మెయిన్ ఫీచర్

మీరు తాగే నీటిలో మినిరల్స్ ఉన్నాయా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజురోజుకు పుట్టగొడుగుల్లా మినరల్ వాటర్ ప్లాంట్లు వెలుస్తున్నాయి. నిబంధనలను పాటించకుండా వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు యథేచ్చగా స్వచ్చమైన నీటి పేరుతో దోపిడీ చేస్తున్నారు. ప్రజల అమాయకత్వాన్ని, అవసరాన్ని గుర్తించి అక్రమాలకు పాల్పడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మినట్లుగా సాధారణ నీటినే మినరల్ వాటర్‌గా పేర్కొంటూ ప్రజల వద్ద నుంచి పైసలను దండుకుంటున్నారు. నగరంలో మినరల్ వాటర్ ప్లాంట్ల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. అయితే అమాయక ప్రజలు మాత్రం జబ్బుల బారిన పడుతున్నారు. ఆర్థికంగా, ఆరోగ్యకరంగా అనేక అవస్థలు పడుతున్నారు. లేని రోగాలను ‘కొని’తెచ్చుకుంటున్నారు.
వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) నిబంధనల ప్రకారం లైసెన్సులు పొంది ఉండాలి. చిరు వ్యాపారాలు, హోటళ్లు ఎక్కువ కావడం మధ్య తరగతికి దిగువగా ఉన్న వర్గాలు సైతం మినరల్ వాటర్ క్యాన్లు కొనడంతో నీటి వ్యాపారం అధికమైంది. ఫలితంగా నిబంధనలు పక్కన పెట్టి యజమానులు సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. బిఐఎస్ విధానాల ప్రకారం శుద్ధిపరచిన నీటిని అందించాలి. కానీ ఈ నిబంధనలు ఏమీ లేకుండా బిఐఎస్ లైసెన్సులు లేని వాటర్ ప్లాంట్లు మినరల్ వాటర్ పేరిట ప్రజలను దోపిడీ చేస్తున్నాయి. మినరల్ వాటర్ క్యాన్లలోనే ఫంగస్ కళ్లకు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. క్యాన్లను సైతం యజమానులు శుభ్రం చేయకుండా ప్రజల ఆరోగ్యంతో ఆడలాడుకుంటున్నారు.
ఇబ్బడి ముబ్బడిగా ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల యాజమాన్యాలు పిల్లలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించే విషయంలో నిర్లక్ష్యం వసిస్తున్నాయి. సాధారణంగా ఇళ్లకు సరఫరా చేసే నీటికి క్యాన్ ఒక్కింటికి రూ.12 నుంచి రూ.15 వరకు వసూలు చేస్తున్నారు. నిబంధనలు పాటించని వాటర్ ప్లాంట్ల నీటిని తాగితే వివిధ రోగాలు వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మోకాళ్లనొప్పులు, ఎముకల అరుగుదల, అలర్జీ తదితర వ్యాధులు సంభవిస్తాయని వైద్యులు చెబుతున్నారు. తాగునీటి శుద్ధి లేకపోవడమే పలు రోగాలకు కారణమంటున్నారు. నిజానికి ప్రతి లీటర్ నీటిలో కాల్షియం మోతాదు 75 మిల్లీ గ్రాములు, మెగ్నీషియం 30 మిల్లీ గ్రాములు, ఐరన్ మోతాదు 0.3 మిల్లీ గ్రాములు ఉండాలి. లీటర్ నీటిలో ఫ్లోరైడ్ మోతాదు 1 మిల్లీ గ్రాము కంటే తక్కువగా ఉండాలి. పునర్వియోగించే ప్లాస్టిక్ డబ్బాలను బిపిఏ ఫ్రీ ప్లాస్టిక్‌తో తయారుచేయాలి. పరిశుభ్రత మరియు వినియోగదారుని భద్రత దృష్టితో, నీటి నిల్వ కోసం ఒకసారి ఉపయోగించడానికి తయారుచేసిన ప్లాస్టిక్ నీటి సీసాలను పునర్వినియోగించడం మంచిది కాదు. మన పూర్వీకులు కొన్ని వందల సంవత్సరాల క్రితమే మన ఆరోగ్యం కోసం కొన్ని సూత్రాలు చెప్పారు. కానీ మనమే టెక్నాలజీ, అభివృద్ధి పేరుతో వాటిని ఆచరించడం మానేశాం. మన తాత ముత్తాతలు.. నీళ్లకోసం ఇత్తడి బిందెలు, రాగి బిందెలు, ఇత్తడి, రాగి చెంబులు వాడేవారు. వాటిలో నీటిని పోయడంవలన నీళ్లలో ఉండే క్రిములు చాలావరకు నశించేవి.
తాగునీటి ద్వారానే మనకు ముఖ్యమైన లవణాల కూడా చేరతాయి. స్వచ్ఛ జలం మనకు కావాల్సిన అన్ని అవసరాల్ని తీర్చలేదు. అలాటి నీటితోపాటు అందులో కరిగి వున్న కొన్ని ముఖ్యమైన లవణాలూ అవరం. నగర పురపాలక సంస్థలు జలాశయాల నుంచి నీటిని వినియోగదారులకు పంపిణీ చేసే ముందే పంపు హౌసు దగ్గరే అధిక మోతాదులో వున్న లవణాల శాతాన్ని తగ్గిస్తాయి. అవసరమైన లవణాల శాతాన్ని పెంచుతారు. ఇలా నిర్ణీత తాగునీటి ధర్మాలున్న విధంగా కుళాయిల ద్వారా పంపిణీ చేస్తారు. ఇలాంటి నీరు తీసుకుంటే మంచిది. నాణ్యమైన కంపెనీలు అందించే మినరల్ వాటర్ కూడా మంచిదే. సరైన నాణ్యతా ప్రమాణాలు ఉన్నాయో లేదో తెలియదు కాబట్టి సాధ్యమైనంత వరకూ మున్సిపాలిటీ నీటిని కాచి వడపోసి తాగడం మంచిది. నీటిని సరఫరా చేసే వాటర్ క్యాన్లను ప్రతిసారి పొటాషియం పర్మాంగనేట్, హైపో సొల్యూషన్‌తో పరిశుభ్రపరచాలి. వాటర్ క్యాన్లలో నీరు నింపేవారు చేతులకు గ్లౌజులు వేసుకోవడం వంటి జాగత్తలు పాటించాలి. అదేవిధంగా వాటర్ ప్లాంటులో మైక్రో బయాలజిస్టులు, కెమిస్టులను నియమించుకోవాలి. వీరు శుద్ధిచేసిన ప్రతి బ్యాచ్‌కు చెందిన నీటిని పీహెచ్ పరీక్ష చేయాలి. పిహెచ్ 7 కంటే తగ్గితే కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం వుంటుందని వైద్యులు పేర్కొంటున్నారు.
ఏ విధమైన పైపులు వాడుతున్నారు? నీటి శుద్ధికి ఏ పదార్థాలు ఎంత పరిమాణంలో ఉపయోగించాలి? ఎంత పరిమాణంలో ఉపయోగిస్తున్నారనేదానికి ఆహార భద్రత శాఖ అధికారులు పరీక్షించి అనుమతించాలి. శుద్ధిచేసిన నీరు తాగేందుకు అనువుగా నాణ్యత ప్రమాణాలకు తగినట్లుగా ఉందా లేదా అనే దానిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్థారించాలి. మినరల్ వాటర్ తయారీదారులు ఒకసారి ఆ నీటిని చెక్ చేసి బాటిల్స్ లాక్ చేశాక నెలలు గడిచినా ఆ నీరు అలాగే వుంటుంది. ఆ వాటర్ క్యాన్లలో క్లోరిన్ శాతం తక్కువగా ఉంటుందని, ఆ నీరు తాగితే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. నీటి డబ్బాపైన ఎక్స్‌పైరీ తేదీతోపాటు, వాటర్ ప్లాంటు వివరాలు, చిరునామా, ఫిర్యాదు నెంబర్ ఉండాలి. కానీ ఎక్కడా ఈ నిబంధనలు పాటించడంలేదు. ప్లాస్టిక్ డబ్బాల్లో వున్న నీరు ఎండ తీవ్రతకు రసాయనిక చర్యలు జరిగి కలుషిత నీరుగా మారుతోంది. ఇలాంటి సందర్భాల్లో ఎక్స్‌పైరీ తేదీ ఉంటే వినియోగదారులు అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని ఇప్పటికే పలు సర్వేల ద్వారా వెల్లడికావడం, వైద్యులు హెచ్చరిస్తుండటంతో మినరల్ వాడకాన్ని చాలామంది తగ్గించేస్తున్నారు. 20 లీటర్ల క్యాన్ 25 నుంచి 30 రూపాయలలు దాకా వెచ్చించి కొని.. తాగితే రోగాల పాలయ్యేకంటే అందుబాటులో వున్న మున్సిపాలిటీ నీటిని కాచి వడపోసి తాగడం మంచిది.

--తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి