మెయన్ ఫీచర్

‘హోదా’ గాయానికి అభివృద్ధి లేపనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా చర్చ, లేదా వివాదం, నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తున్నది. అందుకు కారణాలు ఏవైనా ఇది సంతోషించదగ్గ పరిణామం అవుతున్నది. రాగలదని అందరూ ఆశించిన హోదా రాకపోవడం ముఖ్యంగా సాధారణ ప్రజలను గాయపరచింది. ఇందుకు లేపనం కాగలది అభివృద్ధి మాత్రమే. అయితే అది పాలకులు అంటున్న అభివృద్ధి కాదు, ప్రజలు కోరుకుంటున్నది అయి ఉండాలి. అది జరిగనట్లయితే ఈ గాయం, దాని మచ్చనుంచి ప్రజల దృష్టి క్రమంగా మళ్లే అవకాశం ఉంటుంది. లేనిపక్షంలో, ప్రభుత్వం తన ధోరణిలో తాను వ్యవహరించినట్లయితే తమకు అవసరమైన అభివృద్ధి జరగనప్పుడు ప్రజలు ఈ గాయాన్ని నెమరు వేసుకుంటారు. ఆ గాయాన్ని ఎపుడైనా సరే తిరిగి కెలికేందుకు ప్రతిపక్షాలవారు, ఇతర విమర్శకుల సిద్ధంగా ఉంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయనకు సహకరించవలసిన బాధ్యత గల కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఈ విషయం గుర్తుంచుకోక తప్పదు. లేని పక్షంలో ఆంధ్రప్రదేవ్‌కు నష్టం కలిగే మాట అట్లుంచి, రాగల ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో టిడిపి-బిజెపి కూటమికి హాని కలుగుతుంది.
ప్రత్యేక హోదా ప్రశ్నపై రెండేళ్లపాటు తీవ్రమైన చర్చలు జరిగాయి. హోదా ఇవ్వాలని టిడిపి, ఇచ్చే విషయం పరిశీలిస్తున్నామని బిజెపి కేంద్ర ప్రభుత్వం మొదటి ఏడాది కాలం పైకి ఏమి మాట్లాడినా, అది వీలయేపని కాదని ఇద్దరికీ మొదటినుంచీ తెలుసు. ఇంకా చెప్పాలంటే విభజన ఆమోదం పొందినప్పటినుంచే తెలుసు. ఆ సంగతి వారికెంత స్పష్టంగా తెలుసునో ప్రతిపక్షంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు, అవశిష్టంగా మిగిలిన జాతీయ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ శాఖకు, కమ్యూనిస్టు పార్టీలకు కూడా అంత బాగా తెలుసు. అయినా అట్లా ఎందుకు వ్యవహరించారంటే ఎవరి రాజకీయ అవసరాలు వారికున్నాయి. చివరకు కమ్యూనిస్టులు కూడా అటువంటి అవసరాలకోసం పాప్యులిస్టు నినాదాలిచ్చి ఆందోళనలతో ప్రజలను తప్పుదారి పట్టించారంటే వారి బలహీనత ఏ స్థాయికి చేరిందో గ్రహించవచ్చు. కమ్యూనిస్టులు ఎంత బలహీనపడినా ప్రజల దృష్టిలో కొంత గౌరవం ఇంకా మిగిలివుంది. ఒకవేళ వారు ప్రత్యేక హోదా ప్రశ్నపై వాస్తవ పరిస్థితిని ప్రజలకు మొదటినుంచీ వివరించి, అది సాధ్యమయ్యేది కాదని, ఇతర పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని, కనుక ప్రజలు అభివృద్ధి కోసం పట్టుపట్టాలని కోరినట్లయితే ఈ వేడి అంతా తగ్గుతున్న స్థితిలో వారి ప్రతిష్ఠ పెరిగేది. వారు చెప్పిందే నిజమైందన్న విశ్వాసం ప్రజలకు కలిగేది. ఓట్లు కూడా పెరిగేవేమో? కాని కాదు, హోదా భావనల ప్రకోపపు కేకులో తమకూ ఒక ముక్క దొరకాలన్న హ్రస్వదృష్టితో తమ చౌకబారు రాజకీయం తాము చేసారు. చివరకు వారికి ఏమీ దొరకకుండా పోతున్నది.
టిడిపి, బిజెపిలు మొదటి సంవత్సరమంతా పైన చెప్పినట్టు గడిపిన తర్వాత, ప్రజల దృష్టిని హోదా నుంచి అభివృద్ధి వైపు మళ్లించేందుకు రెండవ ఏడాదికాలం పలు ప్రయాసలు పడ్డారు. హోదా అనే సాంకేతిక గుర్తింపుకన్నా అభివృద్ధి ముఖ్యం, హోదా మంత్రదండం కాదు, హోదా వచ్చిన రాష్ట్రాలు ఏమి బాగుపడ్డాయి, హోదా కన్నా ఎక్కువ నిధులిచ్చి అభివృద్ధి చేస్తాం, అసలు హోదాను బిల్లులో చేర్చకపోవడం కాంగ్రెస్ తప్పు పద్ధతిలో ఒకరకం మాటలు చెబుతూ పోయారు. ఈ క్రమంలో వెనుకటి ప్రణాళికా సంఘం రద్దయి నీతీ ఆయోగ్ ఏర్పడటం, ఆయోగ్‌వారూ ఆర్థిక సంఘంవారూ రాష్ట్రాలకు నిధులూ సహాయాలకు సంబంధించి కొత్త సూత్రాలు సిఫారసు చేయటంతో హోదా విషయం మరొక మలుపు తిరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు హోదా సాధ్యం కాదేమోనని, లేదా అసలు కాదని సూచిస్తూ ముఖ కవళికలలో మరింత నైరాశ్యాన్ని ప్రదర్శించేందుకు టిడిపి, బిజెపిలకు సువర్ణావకాశం లభించింది. ఇతర రాష్ట్రాలూ కోరుతున్నాయనే మాట చెప్పి నిరుత్తరులను చేయడం యథావిధిగా కొనసాగింది. ఇదంతా జరగడంతో కేంద్ర మంత్రులు పార్లమెంటు ఉభయసభలలో, బయటకూడా ‘అసలందుకు నిబంధనలు అంగీకరించవు. హోదా ఇవ్వదగ్గ అర్హతలలో ఆంధ్రప్రదేశ్‌కు ఒక్కటంటే ఒక్కటైనా లేదు’’ అని ఇటీవల ధైర్యంగా చెప్పడం మొదలు పెట్టారు. ఆ ధైర్యం ఎట్లా కలిగిదంటే ప్రత్యర్థి నెమ్మదిగా డస్సిపోయే యుద్ధనీతిని ఈ సరికి విజయవంతంగా అమలు పరచారు గనుక.
అయితే ప్రజల స్థాయిలో ఒకటి జరిగింది. ఎవరికైనా తాము ఓడిపోతున్నామని అర్థమైనప్పుడు దుఃఖం, ఆగ్రహం ముంచుకొస్తాయి. నిరాశ, అసహాయత, అసహనం వంటివి పెల్లుబుకుతాయి. హోదా రాగలదన్న ఆశాభావాలతో మొదటి సంవత్సరమంతా పోరాడినవారు, రెండవ సంవత్సరం గడిచేకొద్దీ అవి జరిగేపని కాదని అర్థమవుతూ రాగా, ఇటువంటి భావనలతో స్వరాలు పెంచారు. ఆస్థితి ఒకరిద్దరి ఆత్మహత్యల వరకు వెళ్లింది. అదే సమయంలో మరొకవైపు ప్రజలకు లోలోపల శూన్యం వంటివి ఏర్పడటం మొదలైంది.
సరిగా ఈ సమయంలో మరొక దృ శ్యం ఆవిష్కారమైంది. ప్రజలు ఈ ఆగ్రహం తమపైకి మళ్లగలదన్న జంకుతో, హోదా రాని కారణాన్ని బిజెపి పైకి తోసేందుకు టిడిపి ప్రయత్నించింది. కనీసం నిధులనైనా హమీ ప్రకారం ఇవ్వడంలేదన్న విమర్శను స్వయంగా ఆరంభించింది. హోదా ఇవ్వక, నిధులూ లేనప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడం ఎట్లాగని ప్రజల ముందు వాపోయింది. ఆ విధంగా ప్రజల సానుభూతి పొందడం, నిందను కేంద్రంపైకి తోయడం, ప్రతిపక్షాల విమర్శలనుంచి కాచుకోవడం అనే త్రిముఖ వ్యూహం అందులో కన్పించింది. ఆంధ్రలో బలపడాలని కోరుకుంటున్న భాజపాకు ఇందులోని ప్రమాదం అర్థం కాకపోవడంతో నిధుల లెక్కలు, ఇతర అభివృద్ధి పథకాల జాబితా బయటతీయడం మొదలు పెట్టింది. ఆ విధంగా కొన్ని వారాలపాటు పోరాటం ఇరువురు మిత్రుల ద్వంద్వ యుద్ధంగా మారడం ఆసక్తికరం అయింది కాని, అందులో ప్రజల సానుభూతిని చంద్రబాబు సంపాదించినట్లు బాలెన్స్ షీట్ చూపుతున్నది. కథ ఈ విధంగా థ్రిల్లర్ మలుపులు తిరగగా, ఇక ప్రతిపక్షాలకు ఏమి చేయాలో తోచని స్థితి ఏర్పడడం ఆసక్తికరమైన విషయం. ఇటువంటి స్థితి కారణంగానే ప్రతిపక్షాల హోదా ఆందోళనలు ఇటీవల స్తబ్దస్థితికి చేరాయి. ముద్రగడ పద్మనాభం వ్యవహారంతో అజెండాలు అందరికీ మారిపోయాయి.
కాని ఇక్కడ అర్థం చేసుకోవలసింది ఒకటున్నది. ఇది తాత్కాలిక స్థితి మా త్రమే. అభివృద్ధి సమస్యలు ఎక్కువ వ్యవధి లేకుండానే తిరిగి ముందుకొస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉమ్మడి రాష్ట్రం అనేది ఒక అభివృద్ధి భావన. రాష్ట్ర విభజన అన్నది అభివృద్ధి భావన. విడిపోయిన తర్వాత భవిష్యత్తు ఏమిటన్నది అభివృద్ధి భావన. ప్రత్యేక హోదా అన్నది అభివృద్ధి భావన. హోదాకు అంతకు మించిన నిధులూ పథకాలన్నది అభివృద్ధి భావన. అవి రాకపోతే ఏమిటన్నదీ అభివృద్ధి భావనే. ఇప్పుడు చివరకు అమరావతి పాలకులు, ఢిల్లీ ఏలికలు నొక్కి మాట్లాడుతున్నది అభివృద్ధి భాష.
అందువల్ల, పైన అనుకున్నట్లు, ఆ హోదాలు, టిడిపి-బిజెపి కలహాల తాత్కాలిక దశ గడిచిపోతున్నందున ప్రజలు అభివృద్ధి గురించి గట్టిగా ఆలోచించడం, దానిపైనే దృష్టి కేంద్రీకరించడం మొదలవుతుంది. రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు గడిచి, తిరిగి ఎన్నికకు మూడు సంవత్సరాలే మిగిలి ఉన్నాయి. రాష్ట్రంలోని అధికార కూటమికి ప్రజలు ఇచ్చిన పరీక్ష గడువు ఇక మూడేళ్లన్నమాట. మొదటి రెండు సంవత్సరాలలో వచ్చిన మార్కులు ఎక్కువ ఏమీ లేవు. విభజన సమస్యలు, రెవెన్యూలోటు, స్వంత రాజధాని లేకపోవడం, రాజధాని నిర్మాణానికి ముఖ్యమంత్రి ప్రయత్నాలు, కేంద్రం నుంచి ఆశించినంత లభించకపోవడం వంటి వన్నీ ప్రజలు గమనించడం లేదని కాదు. ఇవి చంద్రబాబుకు తగినంత సానుభూతిని తెచ్చిపెడుతున్నాయి. వాటిని గరిష్ట స్థాయికి పెంచుకునేందుకు ఆయన చాకచక్యంగా చేస్తున్న ప్రయత్నాలు మరి కొంత ఫలితమివ్వడం కూడ కనిపిస్తున్నది. ప్రతిపక్షాల వైషమ్యాలూ కలిసివస్తున్నాయి.
కాని ఇదికూడా తాత్కాలిక పరిస్థితి. ప్రజలకు కింది స్థాయి నుంచి, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల దృక్కోణాలను గమనించినప్పుడు అంతిమంగా నికరమైన అభివృద్ధికి మాత్రమే వచ్చే ఎన్నికల ముందు పరిగణన లభిస్తుంది. పేదలు, దిగువ మధ్యతరగతి, కొంతవరకు మధ్యతరగతి, కొన్ని రైతువర్గాలు, వృత్తుల వారితో ఇప్పటికే అసంతృప్తి కనిపిస్తున్నది. రాయలసీమ, ఉత్తరాంధ్రలోనూ ఇది ఉంది. వీరిలో తమ స్వంత జీవితాల గురించి కొందరు, ప్రాంతీయాభివృద్ధి గురించి కొందరు ఆలోచిస్తున్నారు. వీరితో పలువురు రాజధాని సమస్యకు, విధానాల-అమలుకు సంబంధం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం అనుసరించిన విధానాల ఫలితాలను గుర్తు చేసుకుంటున్నారు. రాగల మూడేళ్లలోపు క్రమంగా ఇందుకు సమాధానాలు లభించినట్లయితే హోదా గాయం మానుతుంది. ఒకప్పటి టిడిపి పాలన చేదు జ్ఞాపకాలు మరపున పడతాయి. లేని పక్షంలో ఏదైనా జరగవచ్చు.

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)