మెయన్ ఫీచర్

దేశానికి గుదిబండలైన కాంగ్రెస్ తప్పిదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో గాంధీ కుటుంబానికి ఇక శంకరగిరి మాన్యాలే దిక్కవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో ఓటమిపాలై భారత రాజకీయపటంలో బక్కచిక్కిపోయిన కాంగ్రెస్ పార్టీని చూసి ఈ సారి శ్రీమతి సోనియా, ఆమె పుత్రరత్నం రాహుల్ గాంధీలు ఎన్నికల ఫలితాలు చూసి బిక్కచచ్చిపోయారు. ప్రజాతీర్పును శిరసావహిస్తామని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. జెఎన్‌యు వివాదంలో దేశ ద్రోహులను సమర్థించడంలో ఏకమైన కామ్రేడ్‌లు, కాంగ్రెస్‌వారు, బెంగాల్‌లో పొత్తుపెట్టుకొని కన్హయ్యకుమార్‌తో ఓట్లు కురిపించుకోవచ్చనుకున్నారు. కాని జెఎన్‌యు రగడను ప్రజలు తిరస్కరించారు. అసోంలో విదేశీయుల సమస్య అనేక దశాబ్దాలుగా రగులుతోంది. మోదీ ప్రధాని అయిన తరువాత విదేశీ చొరబాటుదారులకు వ్యతిరేకంగా దేశ సమగ్రతను రక్షించే ప్రయత్నానికి అనుకూలంగా తొలిసారి అసోం ప్రజలు బలమైన తీర్పును ఇచ్చారు. చివరకు కాంగ్రెస్ పార్టీ చిన్న రాష్ట్రాలకు మాత్రమే పరిమితమై కుదైలయింది. 2014లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి హుందాగా వ్యవహరించి సహనంతో మోదీ ప్రభుత్వానికి అభివృద్ధి విషయంలో సహకరించే విధంగా, పార్లమెంట్‌ను సజావుగా నడపడంలో చొరవ తీసుకొని ఉంటే కాంగ్రెస్‌కు ఈ గతి పట్టేది కాదు. ప్రతి విషయాన్ని రాజకీయం చేసి అసహనం ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీ తాజా ఓటమిని జీర్ణించుకుంటుందంటే ఎవ్వరూ నమ్మరు.
దశాబ్దాలుగా గాంధీ కుటుంబీకులు గోబెల్స్ ప్రచారం చేశారు. జాతీయవాద సంస్థలను దుమ్మెత్తిపోశారు. నిందించారు. నిషేధించారు.మహాత్మాగాంధీ అనుయాయులమని చెప్పుకుంటూ ఆయన పేరును బాగా వాడుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ మహాత్మాగాంధీని హత్య చేసిందన్నారు. కాని మహాత్మాగాంధీ మనుమడు శ్రీకృష్ణ కులకన్ణి రాహుల్ గాంధీకి రాసిన ఉత్తరంలో అవన్నీ అవాస్తవాలని, అనేక విచారణ సంఘాలు సైతం సంఘం పేరు ప్రస్తావించలేదని, మహాత్మాగాంధీ పేరును కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాకీయాలకోసం వాడుకోవద్దని కోరారు. దశాబ్దాలుగా దేశ అఖండత విషయంలోను, కాంగ్రెస్ పార్టీ ఉపేక్ష వహించింది. ఫలితంగా చైనా, పాకిస్తాన్‌లు మన భూభాగలను యథేచ్ఛగా ఆక్రమించాయి. పైచిలుకు చీటికి మాటికి రెచ్చగొడుతూనే ఉన్నాయి. కేజ్రీవాల్ అరుంధతీరాయ్, వంటి వారు వాళ్ల పార్టీలు దేశ అఖండతను దెబ్బతీస్తూ భారతదేశ చిత్రపటాల్లో కశ్మీరు లేకుండా చూపిస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది కాంగ్రెస్ పార్టీ. జమ్మూకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్‌లను గూగుల్ సైతం చుక్కల గీతలతో యింతకాలం చూపింది. కానీ నేడు మోదీ ప్రభుత్వం తాజాగా ఒక చట్టం తెచ్చింది. అరుణాచల్‌ను, పివొకెను వివాదాస్పద భూమిగా చూపితే ఏడేళ్ల జైలు, వందకోట్ల జరిమానా విధిస్తారు. ఈ చట్టంతో అంతా సర్దుమణిగింది. గూగుల్ ఇప్పుడు జమ్మూకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్‌లను భారత్‌లో అంతర్భాగంగా చూపిస్తోంది.
రాహుల్ గాంధీ 47 ఏళ్ల యువనేత. స్మృతి ఇరానీ కాంగ్రెస్ వాళ్లకు 38 ఏళ్ల ఆంటీగా కనిపిస్తుంది. సరుకు లేనప్పుడు యువకులు వృద్ధులతో సమానమే. కాంగ్రెస్ ఎప్పుడు కావాలని కోరుకున్నా అందుబాటులో లేకుండా పారిపోవడం రాహుల్ నైజం. ఆయన బాడీ లాంగ్వేజీలో దర్పం, నెహ్రూ వారసత్వ అహంకారం తప్ప నమ్రత, అణకువ కానరావు. సోనియాను కాదని ఆయన వామపక్షాలతో జతకట్టారు. తమిళనాడులో అవినీతిలో మునిగిన డిఎంకెతో అంటకాగారు. ఇండియాటుడే కథనం ప్రకారం కాంగ్రెస్ ఎంపిలందరిలోకన్నా అతి తక్కువగా స్టాండింగ్ కమిటి సమావేశాలకు ఆయన 13.64శాతం హాజరయ్యారు. తాజా ఎన్నికల ఫలితాలతో ఆంగ్ల మీడియా నోట్లో పచ్చివెలక్కా య గొంతులో పడినట్లయింది. మోదీతో సమానంగా రాహుల్‌ని పోలుస్తూ 2014 ఎన్నికల్లో ఆ తరువాత కూడా కథనాలు ప్రసారం చేసిన ఆంగ్ల మీడియా రాహుల్ గాంధీ అంతుబట్టని వైఖరితో దిక్కుతోచకుండా ఉంది. 2004లో గెలిచినప్పుడు రాహుల్ గాంధీ భాజపాను ద్వేషించి మాట్లాడుతూ ‘బిజెపి కథ ముగిసింది’ అన్నారు. 2009 ఎన్నికల్లో గెల్చిన తరువాత మీడియా రాహుల్ ఎదుగుదలను ఆశ్చర్యంగా వర్ణించింది. 2014లో ఆయనే అంతా ప్రధాని అవుతారన్నారు. నిజానికి ఆయన ఎదిగేందుకు తన స్థాయిని పెంచుకునేందుకు పదేళ్ల సుదీర్ఘ సమయం లభించింది. కానీ ఆయన దాన్ని సద్వినియోగ పరచుకోలేదు.
రాజీవ్ గాంధీ పైలట్‌గా వుంటూ బలవంతంగా రాజకీయాల్లోకి లాగబడ్డారు. ఆ తరవాత సోనియా అధ్యక్షురాలయ్యారు. సోనియా వారసత్వం రాహుల్‌కు అయాచితమైంది. ఉపాధ్యక్షుడైన తరువాత అంతర్గత ప్రజాస్వామ్యమంటూ ఆయన వొంటరి పోరాటం చేశారు. ఆయనకు ఆలోచనలు లేవు, వాటి అమలుకు తగ్గ శక్తి లేదని కొందరంటారు. రాహుల్‌ను కాదని ప్రియాంక గాంధీకి పెద్దపీట వేస్తే ఆమె వెనుక రాబర్ట్ వాద్రా అవినీతి మోత ఉంది. లక్ష రూపాయల పెట్టుబడితో రూ.300 కోట్లు సంపాదించిన ఘనత వాద్రాది. రాహుల్‌పై ఫేస్‌బుక్‌లో,ట్విట్టర్‌లో హాస్య ప్రహసనాలు వెల్లువెత్తాయి. ఆయన్ను రక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏ ప్రయత్నమూ చేయలేదు. జయపురలో జరిగిన చింతన్ శిబిరంలో రాహుల్ మంచి ఆలోచనలమే పార్టీ ముందుంచారు. సామాన్యుడికి చేరువ కావాలని, యువశక్తిని ప్రోత్సహించాలని, సమాచార చట్టం మార్పునకు గొప్ప ఆయుధమని ఆయన వాదించారు. కాని ఆయన మాటలకు కాంగ్రెస్‌లోకూడా సమర్ధన లభించలేదు. 2012లో జరిగిన నిర్భయకాండకు సంబంధించి కనీసం ఓ సానుభూతి ప్రకటనకూ మొహం చాటేశారు. ఆయనలో తొందరలేదు. సందర్భాలను అవకాశాలుగా మార్చుకునే సత్తాలేదు. అమ్మచాటు బిడ్డగానే ఉండేందుకే ఆయన ప్రాధాన్యతనిచ్చారు. అన్నాహజారే నెరపిన అవినీతి వ్యతిరేక ఉద్యమ సమయంలోనూ ఆయన చొరవ చూపలేదు. స్వయంగా కూటమి నేతలే అవినీతి ఊబిలో దిగబడిన తరువాత ఆయన చేయగలిగిందేమీ లేదు.
ఆరు దశాబ్దాలపాటు దేశానే్నలిన కాంగ్రెస్ పార్టీ, గాంధీల కుటుంబం గతమెంతో ఘనం. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ పార్టీని రద్దు చేసి సేవాదళ్‌గా కొనసాగించాలని కోరిన మహాత్మాగాంధీ కోరిక ముందు నెహ్రూ వ్యక్తిగత మహాత్వ కాంక్షయే గెలిచింది. దేశ ప్రధానమంత్రి కావాలన్న తన కోరికను నెహ్రూ నెగ్గించుకున్నారు. ఐరాస శాశ్వత సభ్యత్వం తీసుకునే అవకాశం వచ్చినా 1950లో ఆయన దాన్ని చైనాకు కట్టబెట్టారు. 1961లో భారత సైన్యం మనోనిబ్బరాన్ని దెబ్బతీస్తూ చైనాకు వెళ్లి పంచశీలపై సంతకం చేసి వచ్చారు. 1962లో చైనా భారత్‌పై దాడి చేసింది. నెహ్రూ వంశవృక్షంపై అనేక వివాదాలున్నాయి. అందుకే ఆయన జన్మస్థలం వీర్‌గంజ్, అలహాబాద్‌లో కాకుండా ఆయన పూర్వజుల ఇల్లు ఆనంద్‌భవన్ ఆయన స్మారకమైంది. ఆయన కూతురు ఇందిర ప్రధానిగా 1968లో ఆఫ్ఘనిస్తాన్‌లో బాబరు సమాధిని దర్శించి ఓ భారత ఆక్రమణదారుడి పట్ల తన భక్తిని చాటింది. 1971లో తూర్పు పాకిస్తాన్ నుంచి ఈశాన్య భారతంలోకి అక్రమంగా ప్రవేశించిన 40 లక్షలమంది విదేశీయుల గురించి ఆమె పట్టించుకోలేదు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో చొరబాటుదారుల సంఖ్య, రెండు కోట్లకు చేరింది. 1971 యుద్ధంలో పట్టుబడ్డ 90 వేలమంది పాకిస్తానీ సైనికుల్ని మనదేశం విడిచిపెట్టింది. పాకిస్తాన్ సైన్యం పట్టుకున్న భారత సైనికులు విడుదలకు నోచుకోలేదు. 1980లో అందుకే ఈశాన్య భారతంలో ఉగ్రవాదం మొదలైంది.1975-77 మధ్య దేశంలో అత్యవసర పరిస్థితి విధించి జెపి వంటి వారెందరినో జైలుపాలు చేసి ప్రజాస్వామ్యం పీకనొక్కింది ఇందిర. 1977 ఎన్నికల్లో పరాజయం చవిచూసింది. ప్రజాస్వామ్యం గెలిచింది. సెక్యులరిజం మాటను ఈ సమయంలోనే ఇందిర రాజ్యాంగంలో చొప్పించారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపారు. పంజాబులో ఖలిస్తాన్ ఉద్యమం నడుస్తున్న సమయంలో ఆమె భింద్రన్ వాలేను ప్రోత్సహించింది. అతను ఏకుమేకయ్యాడు. చివరకు స్వర్ణదేవాలయంపై ఆపరేషన్ బ్లూస్టార్ జరిగి అతను హతమయ్యాడు. అది సిక్కులకు ఆగ్రహం తెప్పించింది. ఆమె అంగరక్షకులే ఆమెపై కాల్పులు జరిపారు. ఆమె కొడుకు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు.
మొదటిసారి కాంగ్రెస్ పార్టీ దేశ సమైక్యత సమగ్రతల నివాదంతో ఎన్నికల బరిలోకి దిగింది.1984 నవంబరులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయినప్పటికీ అది కేవలం ఎన్నికల నినాదంగా మిగిలింది. 1989లో కాశ్మీర్‌లో ఉగ్రవాదం పరాకాష్టకు చేరి ఐదు లక్షలమంది కాశ్మీరీ పండిట్లు శ్రీనగర్ విడిచిపెట్టారు. ఉగ్రవాదంపై రాజీవ్ గాంధీ ఉక్కుపాదం మోపలేదు. సైన్యాన్ని ఆ దిశలో ఆయన ఆదేశించలేదు. 1991-96 భారతదేశ పాలనాకాలం గాంధీల ప్రమేయం లేకుండా జరిగింది. ఐపికెఎఫ్ పేరున శ్రీలంకలో శాంతికై రాజీవ్ గాంధీ పంపిన సైనిక పటాలాలలో 600 మంది హతమయ్యారు. తమిళుల ఆగ్రహానికి కూడా ఆయన గురయ్యారు.
ఇక 2004-14 మధ్య దేశానే్నలిన యుపిఎ-1,2 సోనియా సారథ్యంలో దేశాన్ని అథోగతి పాలు చేసిందనేది జగద్విదితం. నెహ్రూ, ఇందిర, రాజీవ్ గాంధీల పేర ఎన్నో అవార్డులు, విశ్వవిద్యాలయాలు, విమానాశ్రయాలు, క్రీడా అవార్డులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ యోజనలు ఉన్నాయి. దేశంలో ఎందరో దేశభక్తులుండగా, మహానుభావులుండగా, ప్రతిచోట తమ కుటుంబంలో వారిపేరే ‘తోక’ చేసుకోవడం గాంధీల కుటుంబానికే చెల్లింది. తిలక్, నేతాజీ, భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, లాలాలజపతిరాయ్, బిపిన్‌చంద్రపాల్, లాల్‌బహదూర్ శాస్ర్తీ ఇలా ఎందరో త్యాగధనుల తర్పణాలతో పునీతమైన దేశంలో వారి స్మృతి అనేది లేకుండా చేశారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పి.వి.నరసింహారావుగారికి ఢిల్లీలో స్మారకం లేదు. ఈ భూమిలో పరిమళించిన సంస్కారాలకు అనుగుణగా ధర్మబద్ధమైన, నీతివంతమైన పాలన మాత్రమే అందరికీ మేలు చేస్తుంది. అందరికీ అభివృద్ధి ఫలాలను అందించగలుగుతుంది. అదే జాతికి శాశ్వత శ్రేయం చేకూరుస్తుంది.

-తాడేపల్లి హనుమత్ ప్రసాద్ సెల్: 9676190888