మెయిన్ ఫీచర్

ఇహపర సౌఖ్యదాయని లలితాదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అష్టాదశ పురాణాలలోని బ్రహ్మాండ పురాణంలో ఉత్తరఖండంలో లలితా రహస్యనామ సహస్ర స్తోత్రమున్నది. దీనిని హయగ్రీవుడు అగస్త్య మహర్షికి వివరించాడు. లలితాదేవి వైభవాన్ని పలు విధాలుగా ప్రస్తుతించారు. త్రిపుర సుందరి, త్రిపురేశ్వరి- పరమేశ్వరి, కామేశ్వరి, రాజరాజేశ్వరి వంటి అనేక పేర్లతో ప్రార్థనలందుకుంటున్న శ్రీ లలితాదేవి అఖిలాండకోటికి జనని. జీవకోటికి మాతృదేవత. సృష్టికి మూలమైన ఆమె అయోనిజ. స్వతంత్రాధికారిణి. సృష్టి స్థితి లయములు, తిరోధానం, అనుగ్రహాది కార్యాలను జరపడానికే ఆమె అడుగు ముందుకేసి ఉద్యమిస్తుంది. ఆమె చిదగ్నికుండంలో జనించింది.
శ్రీలలితా స్తోత్రంలో చిదగ్ని కుండ సంభూతగా పేర్కొనబడింది. అద్వితీయ సౌందర్యారాశి. సకలాభరణ విరాజిత. సర్వమంగళమూర్తి, అరువది నాలుగు కళలకూ అధిష్ఠాన దేవత. వేదమయి. యుద్ధంలో భండాసురునీ, అతని పుత్రులను అవలీలగా వధించింది. ఆదిమధ్యాంతరహిత. త్రిమూర్తులు భక్తితో ఆమెను సేవిస్తుంటారు. లక్ష్మి, సరస్వతులు ఎడమ, కుడివైపుల నిలబడి వింజామరలతో వీస్తూంటారు. వైదిక సదాచారాలను నిర్వహింపజేసే తల్లి లలితాదేవి. షట్చక్రాలలో విరాజిల్లుతున్నది. జగన్నియంత్రి.
దక్షిణదిక్కు అధి దేవత మృత్యుదేవత కూడా లలితను ఆరాధిస్తున్నది. తన భక్తులను మృత్యువునుండి కాపాడుతుంది కావుననే ఆమెను మృత్యుదారుకుఠారికగా స్తుతిస్తారు. వాంఛితార్థ ప్రదాయిని. పరాశక్తిగా ఆరాధనలందుకుంటుంది. అష్టదిక్కులలో ప్రకృతి శక్తులున్నాయి.
పద్మపురాణంలో ఉత్తరఖండంలో తంత్రరాజ్యంలో లలితయే కృష్ణునిగా అవతరించాడని చెప్పబడినది. గోపికలు లలితాదేవి శక్తులు అని కూడా తెలుపబడినది. అందరూ కూడా కృష్ణ వల్లభులని పురాణం తెల్పింది.
లలితాదేవిని స్మరణతో, జీవతో, వందనాలతో పూజలు చేయాలి. ప్రాతఃస్మరామి, ప్రాతర్భజామి- ప్రాతర్నమామి- ప్రాతర్వదామి లలితే అని ధ్యాన శ్లోకాలలో వర్ణింపబడినది. కవచంలో శ్రీ మహాత్రిపుర సుందరీ లలితా పరాంబా దేవతా అని స్తోత్రం చేయబడినది. వాగీశాది సమస్త భూత జననిగా కరుణా రసార్ణవమయిగా - కామేశ్వరుని అంకస్థితిగా స్తుతింపబడినది. శంకరుని అర్థాంగ సౌందర్య శరీరంతో విలసిల్లినది. బ్రహ్మాండ పురాణంలోని త్రిపుర సుందరీగాథ మనోజ్ఞంగా వర్ణించబడినది.
దేవతలు లలితాదేవిని గురించి మహాయాగం చేస్తుంటే భండాసురుడు విఘ్నం కలిగించాడు. దేవి వాటిని తొలగించగా దేవతలు హోమం చేశారు. ఆ అగ్నిగుండం నుండి ఆవిర్భవించిన ఆ మహాదేవియే శ్రీ లలితాదేవి. ఈమె దివ్య చరిత్ర లలితోపాఖ్యానంలోను, ఆమె మహత్మ్యం లలితా సహస్రనామ స్తోత్రంలోను, తంత్ర గ్రంథాలలోను కన్పిస్తాయి. శ్రీచక్రం మధ్య శ్రీకామేశ్వరునితో కూడిన లలితాదేవినే పూజిస్తారు. ఈ శ్రీ విద్యారాధన భోగమోక్షాలను రెంటినీ ప్రసాదిస్తుందని తంత్రశాస్త్రం, పురాణాలు బోధిస్తున్నాయి.
ఆ లలితాపరమేశ్వరిని కొందరు పూవులతో పూజిస్తే మరికొందరు నివేదనతో ఆరాధిస్తారు. సకల సృష్టికి ఆధారభూతమైన తల్లిని ఏ పేరుతో కొలిచినా ఆతల్లి చల్లని చూపులు అందరకూ అందుతాయ. ఆ తల్లి చల్లని నీడలో ఉంటే చాలు ఇహపర సౌఖ్యాలు కలుగుతాయనే నమ్మకం నేటి ఆధునిక కాలంలో కూడా నిత్యసత్యంగా భాసిల్లుతోంది.
ఆషాఢమాసంలో ఆ తల్లినే గ్రామదేవతగాకూడ సంభావించి పూజిస్తారు. ఆశ్వీజమాసంలో శరన్నవరాత్రుల్లో మంత్ర తంత్రాలతో పూజిస్తారు. పామరులు, పండితులెవరైనా సరే తల్లిని పూజించని వారు ఎవరూ ఉండరు.
శరన్నవరాత్రులలో శ్రీ లలితా పరా భట్టారికను భక్తిశ్రద్ధలతో పూజించి ఆ దేవి అనుగ్రహానికి ఎల్లరూ పాత్రులు కాగలరని ఆశ, ఆకాంక్ష. లలితాదేవి భక్తుల పాలిట కల్పవల్లి, కరుణామయి. ఆనందప్రదాయి గదా!
అందుకే పిపీలికాది బ్రహ్మ పర్యంతమూ తల్లిని పొగుడుతూ కీర్తిస్తూ సౌఖ్యాలను పొందుతున్నారు.

-పి.వి.సీతారామమూర్తి, 94903 86015