మెయన్ ఫీచర్

‘జమిలి’ ఎన్నికలు వరమా? శాపమా??

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చట్టసభలన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరిపించేందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ‘జమిలి ఎన్నికలం’టే అన్ని శాసనసభలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే. 16వ లోక్‌సభకు కాలపరిమితి వచ్చే ఏడాది మే నెల వరకు ఉం ది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలను లోక్‌సభతో పాటు రద్దు చేసి ఒకేసారి ఎన్నికలు జరిపించే సాహసం ఏ పార్టీ కూడా చేయలేదు. జమిలి ఎన్నికలపై ఇప్పటికే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పచ్చజెండా ఊపారు. పాండిచ్చేరి సీఎం నారాయణ స్వామి మాత్రం ఇందుకు అంగీకరించలేదు.
జమిలి ఎన్నికలపై మోదీ ప్రభుత్వం పెద్ద కసరత్తే చేస్తోంది. ‘లా కమిషన్’కు- జమిలి ఎన్నికల కోసం అవసరమైన రాజ్యాంగ సవరణలు, విధి విధానాలు, జనాభిప్రాయసేకరణ, రాజకీయ పార్టీల మనోగతాలను తెలుసుకోవడం వంటి పనులు అప్పగించారు. ఇదే విషయమై తమ అభిప్రాయాలను ఈ నెల 30వ తేదీలోగా తెలియచేయాలని ‘లా కమిషన్’ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. జూలై 8,9 తేదీల్లో జమిలి ఎన్నికలే అజెండాగా అన్ని రాజకీయ పార్టీలతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని ‘లా కమిషన్’ నిర్ణయించింది. ‘లా కమిషన్’ తాజా నివేదిక ప్రకారం దేశంలోని 29 రాష్ట్రాల్లో సగం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 2019 పార్లమెంటు ఎన్నికలతో, మిగిలిన సగం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 2024 లోక్‌సభ ఎన్నికలతోకలిసి నిర్వహించాలని ప్రతిపాదించింది. ఒకసారి ఎన్నికైన ప్రభుత్వాలు స్థిరంగా ఉండాలంటే ఫిరాయింపునిరోధక చట్టాన్ని సరళీకృతం చేయాలని లా కమిషన్ సూచించినట్టు సమాచారం. అసెంబ్లీ లేదా పార్లమెంటు కాలపరిమతి ఐదేళ్లయితే, మధ్యలో ప్రభుత్వాలు ఏదైనా కారణాల వల్ల పడిపోతే, అనివార్యంగా జరిగే మధ్యంతర ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే పార్టీ మిగిలిన కాలానికి మాత్రమే ఉండాలన్న ప్రతిపాదనను కూడా చేర్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సిఫార్సులు రానున్న రోజుల్లో ఎటూ బయటకు వస్తాయి.
ప్రస్తుతం ఏడు గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, 49 గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. యుపి, ఒడిశా, పుదుచ్ఛేరి రాష్ట్రాలు మాత్రమే జమిలి ఎన్నికలపై స్పందించాయి. బయటకు చెప్పకపోయినా జమిలి ఎన్నికలకు తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కూడా ఉత్సాహపడుతున్నారు. ఈ రెండు అసెంబ్లీలకు వచ్చే ఏడాది జూన్ మొదటి వారం వరకు గడువు ఉంది. కాని లోక్‌సభతో అసెంబ్లీలకు ఎన్నికలు జరపాలనుకుంటే ఈ ఏడాది డిసెంబర్‌లో లేదా వచ్చే ఏడాది జనవరి నాటికి మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది. అంటే ఆరు నెలల ముందుగానే అసెంబ్లీలను రద్దు చేసి లోక్‌సభతో పాటు ఎన్నికలకు వెళ్లాలని ఆంధ్ర, తెలంగాణలో అధికారంలో ఉన్న టీడీపీ, టీఆర్‌ఎస్ పక్షాలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇటీవల జరిగిన ‘నీతి ఆయోగ్’ సమావేశంలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ జమిలి ఎన్నికలపై జాతీయ స్థాయిలో విస్తృత చర్చ జరగాలన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఎక్కడో ఒక చోట నిత్యం జరుగుతుండడం వల్ల సుపరిపాలన అందించలేమని, ఎన్నికల కోడ్ అడ్డు వస్తోందని, ప్రతి ఎన్నికను అధికారంలో ఉన్న పార్టీకి అగ్ని పరీక్షగా తయారై పరిపాలనపై దృష్టిని కేంద్రీకరించలేకపోతున్నామని బీజేపీ అంటోంది.
జమిలి ఎన్నికల వల్ల ఎన్నికల ఖర్చు బాగా తగ్గుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ‘ఒక దేశం- ఒక ఎన్నికలు’ నినాదాన్ని చాలారోజులుగా వినిపిస్తున్నారు. జమిలి ఎన్నికలు జరుగుతాయా? లేదా? అనే విషయం వచ్చే నెలలోనే తేలిపోతుంది. ఇలా జరగాలంటే రాజ్యాంగానికి ఐదు సవరణలు తీసుకురావాల్సి ఉంటుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ సవరణలను ఉభయ సభలు ఆమోదించాలి. ఇవన్నీ జరిగితే, లోక్‌సభతో పాటు జమ్మూ కశ్మీర్, మిజోరాం, మధ్యప్రదేశ్,్ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, అరుణాచలప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హర్యానా, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతాయి. మహారాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి 2019 నవంబర్ దాకా ఉంది.
జమిలి ఎన్నికల వల్ల లాభాలను పక్కనపెడితే, ఈ ఎన్నికల వల్ల ప్రజలు ఎన్నుకున్న లోక్‌సభ, అసెంబ్లీల కాలపరిమితి అర్ధాంతరంగా ముగుస్తుంది. ఉదాహరణకు 16వ లోక్‌సభ కాలపరిమితి 2019 మే నెలాఖరువరకు ఉంది. ఆంధ్ర, తెలంగాణ శాసనసభల కాలపరిమతి 2019 జూన్ వరకు ఉంది. ఐదేళ్ల పాటు పరిపాలించమని ప్రజలు ఎన్నుకుంటే, ముందుగా జమిలికి సిద్ధపడడం వెనక ఉద్దేశమేంటి? జమిలికి కాంగ్రెస్ అడ్డుపడకపోవచ్చు. జాతీయ స్థాయిలో లేదా రాష్టస్థ్రాయిలో ఎప్పుడు ఎన్నికలు ఎప్పుడువస్తాయా అని ప్రాంతీయ పార్టీలు ఆతృతగా ఎదురుచూస్తుంటాయి. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలకు ఎన్నికలను అనుకున్న సమయానికి నిర్వహిస్తే బీజేపీకి ఓటమి ఖాయమని కొన్ని సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. ఇదే నిజమైతే ఈ రాష్ట్రాల ఎన్నికల ఆ తర్వాత నాలుగైదు నెలలకు లోక్‌సభకు ఎన్నికలు వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న భయం బీజేపీని వెంటాడుతోంది. అందుకే జమిలి ఎన్నికలు అనే విశాలమైన నినాదం ముసుగు వెనక బీజేపీ భయం దాగి ఉంది. బీజేపీకి గ్యారంటీగా సీట్లు తెచ్చే రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌ల్లో ‘కమలం’ వాడిపోతే, ఆ తర్వాత నాలుగునెలలు పాలన సజావుగా కొనసాగడం కష్టం. జమిలి ఎన్నికల ఆలోచన రాజ్యాంగ రీత్యా, ప్రజాస్వామ్య రీత్యా మంచిదే అయినా, దీనిని స్వాగతించే పార్టీల్లో స్వార్థ చింతన కనపడుతోంది.
ఉత్తరప్రదేశ్‌లో వరుస పరాజయాలతో కుంగిపోయిన బీజేపీ ఆ అసెంబ్లీని రద్దు చేసి జమిలికి సిద్ధపడే సాహసం చేయలేదు. ఎందుకంటే మరో 20 ఏళ్లపాటు యుపిలో ఏ పార్టీకి రాని విధంగా గత ఎన్నికల్లో 300 సీట్లు బీజేపికి వచ్చాయి. కర్నాటకలో కుమారస్వామి ప్రభుత్వం తుమ్మితే ఊడిపోతుంది. కుమారస్వామికి కాంగ్రెస్ మద్దతును ఉపసంహరించుకుంటే జమిలి ఎన్నికలకు కర్నాటకను సిద్ధం చేయవచ్చు. తమిళనాడులో జయలలితను చూసి గతంలో అన్నా డిఎంకెను ప్రజలు గెలిపించారు. జయలలిత మరణం తర్వాత చోటు చేసుకున్న రచ్చ రాజకీయాలు అందరికీ తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీని రద్దు చేసే విధంగా అధికారంలో ఉన్న పార్టీని బీజేపీ ఒప్పించగలదా? జమ్మూ కశ్మీర్‌లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం రద్దయింది. పార్లమెంటుతో పాటు కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగడం ఖాయంగా కనపడుతోంది.
జమిలి ఎన్నికలకు ప్రాంతీయ పార్టీలు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఉరకలేస్తున్నాయి. ఆంధ్రా లో టీడీపీ, వైకాపాతో పాటు జనసేన-వామపక్షాలు, కాంగ్రెస్, బీజేపి పక్షాల మధ్య పంచముఖ పోటీలు జరగనున్నాయి. జమిలి ఎన్నికల్లో ‘గెలిస్తే గెలుస్తాం, మునిగితే మునుగుతాం’ అనే ధోరణిలో పార్టీలు ఉన్నాయి. రాజ్యాం గ సవరణలు తేకుండా జమిలి ఎన్నికలను మోదీ ప్ర భుత్వం నిర్వహించలేదు. కాలపరిమితి ముగియకుండా ఒక అసెంబ్లీని రద్దు చేయాలంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం సిఫార్సు చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగ సవరణలు జరగని పక్షంలో బీజేపీ అనివార్యంగా రాజస్తాన్, మధ్యప్రదేశ్,్ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలతో పాటు సాధారణ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది. ఇదే జరిగితే ఆరు నెలలకు ముందుగా ఆంధ్ర, తెలంగాణ అసెంబ్లీలను అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రద్దు చేయాలని సిఫార్సు చేసి ఎన్నికలకు వెళ్లడం సమర్ధనీయమా ? ముందస్తు ఎన్నికలు కలిసి రావనే సెంటిమెంట్ కొందరు నేతలకు ఉంది.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 4, 6, 9, 11, 12 లోక్‌సభలు పూర్తి కాలపరిమితి ఐదేళ్లు నిండకుండానే రద్దయ్యాయి. 13వ లోక్‌సభ సంగతి ఏమైందోతెలిసిందే. అప్పట్లో కేంద్రంలో వాజపేయి ప్రభుత్వం , ఎల్‌కె అద్వానీ ‘అంతా బాగుంది, భారత్ వెలిగిపోతోంది’ అనే భ్రమలకు లోనై, అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి వ్యూహ రచనలు చేసి లోక్‌సభను రద్దుచేశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రద్దుకు చంద్రబాబు ప్రభుత్వం సిఫార్సు చేసి తన ఓటమికి తానే ముహుర్తం ఖరారు చేసుకున్నారు. సీన్ కట్ చేస్తే- 2014లో అధికారంలోకి మళ్లీ చంద్రబాబు వచ్చే సరికి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిపోయింది. 2004, 2009 ఎన్నికల్లో చంద్రబాబు రకరకాల పొత్తులతో పరాజయం చెందారు. బీజేపీదీ అదే పరిస్థితి. 2004లో ముందస్తు వ్యూహం వల్ల ఓట్ల వర్షం కురిసి బోలెడు సీట్లు సంపాదించవచ్చనుకుంటే, బాక్సాఫీసు వద్ద సినిమా తస్సుమన్నట్లు ఎన్డీఏ ప్రభుత్వం ఓటమి చవిచూసింది. పదేళ్లపాటు నిరీక్షిస్తే కాని బీజేపీ అధికారంలోకి రాలేకపోయింది.
ముందస్తు సెంటిమెంట్లు తెలుగు రాష్ట్రాల్లో ఫలించకపోవచ్చు. ప్రభుత్వ వ్యతిరేక ప్రభంజనం వల్ల ఓటమి చెందుతామని, ప్రతిపక్షాల్లో ఐక్యమత్యం రాకుండా ఉండేందుకు, తగిన వ్యవధి ఇవ్వకుండా ముందస్తుకు పో దాం అనే ఆలోచన కొన్ని అధికార పార్టీల్లో ఉంది. జమిలి ఎన్నికలు తప్పుడు వ్యూహమని మరికొన్ని పార్టీలు భావిస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉంటే గనుక- ఎన్నికలు ముందుగా జరిగినా లేదా ఆరు నెలల తర్వాత జరిగిన ఓడిస్తారు. నాయకుడు నచ్చితే- ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పట్టం కడతారు. ‘ఒక దేశం- ఒక ఎన్నికల’ వల్ల వచ్చే ప్రయోజనం ఎలా ఉన్నా, అధికారాన్ని ఆరు నెలల ముందు పోగొట్టుకోవడం, ప్రజలు ఐదేళ్లపాటు ఇచ్చిన తీర్పుకు పాతర వేయడం సహేతుకం కాదు.

-కె. విజయశైలేంద్ర 98499 98097