మెయిన్ ఫీచర్

పాలిథిన్‌పై సమరం.... ఇంటినుంచే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంటాం.. వాడేస్తాం.. ఇంటికి తెచ్చి చెత్త నింపి మళ్లీ పడేస్తాం.. మళ్లీ కొంటాం.. వాడేస్తాం.. పడేస్తాం.. ఇలా ప్రతిరోజూ ఓ వ్యక్తి ఓ పాలిథీన్ కవర్‌ను పడేసినా.. అదంతా రోజుకు వందకోట్ల పైమాటే.. అవన్నీ ఎక్కడికి వెళతాయి..? ఏమైపోతాయి? అనేదే పెద్ద ప్రశ్న.. నిజమేమిటంటే అవి ఎక్కడికీ వెళ్లడం లేదు. భూమిపై, నీళ్లల్లో, కొండల్లో, గుట్టల్లో, తుప్పల్లో, జంతువుల కడుపుల్లో.. ఇలా ఎక్కడపడితే అక్కడ ఉన్నాయి. అవన్నీ కొండలా మారి కొండచిలువలా మానవజాతిని మింగేస్తోంది. అదే.. పాలిథీన్ రాక్షసి.
చవగ్గా వస్తోందని, తేలిగ్గా మడత పెట్టుకోవచ్చని, ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చని మురిసిపోయిన మనిషి.. ఆనక వచ్చే నష్టాల సంగతే పట్టించుకోలేదు. ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు కొంపలు ముంచుతోంది. మన జీవితంలో ప్లాస్టిక్ అనేది ఎంతగా చొచ్చుకుపోయిందంటే ప్లాస్టిక్‌తో చేయని వస్తువులు చాలా తక్కువ. నీళ్ల సీసాలు, కూల్‌డ్రింకులు, బిందెలు, గ్లాసులు, మూతలు, పళ్లాలు, తినే కంచాల దగ్గర్నించి ఇంటికి వాడే కర్టెన్లు, టేబిల్ క్లాత్‌లు కూడా ప్లాస్టిక్‌తో చేసినవే. ఇక పిల్లల ఆట వస్తువుల సంగతి చెప్పనే అక్కరలేదు. ఇవి తేలికగా వుండి, విరిగిపోనివి, రంగు పోనివి కనుక అందరికీ సదుపాయంగా వుంటుంది. నిజమే గానీ దానివల్ల హాని చాలా ఎక్కువగా, ఒక్కొక్కసారి భయంకరంగా వుండవచ్చు. ముఖ్యంగా నీళ్ల సీసాలు చాలారోజులు వాడతారు కనుక అవే సీసాలలో మళ్లీ మళ్లీ నీళ్లు, పాలు, పళ్లరసాలు నింపి నిలువ చేస్తారు. ఇవి చల్లగా వున్నప్పుడు అంత అపాయం లేదు గాని ఒకసారి ఉష్ణోగ్రత ఎక్కువై వేడెక్కితే అందులో విష పదార్థాలు తయారై ఆహార పదార్థాలలో కలిసిపోతాయి. ఇవి శరీరానికి రరకాలైన జబ్బులు వ్యాధులు కలిగించి అనారోగ్యం పాలు చేస్తాయి.
పాలిథీన్, ప్లాస్టిక్ అనేది అన్ని రకాల జీవరాశుల మెడ చుట్టూ పెద్ద పాము. నోరులేని పశువులు పాలిథిన్ కవర్ల రంగు చూసి మోసపోతాయి. పచ్చపచ్చగా ఉంటే పచ్చగడ్డేమో అని భ్రమపడతాయి. పళ్ల తొక్కలూ, మిగిలిపోయిన రొట్టె ముక్కలూ, పాచిపోయిన అన్నం.. ఆ కవర్లలో పెట్టి ముడేసి చెత్తబుట్టలో వేస్తాం. కవర్ల ముడి విప్పేసి ఆ మూగజీవులు వాటిని తినలేవు కాబట్టి ఆవురావురుమంటూ ఆ కవర్లతో సహా మింగేస్తాయి. ఫలితంగా అన్నం అరిగిపోతుంది. తొక్కలు జీర్ణమవుతాయి. కానీ పాలిథిన్ మాత్రం పేగులకు చుట్టుకుపోయి ఆ జీవిని నరకయాతనకు గురిచేస్తుంది. పాలిథిన్ కవర్ల కారణంగా రోజుకు వంద పశువుల వరకూ చనిపోతున్నట్లు ఓ అంచనా! అప్పట్లో ఆపరేషన్ చేసి ఓ ఆవు పొట్టలోంచి దాదాపు 35 కిలోల పాలిథిన్ సంచులు తీసిన సంగతి అందరికీ తెలిసిందే.. లక్షలాది పక్షులు పాలిథిన్ యమగండానికి బలవుతున్నాయి.
సముద్రాన్ని ఈ పాలిథిన్ కవర్లు సునామీ కన్నా తీవ్ర సంక్షోభానికి గురిచేస్తున్నాయి. మూడు వందలకు పైగా అరుదైన సముద్ర జాతులు పాలిథిన్ కారణంగా కనుమరుగైపోయాయని పర్యావరణ ప్రియులు గగ్గోలు పెడుతున్నారు. సాగరాన్ని కూడా చెత్తబుట్టలా భావించే మనిషి అదో సమస్య కాదని నిమ్మళంగా అందులో అనేక పాలిథిన్ కవర్లను వేస్తున్నాడు. పాలిథిన్ భస్మాసురుడికి బ్రదరు. పంటపొలాల్లో కలిసిపోయిన పాలిథిన్ కవర్లలోని సూక్ష్మ రసాయనాలు.. బియ్యం, ఆకుకూరలు, కూరగాయల ద్వారా మనిషి ఆహార చక్రంలో భాగమైపోయి తీవ్ర అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. పాలిథిన్ అవశేషాలు జలాశయాల్లో పేరుకుపోయి చేపల ద్వారా, ఇతర సముద్ర ఆశారాల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా మనిషి ఒంట్లోకి చేరుతున్నాయి. ఫలితంగా వీటి ప్రభావం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటోంది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఏటా రెండు కోట్ల జీవరాశుల మరణానికి పాలిథిన్ కారణం అవుతోంది. ఒక మనిషి మరణానికి కారణం అయితేనే ఉరిశిక్ష వేస్తామే.. మరి ఇన్ని చావులకు కారణమైన ఆ రాకాసిని ఏం చేయాలి?
పాలిథిన్ వాడకమనేది గుండెల మీద కుంపటి. ఉగ్రమాదమంతటి తీవ్ర సమస్య. అందుకని పాలిథిన్ దుష్ప భావాల నుంచి తప్పించుకోవాలంటే నిషేధాలు సరిపోవు. నిజాయితీ కావాలి. జీవోలు అక్కరలేదు. జన భాగస్వామ్యం అవసరం. దుకాణం నుండి సరుకులు మాత్రమే సంచుల్లో తెచ్చుకుందాం. ప్లాస్టిక్ కవర్లలో కాదు. ఉచితంగా ఇచ్చినా వద్దని చెబుదాం. ఒక్క రూపాయి ఎక్కువైనా కూడా పర్యావరణానికి హానిచేయని సంచుల్నే ఎంచుకుందాం. ఉద్యమాలు ఎక్కడో పుట్టవు. ఒక్క మనిషితోనే మొదలవుతాయి. ఆ మనిషి మనమే అవుదాం. ముఖ్యంగా ఆడవారు ఇంటి నుంచే ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టాలి. అప్పుడే పాలిథిన్ వ్యతిరేక ఉద్యమానికి మనమంతా నాయకులమవుతాం.
పర్యావరణ పరిరక్షణకి సంబంధించి తరచుగా ‘ద త్రీ ఆర్స్’ పదాన్ని వాడటం అందరికీ తెలిసిందే. ఈ మూడు ఆర్‌లకు రెడ్యూస్, రీ యూజ్, రీ సైకిల్ అని అర్థం.
* రెడ్యూస్: వీలైనంత వరకు చెత్తను తగ్గించాలి. అనవసరంగా ఏ వస్తువునూ కొనకూడదు. మార్కెట్లోకి వచ్చే రకరకాల ప్లాస్టిక్ టిఫిన్ డబ్బాలను, పెన్సిల్ బాక్స్‌లను చూసి అవి అవసరమో, కాదో ఆలోచించకుండా కొనేస్తుంటాం. ఆ తరువాత వాటిని వాడకుండా ఉంచేస్తుంటాం. దానివల్ల వ్యర్థాల సంఖ్య ఎక్కువైపోతోంది. అందుకే ఏ వస్తువునైనా కొనేటప్పడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
* రీయూజ్: ఒక వస్తువును కొని దాన్ని మళ్లీ మళ్లీ ఉపయోగించడమే రీయూజ్. వస్తువులను రకరకాలుగా ప్యాక్ చేసి అమ్ముతుంటారు. బిస్కెట్ డబ్బాలు, చెప్పులు, చీరలు వంటివి కొన్నప్పుడు అట్టపెట్టల వంటివి వస్తుంటాయి. వాటిని పారేయకుండా తెలివిగా, సృజనాత్మకంగా ఉపయోగించాలి. అప్పుడే రీయూజ్‌కు అసలైన అర్థం.
* రీ సైకిల్: కాగితాలు, బట్టలు, జ్యూట్ వంటివి రీ సైకిల్‌కి పనికొస్తాయి. కాబట్టి ఇలాంటివి వాడటం వల్ల పర్యావరణానికి ఎలాంటి నష్టం ఉండదు. కానీ పాలిథిన్ కవర్లకు రీ సైకిల్ గుణం లేనందువల్ల ఇది పర్యావరణానికి హానికరం. కాబట్టి దీనిని వాడకపోవడమే అన్ని రకాలా మంచిది.
* బయట నుంచి సరుకులు కానీ, కూరగాయలు కానీ తెచ్చేటప్పుడు వస్త్రంతో చేసిన సంచిని కానీ, కాగితం బ్యాగులు కానీ, జూట్ బ్యాగులు కానీ వాడదాం.
* చెత్తను వేసేటప్పుడు కూడా చెత్త డబ్బాలను వాడదాం. అవి కూడా ప్లాస్టిక్‌వి కాదు. పర్యావరణ హితమైనవి.
* పిల్లలకు క్యారేజీలను జూట్ బ్యాగుల్లో కానీ, మనమే తయారుచేసిన అందమైన బ్యాగుల్లో కానీ సర్దుదాం.
* ముఖ్యంగా కారులో సీటు కవర్లు, కవరింగు మెటీరియల్, వివిధములైన డాష్‌బోర్డులు ఎయిర్‌వెంట్సు చాలా ప్రమాదకరమైనవి. ముఖ్యంగా ఏసి కార్లలో అన్ని అద్దాలు బంధించినపుడు అదివరకే వేడివల్ల తయారైన బెంజీను రింగ్సు గాలిలోనించి మనం పీల్చే ప్రమాదం వుంది. ఇవి ఊపిరితిత్తులు, గొంతు, ఆహార నాళం గుండా శరీరంలోకి చేరి రకరకాలైన కాన్సర్లు, జబ్బులు, కిడ్నీ జబ్బులు కలుగజేస్తాయి. మనకి తెలియకుండానే గర్భిణీ స్ర్తిలు చిన్న పిల్లల్ని కార్లలో ఎక్కించి చల్లగా వుండడానికి దుమ్ము ధూళి రోడ్డుపైనించి రాకుండా వుండడానికి ఎయిర్ కండిషను వేస్తాము. ఇలా బెంజిన్ రింగ్సు పీల్చకుండా లేదా పీల్చినా తక్కువ స్థాయిలో శరీరంలోనికి చేరడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పసిపిల్లలు, స్ర్తిలు, గర్భిణీలు తెలుసుకోవలసిన విషయాలు, జాగ్రత్తలు- ఇవి అందరూ పాటించాలి. ఈ బెంజీను అనేది పూర్తిగా లేకుండా వుండదు గాని నిరపాయకరమైన పరిమాణం 50 మి.గ్రా. ప్రతి చదరపు అడుగుకి (50 ఎజిఎమ్/స్క్వేర్‌ఫుట్) వాతావరణంలో. అయితే కార్లలో 400-800 ఎంజిఎం వరకు వుంటుంది. అది ఇంట్లో గరాజీలో వున్నా కూడా, అంటే అపాయస్థితికి చేరుతుందన్నమాట! ఇంక ఎండలో నిలబెట్టిన కార్లలో 2000-4000 మి.గ్రా. వరకు చేరుతుంది. అంటే 40 రెట్లు పెరుగుతుంది. మరి మనం ఏసి వేసుకునే ముందు అద్దాలన్నీ మూసివేస్తాం కదా. ఈ విషపదార్థాన్ని నేరుగా పీల్చేస్తారు లోపలున్నవారు. ఇలా జరగకుండా వుండాలంటే కారులోని అద్దాలన్నీ పూర్తిగా తెరిచి గాలి ధారాళంగా విడిచిపెట్టాలి. తర్వాత ఏసి వేసి వేడిగాలి పూర్తిగా పోయిన తర్వాత అంటే ఒక 3-4 నిమిషాలు అద్దాలు అలాగే వుండనిచ్చి కారు కొంచెం దూరం నడిచిన తర్వాత అద్దాలు మూయాలి. ఈ చిన్న జాగ్రత్తవల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఎంత తొందరలో వున్నా ఎసి వేసిన 4-5 నిమిషాలకి అద్దాలు మూస్తే బెంజీను యొక్క తీవ్రత తగ్గిపోతుంది. బెంజీనువల్ల బ్లడ్ కాన్సరు, బోన్‌మారో, డిప్రెషన్, లంగ్ కాన్సరు, గొంతు కాన్సరు వంటి ప్రాణాపాయ వ్యాధులు వస్తాయన్న సంగతి అందరూ తెలుసుకోవాలి.
ఇంట్లో ప్లాస్టిక్ వస్తువు కానీ, పాలిథిన్ కవరు కనిపించకుండా చేయడం వల్ల భవిష్యత్తులో మానవజాతికి మనుగడ ఉంటుంది. ఈ మాత్రం బాధ్యత అయితే ప్రతీ స్ర్తీకి ఉంటుంది కదా.. దాన్ని నూరుశాతం చిత్తశుద్ధితో నెరవేరుద్దాం.

-ఉమామహేశ్వరి