మెయన్ ఫీచర్

అనవసర జాప్యంతో అనర్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధాని భవనాలకు గత బుధవారం మధ్యాహ్నం ప్రారంభోత్సవం జరగటం, ప్రభుత్వ సిబ్బంది తమ కార్యాలయాలలోకి ఆనందోత్సాహాలతో ప్రవేశించడం, ఆ సంరంభాలను టెలివిజన్ ఛానళ్ల ప్రత్యక్ష ప్రసారాలతో గమనించడం శాశ్వతంగా గుర్తుండిపోయే దృశ్యాలు. ఆ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఆలోచించిన వారికి బహుశా రెండు భావనలు కలిగివుంటాయి. ఒకటి భవిష్యత్తుకు సంబంధించినది కాగా, రెండవది గత అనేక దశాబ్దాల పరిణామాలు.
భవిష్యత్తు విషయానికి ముందుగా వస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇపుడొక స్థిరమైన, శాశ్వతమైన, స్వంత రాజధాని ఎర్పడుతున్నది. దానిపేరు అమరావతి. ఆ నగరాన్ని కేంద్రం చేసుకొని ఇకవారు ‘శాశ్వతంగా’ తమ భవిష్యత్తును తాము తీర్చిదిద్దుకోవచ్చు. ‘శాశ్వతంగా’ అనడం ఎం దుకో ఊహించడం కష్టం కాదు. రాజధానులు మారటం రాజుల కాలం వరకు ఉండేది. వలస పాలనలోనూ జరిగింది. కాని ఆధునిక ప్రజాస్వామ్యాలు అవతరించిన తర్వాత అటువంటి మార్పులు ప్రజలు, వారి ప్రతినిధులు స్వీయ నిర్ణయాలతో చేసుకునేవి తప్ప, ఎవరో పైనుంచి చేసేవి కావు. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇకనుంచి అమరావతి శాశ్వత రాజధాని అవుతున్నది. అంతేకాదు. కారణాలు ఏవైతేనేమి మద్రాసు నుంచి కర్నూలుకు, అ క్కడినుంచి హైదరాబాద్‌కు, తిరిగి మరొక కొత్త ప్రదేశానికి మారుతూ వచ్చిన అస్థిరతలు ఇక ఉండబోవటంలేదు. ఈ విధంగా మారుతూ పోవలసిన స్థితి దేశంలో మరే రాష్ట్రానికీ ఎదురుకాలేదు. ఒక సుస్థిర, శాశ్వత రాజధాని 1953 తర్వాత 63 సంవత్సరాలకు గాని ఏర్పడనటువంటి దుస్థితిని కూడా మరే రాష్టమ్రూ ఎదుర్కోలేదు. వీటిని గమనికలోని తీసుకున్నపుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల సానుభూతి భావన కలగక తప్పదు. అందువల్ల వారికి ఈ సందర్భంలో అందరూ శుభాకాంక్షలు తెలియజేయాలి. తమ భవిష్యత్తు ఉజ్వలంగా రూపొందాలని కోరుకోవాలి.
అది తప్పకుండా సాధ్యమే కూడా. వేల సంవత్సరాల చరిత్రను గమనించినట్లయితే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అనేక వనరులకు, సంపదల ఉత్పత్తికి నిలయాలు. సముద్రతీరం సరేసరి. ఈ స్థితి క్రీస్తుపూర్వం నుంచి దేశ స్వాతంత్య్రం వరకు అన్ని దశలలోనూ కొనసాగింది. స్వాతంత్య్రానంతరం లభించిన కొత్త అవకాశలతో అందుకు మరింత ఊపు వచ్చింది. అందుకే మొత్తం దేశంలోనే 20వ శతాబ్దంలో అతివేగంగా ఆర్థికాభివృద్ధి సాధించి పెట్టుబడులు-వ్యాపారంలో అగ్రగామిగా ఉన్న ప్రాంతాలలో కోస్తాంధ్ర ఒకటని ఆర్థిక శాస్తవ్రేత్తలు ఏకగ్రీవంగా ప్రకటించారు. ఈ వౌలికమైన స్థితిగతులకు ఉమ్మడి రాష్ట్ర విభజన తప్పకుండా ఒక కుదుపు వంటిదే కాని, వాటిని తలకిందులు చేసేది మాత్రం కాబోదు. కనుక భవిష్యత్తుకు ఏ సమ్యలూ ఉండవు. బుధవారం నాడు తమ కొత్త రాజధాని ప్రాంతం భవనాలలోకి ఉత్సాహంగా ప్రవేశించిన ఉద్యోగుల మనస్సులలో ఇటువం టి ఆలోచనలు, ఆత్మవిశ్వాసాలు ఎంతవరకు మెలిగాయో తెలియదుగాని, క్రమంగా వారది గ్రహించకపోరు. అదేవిధమైన ఆత్మవిశ్వాసాలు ఏపీ ప్రజలందరిలోనూ పరివ్యాప్తం కాకపోవు.
రాజధాని హైదరాబాద్ నుంచి స్వరాష్ట్రానికి తరలించే విషయమై ఎందువల్లనైతేనేమి అక్కరలేని జాప్యాలు కొన్ని జరిగాయి. కాని ఆ పని ఇపుడు మొదలైపోయినందున ఎంత త్వరగా పూర్తిచేస్తే ఆంధ్రప్రదేశ్‌కు అంత మేలు జరుగుతుంది. విభజన అనంతరం తొలి మాసాలలో కలిగిన దిగ్భ్రాంతి నుంచి తేరుకున్న సాధారణ ప్రజలు ఇక పరిపాలనను పొరుగు రాష్ట్ర రాజధాని నుంచి గాక తమ నేలపైనుంచి, తమ మధ్య ఉండి సాగాలని కోరుకోవడం 2014 చివరినుండే కనిపించసాగింది. పైన అనుకొన్నట్లు, పరిపాలన తరలింపునకు జాప్యం ఎందువల్ల జరిగినా ప్రస్తుతం మొదలైనందున ఇక త్వరగా ముగిసిపోవాలి. ఉమ్మడి సంస్థలు, వాటి సిబ్బంది, ఆస్తులు, ఉమ్మడి హైకోర్టు వంటి సమస్యలను కూడా వేగంగా తేల్చుకోవడం ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనకరమవుతుంది. అది జరగనంతకాలం పరిపాలన ఆమేరకు కుంటుపడుతూనే సాగుతుంది. డజన్లకొద్దీ ఉమ్మడి సంస్థలు, హైకోర్టు హైదరాబాద్ కేంద్రంగా ఉండ టం, ప్రజలకు, పరిపాలకులకు అనేక విధాలుగా సమస్యాత్మకం అవుతుంది. హైకోర్టు విషయం తీసుకుంటే, న్యాయాధికారుల నియామకాలు అనే కోణానికి సంబంధించి తమకు అన్యాయం జరుగుతున్నదని తెలంగాణలో ప్రస్తుతం ఆందోళన జరుగుతుండవచ్చు. కాని హైకోర్టు సంవత్సరాల తరబడి హైదరాబాలోనే కొనసాగటం అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, లాయర్లందరికీ దీర్ఘకాలం పాటు అనవసర వ్యయ ప్రయాసలు కలిగించే విషయం. ఉమ్మడి సంస్థల ప్రశ్న కూడా ఇటువంటిదే. అందువల్ల, ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఒడిదుడుకులు లేకుండా సాగి సత్వరాభివృద్థికి తోడ్పడేందుకు, ఈ అం శాల పరిష్కారం అవసరమని ప్రజలు గుర్తించాలి.
పోతే, మొదట అనుకున్న రెండు విషయాలలో ఇదంతా వర్తమానం, భవిష్యత్తుకు సంబంధించినది కాగా, గతం గురించి సావధానంగా విచారించుకోవలసిన సమయం కూడా ఎదురవుతున్నది. వరదలో ఇల్లు కొట్టుకుపోయిన కుటుం బం కొత్త ఇంటిని కట్టుకునే సమయంలో, ఎటువంటి నిర్మాణ లోపాల వల్ల అటువంటి నష్టం సంభవించిందో సమీక్షించుకుంటుంది. అటువంటి నిర్మాణం లోపా లు తిరిగి జరగకుండా జాగ్రత్త పడుతుంది. ఇటువంటి సమీక్షలు సావధానం గా జరుగుతాయి కాని ఉద్వేగాలతోనో, హడావుడిగానో, మొక్కుబడిగానో కాదు. అట్లాగే, గత నిర్మాణంలోని బలాలు, బలహీనతల సమీక్ష వాస్తవికంగా జరిగితేనే ఉపయోగకరమవుతుంది. సమీక్షకు కార ణం లోపాల వల్ల ఇల్లు కొట్టుకుపోవడం అయినందున ముఖ్యంగా లోపాల సమీక్ష మరింత జాగ్రత్తగా చేసుకోవాలి. వాటిని ఏ కారణం చేతనైనా సరే కప్పిపెట్టుకునే ప్రయత్నం జరిగినట్లయితే గత అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకునే ఉద్దేశం మనకు లేదన్నమాట. అపుడు భవిష్యత్తు లో అవే నష్టాలు, కొత్త నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అరమరిక లు లేకుండా చెప్పుకోవాలంటే, ముఖ్యం గా రాయలసీమలో తలెత్తుతున్న, లేదా కొనసాగుతున్న అసంతృప్తులు అటువంటి టైమ్ బాంబు అనాలి. కనుక గతం గురించి సావధాన సమీక్ష అవసరం.
ఉమ్మడి రాష్ట్ర విభజనోద్యమ సమయంలో రెండువైపుల చర్చలు విస్తృతంగా జరిగాయి. కాని రెండు చర్చల మధ్య ఒకే తేడా కనిపించింది. తెలంగాణ వారు తా ము ఎందుకు విడిపోవాలని కోరుకున్నారో లోతైన చర్చలు జరిపారు. అందులో ఉద్వేగంతోపాటు వాస్తవాల ఆధారంగా చేసిన వాదనలు చాలా కనిపించాయి. కాని సమైక్యత కోరుకున్నవారు ఉద్వేగాన్ని ప్రదర్శించినంతగా వాస్తవాల ఆధారంతో వాదనలు చేయలేదు. ఎదురుగా కనిపించే పలు వాస్తవాలను తోసిపుచ్చా రు. ఇవి వారి బలహీనతలయ్యాయి. అ యితే ఈ వైఫల్యం ప్రజలదో, సాధారణ ఉద్యమకారులదో కాదు. రాజకీయ నాయకులు, మేధావులది. 1956 నుంచి మొదలుకొని, విభజన బిల్లు పార్లమెంటు ఆమో దం పొందేవరకు దశాబ్దాల తరబడిగా నాయకులు, అధికార వర్గాలు, మేధావులు, ధనిక వర్గాలు తమ స్వప్రయోజనాలకోసం అనుసరించిన విధానాల కారణం గా ఉమ్మడి నివాస నిర్మాణంలో పగుళ్లు ఏర్పడుతూపోయాయి. ఆ వాస్తవాలను వారు బయటకు చెప్పలేరు కనుక ప్రజల ముందు ఉద్వేగ పూరిత వాదనలు చేసా రు. అవి, వరదలో ఇల్లు కూలటాన్ని నివారించలేకపోయాయి. దాచేస్తే దాగని సత్యాలను ఇపుడీ దశనుంచి ఆరంభించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సావధానంగా తెలుసుకుని ఆలోచించడం అవసరం.
తెలుగువారంతా ఒకటి కావాలన్నది ఒక ఉదాత్తమైన సాంస్కృతికమైన, జాతిపరమైన అంశం. అది సుమారు 20వ శతాబ్దపు ఆరంభం నుంచి వ్యక్తమవుతూ వచ్చింది. సంస్కృతీవాదులు, రచయితలు, కళాకారులు, మేధావులు, సంస్కరణవాదుల స్థాయిలో ఉండిన అటువంటి ఆకాంక్షలోకి క్రమంగా రాజకీయవాదులు, ఆర్థిక శక్తుల ప్రవేశం జరిగింది. దానితో లక్ష్యాలు మారాయి. పవిత్రత పోయింది. ఆవెనుక జరిగిందంతా సమకాలీన చరిత్ర. 1969లో తెలంగాణ ఉద్యమం జరుగుతుండినప్పుడు అప్పటి సిపిఐ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు తమ అధికార పత్రిక ‘న్యూ ఏజ్’లో ఒక వ్యాసం రాస్తూ, ఒప్పందాల ఉల్లంఘనే ఉద్యమానికి కారణమని, పరిస్థితులు అదేవిధంగా కొనసాగితే ‘‘దేశంలోని భాషా రాష్ట్రాల విభజన మొట్టమొదటి భాషా రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్‌తోనే ఆరంభం కావచ్చు’’నని దూరదృష్టితో ఒక హెచ్చరిక చేశారు. ఆ యన అన్న పరిస్థితులు 1956-69 కాలానివి. అవి 1969-2014 మధ్య కూడా కొనసాగాయి. 1956-2014 మధ్యనాటి ఆ ‘‘పరిస్థితు’’ లకు బాధ్యత సాధారణ ప్రజలది కాదు. ఉమ్మడి ఇంటికి బీటలు తెచ్చి న వర్గాలేవో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
చరిత్ర దృష్టితో విచారించినప్పుడు ఈ పరిణామాలన్నీ ఆంధ్రులు, తెలంగాణ వా రితో సహా తెలుగువారందరికీ ఒక సాం స్కృతికమైన, జాతిపరమైన విషాద మే. అందుకు దోషులైన వారిని గుర్తించి శి క్షించడం ఎప్పటికైనా జరిగేదీ లేనిదీ అనుమానాస్పదమే. కాని సావధానమైన ఆలోచనలు జరిగినట్లయితే ఆ దోషులపై చరిత్ర తన తీర్పు తాను చెప్తుంది. ప్రజలు ఇప్పుడైనా చెప్పగలరు.

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)