మెయిన్ ఫీచర్

వామ్మో..బామ్మ!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టింది భారతదేశం..
పెరిగింది ఫ్రాన్స్..
ఉండేది అమెరికాలో..
ప్రముఖ మోడల్..
హాలీవుడ్ హీరోయిన్..
యోగా గురువు..
డాన్స్ మాస్టర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డ్..
ఇలా ఎన్నో.. ఇంతా చెప్పేది తొంభై తొమ్మిది సంవత్సరాల ఓ బామ్మ గురించి.. మరో నెలరోజుల్లో ఆమెకు వందేళ్లూ నిండిపోతాయి. అయినా సరే రోజూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది ఈ బామ్మ. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా నాలుగు డాన్స్ కాంపిటీషన్స్‌లో పాల్గొనే ఈ బామ్మ గురించి తెలుసుకోవాలంటే ఆమె బాల్యంలోకి వెళ్లాల్సిందే..
బాల్యం: ఈ బామ్మ పేరు తావో పోర్చన్ లించ్. పుట్టింది 1918, ఆగస్టు 13వ తేదీన. తండ్రి పోర్చన్ లించ్ ఫ్రెంచ్ దేశస్తుడు. తల్లి భారతీయురాలు. తావో పుదుచ్చేరిలో పుట్టింది. ఓ రోజు పుదుచ్చేరి బీచ్ ఒడ్డున కొంతమంది యోగాసనాలు వేయడం చూసి తానూ యోగా నేర్చుకోవాలనుకుని తల్లిదండ్రులకు చెప్పిందట తావో. అప్పుడు ఆమె వయసు ఎనిమిది సంవత్సరాలు. చిన్నప్పటి నుంచీ జీవితంలో సాధించలేనిది ఏదీ లేదు అనే సిద్ధాంతాన్ని నమ్ముకుంది తావో. అందుకే చిన్నప్పుడే యోగాసనాలు వేసే మగ పిల్లల్ని చూసి తానూ యోగా నేర్చుకోవాలనుకుంది. అబ్బాయిలు మాత్రమే చేసే యోగాను అమ్మాయిలు ఎలా నేర్చుకుంటారు? అమ్మాయిలు అలాంటివి చేయకూడదు. వద్దు.. అని చెప్పారు కుటుంబ సభ్యులు. కానీ తావో వినలేదు. అబ్బాయిలు చేస్తున్నారంటే.. ఆ పనిని అమ్మాయిలు కూడా చేయగలరు. వారిదీ శరీరమే కదా అని తల్లిదండ్రులకు నచ్చచెప్పింది తావో. అలా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఓ గురువు దగ్గర యోగా శిక్షణ తీసుకుంది తావో. అప్పుడు యోగా శిక్షణలో అందరూ అబ్బాయిలే.. తావో ఒక్కటే అమ్మాయి. 1930లో తావో తన అంకుల్‌తో కలిసి గాంధీజీగారి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంది.
కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె విదేశాలకు వెళ్లిపోవడం.. అక్కడ మోడల్‌గా తావోకు అవకాశాలు రావడంతో మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. తరువాత నెమ్మదిగా డాన్స్ ప్రోగ్రా ములూ మొదలుపెట్టింది తావో. ప్రముఖ మోడల్‌గా ఉంటూ డాన్స్ ప్రోగ్రాములు చేసుకుంటున్న తావోకు హాలివుడ్ సినిమా ఆఫర్‌లు వచ్చాయి. వాటిని కూడా వదులుకోలేదామె. అలా రోజంతా క్షణం తీరిక లేకుండా గడిపేది. మార్లిన్ మన్రో, ఎలిజిబెత్ టేలర్ వంటి సెలబ్రిటీలతో పాటు దేవ్ ఆనంద్ వంటి భారతీయ నటులతో కూడా పనిచేసింది తావో. ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా ఆమె అప్పుడప్పుడూ యోగాసనాలు వేసేది. తన పక్కవారికి కూడా వాటి గురించి వివరించేదట. తావో తాను పెళ్లిచేసుకున్న తరువాత యోగాను ఫుల్ టైం కెరీర్‌గా మలచుకోవాలనుకున్నారుట.
తావో పెళ్లయిన కొద్దిరోజుల వరకు కూడా మోడలింగ్, సినిమాలు చేసేవారు. ఖాళీ సమయాల్లో అరబిందో, ఇందిరాదేవి వంటి యోగా దిగ్గజాల పుస్తకాలు చదివేవారు. చిన్నప్పుడు నేర్చుకుని వదిలేసిన యోగాను తిరిగి, కె.ఎన్. అయ్యంగార్ వంటి దిగ్గజ యోగా గురువు దగ్గర పూర్తిస్థాయి తర్ఫీదు పొందారు తావో. 1967లో నటనకు, మోడలింగ్‌కు స్వస్తి చెప్పారు తావో. 1976 యోగా శిక్షకురాలిగా మారారు. యోగా చేస్తున్నా ఆమె డాన్స్‌ను ఎప్పుడూ వదలలేదు. ప్రపంచంలోనే తొలిసారిగా, ఆ కాలంలోనే ఆమె ఆధ్వర్యంలో ‘యోగా టీచర్ అలయెన్స్’ మొదలైంది.
యోగా శిక్షణకే పూర్తి జీవితాన్ని అర్పించిన తావో.. యోగాలోనే కాదు బాల్‌రూమ్ టాంగో అనే డాన్స్‌లో కూడా నేర్పరి. తావో దృష్టిలో యోగా అనేది ఓ ప్రక్రియ, వ్యాయామం కాదు. అదో జీవన విధానం అంటారామె. జీవితాన్ని ప్రశాంతంగా, ఆనందంగా, తృప్తిగా, ఉల్లాసంగా గడపడానికి యోగా విలువైన సాధనం అని చెబుతారు ఈ తొంభై తొమ్మిదేళ్ల తావో. ఇప్పటికీ యోగా శిక్షణలో క్షణం తీరిక లేకుండా గడుపుతూంటారామె.
అవార్డులు: యోగా సాధనలో దాదాపు 70 సంవత్సరాల అనుభవం ఉన్న ఆమె దాదాపు 47 సంవత్సరాల నుంచి యోగా శిక్షణను అందిస్తున్నారు. ప్రపంచంలో అంత్యంత వయోధిక యోగా శిక్షకురాలిగా తావో 2012లో ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’లో చోటు సంపాదించుకున్నారు. తనకు డాన్స్‌పైనున్న మక్కువతో ‘డాన్సింగ్ లైట్’ పేరు తన ఆటో బయోగ్రఫీని కూడా విడుదలచేశారు. ఇది ఐపిపివె అవార్డును, ఇంటర్నేషనల్ బుక్ అవార్డునూ సాధించింది. ఈ బామ్మ ఇటీవలే ‘అమెరికన్ గాట్ టాలెంట్’ అనే టీవీ షోలో ప్రముఖ బాల్‌రూమ్ డాన్సర్ వార్డ్ మర్గారెన్‌తో కలిసి స్టెప్పులేసి అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. అంతేకాదండోయ్ ఈ వయసులో ‘రిఫ్లెక్షన్స్: ది జర్నీ ఆఫ్ లైఫ్’ అనే పుస్తకాన్ని కూడా రాసింది ఈ బామ్మ.
మోడలింగ్, నటన, యోగా, డాన్స్, రచయిత.. ఇవే కాదు ఈమెలో వ్యాపారవేత్త, సంఘసంస్కర్త కూడా ఉన్నారు. ఎందుకంటే తావో తన భర్తతో కలిసి అమెరికాలో వైన్ వ్యాపారాన్ని పెట్టి బాగా అభివృద్ధి చేశారు. తరువాత ‘అమెరికా వైన్ సొసైటీ’ని స్థాపించి.. దానికి కొద్దిరోజులు ఉపాధ్యక్షురాలిగా కూడా వ్యవహరించారు. ఇవే కాదండోయ్ తావోకి కారు డ్రైవింగ్ అంటే కూడా చాలా ఇష్టం. ఇప్పటికీ ఆమె కారు ఆమే డ్రైవ్ చేస్తారు. ఆమె పనిచేసిన కొన్ని సినిమాలకు స్క్రీన్ ప్లే కూడా రాసేవారుట. అలా అన్నిరంగాల్లోనూ తావో అందెవేసిన చెయ్యే..
2010లో అంటే తొంభై రెండేళ్ల వయస్సులో ఆమెకు క్యాన్సర్ వచ్చింది. దానితో కూడా పోరాడి గెలిచారు తావో. ఇప్పటికీ ఆమె చాలా ఫిట్‌గా ఉంటారు. అందుకే ఆమె యోగా తరగతులకు చాలామంది ఆకర్షితులవుతారు. యోగా శిక్షణలో కురువృద్ధురాలిగా, వంద సంవత్సరాల వయస్సులోనూ ఉల్లాసంగా, ఉత్సాహంగా, క్షణం తీరిక లేకుండా గడుపుతూన్న తావో జీవితం ప్రతి ఒక్కరికీ ప్రేరణే.. కదూ.. ఇటీవల అథ్లెటా కంపెనీకి చెందిన ఓ మాగ్‌జైన్ తావో ఫొటోని

ముఖచిత్రంగా ప్రచురించింది. ఆ సంస్థ నిర్వహించిన ‘పవర్ ఆఫ్ షీ’ కార్యక్రమానికి తావో ముఖ్య అతిథిగా హాజరైంది. తావో ఇప్పటికీ ఎంతో ఇష్టంగా చేసే బాల్‌రూమ్ డాన్స్‌లో సహ నృత్యకారుడు ఆమెకంటే డెబ్భై రెండేళ్లు చిన్నవాడు కావడం విశేషం కాక మరేమిటి? ఇప్పటికీ సంవత్సరానికి నాలుగు బాల్‌రూమ్ డాన్స్ ప్రోగ్రాముల్లోనన్నా ఈ బామ్మ పాల్గొంటుందంటే.. ప్రతి ఒక్కరూ వామ్మో! బామ్మ!! అనక మానరు.

-ప్రత్యూష