మెయిన్ ఫీచర్

ఎందరికో ప్రాణదానం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిందటి సంవత్సరం ఢిల్లీలో జరిగిన ఒక అరుదైన సంఘటన అవయవదానం విశిష్టతను అద్భుతంగా తెలియజేస్తుంది. మదన్‌మోహన్ కుమారుడు 20 సంవత్సరాల వయసుగల అన్మోల్ ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ స్థితికి వెళ్లిపోయాడు. అతని మరణం వృథాపోరాదని అతని తల్లిదండ్రులు భావించి వెంటనే ఢిల్లీలోని కుటుంబ అవయవ బ్యాంకింగ్ సంస్థ (ఆర్బో)ను సంప్రదించారు. వెంటనే ఆఘమేఘాల మీద అనుమతులు సాధించి, దేశంలోనే అత్యంత వేగంగా పనిచేసే ముఖ్యమైన, పనిచేస్తున్న అవయవాలను సేకరించి, అనంతరం ఢిల్లీలోని ఎయిమ్స్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో 34 మంది రోగులకు వాటిని అమర్చి చావు బ్రతుకులమధ్య నరకం అనుభవిస్తున్న వారందరి ప్రాణాలు కాపాడారు. దేశంలోనే అత్యంత పెద్ద అవయవ మార్పిడి చికిత్సగా రికార్డులకెక్కిన ఈ సంఘటనపై మన ప్రధాని స్వయంగా స్పందించి అన్మోల్ కుటుంబానికి పది లక్షల రూపాయల ప్రోత్సాహాన్ని అందించడమే కాకుండా దేశంలో అవయవదానానికి ఊతం ఇచ్చే పలు చర్యలను చేపడతామని ప్రకటించారు. సాధారణంగా అవయవదాతలకు ఎన్నో రకాలుగా నచ్చచెప్పాల్సి వుంటుంది. కానీ ఒక చిన్న ఉద్యోగం చేస్తున్న మదన్ మోహన్‌కి ఎలాంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం కలగలేదు అని ఆర్బోకు చెందిన డాక్టర్ ఆర్తి విజ్ పేర్కొనడం గమనార్హం.
అన్ని దానాలలోకెల్లా అన్నదానం గొప్పది అని శాస్తవ్రాక్యం. అయితే ఆ దానానే్న మించిపోయి గొప్ప పుణ్యం మూటగట్టుకునే మహద్భాగ్యాన్ని మనకు ఆధునిక వైద్యశాస్త్రం అందించింది. అదే అవయవదానం. బ్రతికి వుండగానే లేక మరణించిన తర్వాతనైనా మన శరీరంలోని కొన్ని ముఖ్యమైన అవయవాలను దానం చేసి తద్వారా ఇంకొక వ్యక్తి పరిపూర్ణ ఆరోగ్యంతో మరికొంతకాలం జీవించేందుకు తోడ్పడటమే అవయవదానం యొక్క శ్రేష్టత. అయితే ఇటీవల జాతీయ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం దీనావస్థల్లో వుండి, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతూ క్షణం క్షణం చావుబ్రతుకులమధ్య కొట్టుమిట్టాడుతూ అవయవ దాతలకోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య లక్షల్లో వుంటే, అవయవదానానికి ముందుకువస్తున్న దాతల సంఖ్య వందల్లో వుంటోంది. అవయవదానంపై అవగాహనలేమి, ప్రజల్లో నెలకొన్న అపోహలు, ఈ ప్రక్రియలో పెద్ద ఎత్తున జరుగుతున్న అక్రమాలు కారణంగా ఆ విధానం ఆధునిక దేశాలతో పోలిస్తే అనుకున్నంతగా ప్రగతిని సాధించడంలేదు.
వైద్యశాస్త్రం ప్రకారం సహజంగా మరణించిన వ్యక్తిలో కళ్ళు, గుండె వాల్వ్‌లు, చర్మం, ఎముకలు, కార్టిలాజ్, నరాలు వంటి అవయవాలు దానానికి పనికివస్తాయి. అదే బ్రతికివున్న వ్యక్తి రక్తం, ఎముకలు, కిడ్నీ, కాలేయం, ఊపిరితిత్తుల్లో కొంత భాగం, పాంక్రియాస్‌లో కొంతభాగం, దానం ఇవ్వవచ్చు. అయితే దానం చేస్తున్న వ్యక్తికి, రోగికి వైద్య పరీక్షలు నిర్వహించాకే ఈ అవయవాలు అమర్చవచ్చో లేదో వైద్యులు నిర్ణయిస్తారు. ఇక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తిలో కిడ్నీలు, కళ్ళు, కాలేయం, ఊపిరితిత్తులు, పాంక్రియాస్, చిన్నపేగు, స్వరపేటిక, యుటెరస్, నరాలు, ఎముకలు వంటివి దానానికి ఉపయోగపడతాయి. ఈ అవయవ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు అవయవాన్ని బట్టి అత్యల్పంగా కళ్ళకు మూడు గంటలనుండి గరిష్టంగా కిడ్నీలకు 48 గంటల సమయం పడుతుంది.
జాతీయ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం దేశంలో కిడ్నీలకు అధిక డిమాండ్ వుంది. ఏటా ఎనభై వేలమంది వెయిటింగ్‌లిస్టు జాబితాలోనికి చేరుతున్నారు. ప్రస్తుతం దేశంలో కిడ్నీ దాతల కోసం ఎదురుచూసే వారి సంఖ్య ఐదు లక్షలకు చేరుకుంది. అయితే వీరిలో కేవలం ఎనిమిదివేల మందికి మాత్రమే కిడ్నీలు లభ్యవౌతున్నాయి. అలాగే రెండు లక్షల కాలేయం అవసరం వుండగా ఏటా మూడు శాతం మందికి మాత్రమే అవయవదానానికి ముందుకు వస్తున్నారు. మిగతా అవయవాలకు వస్తే ప్రస్తుతం రెండు లక్షల ఊపిరితిత్తులు, మూడున్నర లక్షల గుండెలు, 70వేల పాంక్రియాస్‌ల అవసరం వుండగా లభ్యత మాత్రం వందల్లో వుందంటే ఈ అవయవదానం పట్ల ఎంతటి నిర్లిప్తవైఖరి వుందో ఇట్టే అర్థవౌతోంది.
అవయవదానంలో ప్రతి పది లక్షల జనాభాకు 36 మంది దాతలు, క్రొయేషియా 32, అమెరికా 26, ఫ్రాన్స్ 22లతో మొదటి నాలుగు స్థానాల్లో వుండగా, భారత్ మాత్రం 0.8 దాతలతో 156వ స్థానంలో వుంది. జిడిపిలో, జనాభాలో మనకంటే ఎంతో చిన్నవైన భూటాన్, జర్మనీ, ఇటలీ, ఉత్తరకొరియా దేశాలు మనకంటే ఎంతో మెరుగైన స్థానాలలో వున్నాయి. ఇక దేశీయంగా మెరుగైన అవగాహన, ప్రోత్సాహం, చట్టాల సరళీకరణలలో తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, గుజరాత్‌లు మొదటి ఐదు స్థానాల్లో వుండగా తెలుగు రాష్ట్రాలు 10, 11 స్థానాలలో వున్నాయి. ఒడిస్సా, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మరియు ఈశాన్య రాష్ట్రాలలో పరిస్థితి ఎంతో నిరాశాజనకంగా వుంది.
మన దేశంలో ప్రజలలో అవయవదానం పట్ల ఎన్నో అపోహలు నెలకొన్నాయి. ఇతరుల అవయవాలు దానం తీసుకుంటే వారి పాపాలు మనకు సంక్రమిస్తాయనే మూఢ నమ్మకాలు ప్రజల్లో పాతుకొని వున్నాయి.
ఇక కఠినతర నిబంధనావళి, అధికారుల నిర్లక్ష్యవైఖరి, చట్టాలలోని కొన్ని లొసుగుల కారణంగా కూడా అవయవదానానికి దాతలు ముందుకు రావడంలేదు. ఉదాహరణకు యాక్సిడెంట్‌లో మరణించిన వ్యక్తి అవయవాలు తీసుకోవాలంటే పోలీసులకు తెలియపరిచి, వారి అనుమతి పొందిన తరువాత ఆ శరీరానికి పోస్టుమార్టం నిర్వహించి డాక్టర్ల మరియు పోలీసుల లిఖితపూర్వక అనుమతి తీసుకున్న తర్వాతనే అవయవాలను దానం చేయడానికి వీలుంటుంది. అలాగే బ్రెయిన్ డెడ్ కేసులో డాక్టర్ల ధృవీకరణ పత్రాలను మెడికల్ కౌన్సిల్‌కు అనుమతుల కోసం పంపించాల్సి వుంటుంది. సజీవంగా వున్న దాతల విషయంలో సమీప బంధువులకు దానం చేసినట్లయితే ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇతరులకు దానం చేసే పక్షంలో అనేక అనుమతుల కోసం ప్రదక్షిణాలు చేయాల్సి వుంటుంది. కాబట్టి ఇంత శ్రమపడేందుకు దాతలు సిద్ధపడడం లేదు. కొన్ని నిజమైన సందర్భాలలో రోగులను కాపాడేందుకు నిబంధనావళిని సడలించాలి.
అవయవాలను దాతలనుండి తీసేందుకు స్పెషాలిటీ ఆసుపత్రులు మన దేశంలో కేవలం నగరాలకు మాత్రమే పరిమితమై వున్నాయి. ఈ ప్రక్రియ కూడా లక్షల్లో కూడుకున్న వ్యవహారం. ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రోత్సాహాలు ఇపుడు లభించడంలేదు. ద్వైపాక్షిక అంగీకారం కుదిరిన సందర్భాలలో మాత్రమే దాతలకు ఏ మాత్రం ఖర్చు అవకుండా సాఫీగా సాగిపోతోంది. స్వచ్ఛందంగా దానం చేయాలనుకునేవారికి అయ్యే వ్యయం లక్షల్లో వుంటోంది. బ్రతుకు బండి ఈడ్చడమే గగనం అయిపోతున్న నేటి కరువు రోజుల్లో ఇటువంటి వ్యయానికి ఎవరు సిద్ధపడతారు?
ఇక అవయవదానం ముసుగులో అనేక మోసాలు, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. అక్రమ అవయవ వ్యాపారంలో ఏటా 800 కోట్ల టర్నోవర్‌తో ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో వుంది. పేదరికం అడ్డం పెట్టుకొని గ్రామీణులకు పెద్ద మొత్తంలో ఆశ చూపించో, లేక అనాథలను తీసుకువచ్చి వారి అవయవాలను అతనికి తెలియకుండా తస్కరించడమో లేక అనారోగ్యం కారణంగా ఆపరేషన్ చేసే సమయంలో కొన్ని అవయవాలు తీసేసి ఇతరులకు అమ్మడమో లేక విదేశాలకు ఎగుమతి చెయ్యడమో చేసి లక్షలు గడించే అక్రమ దందా దేశంలో విశృంఖలంగా సాగుతోంది. ఇటీవల ముంబైలో ఒక ఆసుపత్రిపై సిబిసిఐడి దాడి చేసినపుడు గత ఐదేళ్లుగా ఏడు వందల ఆపరేషన్లు రోగులకు తెలియకుండా అవయవాలను తీసి విదేశాలకు అక్రమ రవాణా చేసిన ఉదంతాలు వెలుగు చూసాయి. ఇటువంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వచ్చే పార్లమెంటు సమావేశాలలో ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ చట్టానికి సవరణలు చేసి అక్రమార్కులకు మరింత కఠిన శిక్షలు విధించేందుకు వీలు కల్పించనుంది. అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం జీవన్‌దాన్ అనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రతీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్సకు ఆసుపత్రికి 50 వేల నగదు, అవయవ స్వీకర్తలకు ఆపరేషన్ చేయించుకున్న రెండు సంవత్సరాల వరకు ఉచిత మెడికల్ చెకప్, మందుల వితరణ, అవయవదాత కుటుంబానికి ఐదు లక్షల ప్రోత్సాహం ఇవ్వడం వంటి చర్యలు అవయవదాన ప్రక్రియకు మరింత ఊతం ఇస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
అవయవదాన ప్రక్రియ సరళీకృతం చేసేందుకు, జీవన్‌దాన్ పథకం ఆచరణలో సత్ఫలితాలను ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో వుందని ప్రధాని స్వయంగా ప్రకటించారు. ప్రజల్లో నెలకొన్న అపోహలు, భయాలు, అనవసర ఆందోళనలను తొలగించేందుకు గ్రామ స్థాయి నుండి విస్తృత స్థాయిలో అవగాహనా సదస్సులు నిర్వహించాల్సి వుంది.

--సి.ప్రతాప్ 9136827107