మెయిన్ ఫీచర్

‘క్లైమాక్సా’ మజాకా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** సినిమాకు ప్రారంభం... ఇంటర్వెల్ బ్యాంగ్... క్లైమాక్స్... ఈ మూడూ పడికట్టురాళ్ళు! ఇవి కుదిరాయా కథనం ఆటోమాటిగ్గా అందంగా అల్లుకుపోతుంది. 24ఫ్రేమ్స్ అలవోకగా అమరిపోతాయి. సినిమా ఆబాల గోపాలాన్ని అలరించేలా అద్భుతంగా తయారైపోతుంది. అందుకే కథకుడు వీటిపైనే ఎక్కువగా దృష్టిసారిస్తాడు. ప్రారంభం అదిరిపడేలా రాసుకుంటాడు. అంటే ప్రేక్షకుల్లో ఆసక్తికలిగేలా మొదలుపెడతాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ అదరగొట్టేలా చూసుకుంటాడు. అంటే ఉత్సుకత రేకెత్తించేలా సెకండ్ పార్ట్‌కోసం ఎదురుచూసేలా చేస్తాడు. ఇక క్లైమాక్స్ అబ్బురపడేలా ప్లానేస్తాడు. అంటే ప్రేక్షకుడి మైండ్ బ్లోయింగ్ అయ్యేలా బైండెడ్ స్క్రిప్ట్ పకడ్బందీగా తయారుచేసుకుంటాడు. ఇకనేం సినిమా అహో అదుర్స్!!
---------------------------------

అయితే చాలామటుకు సినిమాలు ప్రారంభమే నీరసంగా ఉంటూ పోనుపోను ఇంటర్వెల్ ఊహించని ఎత్తుగడ (లేదా సూపర్ ట్విస్ట్)తో ఊపందుకొని ప్రేక్షకుడికి నచ్చే క్లైమాక్స్‌తో ఎండ్ అయినవి ఎన్నో విజయవంతపు తీరాన్ని తాకాయి. బాక్సాఫీసుని ఆనందపుటంచుల్లో హుషారుగా తిప్పాయి. ఇక ప్రారంభం, ఈలలు వేయించి. ఇంటర్వెల్ సోసోగా అనిపించి, క్లైమాక్స్‌ని చేరేసరికి, ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టడమో, చిర్రెత్తించడమో చేసేస్తే... ఆ సినిమా పేరుకు రాకుండా పోయిన సందర్భాలు కోకొల్లలు... సినిమా గ్రంథపు పుటల్ని తిరగేస్తే! వాస్తవానికి థియేటర్‌ని వదిలిపెట్టే చివరి సమయంలో వచ్చే ప్రిక్లైమాక్స్ లేదా క్లైమాక్స్ ప్రేక్షకుడికి నచ్చేసిందా వదిలిపెట్టడా సినిమాని! హిట్ చేసేస్తాడు! క్లైమాక్స్‌కి అంత ఇంపార్టెన్స్ ఉంది. సినిమా టోటల్‌గా యావరేజ్ అనిపించినా క్లైమాక్స్ బ్రహ్మాండంగా వర్కవుట్ అయితే ఆ నిర్మాత నక్కతోకని తొక్కినట్టే! దర్శకుడు బూరెల బుట్టలో పడ్డట్టే! కథారచయిత ఏనుగు మీద ఊరేగినట్టే! అంతుంటుంది సీన్!!
ప్రణయ గాథల పాఠ్యపుస్తకం.. విషాద ప్రేమికుడి వ్యథాభరిత విఫల కథన శిఖరం దేవదాసు. సినిమా అంతా ఒక ఎత్తు. క్లైమాక్స్ మరొక ఎత్తుగడలా అన్పిస్తుంది. (అఫ్‌కోర్స్ అది నవలే అయినా!) దేవదాసు తన ఊరికి వచ్చాడని... శవమై వచ్చాడని... తెలిసిన పారు (పార్వతి) తన ప్రేమికుడిని కళ్ళారా చూడాలనే ఆతృతతో పరుగుపరుగున ఇంట్లోంచి బయటకు పరుగెత్తే ప్రయత్నం చేస్తుంది. ముందే పసిగట్టిన పార్వతి (సావిత్రి) భర్త సియస్సార్ నౌకర్లను పురమాయించి ఇంటి గేటు మూయించేస్తాడు. ఆమె తల గేటుకి ఢీకొని పడిపోతుంది. చనిపోతుంది. అలా ఇలలో సఖుడిని కలుసుకోలేక పోతుంది. ఆమె దేవదాసు (అక్కినేని)ని చూస్తే బాగుంటుందనో, లేదా దేవదాసు బ్రతికి ఉండి పార్వతిని కలుసుకుంటే హ్యాపీ ముగింపు ఉంటుందనో ప్రేక్షకుడు తలపోస్తాడు. ఈ రెండు క్లైమాక్స్‌లకు అవకాశం ఉన్నా నవలాధారంగా దర్శకుడు ఈ ముగింపుని ఖరారుచేసి ప్రేక్షకుడ్ని ఒప్పించడమే కాదు తనవితీరా ఏడిపించాడు. గుండె కరిగిన ప్రేక్షకుడు కన్నీటి సంద్రమై థియేటర్లోంచి బయటకు వచ్చాడు. ఈ విషాదపు క్లైమాక్సే దేవదాసు అఖండ విజయానికి ఊతమై నిలిచిందనడంలో అతిశయోక్తి కాని అసంబద్ధం కాని లేదు. అక్కినేని ప్రేమకథల రారాజు అయ్యాడు.
అందుకే రెండుమూడు ముగింపులకు అవకాశమున్న సినిమా కథలకు సరైన సరిపోయే ముగింపు టచ్‌నివ్వడంలోనే దర్శక రచయితల టాలెంట్ బయటపడుతుంది. అలాంటి క్లైమాక్సే కట్టిపడేసి ప్రేక్షకుడిని మెప్పిస్తుంది. ఒప్పిస్తుంది. నిర్మాతని ముంచకుండా గట్టెక్కిస్తుంది.
జానపదాల సామ్రాట్టు... సరికొత్త మాంత్రికుడి మాయాజాలపు వినోదాల మరో హిట్టు... ‘పాతాళభేరవి’. క్లైమాక్స్ చాలా గమ్మత్తుగా ఉంటుంది. హీరో (ఎన్టీఆర్)ని తన గుహకి రప్పించుకున్న మాంత్రికుడు (యస్వీ రంగారావు) శిరసు వంచి పాతాళభైరవి (దేవత)కి ప్రణమిల్లమంటాడు. హీరో చాలా తెలివిగా మాంత్రికుడి వ్యూహనికి ప్రతి వ్యూహం పన్ని... మాంత్రికుడినోమారు ప్రణమిల్లే భంగిమ స్వతహా చేసి చూపమంటాడు. సరేనంటూ ట్రయల్స్‌గా శిరసువంచిన మాంత్రికుడి శిరసుని ఒకే ఒక కత్తివేటుతో ఖండించేసి దేవిని ప్రసన్నం చేసుకుంటాడు. ఈ తమాషా క్లైమాక్స్ ప్రేక్షకుడిని ఉక్కిరిబిక్కిరి చేసింది. యన్టీఆర్‌ని స్టార్‌ని చేసేసింది. తానే కత్తిచేబూని మాంత్రికుడిని హతమార్చినంత సంబరపడిపోతూ ఆనంద డోలికల్లో తేలియాడుతూ థియేటర్లోంచి ప్రేక్షకుడు బయటకొచ్చేట్టు చేసింది.
గోరింటాకు ఎర్రగా పండిందా, మంచి మొగుడొస్తాడని ఇంట్లో మహిళా తలకాయలంటాయి సరదాకి. అలాగే సినిమా క్లైమాక్స్ కుదిరి అదిరిందా, సూపర్ వసూళ్ళకే ఢోకా ఉండదని సినీ పెద్ద తలకాయలంటారు. నిజమే! క్లైమాక్స్ సరిగ్గా కుదరకనో లేక నచ్చేటట్లుగా వండలేకనో కథల్ని పక్కన పడేసిన దాఖలాలున్నాయి. క్లైమాక్స్‌కి అంతపవరుంటుంది మరి! ప్రేక్షకుడికి క్లైమాక్స్ కనెక్టవ్వాలి. కథంతా చెప్పుకొచ్చి.. సినిమా అంతా నడిపించేసి... కన్‌క్లూజన్‌గా క్లైమాక్స్‌ని ప్రేక్షకుడికి నచ్చేటట్టు తీయగలిగితేనే ఆ సినిమా గట్టెక్కినట్టు. ఇంకా బాగానచ్చితే హిట్టయినట్టు. సూపరహో అయితే ఆ సినిమా బంపర్ హిట్టు. కాబట్టి సినిమా భవితవ్యాన్ని తేల్చేది ముగింపేనని ఘంటాపథంగా చెప్పొచ్చు.
అందుకు ఈమధ్యే విడుదలై బాక్సాఫీసు రికార్డులన్నింటినీ బద్దలుకొట్టి నాన్ బాహుబలి సినిమాల్లో నెంబర్‌వన్‌గా నిలిచిన రంగస్థలం తాజా సాక్ష్యం.. ఆక్సిడెంట్‌కి గురై కోమాలోకి వెళ్లి మంచం బారిన పడిన విలన్ పాత్రధారి ప్రకాశ్‌రాజ్‌ని.. కుటుంబ సభ్యులు ఆశవదులుకొని హాస్పిటల్లో వదిలివెళ్ళినా.. చాలా సహనంతో ఓపిగ్గా హీరో (రామ్‌చరణ్) తన సేవలతో విలన్‌ని మామూలు మనిషిని చేసి... అతడు హ్యాపీగా ఇంట్లో కుదురుకున్నాక మరీ హీరో తనకు జరిగిన అన్యాయాన్ని ఏకరువుపెట్టి... విలన్‌ని చంపేస్తాడు. ప్రేక్షకులకు ఈ క్లైమాక్స్ ఊహించనిది. చివరిదాకా సస్పెన్స్ మెయిన్‌టెన్ చేసేసరికి ప్రేక్షకుడు థ్రిల్ ఫీలయ్యాడు. భలే తమాషాగా అనిపించిందీ ముగింపు ప్రేక్షకుడికి. ఇకనేం బారులుతీరారు. బ్రహ్మాండంగా రిపీట్ ఆడియన్స్ తోడయ్యారు. కోట్ల సొమ్ము అవలీలగా రాబట్టుకుందీ సినిమా. మరి క్లైమాక్సా మజాకా!
విషాదంతోనైనా, వినోదంతోనైనా, యాక్షన్ థ్రిల్లింగ్‌తోనైనా క్లైమాక్స్ గుండెని కట్టిపడేస్తేనే ప్రేక్షకుడు చిన్నపిల్లాడిలా చప్పట్లు కొడతాడు. టికెట్టుకి గిట్టుబాటయ్యిందని ఎగిరి గంతేస్తాడు. దీనికి కాస్త ముందుకు వెళితే అద్భుత విన్యాసాల్ని హాలీవుడ్ సాంకేతిక నిపుణుల సహకారంతో కళ్ళు చెదిరేటట్టు చిత్రీకరించారు. వారెవ్వా అనుకున్నారు ప్రేక్షకులు. (సుమారు) అరగంటసేపు సాగే ఆ షాట్స్ భలేగా అన్పించాయి.
ప్రేక్షకుల కనువిందుకి సరికొత్త రుచులనందించాయి. ఆ క్లైమాక్స్ సన్నివేశాలు ముందెన్నడూ తెలుగు సినిమాలో కనీవినీ ఎరుగని ప్రేక్షకుడి మదిని విపరీతంగా అలరించాయి, ఆహ్లాదపరిచాయి. యాక్షన్ సీనే్స అయినా ఆకట్టుకొని ప్రేక్షకుడిచేత ఆదరించబడేలా చేశాయి. రోబో ఎంత పెద్ద హిట్టో మనం ఎరుగనిదేం కాదు! అందుకే క్లైమాక్స్‌ని చక్కగా వండితేనే మిగతా కథ కథనాలకు పరిపుష్టి వస్తుంది.
మెగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ తొలినాళ్ళలో హీరోగా చేసిన చిత్రం సక్సెస్ పిక్చర్ సుస్వాగతం. తెలుగు ప్రేక్షకులు ఆక్సెప్ట్‌చేయని ఓ వినూత్న క్లైమాక్స్. సినిమా ఎండింగ్‌లో చనిపోయిన తండ్రి అంత్యక్రియలకు సైతం హాజరుకాలేకపోయిన హీరో(పవన్‌కళ్యాణ్)కి కనువిప్పు కలుగుతుంది. జీవిత లక్ష్యం ఏమిటో తెలిసొస్తుంది. అప్పుడొస్తుంది హీరోయిన్ (దేవయాని) అతడి చెంతకు ప్రేమని అంగీకరిస్తున్నానంటూ! హీరోయినే కాదు ప్రేక్షకుడు సైతం ఉలిక్కిపడేలా... నాలుగేళ్ళు వెంటపడినా దక్కని నీ ప్రేమ సర్వస్వం కోల్పోయిన నాకిపుడక్కర్లేదని తిరస్కరిస్తాడు హీరో. ఆమె ఎంత ప్రాధేయపడినా, ప్రేమే నచ్చడం లేదు. ఇక నువ్వేలా నచ్చుతావని... ఉద్యోగంకోసం వెళ్ళిపోయే ఈ క్లైమాక్స్ సీన్ ప్రేక్షకుడికి తెగ నచ్చేసింది. యువత వెంటపడాల్సింది పడతికోసం ప్రేమకోసం కాదని ఒక లక్ష్యంకోసమని ప్రబోధించిన ఆ సినిమా సక్సెస్‌కి సుస్వాగతం పలికింది.
అందుకే సినిమా వర్గీయులు క్లైమాక్స్ బాగుండాలి. వినూత్నంగా ఉండాలి అని జాగ్రత్తపడుతున్నారు. క్లైమాక్స్ మూసధోరణిలో తీయబడిన సినిమాలెన్నో డిపాజిట్టు కోల్పోయాయి. బాక్సాఫీసు గల్లంతయ్యింది.
మరో మోడరన్ ప్రేమకథా కావ్యం. నాగార్జున సినిమా కెరియర్‌లో మైలురాయి. మణిరత్నపు ఆణిముత్యం గీతాంజలి ఎండింగ్ కూడా గమ్మత్తుగా అన్పిస్తుంది. ప్రేక్షకుల్ని విస్మయానికి గురిచేసి సినీ హృదయాల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. హృదయాల్ని సున్నితంగా స్పృశించి ఏకంగా మదిలో పాగావేస్తుంది. హీరో (నాగార్జున) హీరోయిన్లు (గిరిజ) ఇద్దరూ వ్యాధిగ్రస్థులే! ఈ కానె్సప్టే భలేగా ఉంటుంది. ఆ విషయం తెలియకుండా ఒకరినొకరు ప్రేమించేసుకుంటారు. పీకల్లోతుల్లోకి మునిగాక విషయం తెలుస్తుంది. అంతమాత్రాన ఎదగదుల్లోని ప్రణయ ముద్రల్ని చెరిపేసుకోలేరుగా. మనస్ఫూర్తిగా ఒకరినొకరు అంగీకరిస్తారు. చివర్లో కలిసి బ్రతకాలనే వారి ఆకాంక్షకి ప్రతిగా.. వాళ్ళిద్దరూ హాపీగా, హాయిగా ఒకరికోసం ఒకరు బ్రతికినంత కాలం బ్రతుకుతూ ప్రతిక్షణం గడిపేస్తారనే... ఓ కాప్షన్‌తో సినిమా ఎండవుతుంది. ప్రేక్షకుడి గుండె తడితో బయటకొచ్చేస్తాడు. ఆ లవ్ క్లైమాక్స్ ప్రేక్షకుడ్ని వెంటాడేసింది.
ఇలా విభిన్న క్లైమాక్స్‌లున్న సినిమాలు కోకొల్లలున్నాయి. మొన్నటివి, నిన్నటివి... అలాగే తాజా తాజావి! అలాంటివే నచ్చాయి, నచ్చుతాయి. అలాగే ఐమాక్స్ థియేటర్లోచూస్తే సినిమాలెలా ‘మైమరపిస్తాయో... క్లైమాక్స్ బాగున్న సినిమా అంతలా అలరిస్తుందన్నది నిర్వివాదాంశం. అందుకే క్లైమాక్సైనా ప్రీ క్లైమాక్సైనా అదరహో అయితేనే ప్రేక్షకుడిక బెదరహో! అందుకే జయహో క్లైమాక్స్!!.

-ఎనుగంటి వేణుగోపాల్