మెయన్ ఫీచర్

ఇక ‘పొలం బాట’ నడిచేదెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభజన’ అనంతరం గత నాలుగేళ్లలో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల ఆలోచనా విధానాల్లో చాలా మార్పులు వచ్చాయి. విభజనకు ముందున్న ద్వేషభావాలు ఇప్పుడు లేవు. ఏపీ నుంచి హైదరాబాద్‌కు జనం రావడం తగ్గలేదు. తెలంగాణ నుంచి తిరుపతి, అన్నవరం పుణ్యక్షేత్రాలకు భక్తుల తాకిడి తగ్గలేదు. రెండు రాష్ట్రాల్లోనూ సాగునీటి ప్రాజెక్టుల పనులు ఊపందుకున్నాయి. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ గాయపడి మెల్లమెల్లగా కోలుకుంటోంది. ఏపీలోని ప్రజలెవరూ రాష్ట్రం విడిపోయిందన్న భావన తమలో లేదంటున్నారు. మంచో,చెడో విభజన జరగడం వల్ల ప్రాంతీయంగా అభివృద్ధి సాధించేందుకు అవకాశం లభించిందంటున్నారు.
ఎవరెన్ని చెప్పినా ఏపీలోని రాయలసీమను మినహాయిస్తే మిగతా చోట్ల పరిశ్రమలు రావడం కష్టమే. అమరావతి, విశాఖల్లో ఐటీ కంపెనీలు వచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నా ఫలితాలు అంతంత మాత్రమే. ఏపీలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కొన్ని చారిత్రక సత్యాలను విస్మరించరాదు. ఈ వాస్తవాలను తెలుసుకోకుండా ‘బ్లూప్రింట్లు’ తయారు చేసుకుంటూ పోతే ఉపయోగం ఉండదు. ఏపీలోని ఇచ్ఛాపురం నుంచి కర్నూలు జిల్లా మంత్రాలయం వరకు ఎక్కడ చూసినా వ్యవసాయమే ప్రధాన వృత్తి, జీవనోపాధి. ఈ వాస్తవాన్ని గ్రహించి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపైన దృష్టిని కేంద్రీకరించాలి. పోలవరం ప్రాజెక్టును ఐదేళ్లలో పూర్తి చేస్తే ఆంధ్ర రాష్ట్రం పంజాబ్‌గా మారుతుంది. ప్రాజెక్టులే గాక వ్యవసాయాన్ని ప్రోత్సహించే చర్యలను ప్రభుత్వం తీసుకోవాలి. ఉభయ గోదావరి జిల్లాల్లో తాజా పరిస్థితిని గమనిస్తే- కొన్ని గ్రామాల్లో వ్యవసాయం చేసే వారే లేకుండాపోయారు. వ్యవసాయ కుటుంబాల్లో పిల్లలు ఉన్నత చదువులు చదువుకుని చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లేదా విదేశాలకు వెళ్లి స్థిరపడుతున్నారు. ఇదే పరిస్థితి రాయలసీమలో, తెలంగాణలో ఉంది. దీర్ఘకాలంలో రైతాంగ కుటుంబాల్లో సరికొత్త సంక్షోభం తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి.
1980వ దశకం తర్వాత అనేక కారణాల వల్ల చాలా కుటుంబాల్లో సంతానం పరిమితంగానే ఉంటోంది. ఆడైనా, మగైనా ఒకరు లేదా ఇద్దరు పిల్లలు చాలన్న భావన పెరిగింది. ఈ ధోరణి ఇప్పుడు వ్యవసాయ రంగానికి శాపంగా మారుతోంది. నూటికి 90 శాతం రైతు కుటుంబాల్లో ఇదే పరిస్ధితి నెలకొని ఉంది. ఈ పిల్లలు వ్యవసాయం చేయకుండా నగరాలకు వెళ్లి ఇంజనీరింగ్ చదివి ఐటీ తదితర రంగాల్లో స్ధిరపడుతున్నారు. ఏడాదికోసారి సొంత ఊరికి వచ్చి మూడు, నాలుగు రోజులు గడిపి వెళుతున్నారు. తల్లితండ్రుల తదనంతరం వ్యవసాయం చేసేవారు లేక భూములు బీడువారడమో, పరాధీనం కావడమో జరుగుతోంది. దీనికి కారణం మానవ వనరుల కొరత. వృద్ధులైన రైతులు కూడా ఇంటికి తాళాలు వేసి, వ్యవసాయానికి స్వస్తిచెప్పి నగరాలకు చేరుతున్నారు. ఈ రోజు కొంత మంది రైతులను ప్రశ్నిస్తే, 30 ఏళ్ల క్రితం చేసిన తప్పులను గుర్తు తెచ్చుకుని బాధపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ కులాలు, మతాలకు అతీతంగా చూస్తే రైతాంగానికి సంబంధించి శాపంగా మారింది.
పాలకులు, అధికారులు తలచుకుంటే ఎలాంటి అద్భుతాలనైనా సాధించవచ్చు. మానవ వనరులను తేగలమా?. హిందూ అవిభక్త కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, ఏక సంతానం వైపు మొగ్గు చూపడం వల్ల వ్యవసాయానికి తీరని హాని జరుగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి నేతలు చెప్పే కొన్ని విషయాల్లో, దార్శనికత దృష్టితో చేసే వ్యాఖ్యల్లో దాగిన వాస్తవాలను కాదనలేం. అందరికీ తెలిసిన విషయాలే అయినా ప్రజాజీవితంలో ఉన్నవారు చెబితే వాటికి విలువ ఉంటుంది. రానున్న సంవత్సరాల్లో తీవ్రమైన మానవ వనరుల కొరతను ఎదుర్కొంటామని గతంలో చంద్రబాబు చాలాసార్లు చెప్పారు. ప్రధానంగా వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకునే కుటుంబాల సంఖ్య తగ్గిపోవడంతో మానవ వనరుల కొరత తలెత్తుతోంది. దీని వల్ల వ్యవసాయ వృద్ధిరేటు తగ్గుతుంది. 70 శాతం వ్యవసాయం చేసే కుటుంబాలు ఆస్తులు పొగొట్టుకునే పరిస్థితి దాపురిస్తుంది. భూమి నిరుపయోగంగా మారుతుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయి అటు ఉత్తరాంధ్ర, ఇటు కృష్ణా డెల్టాతో పాటు రాయలసీమ జిల్లాలకు సుభిక్షంగా నీరు లభించినా, వ్యవసాయం చేసే వారుండరేమో?
కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తుంగభద్ర నదీ తీరంలోని ఒక గ్రామం పరిస్థితి చూస్తే ఎవరికైనా విస్మయం కలుగుతుంది. అక్కడ 95 ఏళ్ల వృద్ధుడు తులసీదాస్ చెప్పిన విషయాలు మనకు ఆశ్చర్యానే్న కాదు, ఆందోళనను కలిగిస్తాయి. ఆయనకు ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు. ఒక్కో కుమారుడికి ముగ్గురు పిల్లలు, ఆ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తే ఒక్కొక్కరికి ముగ్గురు పిల్లలు కలిగారు. ఆడ లేదా మగ పిల్లలు ఎవరైనా ఫర్యాలేదన్నది ఆ కుటుంబం భావన. రైతు కుటుంబాలకు మానవ వనరులు ముఖ్యం. లేదంటే వ్యవసాయం దెబ్బతింటుంది. భూములు కొనే్నళ్లుకు చేతులు మారుతాయి. పైగా వ్యవసాయం చేసే వారు తక్కువవుతున్నారు. పరాధీనం కాకపోయినా భూములు నిరుపయోగంగా మారుతాయన్న ఆ వృద్ధుని మాటలు అక్షర సత్యాలు.
ఏపీ, తెలంగాణల్లో నేడు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ చొరవతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రాతో పోల్చితే తెలంగాణలో మానవ వనరులు ఎక్కువే. వ్యవసాయ రంగంలో మానవ వనరులు తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఉత్తర తెలంగాణ నుంచి ఇప్పటికీ వ్యవసాయం మానివేసి నగరాలకు చేరుతున్నారు. బృహత్తర ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే తెలంగాణ సుభిక్షప్రాంతంగా మారుతుంది. వచ్చే కొద్ది సంవత్సరాల్లోనే తెలంగాణ వ్యవసాయం రూపురేఖలు మారిపోనున్నాయి. ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు వ్యవసాయం ప్రధానంగా ఉన్న సమాజాన్ని చైతన్యం చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలి. పొలాలకు సాగునీరు అందించినంత మాత్రాన ఉపయోగం ఉండదు. వ్యవసాయం చేసే వారుండాలి. ఆధునిక రీతుల్లో వ్యవసాయం చేసే కొత్త మానన వనరులు అపారంగా సృష్టించుకోవాలి. వ్యవసాయం ఒక ఆసక్తిగా మార్చుకోవాలి. ‘నగరాలకు వచ్చి స్థిరపడిన రైతులు, వారి కుటుంబాలు గ్రామసీమలకు తరలండి’ అనే నినాదం ఇవ్వాలి. ఆంధ్ర, తెలంగాణల్లో వచ్చే పదేళ్లలోగానే అన్ని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తవుతాయి. తెలంగాణలో కాళేశ్వరం, ఆంధ్రాలో పోలవరం పూర్తయితే లక్షల ఎకరాలు సుసంపన్నమవుతాయి. కాని వ్యవసాయం చేసేందుకు రైతులు ఎక్కడ నుంచి వస్తారు?
వ్యవసాయ రంగం పట్ల యువకులకు ఆసక్తి పెంచే విధంగా రెండు రాష్ట్రాల్లోప్రభుత్వాలు సెలబ్రిటీస్‌తో సందేశాలు ఇప్పించాలి. విస్తృతంగా సదస్సులను నిర్వహించాలి. ఎన్నికల ప్రచారం తరహాలో సభలు, సమావేశాలు పెట్టాలి. వ్యవసాయం లాభదాయకం అనేందుకు సక్సెస్ స్టోరీలను ప్రసార మాధ్యమాల్లో ప్రచారం చేయాలి. ఇప్పటికే కొంతమంది యువకులు వ్యవసాయంలో రాణించారు. ఆర్ధిక, సామాజిక, వ్యవసాయ, పశుసంవర్ధక శాస్తవ్రేత్తలు, బ్యూరోక్రాట్లు, రాజకీయాలకు అతీతంగా వ్యవసాయం పట్ల మక్కువ కలిగించాలి. ఇందులో రాజకీయ నేతలనూ భాగస్వాములను చేయాలి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు సాగునీటి రంగానికి దేశంలో మరే ఇతర రాష్ట్రం కూడా ఖర్చుపెట్టని విధంగా నిధులను వెచ్చిస్తున్నాయి. ఇది మంచి పరిణామమే.
ఉత్పత్తి రంగం, ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల్లో ఒకసారి వౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తే వాటంతట అవే అభివృద్ధి చెందుతాయి. అవసరమైన దాని కంటే ఎక్కువ మానవవనరులు ఈ రంగాలకు లభిస్తాయి. వ్యవసాయరంగానికి మానవ వనరుల కొరత దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉంది. కుటుంబ నియంత్రణ పద్ధతులను పోటీలు పడి అమలు చేసిన ఆంధ్ర, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో ఈ రోజు వ్యవసాయ రంగంలో మానవ వనరుల కొరత సంక్షోభం ఏర్పడింది. రైతు కూలీల కొరత కూడా తీవ్రంగా ఉంది. ఈ కొరత ఇంకా విషమిస్తే- ప్రభుత్వాలు రాత్రికి రాత్రి సమస్యలను పరిష్కరించలేవు. అద్భుతమైన ప్రాజెక్టుల నిర్మాణం, కావాల్సినంత సాగునీరు, 24 గంటల కరెంటు అందుబాటులోకి వస్తాయి. ఆకర్షణీయమైన రంగులతో పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇస్తున్నారు. బ్యాంకులు రుణాలు ఇస్తాయి. కాని వ్యవసాయం చేసేందుకు రైతు దొరకడు. సొంత భూమిలో వ్యవసాయం చేసే రైతుకు, కౌలుకు వ్యవసాయం చేసే రైతులకు తేడా ఉంటుంది. కౌలుకు కూడా వ్యవసాయం చేసే రైతుల సంఖ్య తగ్గుతోంది. వ్యవసాయం రంగంలో కొన్ని దశాబ్దాలుగా నెలకొన్న సంక్షోభం వల్ల తెలుగు రాష్ట్రాలు మానన వనరుల విపత్తును ఎదుర్కొనబోతున్నాయి. ముందస్తు ప్రణాళికలతో ప్రభుత్వాలు మేల్కొని వ్యవసాయాన్ని బతికించుకోవాలి. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, మేధావులు- అనవసర రాజకీయ చర్చలను కొంత కాలం పక్కనపెట్టి ముంచుకొస్తున్న ఈ ఉపద్రవంపై కళ్లు తెరవాలి. వ్యవసాయ రంగంలో మానవవనరుల కొరతపై విస్తృతమైన అధ్యయనాలు జరగాలి. వ్యవసాయం లాభసాటి వ్యాపారం, గౌరవప్రదమైన కుటుంబ జీవనానికి రాచబాట అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పంట దిగుబడి, మద్దతు ధర, మార్కెట్ మాయాజాలం, దళారుల బెడద వంటి సమస్యలను నివారించి, వ్యవసాయ రంగం నిలదొక్కుకునే శాస్ర్తియ మార్గాలను ప్రభుత్వాలు అమలు చేయాలి.

-కె.విజయ శైలేంద్ర 98499 98097