ఎడిట్ పేజీ

వర్సిటీల్లో పరిశోధనలు ప్రశ్నార్థకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంఖ్యాపరంగా ఉన్నత స్థాయి విద్యాసంస్థలు పె రిగినా, వాటి నిర్వహణ తీరుపై పాలకులు ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఇందుకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ విద్యాసంస్థలే ప్రబల నిదర్శనం. తెలంగాణలో 11 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, 3 కేం ద్రీయ విశ్వవిద్యాలయాలు, 2 జాతీయస్థాయి విద్యా సంస్థలు, ఎన్‌ఐటి, ట్రిపుల్ ఐటీ, 1 డీమ్డ్ విశ్వవిద్యాలయం కలిపి మొత్తం 17 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు మెరుగైన వసతులు లేవన్నది కఠోర వాస్తవం. వర్సిటీల్లో ఆర్థిక సంక్షోభం కారణంగా పరిశోధనలు, నవీన ఆవిష్కరణలకు ఆటంకం కలుగుతోంది. పరిశోధనలు కేవలం కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు మాత్రమే పరిమితమవుతున్నాయి.
ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిశోధనలతో ప్రపంచం యావత్తూ దూసుకుపోతున్న ఈ రోజుల్లో మన విశ్వవిద్యాలయాల్లో పరిశోధన రంగం అగమ్య గోచరంగా మారింది. నూతన పద్ధతులను ఉపయోగించి పరిశోధనలు చేయాలంటే ఆధునిక పరికరాలు, ప్రయోగశాలలు, విశాలమైన భవనాలు, అనుభవం కల్గిన ఆచార్యులు పూర్తిస్థాయిలో ఉండాలి. కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 1,200 ఆచార్య, సహాయ ఆచార్య పోస్టులు ఖాళీగా ఉండగా రాబోయే రెండు సంవత్సరాలలో చాలామంది సీనియర్ ఆచార్యులు పదవీ విరమణ చేసే అవకాశం ఉంది. ఇది రాబోయే కాలంలో పరిశోధనలకు మరింత విఘాతం కలిగించే విపరిణామం. తరగతి గదిలో పాఠాల కంటే ప్రయోగశాల విద్యకే విదేశాల్లో ప్రాధాన్యం ఇస్తారు. దురదృష్టవశాత్తూ తెలంగాణ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి కానరావడం లేదు. ‘పట్టాలు’ పొందుతున్నా ఉపాధి పొందడంలో విద్యార్థులు విఫలం అవడానికి ప్రధాన కారణం వర్సిటీల్లో అర్హులైన బోధకులు లేకపోవడం. అనుభవజ్ఞుడైన ఆచార్యునితోనే విద్యార్థికి నాణ్యమైన విద్య, పరిశోధనాత్మక విద్య లభిస్తుంది. ఇది ప్రస్తుతం మన రాష్ట్రంలో కరువైంది. దేశ విదేశాల్లో నూతన ఆవిష్కరణలు, వివిధ శాస్త్ర సాంకేతిక పద్ధతులు, విధానాలు తెలుసుకోవాలంటే- సంబంధిత పరిశోధన పత్రాలని అందుబాటులో తీసుకురావాలి. పరిశోధనల గురించి సమస్త సమాచారం విద్యార్థులకు చేరే విధంగా మన విశ్వవిద్యాలయాలు పూర్తిస్థాయిలో కృషి చేయటం లేదు.
సైన్స్, సోషల్ సైన్స్, ఆర్ట్స్ తదితర అంశాల్లో పరిశోధన పత్రాలను అంతర్జాలం నుండి డౌన్‌లోడ్ చేసుకొని, మెరుగైన సమాచారం సేకరించాలంటే పరిశోధక విద్యార్థులు తమ వ్యక్తిగత అకౌంట్‌ను వినియోగించాల్సి వస్తోంది. ఈ సేవలను విద్యార్థులు ఉచితంగా పొందే సౌకర్యం మన విశ్వవిద్యాలయాల్లో లేకపోవడం శోచనీయం. ప్రపంచంలోనే పరిశోధన రంగంలో అత్యుత్తమైన పత్రాలు అందుబాటులో లేవు. ఉదాహరణకు- ఏసిఎస్, ఆర్‌ఎస్‌సి, సైన్స్ డైరెక్ట్, విల్లి, స్ప్రైజెర్, హెల్స్‌వేర్ లాంటి హై ఇంపాక్ట్ ఫాక్టర్ ఉన్న పరిశోధన పత్రాలు పొందేందుకు ఆన్‌లైన్‌లో ‘లాగిన్’ అవ్వాలంటే ప్రతి సంవత్సరం కొంత రుసుమును సంబంధిత విశ్వవిద్యాలయాలు భరించాలి. ఈ సౌలభ్యం కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఉంటుంది. కానీ రాష్ట్రం పరిధిలో ఉన్న వర్సిటీల్లో ఆ ఊసే లేదు. యూనివర్సిటీ నిధుల సంఘం నుండి అధిక స్థాయిలో కేంద్ర విశ్వవిద్యాలయాలకు నిధుల కేటాయింపుజరుగుతున్నందున వారికి ఎటువంటి సమస్యా రాదు. రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు బడ్జెట్ గ్రాంట్ పెంచకపోవడం వలన ఈ ప్రాంత పరిశోధకులకు శాపంగా మారింది. దేశ, విదేశాల్లో ఆధునిక నూతన పరిశోధన ఆవిష్కరణలు నిలువచేసి సమాజానికి అందించే పరిశోధనలు కలిగిన హైఇంపాక్ట్ పరిశోధన పత్రాలు మన రాష్ట్రంలో అందుబాటులో లేవు. దీంతో పరిశోధన రంగం వైపుదృష్టిసారించే విద్యార్థుల, మేధావుల సంఖ్య తగ్గుతోంది.
నేటివరకూ యూజీసీ అందిస్తున్న పురాతన కాలం నాటి పత్రాలను వెబ్‌సైట్‌లో చూస్తూ నేటి మన పరిశోధనలు ‘కొత్త సీసాలో పాత సారా’ అనే సామెతను గుర్తుచేసుకుంటారు. పోటీ ప్రపంచంలో దూసుకుపోవాలంటే సమకాలీనంగా జరుగుతున్న పరిశోధనల గురించి తెలుసుకోవాలి. ఎంతో ప్రసిద్ధి చెందిన ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో సైతం ఇప్పటికీ కాలం చెల్లిన వెబ్‌సైట్లు, దశాబ్దాల నాటి జర్నల్స్‌లోని సమాచారంపై విద్యార్థులు ఆధారపడక తప్పడం లేదు. దీంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మనం పోటీపడలేక పోతున్నాం. కేవలం పరిశోధన పత్రాలే కాకుండా పరిశోధన పరికరాల కొరత మన విశ్వవిద్యాలయాలను పట్టిపీడిస్తుంది. రసాయన శాస్త్రం వంటి విభాగాల్లో పరిశోధన పరికరాల ఏర్పాటు అధిక ఖర్చుతో కూడిన పని. వీటికి తగిన ప్రాధాన్యత ఇవ్వడంలో విఫలం అవుతున్నాం. దీనికితోడు భవనాల కొరత కూడా ఉంది.
ఫెలోషిప్‌ల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ‘నేషనల్ ఫెలోషిప్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్’ పేరిట కేంద్ర మానవ వనరుల శాఖ వారు షెడ్యూల్డ్ కులాల వారికి 3000, షెడ్యూల్డ్ తెగల వారికి 800, వెనుకబడిన కులాలు, ఓబీసీ వారికి 300 స్లాట్స్ చొప్పున కేటాయిస్తున్న ఫెలోషిప్‌లు సరిపోవడం లేదు. దేశవ్యాప్తంగా 331 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉండగా ఓబీసీ వారికి కేవలం 30 ఫెలోషిప్‌లు మాత్రమే కల్పించడం వల్ల ఒక విశ్వవిద్యాలయానికి ఒక ఫెలోషిప్ కూడా దక్కని స్థితిలో ఓబీసీ విద్యార్థులు ఉన్నారు. జనాభా ప్రాతిపదికన 50 శాతం ఉన్న ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వం 10,000 స్లాట్స్ వారికి పెంచాలి. అలాంటప్పుడే విద్యార్థుల పరిశోధనలకు అయ్యే ఖర్చు భారం కాకుండా ఉంటుంది. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ కులాల వారికి అదనంగా 5000 స్లాట్స్‌ను పెంచితే- పరిశోధక విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ప్రతి సంవత్సరం విధిగా నోటిఫికేషన్ విడుదల చేసినపుడే పరిశోధక విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీనిపై విశ్వవిద్యాలయ నిధుల సంఘం, కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ వారు చొరవతీసుకొని తక్షణం అమలు చేయాలి. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో వివిధ రకాల జాతీయ ఉపకార వేతనాలు పొంది పరిశోధన సాగిస్తున్న విద్యార్థులు సరైన సౌకర్యాలు లేక వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు, జాతీయ పరిశోధన సంస్థలకు వెళుతున్నారు. తమ పరిశోధన ఫలితాలను తెలుసుకునేందుకు సొంత డబ్బులు వెచ్చించాల్సి రావడం విచారకరం.
యూజీసీ, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పరిశోధన సౌకర్యాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నాణ్యమైన ఫలితాలు రావడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో పరిశోధక విద్యార్థులకు ‘ఫ్రీ జర్నల్ ఆక్సిస్’ రూపంలో అన్ని పరిశోధన పత్రాలను అందుబాటులో ఉంచాలి. దీనికి సంబంధించిన ఫీజులను యూనివర్సిటీలే భరించే విధంగా నూతన నిబంధనలు తీసుకువచ్చి కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో మాదిరిగా రాష్ట్ర పరిశోధక విద్యార్థులకు నెలవారీగా రూ. 15000 చొప్పున స్కాలర్‌షిప్‌లు ఇచ్చి పరిశోధన రంగం వైపు ప్రోత్సహించాలి. ఈ రకమైన చర్యలు తీసుకున్నపుడు మన పరిశోధనలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది.
నవీన ఆవిష్కరణలు, పరిశోధనలు నేటి సమాజానికి, భావితరాలకు ప్రయోజనకరంగా ఉండాలంటే ముందు గా మన విశ్వవిద్యాలయాలు పరిశోధనలకు పెద్దపీట వేయాలి. అన్ని విశ్వవిద్యాలయాల్లో ‘ప్లగిరిజమ్’ అనే సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులో ఉంచి పరిశోధక నివేదికలను అంతర్జాలంలో పొందుపరిచినపుడే నాణ్యమైన పరిశోధనకు బాటలు వేసినట్లు అవుతుంది. విదేశాల్లో భారతీయ విద్యార్థులు అద్భుత పరిశోధనలు, నూతన ఆవిష్కరణలతో సంచలనాలు సృష్టిస్తున్నారు. అలాంటి సంచలనాలు ఇక్కడ కూడా రావాలంటే పరిశోధనలో నాణ్యత, పరిశోధన రంగానికి భారీగా నిధుల కేటాయింపులు ఉండాలి. ఇందుకు యూనివర్సిటీ నిధుల సంఘం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం ఎంతో అవసరం. ఈ ప్రక్రియను ఎప్పటికప్పుడు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షించాలి. విద్యారంగంలో ప్రమాణాలకు పట్టం కట్టినపుడే మన విద్యార్థులు అద్భుతాలను ఆవిష్కరిస్తారు.

-- ఈర్ల రాకేష్ 99129 87077