మెయిన్ ఫీచర్

అపనింద.. ఎంతటివారికైనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిందకు భయపడి శ్రీరాముడు తనను అడవుల్లో వదిలేసి రమ్మన్నాడని సీతాదేవిని గంగాతీర భూముల్లో విడిచిపెట్టి లక్ష్మణుడు వెళ్లిపోయాడు. లక్ష్మణుడు చెప్పిన మాటలకు సీత నిర్ఘాంతపోయింది. లక్ష్మణుడు వెళ్లిపోయిన తర్వాత పరిపరివిధాల ఆవేదన చెందింది. అయోధ్యలో వున్నపుడు శ్రీరామునితో తన అనుభవాలను జ్ఞాపకం చేసుకొని కుమిలి కుమిలి ఏడ్చింది. శ్రీరాముడు తనను ఒడిలోకి తీసుకొని హృదయంమీదికి చేర్చుకున్నాడు. అదే ఆఖరుసారవుతుందని కాబోలు శ్రీరాముడు ఆ విధంగా ప్రేమ చూపాడని సీత విలపించింది. అలాగే చెమట పట్టిన చెంపలను శ్రీరాముడు తన చేలపు చెరుగుతో తుడిచాడు. ఆయన చూపిన స్నేహభావానికి అదే తుది చీటీ ఏమో? అనురాగంతో తాంబూలాన్ని ఇచ్చి అనుగ్రహించాడు. ఆ అనుగ్రహానికి అదే చివరి హద్దేమో? కోరినప్పుడు దయతో తన అభిప్రాయాన్ని మన్నించాడు. అతడు చూపిన ఆ దయకు అదే తుది ఏమో? ముఖంలో ముఖం పెట్టి మోహంతో ముద్దాడాడు. తనమీది ఆ మోహానికి అదే అంతమేమో? చిరునవ్వును తేరగా చూసి లోపలికి పిలిచాడు. ఆ ప్రేమ పిలుపుకు అదే చివరనేమో? అని సీత దుఃఖించింది. వన విహారంలో శ్రీరాముడు తనతో మాట్లాడిన మెత్తని మాటలను తలచుకొని సీతాదేవి చలించిపోయింది. జలకేళి సమయంలో శ్రీరాముడు కావించిన పరిహాసాలను మననం చేసుకొని పరితపించింది. భోజనవేళలో తనను సంభావించిన శ్రీరాముని ప్రశంసలను ఊహించుకొని భ్రాంతిలో మునిగిపోయింది.
జూదాది క్రీడల్లో శ్రీరాముడెరుగని ఎత్తులను పన్నిన సందర్భం గుర్తుచేసుకొని కలవరపడింది. ఏకశయ్యలో తాము విహరించిన తీరును తలచుకొని, తమ ప్రణయ కలహాలను జ్ఞాపకం చేసుకొని, తమ సరససల్లాపాలను స్మరించుకొని సీతాదేవి పొగిలి పొగిలి ఏడ్చింది.
అరణ్యంలో సీతాదేవి రోదన విన్న ముని కుమారులు వాల్మీకి దగ్గరకు వెళ్లి చెప్పారు. వాల్మీకి తన దివ్యదృష్టితో జరిగిన విషయమంతా తెలుసుకొని ఆమె శ్రీరాముని పత్ని జనక మహారాజు పుత్రిక అని చెప్పాడు. వెంటనే తన శిష్యులు అర్ఘ్యపాత్రను తీసుకొని వెంట రాగా, వాల్మీకి దయా హృదయుడై గంగాతీర ప్రాంతంలో వున్న సీతాదేవి దగ్గరకు వచ్చాడు. తనను అడవుల్లో వదిలినందుకు నిర్ఘాంతపోయిన సీత ఇంకా తేరుకోలేదు. లక్ష్మణుని రథం వెళ్లి వైపే తన చూపులను నిలిపింది. ఆమె కంటి కొసల్లోనుండి కన్నీళ్లు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. గుండె బరువుతో నిట్టూర్పులు విడుస్తున్నది. దుఃఖాతిశయంతో చెంపకు చేయి చేర్చి అలాగే ఖిన్నురాలయి ఉంది. దుమ్ముకొట్టుకొని వున్న శరీరంతో సీతాదేవి శోకిస్తూ ఉన్నది. వాల్మీకి సమీపించగానే సీతాదేవి ఆ అలికిడిని విన్నది. సుకుమారమైన ఆమె చెక్కిళ్ళపైనుండి కన్నీళ్ళు జారుతుండగా, రెప్పలెత్తి కరుణా సముద్రుడు మునిశ్రేష్ఠుడు అయిన వాల్మీకిని చూసింది. అప్పుడు సీతాదేవి ఊపిరిపీల్చుకుంది. విశ్వాసం కలిగింది. పెద్దగా ఏడుస్తూ వాల్మీకి పాదాలమీద పడింది.
అప్పుడు వాల్మీకి దయాహృదయంతో సీతాదేవిని అనునయించాడు. సీతను దుఃఖించవద్దని సీత గుణశీలాల ఔన్నత్యం రామునికి తెలియనిది కాదని, కాని ప్రజలు వేసిన నిందను పోగొట్టుకోవటానికి శ్రీరాముడు సీతను అడవుల్లో వదలిపెట్టే సాహసానికి పూనుకున్నాడని ఓదార్చాడు.
తనను తండ్రి అయిన జనకునిలాగా భావించమని ధైర్యం చెప్పాడు. తన ఆశ్రమమంతా ఆమెకు విహార వనంగా ఉంటుందని, ఆశ్రమవాసులైన మునికాంతలు విసుగుచెందకుండా ఆమెకు సేవలు చేస్తారని బుజ్జగించాడు. అయినా దైవగతిని మాన్పటానికి ఎవరికీ సాధ్యం కాదని వివేకంతో ధైర్యంతో మెలగాలని వాల్మీకి సీతకు హితవుచెప్పాడు.
అపనింద అనేది ఎంతటివారికైనా తప్పదని, ధైర్యంగా ఎదురొడ్డి నిలబడాలని చాలా చక్కగా కంకటి పాపరాజు ఉత్తర రామాయణాన్ని నిర్వచనంగా రచించినాడు.

-ఉషశ్రీ తాల్క