మెయిన్ ఫీచర్

సాహస విప్లవ మహోదధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాసముద్రంలో అలలు రావటం సాధారణమైన విషయం. కానీ రూపురేఖల్ని మార్చేసేవిధంగా, చరిత్రను కొత్త పుంతలు తొక్కించేవిధంగా పెనుకెరటాలు తీరాన్నితాకి పాతస్వరూపాన్ని పాతిపెట్టే విధంగా ఈడ్చి కొట్టటం అంటే అది ఒక నవయుగమే అవుతుంది. తెలుగు సాహిత్య చరిత్రలో కరడుగట్టిన బూర్జువాతత్వాన్ని తుదముట్టించేందుకు కలాన్ని కత్తిలా వాడి, చీల్చి చెండాడి రుద్రవీణను వాయించిన అగ్నిధారాస్వరూపం, సాహస విప్లవ మహోదధి, కళాప్రపూర్ణ డా. దాశరధి కృష్ణమాచార్య. ఆయన 1925 జూలై 22న తెలంగాణాలోని ఖమ్మం జిల్లాలో చిన్నగూడూరు గ్రామంలో ఒక సంప్రదాయ వైఖానస కుటుంబంలో జన్మించాడు. సంస్కృతం, హిందీ, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషు భాషల్లో పాండిత్యం సంపాదించాడు. మెట్రిక్యులేషన్ చదువుతూన్న రోజుల్లోనే హైదరాబాదు నిజాం దారుణమైన పాలనవల్ల ప్రజలు పడుతున్న బాధల్ని చూసి చలించిపోయాడు. కమ్యూనిస్టు భావజాలానికి ప్రభావితుడయ్యాడు. పీడిత తాడిత శ్రామిక వర్గాలవారి అణచివేతకు నిరసనగా నిజాంపై ఉప్పెనలా విరుచుకుపడ్డాడు. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చినా నిజాం ఇండియాలో విలీనం కాలేదు. దాంతో దాశరధి తనమిత్రులు కాళోజీ నారాయణరావు, జమలాపురం కేశవరావు, కొలిపాక కృష్ణారావు ప్రభృతులతో కలిసి స్వామీ రామానంద తీర్థులవారి పిలుపునందుకుని నిజాంపై విరుచుకుపడ్డాడు. ఫలితంగా అరెస్టు చేయబడ్డాడు. జైలులో ఉంటూనే అత్యంత ప్రభావవంతమైన కవిత్వాన్ని వ్రాశారు. జైలునుంచి విడుదలయ్యాక విజయవాడకు వచ్చి అక్కడే ఉంటూ తెలుగుదేశం అనే పత్రికద్వారా తన రచనలను ప్రజలకు అందించాడు. దాశరధి ఎంతటి విప్లవాదియో అంతటి ప్రసన్నకవి. ఆయనలో అగ్నిపూలు వికసిస్తాయి. రుద్రవీణ నర్తిస్తుంది. మహాంధ్రోదయం పరవళ్ళు తొక్కుతుంది. ప్రజాపోరాటం విజృంభిస్తుంది. మాతృభూమిపై దేశభక్తి చెలరేగుతుంది. ధర్మచక్రాన్ని రచించిన దాశరధి పునర్నవాన్ని పొంది మహాబోధి సిద్ధాంతాలను ప్రచారం చేశారు. కవితాపుష్పకాన్ని అధిరోహించి గాలిబ్ గీతాలను ఆలపించారు. దేశభవిష్యత్తును గురించి ఆలోచనా లోచనాలతో పరిశీలించి వందలాది సినీగీతాలద్వారా అపురూప సందేశాన్ని అందించారు. ఆయన కలాన్ని నడిపించటంలో ఎంతటి సమర్థుడో సాహితీ కార్యక్రమాల్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా అంత చక్కని ప్రయోక్తగా అందించగలరు. గొప్ప పరిణతి చెందిన రచయితగా తత్త్వవేత్తగా దాశరధి సమాజానికి విలువైన సందేశాల్ని అందించారు. తన కవితలద్వారా ‘‘హింస నుండి నవసమాజ హంస ఉద్భవిస్తుందనే అసత్యాన్ని నమ్మకు-హంతకుడవు కాబోకు’’ అని చాలా ముందుచూపుతో భవిష్యత్ తరాలవారికి చక్కని సలహానిచ్చాడు. ఇది ఎంతో విలువైనది. సమాజానికి చాలా అవసరమైనదికూడా. మార్క్సిజం దేశంలో అలజడిని సృష్టిస్తున్న సమయంలో ఆయన ‘‘ఘర్షణతో ఏనాటికీ హర్షం లభించబోదని’’ చెప్పి ఉద్యమాన్ని కొంతవరకూ శాంతింపజేశాడు. తన అంతరంగంలో దాశరధి గొప్ప దార్శనికుడు. తత్త్వవేత్త. ఉద్యమాలతోనే ఊళలు బాగుపడిపోవని, దానికి ఆలోచనకూడా ఉండాలనీ ఉపదేశించాడు. ‘‘విప్లవం అంటే రక్తం వెదజల్లటం కాదర్రా-హృదయంలో విప్లవం ఎదగాలి’’ అంటాడు. ఎక్కడైనాసరే భేదాభిప్రాయాలు వస్తే తెలివిగా పరిష్కరించుకోవాలంటాడు : ‘‘బుర్రా బుర్రా పగలగొట్టుకోకుండా సమస్యను పరిష్కరించుకోండి అంటాడు. ‘‘అగ్ని పుష్పాలు పూచి ఉద్విగ్న మాన -సమున చీకట్లు కాల్చి వెచ్చదనమొసగి-కవుల కంఠాల శాంతి గీతి వెలయించె-నా తెలంగాణ కోటి రత్నాలవీణ’’ అంటాడు. ఆయన పద్యాలు రసధారలతో సహజంగా అగ్నిపూలులానే వర్షిస్తాయి. ‘‘నా గీతావళు లెంతదూరము ప్రయాణంబౌనొ నందాక నీ -్భగోళంబున నగ్గి వెట్టెదను..’’ అంటూ తన పద్యాలతోనే దుర్మార్గాన్ని చీల్చి చెండాడుతానంటాడు. తనకున్న శబ్ద్ధాకారం మీద ఆయనకున్న నమ్మకానికిది సాక్ష్యం. అన్యాయాన్ని ఎదిరించటంలో దాశరధి మహారధియే. ఆయన ‘‘తిమిరంతో సమరం’’ కావ్యమే ఇందుకు ఉదాహరణ. ఈ కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 1975లో ఆంధ్రా యూనివర్సిటీ ఈయనకు ‘‘కళాప్రపూర్ణ’’ బిరుదునిచ్చింది. తరువాత ఆగ్రా విశ్వ విద్యాలయంవారు డీ.లిట్., బిరుదు నిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థానకవిగా గౌరవించబడ్డారు. అద్భుతమైన సినీగీతాల రచనతో ఆంధ్రులందరి హృదయాలనూ ఆకట్టుకున్నారు. అనేకమైన హిట్ చిత్రాల గీత రచయితగా దాశరధి తెలుగువారి గుండెల్లో నిలిచిపోయారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ కావాలని తొలినాళ్ళలో ఆయన కోరుకున్నారు. నిజాం కోరలనుండి హైదరాబాదు విముక్తమైన తరువాత ‘‘కమ్మని నా తెలంగాణా తొమ్మిది జిల్లాలదేనా ? అసలాంధ్రకు తెలంగాణా పర్యాయం కాదా?’’ అని అడిగారు. ఆయన ఎంతగొప్ప ప్రజాకవి అంటే ఆయనలా ‘‘నా పేరు ప్రజాకోటి -నా ఊరు ప్రజావాటి’’ అని చెప్పుకున్న కవి ఇంక ఏ భాషలోనూ లేడు. తెలుగుతనం మూర్త్భీవించిన గడుసుకవి దాశరధి. ‘‘ఏది కాకతి? ఎవతె రుద్ర? ఎవరు రాయలు? ఎవడు సింగన? అన్ని నేనే ! అంతా నేనే! తెలుగు నేనే ! వెలుగు నేనే!’’ అని చాలా ధైర్యంగా చెప్పుకున్నారు. అంతటి ధైర్యమూ, సాహసమూగల తెలుగుకవి దాశరధి మాత్రమే అంటే అతిశయోక్తి కాదు. తెలుగంటే దశదిశలా వ్యాపించాల్సిన భాష అని ఆయన ఉద్దేశ్యం. అందుకే ‘‘తెలుగు పతాకం ఎగురని దిశయేలేదు-తెలుగు వెలుగు దూరని కోశంలేదు’’ అని ఎంతో విశాలమైన ఆశయాన్ని వ్యక్తం చేశాడు మహాకవి దాశరధి.

- డా. చింతలపాటి మురళీకృష్ణ 9441271135