ఎడిట్ పేజీ

మావోయిస్టులతో చర్చలకు అడ్డేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్యాంగాన్ని ధిక్కరించే రాజకీయ పార్టీలు, సంస్థలు, వ్యక్తులను జనజీవన స్రవంతిలోకి తేవాలంటే చర్చలకు మించిన ప్రక్రియ మరొకటి లేదు. చర్చల వల్ల సమస్యల మూలాల గురించి ఆలోచించేందుకు అవకాశం లభిస్తుంది. బద్ధశత్రువులైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా నియంత కిమ్ మధ్య తాజాగా సింగపూర్‌లో చర్చలు జరగంగా లేనిది- ‘దారి తప్పిన’ మన కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ఇక్కడి ప్రభుత్వాలకు ఉన్న అడ్డంకులేమిటి? టీవీ చానళ్లలో చర్చలు, మేధావుల వ్యాఖ్యల వల్ల సమస్యలకు పరిష్కారాలు దొరకవు. మొండికేసిన ఉత్తర కొరియాను దారికి తెచ్చేందుకు చర్చల ప్రక్రియ ఉపయోగపడింది. భవిష్యత్తులో ఆ హామీలకు కిమ్ కట్టుబడి ఉంటారా? లేదా? అన్నది వేరే సంగతి.
పదమూడేళ్ల క్రితం హైదరాబాద్‌లో నక్సలైట్లు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నక్సలైట్లతో చర్చలు జరిపిన ఏకైక ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచింది. ఆ చర్చలు సఫలమయ్యాయా? విఫలమయ్యాయా? అనే సంగతి పక్కనపెడితే, నక్సల్స్ సమస్యపై ఆనాడు వైఎస్ చూపిన చొరవ ప్రశంసలు పొందింది. 2005 ఆగస్టులో చర్చలు జరిగినపుడు మంజీరా అతిథిగృహంలో నక్సలైట్లు బస చేశారు. చర్చల సమయంలోనే పీపుల్స్ వార్ గ్రూప్ సిపిఐ మావోయిస్టు పార్టీగా అవతరించింది. ఆ చర్చల ప్రకియ ఆ తర్వాత కొనసాగలేదు. కొన్నాళ్లు కాల్పుల విరమణ కొనసాగింది. ఆ తర్వాత మళ్లీ హింస ప్రజ్వరిల్లింది. నక్సలైట్ల బలాలు, బలహీనతలు ప్రభుత్వానికి తెలిసేందుకు చర్చలు దోహదపడ్డాయని కొందరు వ్యాఖ్యానించారు. చర్చల వల్ల నష్టపోయామన్న మావోయిస్టులు కొందరు ఉన్నారు. చర్చల వల్ల అనూహ్యమైన పరిణామాలేవీ జరగవు. మంచోచెడో తాము నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వారిలో 20 శాతం మంది ఎప్పటికీ మారరు.
మావోయిస్టు కార్యకలాపాలు ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశాల్లో ఎక్కువగా ఉన్నాయి . ఏపీ, తెలంగాణల్లో మావోయిస్టు ప్రభావిత జిల్లాలు ఉన్నా, వారి ఉనికి ప్రస్తుతం నామమాత్రమే. 1999 నుంచి 2016 వరకు మావోల హింసకు, ఎదురుకాల్పులకు 13,219 మంది బలయ్యారు. హోంశాఖ విడుదల చేసిన గణాంకాలను విశే్లషిస్తే మొత్తం 26511 ఘటనలు జరిగాయి. 7615 మంది పౌరులు, 2585 మంది భద్రతా సిబ్బంది, 3019 మంది మావోయిస్టులు మరణించారు. 2017లో 109 మంది పౌరులు, 74 మంది పోలీసులు, 150 మంది మావోలు కలిపి 333 మంది వామపక్ష తీవ్రవాద హింసాకాండలో మరణించారు.
వామపక్ష తీవ్రవాదాన్ని అంతర్గత భద్రత సమస్యగా కేంద్రం పరిగణిస్తోంది. శాంతిభద్రతల అంశమైనందున రాష్ట్రప్రభుత్వాలు మావోయిస్టు సమస్యను ఎదుర్కొనాలి. దేశ సార్వభౌమత్వానికి సవాలు విసురుతూ దండకారణ్యం కేంద్రంగా మావోలు విస్తరిస్తున్నందున కేంద్రం భద్రతా బలగాలను రాష్ట్రాలకు పంపి గాలింపు చర్యల్లో సహాయపడుతోంది. 1967 నుంచి 2007 వరకు మూడు దశాబ్దాల పాటు జరిగిన ఎదురుకాల్పుల్లో ఎంతోమంది మావోయిస్టులు, పోలీసులు, రాజకీయ నాయకులు, పౌరులు బలయ్యారు. కాలక్రమంలో తెలంగాణ, ఆంధ్ర నుంచి నక్సలైట్లు దండకారణ్యానికి మకాం మార్చారు.
జమ్మూ కశ్మీర్ సమస్య అందరికీ తెలిసిందే. ఉగ్రవాద సంస్థలకు, పాకిస్తాన్ ప్రభుత్వానికి కొమ్ముకాసే హురియత్ కాన్ఫరెన్స్‌ను చర్చలకు ఆహ్వానించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ‘హురియత్’ నేతలతో చర్చలు జరపడం రివాజుగా వస్తోంది. కాశ్మీర్‌ను వివాదాస్పద ప్రాంతమని అంగీకరించాలని, చర్చల్లో పాకిస్తాన్‌ను భాగస్వామిని చేయాలనే డిమాండ్‌తో చర్చలకు హురియత్ నేతలు వస్తున్నందున భేటీ తర్వాత ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. దిల్లీకి వచ్చే హురియత్ నేతలు పనిలో పనిగా పాకిస్తాన్ రాయబారిని కలిసి వెళతారు. ఈ చర్యలు పార్టీలకు అతీతంగా దేశభక్తులందరికీ ఆగ్రహం తెప్పిస్తాయి. చర్చల ప్రక్రియ కనుక పెద్దమనుషులు నోరుమూసుకుంటారు. ఈ చర్చల వల్ల ఫలితం ఉండదు. దేశ సరిహద్దుల్లో రక్తం పారుతూనే ఉంది. మన జవాన్లు, సరిహద్దు ప్రజలు ప్రతి రోజూ అమరులవుతున్నారు. కాశ్మీర్ వేర్పాటు వాదులు ఉగ్రవాద సంస్థలతో అంటకాగుతూ, మతోన్మాదానికి ఆజ్యం పోస్తుంటారు. కాని భారత్ ప్రభుత్వం ఎంతో సహనంతో, వారిని జన జీవన స్రవంతిలోకి తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. అప్పుడప్పుడు చర్చల ప్రక్రియకు ముందు సీనియర్ అధికారులను పంపి నివేదికలు తెప్పించుకుంటుంది. ఇదీ కాశ్మీర్ చర్చల కథ.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీని చర్చల ప్రక్రియలో ఎందుకు భాగస్వాములను చేయకూడదు ? నక్సలైట్లు దేశభక్తులని ఎన్టీఆర్ అంటే, మావోయిస్టుల అజెండానే తమ అజెండా అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారంటే- సిద్ధాంత విభేదాలే తప్ప మావోలు జాతివిద్రోహులు కారనే విషయం స్పష్టమవుతుంది.
కాగా, ప్రధానమంత్రి మోదీ హత్యకు మావోలు కుట్ర పన్నారన్న సమాచారం ఇటీవల బహిర్గతమైంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ రాజకీయ కోణంలో చేసిన ప్రకటన గర్హనీయం. ఆ తర్వాత తాను చేసిన తప్పును ఆ పార్టీ సరిదిద్దుకుంది. తుపాకీ ద్వారా అధికారాన్ని సాధిస్తామనే సిద్ధాంతవాదులు అధికారంలో ఉన్న నేతలపై గురిపెట్టడం కొత్తకాదు. ఇవేమీ తెలియనట్లు కాంగ్రెస్ పార్టీ నోరుజారింది. తన తండ్రి రాజీవ్ గాంధీ, నాయనమ్మ ఇందిరా గాంధీని ఉగ్రవాదుల హింసకు పొగొట్టుకున్న రాహుల్ గాంధీ తేలికగా మాట్లాడడం సరికాదు. ఏపీ సీఎం చంద్రబాబుపై గతంలో నక్సలైట్లు తిరుమలలోని అలిపిరి వద్ద హత్యాప్రయత్నం చేశారు. అసెంబ్లీ స్పీకర్ శ్రీపాదరావు, మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డిని నక్సలైట్లు హత్య చేశారు. సీనియర్ ఐపీఎస్‌లు వ్యాస్, పరదేశీ నాయుడు, ఉమేష్ చంద్ర సహా ఎంతోమంది పోలీసు అధికారులు నక్సలైట్ల హింసకు బలయ్యారు. కొందరు విద్యావంతులు, పౌరులు నక్సలైట్ల ఉద్యమంలో చేరి పోలీసు కాల్పుల్లో మరణించారు. దండకారణ్యం అభివృద్ధి కావాలన్నా, మధ్య భారతంలో శాంతి వికసించాలన్న మావోయిస్టులను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి. జనజీవన స్రవంతిలోకి తేవాలి. వామపక్ష ప్రభావిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డిజిపిలతో పాటు ముఖ్యమంత్రుల సమావేశాన్ని కేంద్రం నిర్వహించి వారి అభిప్రాయాలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారంతో మావోలతో చర్చలకు కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలో మానవీయ కోణం ఉన్న సీనియర్ అధికారులను, పోలీసు అధికారులను సభ్యులుగా నియమించాలి. నిస్వార్థ సామాజిక కార్యకర్తలు, మావోయిస్టు ఉద్యమాన్ని అధ్యయనం చేసిన నిపుణులకు అవకాశం కల్పించాలి.
ప్రధాని మోదీ రెండేళ్ల క్రితం ఓ సదస్సులో మాట్లాడుతూ, 21వ శతాబ్ధంలో ఉగ్రవాదమైనా, ఎటువంటి సంఘర్షణనైనా ఎదుర్కొనేందుకు చర్చల ప్రక్రియ ఉత్తమమైనదని పేర్కొన్నారు. శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణ్భగవానుడు, గౌతమ బుద్ధుడు, భక్త ప్రహ్లాదుడు వంటి వారు- ‘్ధర్మం సంక్లిష్టతలో ఉన్నప్పుడు చర్చలు ఉత్తమమైనవి’ అని పేర్కొన్నారని ప్రధాని గుర్తుచేశారు. ప్రభుత్వాలు భేషజాలకు పోకుండా ఒక మెట్టుదిగి, మావోలతో చర్చలకు శ్రీకారం చుట్టాలి. మావోలు కూడా చర్చలకు సిద్ధమని ప్రకటించాలి. కాలదోషం పట్టిన సిద్ధాంతాలను పక్కనపెట్టి రాజ్యాంగ పరిధిలో మానవ హక్కుల పరిరక్షణకు, బడుగు వర్గాల ప్రయోజనాలకు మావోలు ముందుకు రావాలి. అడవుల్లో అజ్ఞాతవాసం చేస్తున్న మావోల్లో విశ్వాసం కలిగించే చర్యలను కేంద్రం తీసుకోవాలి. కాల్పుల విరమణను ప్రకటించి గాలింపు చర్యలను నిలిపివేయాలి. మావోలు కూడా మందుపాతరలు పెట్టి మారణహోమం జరిపే పద్ధతులకు స్వస్తిపలకాలి. జైళ్లలో ఏళ్లతరబడి విచారణ లేకుండా మగ్గుతున్న మావోయిస్టు సానుభూతిపరులకు క్షమాభిక్ష పెట్టేందుకు రాష్ట్రప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. చర్చలకు ఎక్కడో ఒక చోట ప్రభుత్వం చొరవ చూపితే కొంత ప్రయోజనం ఉంటుంది. నిర్ణీత కాలపరిమితి చర్చల వల్ల ఫలితాలు ఉండవు. అటు ప్రభుత్వానికి, ఇటు మావోయిస్టులకు సహనం ఉండాలి.

-కె.విజయ శైలేంద్ర 98499 98097