మెయిన్ ఫీచర్

ముదితల్ నేర్వగరాని విద్యగలదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ముదితల్ నేర్వగరాని విద్యగలదే! ముద్దార నేర్పించినన్’’ అంటూ ప్రతి మహిళా సభలోనూ వక్తలు నొక్కి వక్కాణించే పద్యపాదం చిలకమర్తి లక్ష్మనరసింహం (1867-1946)గారు రచించిన ‘నరకాసురవధ’ అను ప్రసన్న యాదవము అనే నాటకంలోనిది.
చిలకమర్తిగారు వీరేశలింగం పంతులుగారి శిష్యులు. గురువుగారు చూపిన స్ర్తి జనోద్ధరణ మార్గానే్న వారూ అనుసరించారు. అందుకే కృష్ణుని కొరకు ఒక కంట శృంగారాన్నీ, నరకుడి కొరకు మరొక కంట వీర రసాన్నీ ఒలికించిన నారీశిరోమణిగా సత్యభామను మహోన్నతంగా చిత్రించారు.
సత్యభామ రణకౌశలానికి ముచ్చటపడిన శ్రీకృష్ణుడు-
‘‘చదువనే్నర్తురు పూరుషుల్బలెనె, శాస్త్రంబుల్ పఠింపించుచో
అదమనే్నర్తురు శత్రుసేనల ధనుర్వ్యాపారముల్ మెచ్చుచో
నుదితోత్సాహము నేలగలరుర్విన్ ప్రతిష్ఠింపుచో
ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించినన్’’- అంటాడు రథాన్ని తోలే దారకునితో.
ఇంకా-
కం ఎగిరిపడితి నిన్నాళులు
మగవాండ్ర భుజాబలంబు మాటగనక, సి
గ్గగునిప్పుడు మీ ముందర
మగువా! యిక సాగిరావు మా మగతనముల్’’
అని అంటాడు సత్యభామతో. పురుష పుంగవులకు కాస్త డామేజింగా ఉండటంవల్లో ఏమో! ఈ పద్యం మాత్రం ప్రాచుర్యం పొందలేదు.
నరకాసుర సంహార సందర్భంలో శ్రీకృష్ణుడు సత్యభామను ప్రోత్సహించిన తీరు అనుపమానం, అనుసరణీయం. దుష్టసంహారానికి, దురాచార నిర్మూలనానికీ మగవాళ్ళు పూనుకోవడం ఎంత అవసరమో, మహిళామణులకు ప్రేరణనివ్వడమూ అంతే ముఖ్యం. నాడు నరకాసురుడి చేష్టలూ, దురాగతాలూ బహిరంగం. వాడి అంతరంగం సుస్పష్టం. కానీ నేడు ఏ మగాడు ఎప్పుడు మృగాడుగా మారతాడో అనూహ్యం. అందుకే ప్రతి మహిళా నిరంతరం జాగరూకురాలై, సత్యభామా స్వరూపమై నవ నరకాసుర నిర్మూలనానికి సర్వసన్నద్ధంగా ఉండాల్సిన పరిస్థితి.
మంత్రద్రష్టులైన గార్గి, కాత్యాయని వంటివారిని, దేవాసుర సంగ్రామంలో సైతం పాల్గొన్న రణతంత్ర విశారదురాలైన కైకనూ, మగ మహారాజుల్ని సైతం ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు త్రాగించిన నాయకురాలు నాగమ్మ మంత్రాంగాన్నీ, ఎనిమిది పదుల వయస్సులోనూ కదన కళాకౌశలాన్ని చూపించిన రాణీ రుద్రమనూ, బ్రిటీషువారిని అసమాన ధైర్య సాహసాలతో గడగడలాడించిన ఝాన్సీ లక్ష్మినీ, అంతరిక్షాన్ని తన కార్యక్షేత్రంగా మలచుకొన్న కల్పనా చావ్లానూ తలచుకొంటే ‘ముదితల్ నేర్వగరాని విద్య గలదే! ముద్దార నేర్పించినన్’ అన్నది పదహారణాల నిజమనిపిస్తుంది.

-డి.వి.ఎమ్.సత్యనారాయణ 9885846949