేడాని పట్టుకోగల సునిశిత పరిశీలన, అలాగే కృష్ణ వ్యక్తిత్వానికీ కృష్ణవేణమ్మగారి వ్యక్తిత్వానికీ మధ్యనున్న పోలికలనీ తేడాలనీ గుర్తించగల నేర్పు, తల్లిదండ్రుల మధ్యనున్న అభిప్రాయభేదాలని తనకి అనుకూలంగా ఉపయోగించుకునే గడుసుతనం, కృష్ణకీ అతని కుటుంబానికీ సహాయపడాలన్న తాపత్రయం, తనవలన (ఒకరకంగా తనకి ప్రత్యర్థి అయి) సుందరి బాధపడినపుడు కూడా పశ్చాత్తాపపడగలిగినంతటి సంస్కారం - ఇలా ఎన్నో విభిన్న లక్షణాల సమ్మేళనం మీనా వ్యక్తిత్వం.
పాఠకులు నవ్వాపుకోలేనంత కొంటెతనం కొన్ని చోట్ల కనిపిస్తుంది. ‘‘రాజు నన్ను సారథిని గురించిన కబుర్లు ఏమైనా చెప్పమని ప్రాణాలు తోడింది. నేను నోటికి వచ్చినట్టు వున్నవీ లేనివీ అన్నీ చెప్పసాగాను. అది వళ్ళంతా చెవులు చేసుకొని విన్నంత శ్రద్ధగా వినసాగింది.’’ అంటుంది ఒకచోట. అలాగే సారథిని అయోమయానికి గురిచేసే కొన్ని అబద్ధాలు, తాయారమ్మని మభ్యపెట్టేందుకు చెప్పే గడుసు మాటలు - ఇవన్నీ మామూలుగా కథానాయికలలో కనిపించని విభిన్న లక్షణాలని చూపిస్తాయి. మరికొన్ని చోట్ల కొన్ని లోతయిన ఆలోచనలు చేసే గాంభీర్యమూ కనిపిస్తుంది. ‘‘ప్రపంచం ఇంత వేగంగా మారిపోవడానికి మూలకారణం ఏమిటి?’’ వంటి ఆలోచనలు అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
తర్వాత నవలలో ముఖ్యంగా చెప్పుకోవలసినది కృష్ణ పాత్రచిత్రణ. ఇది చాలా గొప్పగా చేశారు రచయిత్రి. పైన రామాయణంలోని ఉదాహరణలు చెప్పుకున్నాము కదా! అలాగే ఇక్కడ కూడా నేరుగా కృష్ణ మాట్లాడే మాటల ద్వారా అతని ప్రవర్తన ద్వారా కృష్ణ వ్యక్తిత్వంలోని కొన్ని విషయాలు మనకి అర్థం చేస్తే ఇతర పాత్రల ద్వారా మరికొన్ని విషయాలు అర్థం చేస్తారు రచయిత్రి.
మీనా కాళ్ళో ముళళు గుచ్చుకోవడం, ఆవు ఈనడం, ఎద్దు కట్టు తెంపుకోవడం, ఊర్లో నాటకం వేయడం, రాజేశ్వరిని చూడటానికి పెళ్ళివారు రావడం - ఇలాంటి అత్యంత సాధారణ సన్నివేశాలనుపయోగించుకుని ఒక మనిషి ధైర్యాన్ని, సున్నితత్వాన్ని, పట్టుదలని, బాధ్యతాయుతమైన నడవడిని రచయిత్రి మన కళ్ళకు కట్టే తీరు చాలా గొప్పగా వుంటుంది.
కథలోని పెద్ద పెద్ద మలుపులతోనే కాదు - రాజేశ్వరి కొంచెం అందంగా తయారయి పేరంటానికి వెళ్ళివచ్చినపుడు ‘‘అమ్మా రాజుకి దిష్టి తీయమని చెప్పాను, తీశావా!’’ అని అడగడం వంటి చిన్న చిన్న అంశాలతోను అతని వ్యక్తిత్వాన్ని చిత్రిస్తారు రచయిత్రి.
ఇక నవలలోని ప్రధాన పాత్రలలో ఒకటైన రాజేశ్వరి తన అన్నగారి గురించి చెప్పే మాటలు - అణువంత అసహజత్వం లేకుండా చాలా స్వచ్చంగా ధ్వనించే ఆ మాటలు కృష్ణని అర్థం చేసుకోవడానికి మనకి ఎంత బాగా ఉపయోగపడతాయో అంతే బలంగా నవలలోని చిన్న చిన్న పాత్రల మాటలు కూడా మనం ఆ వ్యక్తిత్వం పట్ల ఆకర్షితులమవడానికి సహాయం చేస్తాయి.
కరణంగారి భార్య కృష్ణకోసం ప్రత్యేకంగా లడ్డూలు వగైరా యిచ్చి ‘‘కృష్ణుడికి పెట్టవే రాజూ! వాడీ మధ్య ఆతోట హడావుడిలో పడి బొత్తిగా మా యింటికి రావటం మానేశాడు. అమ్మమ్మకి కోపం వచ్చిందని చెప్పు.’’ అని చెప్పడం... అలాగే విజయవాడలోని కృష్ణ పిన్నిగారి పాత్ర, కృష్ణ మీద ఈగైనా వాలనివ్వనట్లుండే ఆవిడ ధోరణి, ‘‘వాడిని తిట్టేవాళళు ఎవరే అమ్మా! వాడిని తిడితే కళళు పోతాయి. దరమరాజు’’ అంటూ అతడిని వెనకేసుకుని వచ్చే ఆవిడ మాటలు మొదలైనవన్నీ పాత్ర చిత్రణలో రచయిత్రి చూపిన ప్రతిభకి తార్కాణాలు.
రాజేశ్వరి పెళ్ళి చూపులపుడు ఖరీదైన అలంకారాలు వద్దని కచ్చితంగా చెప్పడం, అంతలోనే చెల్లెలు చిన్నబుచ్చుకుందేమోనని బాధపడి బుజ్జగించినట్లుగా మాట్లాడటం.. ఆమె కంటి కాటుకను స్వయంగా సరిచేయడం, మీనా పొలం దగ్గర తన మాటలకు బాధపడి కోపంగా యింటికి వచ్చేసినపుదు రాత్రిపూట తను వచ్చేసరికి పిల్లలందరూ పడుకుని వుంటే, మీనా అన్నం తిన్నదా లేదా అని తల్లిని అడిగి కనుక్కోవడం... ఇటువంటి విషయాలు రచయిత్రి ఒక వ్యక్తిలో చూసి వ్రాసి వుంటే ఆ పరిశీలనకు, ఒకవేళ ఊహించి వ్రాసి వుంటే ఆ సృజనాత్మకతకు ఎన్ని ప్రశంసలు అందించినా తక్కువే అవుతాయి.
మనిషికి ఉండవలసిన పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని కృష్ణ పాత్రచిత్రణ ద్వారా మనకి చక్కగా అర్థం చేస్తారు రచయిత్రి. నిజంగా సమర్థులయిన వాళళు శక్తి కలిగినవాళళు పైకి చాలా మామూలుగా కనిపిస్తారు. ఎప్పుడైనా అరుదుగా వాళళు తమ శక్తిని చూపించినపుడు దానిని గుర్తించి వాళ్ళని గౌరవించే నేర్పు అందరికీ వుండదు. ఈ నవలలో ఆ లక్షణం కృష్ణకీ, ఆ నేర్పు మీనాకి వుందని చెప్పి ఇద్దరినీ మనకి ఆకర్షణీయంగా మలుస్తారు రచయిత్రి. ఒక సందర్భంలో మీనా అనుకుంటుంది ‘‘దేని మీదా ఆసక్తి లేనట్లుగా నిర్లిప్తంగా కనబడే అతని మన్స్తత్వాన్ని గమనించిన నేను అతడ్ని జడుడిగాను, మందమతిగాను భావించుకున్నాను, కానీ అజ్ఞాతంగా అతనిలో ఇంత శక్తి దాగుందని తెలిసిన ఈ క్షణంలో చకితురాలినయ్యాను.’’ అని.
ఇక సారథి పాత్ర. ఇది మొదటి భాగంలో ఒకరకంగా ప్రతినాయకుడి పాత్రలాంటిది. కానీ రెండవభాగానికి వచ్చేసరికి ఈ పాత్ర స్వభావం మారుతుంది. మారుతుందంటే అతనేమీ మారడు. అతను మీనాకి, ఆమె ద్వారా మనకీ అర్థమయ్యే తీరు మారుతుంది. దానిని రచయిత్రి ఎంత నేర్పుగా సాధించారో గమనించి తీరాలి. మొదటి భాగంలో సారథి కొంత స్వార్ధమూ, వ్యామోహమూ వున్నవాడిలా కనిపిస్తాడు. రెండవభాగంలో ఆ లక్షణాలని ప్రత్యేకించి ఖండించకుండానే అతనిలో వున్న మంచి లక్షణాలని మెల్లమెల్లగా చెప్తూ వస్తారు రచయిత్రి. మొదటి భాగం చివర్లో మొదలవుతుంది ఆ ప్రణాళిక. అనుకోకుండా హనుమంతరావుగారికి చాలా డబ్బు వచ్చినపుడు కృష్ణవేణి ఇది సారథి అల్లుడు కాబోతున్నందువలన పట్టిన అదృష్టం అంటూ ఆ ఘనతని అతనికి కట్టబెడుతుంది. అయితే సారథి ఆమాటలు విని ఠీవిగా ఫోజుగా కూర్చోకపోవడం, తనకి అంటగట్టిన అదృష్టాన్ని మోయలేనివాడిలా సర్దుకు కూర్చోవడం మీనాని ఆశ్చర్యపరుస్తుంది. ‘‘సారథి నాకు నచ్చిన మొదటి క్షణం అది’’ అంటుంది మీనా అక్కడ. ఇక రెండవ భాగంలోకి రాగానే మీనా మెడ్రాస్ ప్రయాణానికి పథకం వేయడం, తండ్రి చూసేట్లుగా కంచంలో మెడ్రాస్ అని వ్రాస్తే సారథి ఆవిషయాన్ని చురుకుగా గ్రహించేయడం, కృష్ణవేణి ‘‘మీరు కూడా వెళ్ళరాదూ!’’ అన్నపుడు తను రావడం మీనాకి యిష్టం లేదని అర్థం చేసుకుని ‘లేదండి, నాకు పనులున్నాయి’ అంటూ తప్పుకోవడం, తర్వాత అతని పరోక్షంలో కూడా మీనా ఆ విషయాన్ని గుర్తు చేసుకుని ‘‘సారథి నేను అనుకున్నంత మూర్ఖుడు కాదేమో!’’ అనుకోవడం, ఆతర్వాత రాజేశ్వరి ప్రత్యేకతని గుర్తించి అతను చెప్పే మాటలు, కృష్ణ విషయంలో అనుమానం వచ్చినపుడు ‘‘నేను నిజాన్ని సహించగలను కానీ మోసాన్ని భరించలే’’నంటూ మీనాతో కచ్చితంగా చెప్పడం, చివర్లో అతను రాజేశ్వరికి వ్రాసే ఉత్తరం- ఇలా ఆ పాత్రపట్ల మన భావాలని చాలా జాగ్రత్తగా మారుస్తూ వస్తారు రచయిత్రి.
నవల మొదట్లో ఒక రకంగా ఉన్న పాత్ర చివరికి మరొకరకంగా మారడం, నవల సాగుతూ వుంటే పాత్ర క్రమంగా పరిణామం చెందడం అనేది మనం సాధారణంగా చూసే విషయం. కానీ ఒకేరకంగా వున్న పాత్రని మనం అర్థం చేసుకునే తీరు మారడం.. సారథి అలాగే ఉండగా అతనిని నవల మొదట్లో ఒకరకంగా అర్థం చేసుకున్న మనం చివరికొచ్చేసరికి అపార్థాలు తొలగించుకుని అతన్ని అభిమానించగలగడం.. ఇది ఈ నవలలో మాత్రమే కనబడే ప్రత్యేకత. పాత్రని కాక పాఠకులనే మార్చడం అనే గమ్మతె్తైన ప్రక్రియని రచయిత్రి యిక్కడ చూపారు.
ఈ మూడు పాత్రల గురించే ప్రధానంగా చెప్పినప్పటికే నవలలోని చిన్నా పెద్దా పాత్రలన్నిటి చిత్రీకరణలోను రచయిత్రి నేర్పు మనకి అర్థమవుతుంది. ముఖ్యంగా మరొక రెండు ముఖ్యమైన పాత్రలయిన కృష్ణవేణి, హనుమంతరావుగార్ల చిత్రీకరణ. మనిషి ఎక్కడ ఎంతవరకూ లొంగి ఉండాలో, ఎక్కడ గట్టిగా మాట్లాడాలో, ఏ విషయాలలో అహాన్ని అణచుకోవాలో ఏ సందర్భాలలో ఆగ్రహాన్ని ప్రదర్శించాలో హనుమంతరావుగారి పాత్ర ద్వారా స్పష్టంగా తెలియచెప్తారు రచయిత్రి. ఒక సందర్భంలో మీనా అంటుంది ‘‘నాన్నగారు ఎప్పుడూ యింతే. నావైపు నిలబడి అమ్మతో పోట్లాడుతూనే వుంటారు. మళ్ళీ నేను కాస్త ఏ మాత్రం ఆవిడ పట్ల వ్యతిరిక్తత కనపరిచినా నా ఆలోచనలని యిట్టే పసిగట్టేసి నన్ను మందలిస్తూ, కూతురుగా నా కర్తవ్యం హెచ్చరిస్తూ వుంటారు.’’ అని.
ఇలా అందమైన వ్యక్తిత్వం వున్న పాత్రలని సృష్టించడంలోను ఆ పాత్రలని అంతే బలంగా పాఠకులకి అర్థం చేయడంలోనూ రచయిత్రి చూపిన ప్రతిభ ఈ నవలలో తరచి చూసిన కొద్దీ కనిపిస్తూనే వుంటుంది. అబ్బురపరుస్తూనే వుంటుంది.
విలువలు :
ఈ నవల సమర్థించిన విలువల గురించీ సిద్ధాంతాల గురించీ రెండు మాటలు చెప్పుకుందాం. ఇందులో ప్రస్తావించబడిన ఒక ప్రధానమైన విలువ భౌతికాంశాలకి తక్కువ ప్రాధాన్యతని యివ్వడం. దీనిని ఒక సిద్దాంతంలా ప్రవచించకుండానే కేవలం పాత్రచిత్రణతోనే చిన్నపిల్లలకి కూడా అర్థమయ్యేంత స్పష్టంగా వివరిస్తారు రచయిత్రి. నవల మొదట్లో హనుమంతరావుగారు భార్యతో అంటారు ‘‘మీనాకున్న విచక్షణా జ్ఞానంలో వెయ్యోవంతయినా నీకుంటే నువవు దాన్ని సరిగా అర్థం చేసుకోగలిగేదానివి.’’ అని. అప్పటికి మనకి లౌకిక వ్యవహారాలలో కృష్ణవేణమ్మగారి సమర్థత ఎలాంటిదో మీనా చెప్తుంది. ఎందులోనూ అంతగా పైకి రాని తన నిర్వాకాల గురించీ చెప్తుంది. అందుకే హనుమంతరావుగారు అంత పెద్ద మాట వాడితే మనం ఆశ్చర్యపోతాం. ఎంతైనా మరీ కూతురికున్న విచక్షణలో వెయ్యోవంతు కూడా తల్లికి లేదనడం సరికాదేమోనని సందేహపడతాం. అయితే దానికి సమాధానం ఆ వెంటనే దొరుకుతుంది మనకి. సారథిలో కృష్ణవేణి గమనించే లక్షణాలు ఏమిటో మీనా గమనించే లక్షణాలు ఏమిటో చెప్పడం ద్వారా ఆ సందేహాన్ని తీర్చేస్తారు రచయిత్రి. ‘‘విచక్షణ’’ అంటే ఏమిటో దాని స్వరూపమేమిటో తానేమీ చెప్పకుండానే మనకి అర్థం చేస్తారు.
గమనించవలసిన మరొక విషయమేమిటంటే ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదం చేసేటంతటి సంపూర్ణమయిన విచక్షణ తమ స్వభావంలో లేనిపాత్రలు కూడా మరీ యుక్తాయుక్తాలు తెలియకుండా ప్రవర్తించవు. మనిషికి ఉండవలసిన కనీసపు సంస్కారాన్ని కలిగి వుంటాయి. భౌతికమైన విషయాలకీ ఆడంబరానికీ విలువనిచ్చే మనస్తత్వం వున్న కృష్ణవేణి కూడా కొన్ని కొన్ని విలువల విషయంలో సర్దుకుపోదు. చిన్నతనంలో మీనాకి పెద్దవాళ్ళ దగ్గర అందులోనూ గురువుగారి దగ్గర ఎలా మెలగాలో చెవులు మెలిపెట్టి మరీ చెప్పడం వంటి ఉదాహరణలతో ఈ విషయాన్ని చక్కగా చెప్తారు నవలలో. నిజానికి పిల్లల పెంపకానికి సంబంధించి కూడా ఇటువంటి విలువైన విషయాలు ఎన్నో ఉన్నాయి ఈ నవలలో. మీనా రెండోసారి నిమ్మలూరు వెళ్ళేటపుడు ఎంత బ్రతిమిలాడినా హనుమంతరావుగారు కెమెరా ఇవ్వకపోవడం... తల్లికి యిష్టం లేకుండా ఎవరో ఫ్రెండుకి తమ అడ్రస్ యిచ్చి ఉత్తరాలు వ్రాస్తానంటూ మీనా అనుమతి అడిగినపుడు మామీ ‘‘మీనాన్నకి తెలుసా’’ అని అడిగి ‘‘సరే అయితే యివవు’’ అనడం, ఆ విషయం ధ్రువపర్చుకోవడానికేనేమో నన్నట్లు మొదలియార్ గారు ఆ ఉత్తరాన్ని కోర్టుకి తీసుకెళ్ళి హనుమంతరావుగారికి ఇవ్వడం.. ఇటువంటి చిన్న చిన్న విషయాలెన్నో కథాగమనంలో కలిసిపోయినట్లు కనబడుతూనే మనకి చాలా విషయాలు నేర్పుతాయి.
కృష్ణ ఇంట్లోని పిల్లల విషయమూ అంతే. అత్తయ్య పెద్దగా చదువుకోకపోయినా ఎప్పుడూ యింటి పనులతో సతమతమవుతూ పిల్లల సంగతి పెద్దగా పట్టించుకోనట్లుగా వున్నా ఆవిడ పిల్లలందరూ చక్కటి క్రమశిక్షణతో వుండడం, మరొక వైపున అందరూ గారాలపట్టి అనుకునే తనకు కూడా లేనంత స్వేచ్ఛా గారాబమూ కూడా వాళ్ళకి వుండడం - అదంతా సునిశితంగా గమనిస్తుంది మీనా. కారణమేమిటని ఆలోచిస్తుంది. ఒక నలభై పేజీలు కథ నడిచాక అప్పుడు తెలుసుకుంటుంది... అందుకు కారణం కృష్ణ అని. ఈ పుస్తకంలో చెప్పబడిన మరొక గొప్ప విలువ స్వార్థరహితంగా సహనంగా ప్రవర్తించడం. ఆ విషయాన్ని పాత్రల ద్వారా సన్నివేశాల ద్వారా కథాగమనం ద్వారా నవల మొత్తంలోనూ మనకి అర్థం చేస్తారు రచయిత్రి. ఒక చోట స్పష్టంగా ఒక పాత్ర చేత చెప్పిస్తారు కూడా.
‘‘అవతలివాళళు (తల్లి, తండ్రి, భర్త, స్నేహితులు ఎవరైనా) మనపట్ల చూపవలసిన బాధ్యతా ప్రేమా చూపనపుడు మనం మాత్రం వారి పట్ల ఆ ప్రేమనీ బాధ్యతనీ ఎందుకు కలిగివుండాలి? ఆ ఊరికి ఈ వూరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ వూరూ అంతే కదా!’’ అని ఒక సందర్భంలో మీనా వేసిన ప్రశ్నకి హనుమంతరావుగారి జవాబు ఇలా వుంటుంది. ‘‘అది వట్టి స్వార్థపరులు చేసే వితండవాదన. నిన్ను ప్రేమించిన వాళ్ళని నువవు తిరిగి ప్రేమించడంలో నీ గొప్పేమీ లేదు. నీ వాళళు అనుకున్నవాళళు తెలిసో తెలియకో మూర్ఖత్వంలో నిన్ను గుర్తించలేక పోతే నీ తెలివితేటలతో వారిలో చైతన్యం తెప్పించి, నిన్ను సరిగ్గా అర్థం చేసుకునేలా చేయాల్సిన బాధ్యత నీమీద వుంది.’’
ఇక చివరిగా స్ర్తీ స్వేచ్ఛకి సంబంధించి ఈ పుస్తకంలో మనకి కనబడే అభిప్రాయాలపై కూడా ఒకసారి దృష్టిని సారిద్దాం. పట్నంలో ఎంతో అధునాతనంగా పెరిగినప్పటికీ మీనా స్వేచ్ఛ అనే మాటకి అర్థం చక్కగా తెలిసినదానిలా ప్రవర్తిస్తుంది. సారథిని పెళ్ళి చేసుకోవడం యిష్టం లేదని తండ్రితో చెప్పేటపుడు ‘‘అతని సమక్షంలో నేను గొంగళిపురుగులా ముడుచుకు పోతాను. హాయిగా నవ్వలేను. నిర్భయంగా మాట్లాడలేను. నేను అల్పురాలిననే భావం నన్ను వదలదు’’ అంటుంది. అంటే హాయిగా నవ్వగలగడం, నిర్భయంగా మాట్లాడగలగడం ఆమె ఆకాంక్షించే విషయాలే. ముడుచుకుపోతూ దైన్యంగా గడపడం అనేది ఆమె భరించలేని అంశమే. అదే సమయంలో పెడసరంగా అవినయంగా ప్రవర్తించడాన్నీ, అవతలివారి ఇబ్బందిని గ్రహించకుండా తన పంతమే ముఖ్యమన్నట్లుగా వ్యవహరించడాన్ని కూడా ఆమె ఒప్పుకోలేదు. సుందరి గొడవపెట్టుకుని పెళ్ళి యింటినుంచి చీకట్లో వెళ్ళిపోయినపుడు ‘‘తనమాట సాగనందుకు అంత కోపమా! ఆడదానికి ఎప్పుడూ అంత తెగింపు మంచిది కాదేమో!’’ అనుకోవడం అందుకు తార్కాణం. పటిష్టమైన సన్నివేశాలతో సంభాషణలతోనాలుగు తరాల తెలుగు పాఠకులని అలరించిన చక్కటి నవల ఇది.

-టి. శ్రీవల్లీ రాధిక