ఎడిట్ పేజీ

న్యాయస్థానాలకు ‘ధక్కార’ తలనొప్పి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యాయవ్యవస్థ అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నా, ఆర్థిక ఇబ్బందులు, సహాయక సిబ్బంది కొరత, న్యాయమూర్తుల పోస్టులు భర్తీ కానందున కోట్ల సంఖ్యలో కేసులు పెండింగ్‌లో పడుతున్నాయి. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకూ అన్ని కోర్టుల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో పెండింగ్ కేసుల పరిష్కారానికి సర్వోన్నత న్యాయస్థానం అనేక వ్యూహాలను అనుసరిస్తోంది. లోక్ అదాలత్‌లు, పరిపాలనా ట్రిబ్యునళ్లు, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార మార్గాలు, కంపెనీ లా ట్రిబ్యునళ్లు, ఫ్యామిలీ కోర్టులు వంటివి ఏర్పాటు చేసి పెండింగ్ కేసులను తగ్గించడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఇంత జరుగుతున్నా కొత్త కేసుల సంఖ్య పెరుగుతోందంటే- ప్రజలకు న్యాయవ్యవస్థపై ఇంకా చెక్కుచెదరని నమ్మకమే కారణం.
సుప్రీం కోర్టులోనే దాదాపు 55,259 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్టికల్ 124 కింద సుప్రీం ప్రధాన న్యాయమూర్తి మరో ఏడుగురు న్యాయమూర్తులతో ఏర్పాటైంది. తర్వాత దానిని యాక్టు 55/1956 ద్వారా న్యాయమూర్తుల సంఖ్యను 10కి పెంచారు. 17/1960 ద్వారా 13కు, 48/77 ద్వారా 17కు, 21/86 ద్వారా 25కు, 11/2009 యాక్టు ద్వారా న్యాయమూర్తుల సంఖ్యను 30కి పెంచారు. నిత్యం తీర్పులు వెలువడుతున్నా, మరోపక్క కొత్తగా కేసులు దాఖలు కావడంతో ఎపుడు చూసినా పెండింగ్ కేసులు కుప్పలా కనిపిస్తున్నాయి. హైకోర్టుల్లో కేసుల పరిష్కారానికి గత వారం సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు. త్వరితగతిన కేసులను పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయాలు కూడా చూడాలని సూచించారు. అందులో ఒక ప్రత్యామ్నాయం ప్రభుత్వ పిటీషన్ల లిటిగేషన్ తగ్గించడం.
ఉద్యోగికి చెల్లించాల్సిన పెన్షన్ లేదా ఇతర భత్యాల విషయంలోనో, సర్వీసు సంబంధమైన కేసుల్లోనో దిగువస్థాయి న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను పదే పదే సవాలు చేస్తూ ఉన్నత న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేయడంతో న్యాయస్థానాల కాలం వృథా అవుతోంది. అతి తక్కువ మొత్తం చెల్లించాల్సిన కేసుల్లోనూ ప్రభుత్వం పంతానికి పట్టింపునకూ పోయి లక్షలు, కోట్లు వెచ్చిస్తోంది. బదిలీకి సంబంధించి ఉద్యోగి కోర్టుకు పోయి రక్షణ పొందిన సమయంలో కూడా ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయిస్తోంది. దీనివల్ల ప్రభుత్వానికి ఎంతో డబ్బు, న్యాయస్థానాలకు విలువైన సమయం వృథా అవుతోంది. ఫలితంగా మిగిలిన కీలక కేసులపై దృష్టిపెట్టలేని దురవస్థ ఏర్పడుతోంది.
ఇదంతా ఒక ఎత్తయితే పరిష్కారమైన కేసులను అమలు చేయకుండా అడ్డుకుంటున్న అధికార యంత్రాం గం కూడా తలనొప్పిగానే తయారైంది. దీనిపై బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించి ధిక్కార కేసులు వేస్తున్నారు. సుప్రీంలో ఇలాంటి ధిక్కార కేసులు 699 పెండింగ్‌లో ఉన్నాయి. హైకోర్టుల్లో 97వేల కేసులున్నాయి. ఇందులో 96,310 సివిల్ ధిక్కార కేసులు కాగా, మిగిలినవి క్రిమినల్ ధిక్కార కేసులు . ఒడిశా హైకోర్టులో గరిష్టంగా క్రిమినల్ ధిక్కార కేసులు 104 పెండింగ్‌లో ఉండగా, అలహాబాద్ హైకోర్టులో 25,370 సివిల్ ధిక్కార కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ‘కోర్టు ధిక్కార చట్టం-1971’లో చాలా స్పష్టమైన నిర్వచనాలు ఉన్నా, కేసులు పరిష్కారమై ఆదేశాలు ఇచ్చినా, అవి వ్యక్తి స్వేచ్ఛ పేరుతోనో, సాంకేతిక అంశాల పేరుతోనే , నిర్వచించడంలో లోపం పేరుతోనో- తీర్పులు అమలుగాక బాధితులు కోర్టు ధిక్కార పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. 1971 నాటి కోర్టు ధిక్కార చట్టానికి 1976లోనూ, 2006లోనూ సవరణలు చేశారు. సమగ్రమైన నిర్వచనాలతో ఈ చట్టం అమలులో ఉంది. చాలా చట్టాలను భారత్ బ్రిటన్, యుఎస్ నుండి దిగుమతి చేసుకున్నా, ఆయా దేశాల్లో కోర్టు ధిక్కారానికి తావు లేకపోవడంతో అక్కడ కోర్టు ధిక్కార చట్టాలను రద్దు చేసినా, భారత్‌లో మాత్రం గత ఐదు దశాబ్దాలుగా అమలులో ఉన్నా ధిక్కార పిటిషన్లు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.
ఏ హైకోర్టులో ఎన్ని ?
అలహాబాద్ హైకోర్టులో సివిల్, క్రిమినల్ కలిపి 25,463 కోర్టు ధిక్కార పిటీషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. బాంబే హైకోర్టులో 5044, కోల్‌కత హైకోర్టులో 5533, ఛత్తీస్‌గఢ్‌లో 300, ఢిల్లీ హైకోర్టులో 1200, గౌహతి హైకోర్టులో 822, కోహిమా బెంచ్‌లో 16, ఐజ్వాల్ బెంచ్‌లో 12, ఇటానగర్ బెంచ్‌లో 48, గుజరాత్‌లో 144, హిమాచల్ ప్రదేశ్‌లో 174, హైదరాబాద్ హైకోర్టులో 7902, జమ్మూకాశ్మీర్‌లో 6888, జార్ఖండ్‌లో 1169, కర్నాటకలో 1281, కేరళ హైకోర్టులో 2735, మధ్యప్రదేశ్ హైకోర్టులో 8283, మద్రాస్ హైకోర్టులో 6783, మణిపూర్ హైకోర్టులో 588, మేఘాలయ హైకోర్టులో 19, ఒడిశా హైకోర్టులో 8077, పాట్నా హైకోర్టులో 4716, పంజాబ్-హర్యానా హైకోర్టులో 4379, రాజస్థాన్ హైకోర్టులో 4593, సిక్కిం హైకోర్టులో ఒకటి, త్రిపుర హైకోర్టులో 34, ఉత్తరాఖండ్ హైకోర్టులో 669 కోర్టు ధిక్కార పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి.
సాధారణ కేసుల పరిష్కారమే న్యాయస్థానాలకు తలకు మించిన భారం అవుతోంది. ఇక కోర్టు ధిక్కార పిటిషన్లను పరిశీలించి వాటిపై తగిన చర్యలను చేపట్టడం ఇంకా చెప్పలేని పరిస్థితి. 50 లక్షలకు మించిన ఆర్థిక అంశాలు ఇమిడి ఉన్న కేసులను మాత్రమే సుప్రీం కోర్టు వరకూ అనుమతించి, అంతకంటే లోపు ఉన్న కేసులను హైకోర్టుల్లోనే పరిష్కరించుకోవడంపై దృష్టి పెట్టాలన్న సుప్రీం సూచనను సైతం కేంద్రం చురుకుగా పరిశీలిస్తోంది. అన్ని ప్రభుత్వ శాఖలకూ న్యాయ విభాగాలను ఏర్పాటు చేసి పాత కేసులను తిరగతోడి ఏవేవి, ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో అధ్యయనం చేసి వీలైతే అంతర్గతంగానే వాటిని పరిష్కరించడం, అనివార్యమైతే ఉన్నత కోర్టులను ఆశ్రయించడం ద్వారా కేసులను తగ్గించుకోవాలని కేంద్రం చూస్తోంది. ఈ చర్యలు సానుకూల ఫలితాలను ఇస్తాయనడం నిస్సందేహం. ఎంతో కాలంగా ఈ అంశంపై దృష్టిపెట్టకపోవడంతో రోజురోజుకూ పిటిషన్లు పెరుగుతూ వచ్చాయి. కొన్ని మార్లు ఇందుకు సంబంధించిన సమాధానాలను కేంద్రం సమర్పించినపుడు కూడా వేల పేజీల్లో ఉండడం ఇబ్బందికరంగా తయారవుతోంది. ఒక దశలో సర్వోన్నత న్యాయస్థానం సైతం అసహనాన్ని ప్రదర్శించింది. గుట్టలకొద్దీ కాగితాలు అందజేస్తే- తాము చెత్తను ఏరుకునేవారిలా కనిపిస్తున్నామా? అంటూ సుప్రీం న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు అనేకం. ఇదంతా కావాలని పనిగట్టుకుని న్యాయస్థానాలను తప్పుదారిపట్టించే కార్యక్రమంగా చెప్పకనే అర్థమవుతుంది.
‘్ధక్కార’ వ్యవహారం అర్థం కావాలంటే కొంచెం చరిత్రలోకి వెళ్లాల్సిందే. ఈస్టు ఇండియా చట్టం అమలులో భాగంగా 1726లో భారత్‌లోని అన్ని ప్రధాన రాచరిక నగరాల్లో చాప్టర్లను ఏర్పాటు చేయాల్సిందిగా ఇంగ్లాండ్ రాజు ఆదేశించడంతో దాదాపు ఇంగ్లాండ్ చట్టాలు అన్నీ భారత్‌లో అమలులోకి వచ్చాయి. 1773 రెగ్యులేటింగ్ చట్టం కింద ఫోర్టు విలియమ్స్ న్యాయస్థానం రద్దయి, 1974లో కలకత్తాలో మేయర్ కోర్టు ప్రారంభమైంది. ఆ తర్వాత ముంబై, మద్రాస్‌ల్లో మేయర్ కోర్టులు వచ్చినా, ‘గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్టు-1800’ కింద అవి కూడా రద్దయి సుప్రీం కోర్టులు అమలులోకి వచ్చాయి. 1801లో మద్రాసులో, 1824లో ముంబైలో సుప్రీం కోర్టులు ఏర్పాటయ్యాయి. 1861లో తీసుకువచ్చిన ఇండియా హైకోర్ట్సు యాక్టు ప్రకారం కలకత్తా, ముంబై, మద్రాస్ సుప్రీంకోర్టులు కాస్తా హైకోర్టులుగా మారాయి. 1866లో అలహాబాద్ హైకోర్టు ఏర్పాటైంది. అపుడు ఈ నాలుగు కోర్టులకు ధిక్కారాన్ని శిక్షించే అధికారాలు ఇంగ్లాండ్ రాజు కట్టబెట్టారు. తీర్పుల్లో కీలక అంశాలను ఆధారంగా చేసుకుని కోర్టు ధిక్కార చట్టం 1926ను కోడిఫైడ్ చట్టంగా తీసుకువచ్చారు. తర్వాత స్వతంత్ర భారత్ ఏర్పడటంతో కొన్ని చట్టాలు యథాతథంగా కొనసాగినా, 1960 ఏప్రిల్ 1న ధిక్కార చట్టానికి కొత్త స్వరూపం ఇస్తూ కొత్త బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అప్పటి అదనపు సొలిసిటర్ జనరల్ హెచ్‌ఎన్ సన్యాల్ అధ్యక్షతన కమిటీని వేసి దానిని మరింత అధ్యయనం చేయాల్సిందిగా ప్రభుత్వం సూచించింది. కమిటీ ఇచ్చిన నివేదికను పార్లమెంట్ జాయింట్ సెలక్టు కమిటీ కూడా పరిశీలించిన తర్వాత 1971లో అమలులోకి తెచ్చారు. దిగువస్థాయి న్యాయస్థానాలకు అధికారాలను పరిమితం చేస్తూ ఉన్నత, సర్వోన్నత న్యాయస్థానాలకు పూర్తి అధికారాలను ఈ చట్టం కట్టబెట్టింది. ధిక్కారం అంటే ఏమిటో కూడా సెక్షన్ 2, 2సి ద్వారా వివరించిన 1971 చట్టం 3,13 సెక్షన్లు ద్వారా ఏ అంశం ధిక్కారం కిందకు వస్తుందో, సెక్షన్ 14,15లో ఏ అంశాలు ధిక్కారం కిందకు రావో కూడా వివరించింది.
1742లోనే లార్డ్ హార్డ్‌విక్ కోర్టు ధిక్కారంపై నిర్వచనం చెప్పాడు. ఇంగ్లాండ్ హల్స్‌బరీ చట్టంలో కూడా కోర్టు ధిక్కారంపై సమగ్ర నిర్వచనమే ఇచ్చారు. సూక్ష్మంగా చెప్పాలంటే న్యాయస్థాన అభిప్రాయాలను స్ఫూర్తికి భిన్నంగా నిర్వచించడం ధిక్కారం కిందకు వస్తుంది. భిన్నంగా చెప్పినా తీర్పు సారాంశాన్ని తప్పుదారి పట్టించడానికి వీలు లేదు. ఎ.రామలింగం వెర్సస్ వివి మహాలింగ నాడార్ (1967) తీర్పులో కూడా కోర్టు ధిక్కారంపై స్పష్టత ఉంది. వాస్తవానికి రాజ్యాంగంలోనే కోర్టు ధిక్కారంపై సర్వోన్నత న్యాయస్థానానికి సంపూర్ణ అధికారాలను కట్టబెట్టారు. ఆర్టికల్ 129, ఆర్టికల్ 215, ఆర్టికల్ 142 (2) వినియోగించుకుని న్యాయస్థానాలు కోర్టు ధిక్కారంపై కఠినంగా వ్యవహరించే వీలుంది. చాలా తీర్పులు వైయక్తికమైనవి కాగా కొన్ని తీర్పులు సార్వజనీనమైనవి ఉన్నాయి. అందరికీ వర్తించే తీర్పుల్లో చాలా వరకూ కోర్టు ధిక్కార అంశం తలెత్తడం లేదు, వైయుక్తికంగా వర్తించే తీర్పుల్లో మాత్రమే కోర్టు ధిక్కారం వస్తోంది.
ప్రస్తుత నిబంధనలను మార్చే యోచనలో 2018 మార్చి 8న న్యాయశాఖ లా కమిషన్‌కు లేఖ రాస్తూ ధిక్కార చట్టంలో సవరణలను ప్రతిపాదించాల్సిందిగా కోరింది. ప్రస్తుత చట్టం సమగ్రంగా ఉందని, దానిలోని నిబంధనలను కుదించడం ద్వారా న్యాయస్థానాలపై గౌరవం మరింత తగ్గే ప్రమాదం ఉందని , చట్టంలో ఎలాంటి సవరణలు చేయాల్సిన అవసరం లేదని తిరిగి బదులిచ్చింది. ఇదంతా బాగానే ఉన్నా ఉన్న కేసులనే పరిష్కరించలేక న్యాయస్థానాలు తలమునకలవుతుంటే కొత్తగా ఈ కోర్టు ధిక్కార పిటిషన్లు కూడా పేరుకుపోవడం కొంచెం సీరియస్‌గా తీసుకోవల్సిన అంశం. ఇందుకు ప్రత్యామ్నాయం సుప్రీం న్యాయమూర్తులతో ప్రత్యేక బెంచ్ ఏర్పాటుచేసి ఈ పిటిషన్లను త్వరితగతిన పరిష్కరించాలి. అందుకు సుప్రీంలోనూ, హైకోర్టుల్లోనూ న్యాయమూర్తుల సంఖ్యను గణనీయంగా పెంచాల్సి ఉంది. దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే వ్యయం చూసుకోరాదు, న్యాయం సకాలంలో అందినపుడే ప్రజలకు అన్ని వ్యవస్థలపై నమ్మకం పెరుగుతుంది. అపుడే ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది.

--బీవీ ప్రసాద్ 98499 98090