మెయిన్ ఫీచర్

యోగనిద్రకు అంకురార్పణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతి ముఖ్యమైన, పవిత్రమైన తిథి ఏకాదశి. మేరుపర్వతమంత పాపాన్నికూడా ప్రక్షాళన చేయగల ప్రభావం కలిగింది ఏకాదశి వ్రతం. ఈ ఏకాదశి వ్రతం గురించి వ్యాసమహర్షి అందించిన పురాణాలను శౌనకాది మునులందరికీ విశదపరచిన సూతుడే నైమిశారణ్యంలో ఏకాదశిగురించి కూడా చెప్పినట్టు నారద పురాణం చెబుతుంది.
ఏకాదశినాడు చేసే పూజలు, జపతపాలు, స్నానం దానం ఇలా ఏ ఒక్క పుణ్యకార్యమైనా అఖండమైన ఫలితాన్నందిస్తుంది. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది కాబట్టి ఏకాదశిని ‘హరివాసరము’ అని కూడాపిలుస్తారు.
కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు ఎన్నో వరాలను సంపాదించి ఆ వరగర్వంతో మునులను, దేవతలను హింసిస్తూ చివరకు ఇంద్రుడు, బ్రహ్మలను కూడా వారి స్థానాలనుండి వెళ్ళగొట్టాడు. వారందరి బాధ తీర్చడానికి విష్ణువు మురాసురునితో తలపడ్డాడు. వెయ్యేళ్ళు యుద్ధం చేసినా రాక్షసుని నిర్జించలేకపోయాడు. మహావిష్ణువు చివరకు అలసటతో ‘సింహావధ’ అనే గుహలో దాక్కున్నాడు. విష్ణువును వెతుక్కుంటూ వచ్చాడు రాక్షసుడు. విష్ణువు సేదతీరే సమయంలో విష్ణువు తన శరీరం నుండి ఒక బాలికను ఉద్భవింపజేసి మురాసురునిపైకి వదిలాడు. ఆ బాలిక రాక్షసునితో యుద్ధం చేసి సంహరించింది. ఆమే ఏకాదశి. విష్ణువు ఎంతో సంతోషించి ఏదైనా వరం కోరుకోమని ఏకాదశిని అడిగాడు. ఆమె నా పేరుకు ప్రసిద్ధి వచ్చేట్టు నన్ను స్మరించిన వారికి నీ సాన్నిథ్యం లభించేట్టు వరం ఇమ్మని అడిగింది. ఆమె కోరికను మన్నించిన మహావిష్ణువు నీ పేరుమీద ఒక తిథి వస్తుంది. ఆ తిథి నాడు నన్ను స్మరిస్తూ వ్రతం చేసినవారికి పుణ్యంకలుగుతుంది. ఆ వ్రతంతో నీ పేరు ప్రసిద్ధి పొందుతుంది అని వరం ఇచ్చాడు. ఆ కన్యకామణియే ఏకాదశి తిథి.
మరో కథనం ప్రకారం పూర్వం కుంబుడు అనే రాక్షసుడు వాని కుమారుడు మృదుమన్యుడు అచంచలమైన శివభక్తితో అనేక వరములు సంపాదించుకున్నారు. అలాగే స్ర్తి, పురుషులనుండి గాని ఏ ఇతర ప్రాణినుండిగాని తనకు మరణం లేకుండా వరాన్ని కోరుకున్నారు. అయితే మరణం అనేది అనివార్యం కాబట్టి ఆ వరం కుదరదని, ఒక అయోనిజ అయిన స్ర్తి చేత తప్ప ఇంకెవరివల్లను మరణం లేకుండా వరాన్నిచ్చాడు శివుడు. అయోనిజ ఉద్భవించడం ఎలాగూ సాధ్యంకాదు. కాబట్టి ఇక తమకు మరణం లేదన్న గర్వంతో విర్రవీగుతూ సకల జనులను బాధపెట్టసాగారు.
ఈ రాక్షసులు చివరకు త్రిమూర్తులను కూడా జయించే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిలో ఓసారి త్రిమూర్తులు తమ భార్యలతో పాటు వెళ్ళి ఉసిరిక వృక్షం తొర్రలో దాక్కొన్నారు. . అందరూ ఆ తొర్రలోనే ఇరుక్కున్నందువలన ఆ రాపిడికి ఒక కన్య ఉద్భవించింది. ఇంతలోనే రాక్షసుడు త్రిమూర్తులను వెతుక్కుంటూ అక్కడకు వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో తొర్రలోనుండి వచ్చిన కన్య రాక్షసుని సంహరించింది. ఇలా దుష్ట సంహారం చేసి శ్రీ మహావిష్ణువుకు ప్రీతి కలిగించింది కాబట్టి మహావిష్ణువుకు ఇష్టురాలయ్యింది. తనకు ఈ విధంగా రాక్షస సంహారంతో సంతోషం కలిగించినందుకు ఫలితంగా వరం కోరుకొమ్మన్నాడు విష్ణుమూర్తి. దానికా బాలిక ఏకాదశి ‘‘శ్రీమన్నారాయణా! సర్వతిథులలోను నేను ప్రముఖంగా పూజించబడాలి. ఎల్లవేళలా నేను నీకు ప్రియమైనదానిగా ఉండాలి. నా తిథిలో ఉపవాసం ఉండి వ్రతం ఆచరించినవారు మోక్షాన్ని పొందాలి’’ అని అడిగింది. ఆ వరానిచ్చాడు విష్ణువు. ఈ ఏకాదశి అని ప్రతి పక్షంలోను పదకొండవ రోజు ఆమెను స్మరించుకొని శ్రీమన్నారాయణుని పూజిస్తే సకల పాపహరణమని పురాణాలు చెప్తున్నాయి. ఏకాదశి తిథి ప్రాధాన్యాన్ని సంతరించుకున్నట్టు భవిష్యపురాణం చెప్తోంది. ఏకాదశులన్నింటిలోకి అత్యంత ప్రధానమయినది తొలి ఏకాదశికి.
ఈ ఆషాడమాసంలోని ఏకాదశే తొలి ఏకాదశిగా ఎందుకు సంభావిస్తారంటే
పూర్వకాలంలో వర్షఋతువే ప్రథమ ఋతువుగా ఆషాఢమాసంతోనే సంవత్సరం ప్రారంభమయ్యేదట. అలా ఆషాఢంలో వచ్చిన ఏకాదశి తొలి ఏకాదశి అయింది. తొలి ఏకాదశినేశయనైకాదశి అనీ అంటారు. ఈ ఏకాదశి రోజునే శ్రీ మహావిష్ణువు పాలకడలిలో నిద్రకు ఉపక్రమిస్తాడు. దానివల్ల ఈ ఏకాదశి శయనైకాదశి గా పేర్గాంచింది.
ఈ తొలి ఏకాదశి రోజున గోపద్మ వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజు ఆవుల కొట్టాన్ని శుభ్రం చేసి కొట్టం మధ్యలో ముప్ఫైమూడు పద్మాలను వేసి మధ్యలో లక్ష్మీనారాయణులను ఉంచి పూజించాలి. గంధపుష్పాలతో అర్చించాలి. ఇలా సంవత్సరం రోజులు చేసి వాయనాలతో దక్షిణతాం బూలాల నిచ్చి వ్రత ఉద్యాపనచేయాలి. ఈ వ్రతం చేసినవారికి అఖండ సౌభాగ్యాలు కలుగుతాయ. మహావిష్ణువు అనుగ్రహమూ కలుగుతుంది.

- ప్రసన్న