మెయిన్ ఫీచర్

ఆకాశమే హద్దు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదు..
నీ శక్తి సామర్థ్యాలను బయటకు తీసి..
నిన్ను నీవు నిరూపించుకునేందుకే వచ్చాయి..
కష్టాలకు కూడా తెలియాలి..
నిన్ను సాధించడం మహాకష్టమని..!
- ఎ.పి.జె. అబ్దుల్ కలాం
ఈ మాటలు తనను చూసే చెప్పారేమో.. అనిపించేలా తయారైంది నేటి మహిళ. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి అడుగు ముందుకేస్తోంది. తను అనుకున్న గమ్యాన్ని చేరడానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో, ఆత్మవిశ్వాసంతో వాటన్నింటినీ ఎదుర్కొంటోంది. విజేతగా నిలబడుతోంది. ఈ జాబితాలోకే వస్తుంది పల్నాటి ప్రవల్లిక. తను అడుగుపెడదామన్న రంగంలో ఎన్ని కష్టనష్టాలు, అవమానాలు ఎదురైనా లెక్కచేయకుండా.. ఓటమిని మెట్లుగా మలచుకుని విజయతీరాలను చేరుకుంది. ఔత్సాహిక యువ వ్యాపారులకు దిక్సూచిగా మారిన పల్నాటి ప్రవల్లిక గురించి ఆమె మాటల్లోనే..
నా పేరు ప్రవల్లిక. ప్రకాశం జిల్లా కందుకూరు మండలంలోని పలుకూరు అనే గ్రామంలో నేను పుట్టి పెరిగాను. పదో తరగతి వరకు అమ్మమ్మ, తాతయ్యల దగ్గర ఉండి చదివాను. తరువాత పై చదువుల కోసం హైదరాబాద్ వచ్చాను. అమ్మ గృహిణి. నాన్న సివిల్ కాంట్రాక్టర్. బీటెక్, ఎంటెక్ పూర్తిచేశాను. కాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. కానీ ఉద్యోగం చేయడం అంతగా ఇష్టం లేదు. పది నుంచి ఆరు వరకు ఉద్యోగం చేస్తూ, నెల తిరిగేసరికి జీతం తీసుకుంటూ, బాస్‌ను సెలవులు అడుక్కుంటూ బతకడం నాకు చిన్నప్పటినుంచీ నచ్చేది కాదు. నా తెలివితేటలను ఉపయోగించి స్వతంత్రంగా వ్యాపారం చేస్తూ ఎదగడమంటే నాకు చాలా ఇష్టం. అందుకే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వద్దనుకున్నాను. ఎంటెక్ చదివేటప్పుడే నేను టెక్స్‌టైల్ డిజైనర్ ప్రాజెక్టుపైన దృష్టి పెట్టాను. దాని గురించి పూర్తి సమాచారం సేకరించాను. అంటే క్లాత్ ఎక్కడ దొరుకుతుంది దగ్గరనుంచి ఎలాంటి బట్టలు నేటితరం ఇష్టపడుతుంది వరకు అన్నమాట.. కానీ టెక్స్‌టైల్ ఇండస్ట్రీని పెట్టాలంటే మాటలు కాదు. బోలెడంత డబ్బు కావాలి. లోను కోసం ప్రయత్నించాను. ఈ క్రమంలోనే నేను చాలా నేర్చుకున్నాను. బాంకర్లను ఒప్పించడానికి ప్రాజెక్టు రిపోర్టు తయారుచేయడం మొదలుకుని అందుబాటులో ఉన్న ప్రభుత్వ పారిశ్రామిక విధానం, కేంద్ర, రాష్ట ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు.. ఇలా అన్నింటినీ అధ్యయనం చేశాను. ఈ అధ్యయనానికే నాకు చాలా సమయం పట్టింది. వీటి మధ్యలో నేను అసలు వ్యాపారానికి సూటవుతానా లేదా అని తెలుసుకోవడానికి నాకు నేనే చిన్న పరీక్ష పెట్టుకున్నాను. అందుకోసం నాన్నవాళ్ళు నెలనెలా ఇచ్చే పాకెట్ మనీని దాచుకుని పెట్టుబడిగా పెట్టాను. బట్టలు ఎక్కడ చీప్‌గా దొరుకుతాయో తెలుసుకుని అక్కడ కొని ఇంట్లోనే తెలిసిన వాళ్ళకు అమ్మాను. చెబితే మీరు నమ్మరు కానీ నేను తెచ్చిన బట్టలు కేవలం ఒకే ఒక గంటలో అమ్ముడిపోయాయి.. అదీ రెట్టింపు లాభంతో.. ఇది కేవలం నన్ను నేను తెలుసుకోవడానికి మాత్రమే.. ఈ వ్యాపారాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే నేను బట్టలు అమ్ముకునే అమ్మాయిని అయిపోనూ.. మరో విషయం ఏంటంటే నేను బట్టలు అమ్మింది ఇంట్లో తెలియదు.
అందుకే ఆ ప్రయత్నం మానుకుని సంక్షేమ పథకాలను అందిపుచ్చుకుని ఇండస్ట్రీ పెట్టాలనుకున్నా.. బ్యాంకుల చుట్టూ తిరిగా.. కానీ అక్కడ వారి ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఆడపిల్లలు చేసే వ్యాపారానికి లోను ఇస్తే వారికి పెళ్లయ్యాక వ్యాపార యూనిట్లు అమ్మేస్తారు.. అయినా ఆడపిల్లలకి ఎందుకు ఈ వ్యాపారాలు? శుభ్రంగా పెళ్లిచేసుకోక? మీకు ప్రాపర్టీ ఏం ఉంది? సెక్యూరిటీగా ఏమి పెడతారు? మీరు దళితులు కదా? ఇలాంటి ప్రశ్నలెన్నింటిలో ఎదుర్కొన్నాను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్ని పథకాలు పెడుతుంటే.. ఇవ్వటానికి బ్యాంకులకు వచ్చే బాధేంటో నాకు అర్థం కాలేదు. స్నేహితులందరూ వ్యాపారం వద్దు, ఏమీ వద్దు.. ఉద్యోగం చేసుకో అన్నారు. ఇన్ని ప్రశ్నలు ఎదుర్కొన్నాక నాలో మరింత పట్టుదల పెరిగింది. చదువుకున్న నాకే లోన్ తీసుకోవాలంటే కావలసిన డాక్యుమెంటేషన్ తెలియదు. మరి చదువురాని వాళ్ళ పరిస్థితి ఏంటో.. చాలామంది తనలాగే వ్యాపారం లేదా ఉత్పత్తి సంస్థ పెట్టటమెలాగో తెలియక ఎన్ని అవస్థలు పడుతున్నారో..? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా అవి అందరూ అందిపుచ్చుకోలేకపోతున్నారు కదా! అనిపించింది. అంతే ఇదే ఆలోచన నుండి పురుడు పోసుకుంది3‘నిపుణ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్కిల్స్ అండ్ ఎంట్రప్రెన్యూర్’ అనే సంస్థ. ఇది హైటెక్స్ ఆవరణలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌లో ఏర్పాటైంది. ఇంట్లో వాళ్ళకి ఇలా ఓ సంస్థను పెట్టాలనుకుంటున్నాను అని చెబితే మొదట వద్దన్నారు. తరువాత సరేనన్నారు. ఈ సంస్థ పెట్టడానికి మాత్రం బ్యాంకు లోను తీసుకోలేదు సుమా..
ఔత్సాహిక వ్యాపారులకు శిక్షణ ఇచ్చి వాళ్ళను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే శిక్షణా సంస్థే నిపుణ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్కిల్స్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్. మాకు తొలి ప్రయత్నంలోనే గవర్నమెంటు నుండి మంచి ప్రాజెక్టు వచ్చింది. అది దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నుంచి ఆ ఆఫర్ వచ్చింది. ఇందులో భాగంగా యాభై మంది గిరిజన యువతీ యువకులకు ఎంట్రప్రెన్యూర్‌షిప్‌లో నలభై అయిదు రోజులపాటు శిక్షణను ఇవ్వాలి. వారికి రెగ్యులర్ సిబ్బందితో పాటు చార్టర్డ్ అకౌంటెంట్స్, బ్యాంక్ అధికారులు, కంపెనీ సెక టరీలను ఆహ్వానించి సిలబస్‌కు అనుగుణంగా శిక్షణను ఇస్తాము. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్ అధికారులను పిలిచి వారికి స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలిప్పిస్తాము. దీనివల్ల వారిలో ఆత్మవిశ్వాసం, వ్యాపార కాంక్ష పెరుగుతుంది. అలాగే ఇంగ్లీషు మాట్లాడటం, కంప్యూటర్ పరిజ్ఞానము, యోగ వంటివి కూడా చేర్చి వాళ్ళను సంపూర్ణంగా తీర్చిదిద్దుతాం. అలా మొదట యాభై మంది ప్రారంభమైన మా సంస్థ తరువాత కాపు కార్పొరేషన్‌వారికి ట్రైనింగును అందించింది. ఇప్పుడు బ్రాహ్మణ సంక్షేమ సంస్థ నుంచి అయిదు వందల మందికి శిక్షణ ఇచ్చే పనిని చేపట్టింది. ఇదంతా కేవలం ఒక సంవత్సరంలో సాధ్యమైంది. లక్షలతో మొదలుపెట్టిన మా సంస్థ టర్నోవర్ ఇప్పుడు రెండు కోట్లు.
మేము కేవలం ప్రభుత్వ సంస్థలు స్పాన్సర్ చేసే వాళ్ళకి మాత్రమే కాదు.. అందరికీ శిక్షణను ఇస్తాం. మా దగ్గర రకరకాల బ్యాచ్‌లు నడుస్తుంటాయి. గ్రాడ్యుయేట్స్‌కోసం ప్రత్యేకంగా ఓ సిలబస్‌ను తయారుచేస్తాం. ఇంజనీరింగ్ కాలేజీలలో కేవలం కాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలకు శిక్షణ ఇస్తాం. అలాగే అన్ని అవకాశాలను వాడుకుంటూ సొంతంగా వ్యాపారం చేయాలనుకునేవాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఓ కోర్సును తయారుచేశాం. గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. నిజానికి చాలామంది చెప్పే విషయం ఏంటంటే.. ఇన్ని రకాల అవకాశాలు, ప్రభుత్వ పథకాలు ఉన్నసంగతి వారికి తెలియదని. మా సంస్థలో శిక్షణ పొందేవారు ఏ కేటగిరీలో వీక్‌గా ఉన్నారో తెలుసుకుని దానికి అనుగుణంగా శిక్షణనిస్తాము. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని స్కీమ్‌లు పెట్టినా అవి ప్రజల వద్దకు సరిగా చేరడం లేదు. శిక్షణలో ఉన్నవారికి ఆ స్కీమ్‌లను ఎలా ఉపయోగించుకోవాలో, వ్యాపారంలో ఏ ఏ వనరుల్ని ఎలా వాడుకోవాలో.. ఇలా అన్ని తరహాల్లో వారికి శిక్షణ ఉంటుంది. ఈ సంస్థ నాకు మానసికంగా సంతృప్తిని ఇచ్చినా నా తుది లక్ష్యం మాత్రం టెక్స్‌టైల్ ఇండస్ట్రీనే.. చిన్నప్పటి నుండి నాకు కులం అంటే తెలియదు. ఇంట్లో అమ్మమ్మ, తాతయ్య ఎప్పుడూ చెప్పలేదు. మొదటిసారిగా దళిత కులం అనే పదాన్ని ఆ బ్యాంకర్ దగ్గరే విన్నాను. చాలా బాధ అనిపించింది. చిన్నప్పటి నుంచి ఆడపిల్లవి, మన కులం ఇది అని పెంచని మా అమ్మ నేను లోను కోసం ప్రయత్నించేటప్పుడు మాత్రం మన కులంలోని ఆడపిల్లల్ని పైకి రానిస్తారా.. ఎందుకొచ్చింది? ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకుని పెళ్ళిచేసుకోమని చెప్పింది. ఆ సమయంలో అమ్మపై బాగా కోపం వచ్చింది. అప్పుడే, ఆ కోపంలోనే సమాజాన్ని మార్చాలి అనుకున్నాను. అందరికీ సేవచేసి నేనేమిటో నిరూపించుకోవాలి అనిపించింది. అందుకే ఈ సంస్థను స్థాపించాను. నేటి యువతను వ్యాపారం వైపు నడిపించడంలో ఎంతో ఆనందం ఉంది. అలాగే ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారన్న సంతృప్తి నన్ను మరింత ముందుకు నడిపిస్తోంది అంటోంది ప్రవల్లిక.
ఇలా ఎందరో ఔత్సాహిక యువ వ్యాపారులకు దిక్సూచిగా మారిన ప్రవల్లిక సమాజంలోని కుల దారిద్య్రాన్ని అంతం చేసి, ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఆమె తుది లక్ష్యమైన టెక్స్‌టైల్ ఇండస్ట్రీని స్థాపించాలని కోరుకుంటూ... ఆల్ ద బెస్ట్ ప్రవల్లిక..

-ఎస్.ఎన్. ఉమామహేశ్వరి