మెయిన్ ఫీచర్

స్మరణీయుడు సంజయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాభారతంలో కౌరవ పక్షాన వున్నవారిలో ఎందరో విజ్ఞులున్నారు. అట్టివారిలో మనం ప్రత్యేకంగా పేర్కొనదగిన ఒక పాత్ర సంజయుడి పాత్ర. సమ్యక్ యోజుయతీతి సంజయః అని సంస్కృత వ్యాఖ్యానం. అనగా చక్కగాఆలోచన చేయగల సమర్థుడు, సమయోచిత బుద్ధికలవాడని అర్థం. భారతంలోని సంజయుడు అన్ని విధాలా సార్థక నామధేయుడు. ఇతరుల అంతరంగాన్ని చక్కగా అర్థం చేసుకుని, తదనుగుణంగా ప్రవర్తించి అందరినీ మిత, హిత వచనాలతో సంతృప్తిపర్చగల నైపుణ్యం కలవాడు.
యో జగ తత్ర దుర్లభః అన్న ఆర్యోక్తి ఈ ఈలోకంలో ప్రయోజనకరమైన ఆలోచనలు చేయగల పుణ్యపురుషులు చాలా అరుదని చాటుతుంది. మహాభారత కథలో ఎన్నో వైవిధ్యమున్న పాత్రలున్నాయి. వాటిలో ఒక విశిష్టమైన వ్యక్తిత్వం కలిగినవాడు సంజయుడు. అసలు సంజయుడి పేరు వినగానే కొన్ని రసవత్తరమైన సన్నివేశాలు స్ఫురించక మానవు.
వాటిలో ముఖ్యమైనవి, సంజయ రాయబారం, ధతరాష్ట్ర మహారాజుకు సంజయుడు చేసిన కురుక్షేత్ర సంగ్రామ వ్యాఖ్యానం. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ దివ్య గీతోపదేశం, ఆయన ప్రదర్శించిన విశ్వరూప సందర్శనం. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారమైన శ్రీకృష్ణుడు ప్రబోధించిన గీతోపదేశాన్ని అర్జునుడితోబాటుగా వీనులారా విని, విరాట్ స్వరూపాన్ని కన్నులారా చూడగలిగిన పుణ్యాత్ముడాయన. సదా స్మరణీయుడు మన భారతంలోని సంజయుడు.
సంజయుడు సూతపుత్రుడు. రథసారథ్యము వీరి కులవృత్తి. అయితే సంజయుడు సదాచార సంపన్నుడు, సాధుపుంగవుడు, సత్యవచనుడు, నీతిమార్గంలో పయనించేవాడు మరియూ ధర్మతత్త్వజ్ఞుడు. వినయ విధేయతలే ఆయనకు ఆభరణాలు. ఆయన పలుకులు ఎంతో మధురంగా వుంటాయి. ప్రభుభక్తి పరాయణుడు. కార్యదీక్షాదక్షుడు. అన్నింటికీ మించి విశ్వాసపాత్రుడు. సద్గుణమూర్తి. కావునే కౌరవ సామ్రాజ్యాధిపతికి ఆప్తుడై, ఆయనకు మంత్రి కాగలిగాడు.
ధృతరాష్ట్ర మహారాజునే ఆశ్రయించుకొని, సదా ఆయనకు సపర్యలు చేస్తూ, తన ప్రవచన భాషణాలతో, ఆయన హృదయాన్ని రంజింపచేసేవాడు, ఆ కారణంగానే ధృతరాష్ట్రుడు, రాయబార భారాన్ని సంజయుడికి అప్పగించారు. సంజయుడు ఎన్నడూ తన కుటుంబం గురించి గానీ, బంధువర్గం గురించిగానీ, తన సొంత పనుల గురించి గానీ ఆలోచించినట్లుగా వ్యాసమహర్షి ఎక్కడా ప్రస్తావించలేదు. ఎల్లకాలాలందూ తన రాజు ఆయన కుమారులు, రాజ్యం, రాజసేవను మాత్రమే ఆలోచించేవాడు.
ధృతరాష్ట్రుడు సంజయుని రాయబారానికి పంపించినపుడు, శుష్కప్రియులు, శూన్యహస్తములుగా కార్యాన్ని నడిపించుకొని రమ్మని అభ్యర్థించాడు. అదేవిధంగా అక్షరాలా అమలు జరిపి తన స్వామి భక్తిని ప్రకటించుకొన్న విశ్వాసపాత్రుడాయన. పాండవులు వుంటున్న ఉపప్లావ్య నగరానికి చేరుకుని మొట్టమొదట శ్రీకృష్ణార్జునులను సందర్శించాడు. అనగా నర నారాయణులను సందర్శించాడన్నమాటే కదా. నిండు సభలో ఆ మరునాడు ధర్మరాజును దర్శించాడు.
ముందుగా స్నేహపూర్వక భావంతో యోగక్షేమాలను వారి తండ్రి విచారించి రమ్మని పంపించారని ప్రారంభించాడు. ధర్మరాజుని ఆయనలోని అజాత శతృత్వ, అహింసాది గుణాలనూ, శమదమాది సద్గుణ సంపత్తినీ ప్రశంసించే విధంగా మొదలుపెట్టాడు రాయబార కార్యాన్ని. ‘చులకని కార్యం చేయడం ధర్మరాజులాంటి ధర్మజ్ఞులకూ, శాంతమూర్తులని ప్రసిద్ధిగాంచిన పెద్దలకు తగదని’ అంటూ, ‘శరణమిద వేడెద క్రోధ శాంతికిన్’, ఉపశమించుట లెస్స అని హితవు పలికాడు. ఆ సమయంలో పాండవులు తమ పట్ల కౌరవులు గావించిన అకృత్యాలను ఏకరవుపెట్టారు.
కౌరవులు దుశ్శీలత చెడదలచితిరేనియు, పోరు సలిపి లభించిన రక్తసిక్తాన్నముకంటె భిక్షాన్నమె మేలగు అంటూ శాంతియు, దాంతియు సకల లోకంబులు బొగడంగ బ్రతికిన పుణ్యమూర్తిని’ అంటూ ధృతరాష్ట్రుడి పక్షాన కనిపించే దోషాన్ని కప్పిపుచ్చి తన వినయగుణం, వాక్చాతుర్యం, భావప్రకటనా సారళ్యం, సంయమనాన్ని ఆదర్శప్రాయంగా ప్రకటించుకున్నాడు. ధర్మరాజంతటివాడే సంజయుని దౌత్య వైఖరిని అభినందించడం విశేషం. ఫలితాన్ని ఆశించక ప్రయత్నం చేయడమే తన కర్తవ్యంగా భావించి సంజయుడు తన రాయబార కార్యాన్ని నిర్వర్తించాడు. తిరిగి వెళ్లి ధృతరాష్ట్రునికి విన్నవించినతీరు కూడా అంత గొప్పగా వుంది. ‘వశీకృతచిత్తుడు ధర్మసూతి మెత్తని పులి’ అనీ, ఆతడలిగితే నీళ్లల్లో నిప్పుపుట్టినట్లే అని చెప్పడం గొప్పగా వుంది. ఉదాసీన వైఖరి వీడవల్సిందనీ, పుత్రులు చెడుదారిన నడిచినప్పుడు వారికి తగిన హితవు చెప్పాలనీ, జూదంవలన నెంతో కీడు జరిగిందనీ, ధృతరాష్ట్రుడికి చెప్పిన గొప్ప భావప్రకటనాచతురుడు.
ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని ప్రారంభమైన యుద్ధ విశేషాలు చివరకు యత్ర యోగేశ్వరః కృష్ణో అంటూ ధర్మమార్గానుసరణమే లోక కళ్యాణానికి దోహదకారి అన్న దివ్య సందేశాన్ని సంజయుడు అందించాడు. కురుక్షేత్ర యుద్ధంలో చివరి రోజున సాత్యకి కంటబడిన సంజయుని సంహరించబోగా వ్యాసమహర్షి ఏతెంచి, అతడు పుణ్యాత్ముడు, వధార్హుడు కాడని విడిపించాడు. ఆ తర్వాత గాంధారీ ధృతరాష్ట్రులతోపాటు తపోవనానికి వెళ్తాడు. ఒకనాడు అగ్నిజ్వాలలు చుట్టుముట్టగా ఆ దంపతుల ప్రేరణతో అచటి నుండి తప్పించుకొని వెళ్లి హిమాలయాలను చేరుకున్నాడు.
భారతంలో ప్రత్యేకంగా కనిపించిన సంజయుడు అందరికీ సర్వదా స్మరణీయుడు. ధర్మరహస్య బోధనలో, సహజ చాతుర్యంలో అందరికీ ఆదర్శప్రాయుడు.

-డా.పులిపర్తి కృష్ణమూర్తి 9949092761